• facebook
  • whatsapp
  • telegram

అభివృద్ధి పేరిట పర్యావరణ విధ్వంసం

పర్యావరణ సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. అనేక అభివృద్ధి ప్రాజెక్టుల్లో ప్రభుత్వ వ్యవస్థలే పర్యావరణ చట్ట నిబంధనలను ఉల్లంఘించడం ఆందోళన కలిగిస్తోంది. 

వివిధ ప్రాజెక్టుల అనుమతుల కోసం దేశంలో అమలు చేస్తున్న పర్యావరణ ప్రభావ మదింపు మార్గదర్శకాలు పటిష్ఠంగా అమలు కావడంలేదనే విమర్శలున్నాయి. రెండున్నరేళ్ల క్రితం విశాఖలో ఎల్జీ పాలిమర్‌ పరిశ్రమలో జరిగిన దుర్ఘటనతో పర్యావరణ అనుమతుల ప్రక్రియ, కాలుష్య కారక పరిశ్రమలపై నిరంతరాయంగా సాగాల్సిన పర్యవేక్షణలో లోపాలు బహిర్గతమయ్యాయి. ఈ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ హరిత ట్రైబ్యునల్‌ వేర్వేరుగా నిర్వహించిన అధ్యయనాలతో దేశంలో పర్యావరణ అనుమతుల ప్రక్రియలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం వెలుగులోకి వచ్చింది. అందుకోసం అవసరమైన కార్యాచరణ చేపట్టడంపై మాత్రం శ్రద్ధ కనబరచలేదు. విశాఖ తీరంలో సి.ఆర్‌.జెడ్‌. పరిధిలోకి వచ్చే ప్రాంతంలో పర్యాటక అభివృద్ధి పేరుతో రుషికొండ విధ్వంసంపై ఆరోపణలు తలెత్తాయి. తీర ప్రాంతాల్లోని అనేక పరిశ్రమలు ప్రమాదకరమైన రసాయన వ్యర్థాలను సముద్ర జలాల్లోకి విడిచిపెడుతున్నాయని కాగ్‌ ఆక్షేపించింది.

నియమాలకు తూట్లు

ప్రభుత్వ, ప్రైవేటు అభివృద్ధి ప్రాజెక్టులు, పరిశ్రమలకు భౌగోళిక, సామాజిక, పర్యావరణ, అటవీ వనాల పరిస్థితుల ఆధారంగా పర్యావరణ ప్రభావ మదింపు నిబంధనల ప్రకారం అనుమతులను మంజూరు చేయాలి. వివిధ చట్టాలు, నిబంధనలు, ట్రైబ్యునళ్ల తీర్పులను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతం గిరిజన ప్రాంతాల కిందకు వస్తే సంబంధిత చట్టాలు, నిబంధనలను అమలు చేస్తారు. ఆయా రాష్ట్రాల పరిధిలోని గిరిజన సలహా మండలితో సంప్రదింపులు తప్పనిసరి. అయితే, క్షేత్రస్థాయిలో తగినంత వ్యవస్థీకృత ఏర్పాట్లు లేకపోవడం వల్ల పలు చట్టాలతో ముడివడిన ఉల్లంఘనలను గుర్తించడం ప్రహసనంగా మారుతోంది. ఫలితంగా అనేక ప్రాంతాల్లో సున్నితమైన పర్యావరణ వ్యవస్థలకు తీరని నష్టం వాటిల్లుతోంది. పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలు ట్రైబ్యునళ్లు వంటి వ్యవస్థలను ఆశ్రయిస్తే తప్ప ఉల్లంఘనలపై ప్రభుత్వాల స్పందన ఉండటంలేదు. విశాఖ సముద్ర తీరంలోని రుషికొండ పర్యాటక ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి మంజూరు, నిర్మాణంలో ప్రతిపాదనల దశ నుంచే పారదర్శకత కొరవడిందనే ఆరోపణలున్నాయి. కేంద్ర పర్యావరణ ప్రాధికార సంస్థ 2021 ఏప్రిల్‌లో ప్రాజెక్టు అనుమతుల అంశాన్ని దృశ్యమాధ్యమ సమావేశం ద్వారా సమీక్షించింది. రాష్ట్ర ప్రభుత్వం రుషికొండపై పాత రిసార్టు స్థానంలో రెండు దశల్లో రిసార్టు నిర్మాణాన్ని ప్రతిపాదించింది. ఇక్కడి బీచ్‌కు అంతర్జాతీయస్థాయి హోదా గుర్తింపు ఉంది. దీనికి తోడు కొవిడ్‌ సంక్షోభం తీవ్రస్థాయిలో ఉండటంతో క్షేత్రస్థాయి పరిశీలన, అధ్యయనం లేకుండానే రిసార్టు నిర్మాణం కోసం పర్యాటకశాఖకు అనుమతి వచ్చింది. రిసార్టు నిర్మాణం పేరుతో అనుమతి పొందిన విస్తీర్ణం కంటే ఎక్కువ మేర కొండను తవ్వేశారనే ఆరోపణలు తలెత్తాయి. ఇటీవల హరిత ట్రైబ్యునల్‌ కేంద్ర పర్యావరణ శాఖ అధికారులతో మొత్తం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో సమీక్షించాలని ఆదేశించడం గమనార్హం. మరోవైపు, అల్లూరి జిల్లాలో ఏపీఎండీసీ ద్వారా బాక్సైట్‌ తవ్వకాలు జరిపి ముడి సరకును జిందాల్‌ తదితర కంపెనీలకు ఇచ్చేందుకు 2006లో అప్పటి ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇది రాజ్యాంగ అయిదో షెడ్యూలు నిబంధనలు, పెసా, అటవీ హక్కుల గుర్తింపు వంటి చట్టాలకు విరుద్ధమంటూ గిరిజనులు వ్యతిరేకించారు. ఏళ్ల తరబడి ప్రయత్నాల తరవాత గిరిజనుల మనోభావాలను గౌరవిస్తూ, ఆ ఒప్పందాలను ప్రభుత్వం రద్దు చేయాల్సి వచ్చింది. తాజాగా అల్లూరి జిల్లాలో ప్రతిపాదిస్తున్న జల విద్యుత్‌ ప్రాజెక్టుల విషయంలోనూ ఇలాంటి పరిస్థితులే పునరావృతమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

పారదర్శకతే గీటురాయి

పర్యావరణ సంరక్షణ చట్టం-1986 ప్రకారం ప్రకృతి వ్యవస్థలను పరిరక్షించడం, మెరుగుపరచడం, పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడం, తగ్గించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. ఇది ప్రభుత్వాలు, పరిశ్రమలు, పౌరులందరి సమాన బాధ్యత. ఏ ప్రాజెక్టు, పరిశ్రమ అయినా స్థానిక ప్రజల ఉపాధి, సామాజిక అభివృద్ధి అంశాలతో ముడివడి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో సున్నిత అటవీ, తీర ప్రాంత ప్రకృతి వ్యవస్థలపై నష్టప్రభావం తప్పనిసరి. ఆ నష్టాన్ని ఎంత మేర తగ్గిస్తారనే విషయాల్లోనే  జవాబుదారీతనం అవసరం. వివిధ ప్రాజెక్టులకు అనుమతుల మంజూరు దశ నుంచే నియమాలకు లోబడి, ప్రజల మనోభావాల ప్రకారం ముందుకెళ్తే ఆందోళనలు తలెత్తవు. పారదర్శకతతో ముందడుగు వేస్తే అభివృద్ధి ప్రాజెక్టులకు ముందుకు వచ్చేవారిలో గందరగోళాన్నీ నివారించవచ్చు.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆర్థిక అంధకారంలో భారత్‌ వెలుగు రేఖ

‣ పొంచి ఉన్న ఆహార అభద్రత

‣ ప్రాబల్యం కోసం కోరిమరీ వైరం

‣ రైతుకేదీ...‘ఉత్సవం’?

‣ మహిళా బిల్లుకు మోక్షమెప్పుడు?

Posted Date: 30-12-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం