• facebook
  • whatsapp
  • telegram

పాకిస్థాన్‌పై తాలిబన్‌ తిరుగుబావుటా

తాను పెంచి పోషించిన సర్పం తననే కాటు వేయడమంటే ఏమిటో పాకిస్థాన్‌కు ప్రస్తుతం తెలిసివస్తోంది. అఫ్గానిస్థాన్‌లో పాక్‌ వెన్నుదన్నుతో అధికారంలోకి వచ్చిన తాలిబన్లు ఇప్పుడు ఆ దేశంపైనే తిరగబడుతున్నారు. అక్కడ నెత్తుటేళ్లు పారిస్తున్నారు.

గతంలో సోవియట్‌ సైన్యంపై అఫ్గాన్‌ తాలిబన్లతో కలిసి పోరాడటానికి గూఢచార సంస్థ ఐఎస్‌ఐ సృష్టించిన పాక్‌ తాలిబన్లు- ఇప్పుడు దాయాది దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. పాక్‌ తాలిబన్లు తెహ్రీకే-తాలిబన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ) సంస్థ ఛత్రం కింద కార్యకలాపాలు సాగిస్తారు. ఈ ఏడాది ఆగస్టులో పాక్‌ భూభాగం నుంచి వచ్చిన అమెరికన్‌ డ్రోన్‌ కాబుల్‌లో అల్‌ఖైదా అధినేత ఐమాన్‌ అల్‌ జవాహరిని హతమార్చింది. అప్పటి నుంచి అఫ్గాన్‌-పాక్‌ సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం పాక్‌లోని ఖైబర్‌ పఖ్తూన్‌క్వా, బలూచిస్థాన్‌ రాష్ట్రాల్లో వేర్పాటువాద ఉద్యమాలు జరుగుతున్నాయి. పాక్‌, అఫ్గాన్‌ల మధ్య 2,640 కిలోమీటర్ల మేర బ్రిటిష్‌ వలస పాలకులు గీసిన డ్యురాండ్‌ సరిహద్దు రేఖను అఫ్గాన్‌ తాలిబన్లు అంగీకరించడం లేదు. దానివల్ల ఖైబర్‌ పఖ్తూన్‌క్వాలోని పష్తూన్‌ ప్రాంతాలు పాక్‌ ఏలుబడిలోకి వెళ్ళిపోయాయని, అవి తమకే చెందుతాయని అఫ్గాన్‌ తాలిబన్లు భీష్మిస్తున్నారు. తాలిబన్లు జాతిరీత్యా పష్తూన్లే. తాలిబన్లు రెండు దేశాల మధ్య చాలాచోట్ల సరిహద్దు కంచెను తొలగిస్తున్నారు. ఈ డిసెంబరు ప్రారంభంలో బలూచిస్థాన్‌లోని చమన్‌, అఫ్గాన్‌లోని స్పిన్‌ బోల్డాక్‌ కూడలిలో పాక్‌ సైనికులు సరిహద్దు కంచెకు మరమ్మతు చేయడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో అఫ్గాన్‌ తాలిబన్లు జరిపిన కాల్పుల్లో పాక్‌ పౌరులు మరణించారు. నవంబరులోనూ అక్కడ ఘర్షణ తలెత్తింది. సరకుల రవాణాకు అది కీలకమైన కూడలి. అమెరికా సేనల సెంట్రల్‌ కమాండ్‌ (సెంట్‌ కామ్‌) అధిపతి జనరల్‌ మైకేల్‌ కురిల్లా ఇస్లామాబాద్‌ వెళ్ళి పాక్‌ సైన్యాధిపతి జనరల్‌ అసిమ్‌ మునీర్‌తో చర్చలు జరిపిన సమయంలోనే చమన్‌ వద్ద అఫ్గాన్‌-పాక్‌ సైనికుల ఘర్షణ నెలకొంది.

అఫ్గాన్‌లో తాలిబన్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరచి తన చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి పాక్‌ ప్రభుత్వం ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఖొరసాన్‌ వంటి ఉగ్ర ముఠాలను ఉసిగొల్పుతోంది. దానికి ప్రతిగా అఫ్గాన్‌ మద్దతు గల టీటీపీ- పాక్‌లో ఉగ్ర దాడుల పరంపర చేపట్టింది. టీటీపీ అధినేత నూర్‌ వలీ మెహసూద్‌ అఫ్గాన్‌లోనే తిష్ఠవేసి తన కార్యకర్తలను నడిపిస్తున్నాడు. ఇటీవల ఇస్లామాబాద్‌లో పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద టీటీపీ కారు బాంబు పేల్చడంతో ఒక పోలీసు అధికారి మరణించారు. 10 మంది గాయపడ్డారు. విదేశీ దౌత్యవేత్తలు నిత్యం భేటీ అయ్యే మారియట్‌ హోటల్‌పైనా టీటీపీ దాడి చేసే అవకాశం ఉందంటూ అమెరికా, బ్రిటన్‌తో పాటు పలు దేశాలు తమ దౌత్యాధికారులను, పౌరులను హెచ్చరించాయి. 2008లో మారియట్‌ హోటల్‌పై భారీ బాంబు దాడితో 54 మంది మరణించారు. మళ్ళీ దాడి భయంతో పాక్‌ పోలీసులు రాజధాని ఇస్లామాబాద్‌ అంతటా చెక్‌పోస్ట్‌లు ఏర్పాటుచేశారు. వాహనాల రాకపోకలపై నియంత్రణ విధించారు.

పాక్‌ ప్రభుత్వాన్ని కూలదోసి అఫ్గాన్‌లో మాదిరిగా షరియా ఆధారిత ఇస్లామిక్‌ రాజ్యాన్ని స్థాపించాలన్నది టీటీపీ ధ్యేయం. నిరుడు అఫ్గాన్‌లో తాలిబన్‌ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పాకిస్థాన్‌లో టీటీపీ దాదాపు 500 మందిని హతమార్చింది. వారిలో అత్యధికులు పాక్‌ భద్రతా సిబ్బందే. డిసెంబరు ప్రారంభంలో టీటీపీ ఉగ్రవాదులు అఫ్గాన్‌ సరిహద్దులోని బన్నూలో పాక్‌ ప్రభుత్వ ఉగ్రవాద వ్యతిరేక పోరాట కేంద్రంపై దాడిచేసి పలువురు పోలీసులను బందీలుగా పట్టుకున్నారు. వారిని విడిచిపెట్టి బేషరతుగా లొంగిపోవాలన్న పాక్‌ ప్రభుత్వ డిమాండుకు టీటీపీ ఉగ్రవాదులు సమ్మతించలేదు. తమను స్వేచ్ఛగా    అఫ్గాన్‌కు వెళ్ళనిస్తేనే బందీలను విడచిపెడతామన్నారు. ఉగ్రవాదులకు నచ్చజెప్పాలని అఫ్గాన్‌ సర్కారును పాక్‌ కోరినా స్పందన కరవైంది. దాంతో డిసెంబరు 20న పాక్‌ కమాండోలు బన్నూపై దాడి చేసి 25 మంది టీటీపీ ముష్కరులను హతమార్చి, బందీలను విడుదల చేశారు. డిసెంబరు మొదట్లోనూ కాబుల్‌లోని పాక్‌ రాయబార కార్యాలయంపై ఉగ్ర దాడి జరిగింది. దీన్నిబట్టి చూస్తే తన గడ్డమీద పాక్‌ ప్రతినిధుల భద్రతపై తాలిబన్‌ సర్కారుకు ఏమాత్రం శ్రద్ధ లేదని అర్థమవుతోంది. అఫ్గాన్‌ నుంచి నిరుడు అమెరికా, నాటో సేనలు నిష్క్రమించాక తాలిబన్‌ సర్కారు తాను ఆడమన్నట్లు ఆడుతుందని పాకిస్థాన్‌ భ్రమపడింది. ఇప్పుడు తాలిబన్లే పాక్‌లో టీటీపీ ద్వారా తమ ప్రభావాన్ని విస్తరించుకోవాలని చూస్తున్నారు.

- కైజర్‌ అడపా
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అభివృద్ధి పేరిట పర్యావరణ విధ్వంసం

‣ జన సంద్రం... వినియోగించుకుంటే వరం!

‣ ఆర్థిక అంధకారంలో భారత్‌ వెలుగు రేఖ

‣ పొంచి ఉన్న ఆహార అభద్రత

‣ ప్రాబల్యం కోసం కోరిమరీ వైరం

‣ రైతుకేదీ...‘ఉత్సవం’?

‣ మహిళా బిల్లుకు మోక్షమెప్పుడు?

Posted Date: 31-12-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం