• facebook
  • whatsapp
  • telegram

డ్రోన్‌ సాంకేతికతతో మార్కెట్‌కు రెక్కలు

నిర్వహణ సామర్థ్యాలను పెంచుకోవడానికి, ఖర్చును తగ్గించుకోవడానికి ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు డిజిటల్‌ ఆవిష్కరణల వైపు చూస్తున్నాయి. డ్రోన్ల సాంకేతికత అలాంటిదే. కొన్నేళ్లుగా రంగాలకు అతీతంగా విస్తరిస్తున్న డ్రోన్ల సేవలు, ఉపాధి అవకాశాలకు ఊతమవుతున్నాయి. సంపద సృష్టికి అక్కరకొస్తున్నాయి. పౌరసేవలను అవి సులభసాధ్యం చేస్తున్నాయి.

గత డిసెంబరు మొదటి వారంలో ఉత్తరాఖండ్‌లోని కొండప్రాంతమైన ఉత్తర్‌కాశీ నుంచి ఆరోగ్య పరీక్షల నమూనాలతో బయల్దేరిన డ్రోన్‌... తొంభై నిమిషాల్లో దేహ్రాదూన్‌ చేరింది. రహదారి మార్గంలో అందుకు ఆరు నుంచి ఎనిమిది గంటలు పడుతుంది. కొండ చరియలు విరిగిపడితే పన్నెండు గంటలు ఎదురు చూడాల్సి వస్తుంది. రెడ్‌క్లిఫి లాబ్స్‌తో కలిసి దిల్లీకి చెందిన అంకుర సంస్థ ‘స్కై ఎయిర్‌’ ప్రారంభించిన డ్రోన్‌ సర్వీసులతో ఉత్తర్‌కాశీ వాసులు ఆరోగ్య సేవలు పొందడం సులువైంది. మరోవైపు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం పదివేల హైఓల్టేజీ విద్యుత్‌ టవర్లను డ్రోన్లతో నిరంతరం పర్యవేక్షించనున్నట్లు ఇటీవలే ప్రకటించింది. అంత ఎత్తు టవర్లను ఉద్యోగులు అధిరోహించడం కష్టసాధ్యం. అందుకు అధిక సమయం సైతం అవసరమవుతుంది. డ్రోన్లు తీసే అత్యంత నాణ్యమైన చిత్రాలతో విద్యుత్‌ టవర్ల పర్యవేక్షణ సులభమవుతుంది. దేశీయంగా కొత్త పుంతలు తొక్కుతున్న డ్రోన్‌ సేవలకు ఇవి ఉదాహరణలు.

విభిన్న రంగాలకు విస్తరణ

కేపీఎంజీ నివేదిక ప్రకారం 2021 ఆగస్టు నుంచి 2022 ఫిబ్రవరి మధ్య డ్రోన్‌ అంకుర సంస్థల్లో 34.4శాతం వృద్ధి నమోదై, వాటి సంఖ్య 221కి చేరింది. వాటిలోకి పెట్టుబడులూ విపరీతంగా ప్రవహిస్తున్నాయి. ఔషధ, ఆహార సరఫరా సేవలు అందిస్తున్న స్కై ఎయిర్‌ స్టార్టప్‌ రూ.14 కోట్ల మేర పెట్టుబడులను రాబట్టింది. చెన్నైకు చెందిన మరో అంకుర సంస్థ గరుడా ఏరోస్పేస్‌ సైతం ఇండియా, యూఏఈ, సింగపుర్‌ పెట్టుబడిదారుల నుంచి సుమారు రూ.40 కోట్లు పొందింది. న్యూదిల్లీకి చెందిన ఎండ్యూర్‌ ఎయిర్‌ సిస్టమ్స్‌ వంటివీ ఈ జాబితాలో కనిపిస్తాయి. 2020లో భారతీయ మానవ రహిత వైమానిక వాహనం (యూఏవీ) విపణి విలువ 83 కోట్ల డాలర్లు అని అబ్జర్వర్‌ రీసెర్చి ఫౌండేషన్‌ గతంలో నివేదించింది. 2021-2026 నడుమ 14.5శాతం వార్షిక సమ్మిళిత వృద్ధిరేటు(సీఏజీఆర్‌)తో పురోగమిస్తుందని అది అంచనా వేసింది. డ్రోన్‌ సేవల మార్కెట్‌ విలువ దేశీయంగా రెండేళ్ల క్రితం 13.04 కోట్ల డాలర్లుగా నమోదైంది. 2030 నాటికి 44.4శాతం సీఏజీఆర్‌తో అది నాలుగు వందల కోట్ల డాలర్లకు పైగా ఎగబాకుతుందని నిపుణులు చెబుతున్నారు. వివిధ రంగాలకు అవసరమైన డ్రోన్లు, వాటి విడిభాగాలను తయారు చేసుకోవడంలో ఇండియా ఇంకా స్వయంసమృద్ధి సాధించలేదు. సరైన ప్రణాళికలు, ప్రోత్సాహకాలతో చేయూతనందిస్తే 2030 నాటికి భారత తయారీ రంగ సామర్థ్యాన్ని ఆ పరిశ్రమ 2,300 కోట్ల డాలర్ల మేర అదనంగా పెంచగలదని అంచనా.

ఇండియాలో ప్రస్తుతం డ్రోన్లు ఎక్కువగా రక్షణ రంగానికి పరిమితమయ్యాయి. ఆ తరవాత వ్యవసాయంలో అవి బాగా కనిపిస్తాయి. సూక్ష్మపోషకాల పిచికారీ నుంచి భూముల సర్వే వరకు అవి అక్కరకొస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ స్వామిత్వ పథకంలో భాగంగా గ్రామీణ ప్రజలకు ఆస్తి పత్రాలను పక్కాగా అందజేయడానికి డ్రోన్‌ సాంకేతికత సాయపడుతోంది. వైద్యరంగంలోనూ మందులు, టీకాలను తక్కువ సమయంలో అందుబాటు ధరల్లో ఒక ప్రాంతం నుంచి మరోచోటుకు చేరవేయడానికి డ్రోన్లు బాగా ఉపయోగపడుతున్నాయి. మౌలిక సదుపాయాల రంగంలో నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి, సర్వేలకు, త్రీడీ నమూనాల రూపకల్పనకు డ్రోన్లను వినియోగిస్తున్నారు. నిర్దేశిత గనుల తనిఖీలో వాటి వినియోగాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. అడవుల నరికివేత, వన్యమృగాల వేటపై నిఘా వేయడానికి, కాలుష్య అంచనాలు, ఆధారాల సేకరణకూ డ్రోన్లను ఉపయోగించుకోవచ్చు. పరిమిత వ్యయంతో సమాచార సేకరణలో ప్రస్తుతం అవే కీలకమవుతున్నాయి. డ్రోన్ల ద్వారా జరిగే విశ్లేషణల మార్కెట్‌ విలువ వచ్చే అయిదేళ్లలో మూడు రెట్లు వృద్ధి సాధిస్తుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ప్రోత్సాహం అవసరం

ఇండియాను డ్రోన్ల కేంద్రంగా మార్చాలని కేంద్రం భావిస్తోంది. దానికోసం నిబంధనలను ఇప్పటికే సరళీకరించింది. రూ.120 కోట్లతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను ప్రకటించింది. అంకురాలు వంటి వాటి ద్వారా డ్రోన్ల పరిశ్రమను మరింతగా ముందుకు తీసుకెళ్ళడానికి 2022 బడ్జెట్‌లో ‘డ్రోన్‌శక్తి’ పథకాన్ని కేంద్రం ప్రకటించింది. వేగంగా విస్తరిస్తున్న భారతీయ డ్రోన్‌ పరిశ్రమకు నిపుణ మానవ వనరులు తగినంతగా అందుబాటులో లేకపోవడం సమస్యాత్మకం అవుతోంది. 2023లోనే దేశానికి లక్ష మంది డ్రోన్‌ పైలట్లు అవసరమవుతారని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ కొద్ది రోజుల క్రితం వెల్లడించారు. ఆ మేరకు మానవ వనరులను తీర్చిదిద్దుకోవాలి. రాబోయే మూడేళ్లలో డ్రోన్‌ రంగం అయిదు లక్షల ఉద్యోగాలను కల్పించగలదనే అంచనాలు లోగడ వెలువడ్డాయి. అవి వాస్తవం కావాలంటే- ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలకు కేటాయింపులు పెంచాలి. సహేతుక పన్ను మినహాయింపులతో ఆయా సంస్థల వెన్ను తట్టాలి.

- పద్మ వడ్డె
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అనిశ్చితి నామ సంవత్సరానికి తెర

‣ పాకిస్థాన్‌పై తాలిబన్‌ తిరుగుబావుటా

‣ అభివృద్ధి పేరిట పర్యావరణ విధ్వంసం

‣ జన సంద్రం... వినియోగించుకుంటే వరం!

‣ ఆర్థిక అంధకారంలో భారత్‌ వెలుగు రేఖ

Posted Date: 06-01-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం