• facebook
  • whatsapp
  • telegram

పెచ్చరిల్లుతున్న కార్చిచ్చుల ముప్పు

అడవుల క్షీణతకు దారితీసే ప్రధాన కారణాల్లో కార్చిచ్చులు ముఖ్యమైనవి. ఆకురాల్చే అడవులు, గడ్డితో కూడిన అటవీ ప్రాంతాలు, గడ్డి మైదానాల్లో వీటి బెడద అధికం. అడవుల్లో ఏర్పడే 95శాతం కార్చిచ్చులకు మానవ ప్రేరిత  చర్యలే ప్రధాన కారణం. బాటసారులు, పశువుల కాపరులు  అలక్ష్యంగా పారేసే బీడీ, సిగరెట్‌ ముక్కలు... వ్యవసాయం కోసం అడవులను కాల్చడం, పంట వ్యర్థాలను తగలబెట్టడం  వంటివన్నీ కార్చిచ్చులకు దారితీస్తున్నాయి. వాతావరణ మార్పులూ కార్చిచ్చులు పెరగడానికి దోహదపడుతున్నాయి.

ఈ ఏడాది మార్చి మొదటి 12 రోజుల్లో దేశంలో సుమారు 42 వేలకుపైగా కార్చిచ్చు ఘటనలు నమోదయ్యాయి. గత సంవత్సరం ఇదేకాలంలో ఏర్పడిన కార్చిచ్చులతో పోలిస్తే ఇవి చాలా ఎక్కువ. అధిక ఉష్ణోగ్రతలు, వర్షపాతలేమి ఇందుకు కారణాలు. దేశంలో 36శాతం మేరకు అడవులు దావానలాల బారిన పడుతున్నాయి. 2022 నవంబరు నుంచి 2023 మార్చి తొమ్మిది వరకు ఒడిశాలో దేశంలోనే అత్యధికంగా 871 పెద్ద కార్చిచ్చులు సంభవించాయి. ఆ తరవాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్‌(754), కర్ణాటక(642), తెలంగాణ(447), మధ్యప్రదేశ్‌ ఉన్నాయి. 2020 నవంబరు- 2021 జూన్‌ మధ్యకాలంలో దేశంలోనే అత్యధికంగా ఒడిశాలో సుమారు 56 వేల కార్చిచ్చులు నమోదయ్యాయి. ఇదేకాలంలో దేశంలో సుమారు మూడున్నర లక్షల కార్చిచ్చులు నమోదయ్యాయి. పెద్ద కార్చిచ్చు ఘటనల వల్ల అటవీ నేలపై నిక్షిప్తమై ఉన్న కర్బన పదార్థం, భూతాపానికి కారణమయ్యే కార్బన్‌ డైఆక్సైడ్‌ రూపంలో అదనంగా వాతావరణంలోకి విడుదలవుతుంది. కార్చిచ్చుల వల్ల చిన్నమొక్కలు, విత్తనాలు, ఎండిన చెట్లు, గడ్డి పూర్తిగా కాలిపోతాయి. ఏటా అడవిలో నిప్పుపడటం వల్ల, చిన్న మొక్కలు దహనమై కొత్త మొక్కలు లేకుండాపోతాయి. ఇదేపరిస్థితి కొంతకాలం కొనసాగితే చిన్నవయస్సు మొక్కలు లేని స్థితికి దారితీసి, ముందుతరం మొక్కల స్థానాన్ని ఆక్రమించడానికి తరవాతి తరం ఉండదు. దీనివల్ల ప్రకృతి సహజ పరిణామ క్రమానికి విఘాతం కలుగుతుంది.

జీవవైవిధ్యానికి నష్టం

తీవ్రమైన అటవీ మంటల వల్ల ఆ ప్రాంత జీవవైవిధ్యం కూడా దెబ్బతింటుంది. మొక్కలతోపాటు జంతుజాలానికి నష్టం సంభవిస్తుంది. సూక్ష్మజీవులు, క్రిమికీటకాలు, ఉభయచరాలు, సరీసృప జాతుల మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. గడ్డి, ఇతర మొక్కలు కాలిపోవడం వల్ల దుప్పుల వంటి శాకాహార జంతువులు ఆహార సమస్య ఎదుర్కొంటాయి. ఇతర ప్రాంతాలకు వలస వెళతాయి. ఆహారం కోసం పంటపొలాలపై దాడి చేస్తాయి. శాకాహార జంతువుల వలస ప్రభావం మాంసాహార జంతువులపైనా పడుతుంది. ఫలితంగా, మానవ-వన్యప్రాణి ఘర్షణకు దారితీస్తుంది. నిజానికి, తక్కువ తీవ్రత కలిగిన కార్చిచ్చులు చీడపీడలను నాశనం చేసి అటవీ ఆవరణ వ్యవస్థకు మేలు చేస్తాయి. అటవీ ఆవరణ వ్యవస్థ రూపొందడం, సంరక్షణలో ముఖ్యపాత్ర వహిస్తాయి. అడవి నేలపై పోగుపడే ఆకులు, వృక్ష సంబంధ పదార్థాలను నిర్మూలించి కొత్తతరం మొక్కలు, గడ్డి, నేల నుంచి పుట్టడానికి, ఎదగడానికి తోడ్పడతాయి. విత్తన పెంకు గట్టిగా ఉండే టేకు వంటి జాతుల విత్తనాలు మొలకెత్తడానికి మంటలు సహకరిస్తాయి. కాకపోతే, తీవ్రత ఎక్కువగా ఉండే కార్చిచ్చులు పునరావృతమవుతుంటే తలెత్తే నష్టం అధికం. అందువల్ల, అటవీ మంటల వల్ల కలిగే లాభాలకన్నా నష్టాలే ఎక్కువ. అటవీ జీవవైవిధ్యాన్ని, ఉత్పత్తిని, ఉత్పాదకతను దెబ్బతీస్తాయి. ఫలితంగా అడవి క్షీణిస్తుంది. స్థానిక సమాజాల ఉపాధి అవకాశాలకు కూడా విఘాతం కలుగుతుంది. వీటివల్ల అటవీ ఆవరణ వ్యవస్థలు ధ్వంసమవుతాయి. 2016లో ఉత్తరాఖండ్‌లో, 2019లో కాలిఫోర్నియా, అమెజాన్‌, బందీపూర్‌ (కర్ణాటక)లలో చెలరేగిన కార్చిచ్చులు అక్కడి అటవీ ఆవరణ వ్యవస్థలకు తీవ్రనష్టాన్ని కలిగించాయి. కార్చిచ్చులను ఆర్పడం, వ్యాపించకుండా నిలువరించడం చాలాకష్టంతో కూడిన పని. బలంగా వీచేగాలులు, తక్కువ తేమ పరిస్థితులు, అతిఉష్ణోగ్రతలు, గుట్టలప్రాంతాలు, రాత్రి సమయాలు వంటివి మంటల నియంత్రణను మరింత జటిలంగా మారుస్తాయి. ఒక్కోసారి మంటలను ఆర్పడం సాధ్యంకాని పరిస్థితి నెలకొంటుంది. విస్తృతమైన అటవీ విస్తీర్ణం, దుర్గమమైన ప్రాంతాలు కావడం దృష్ట్యా నీటితోగాని, అగ్నిమాపక యంత్రం ఉపయోగించి మంటలను ఆర్పడం సాధ్యం కాదు. తీవ్రమైన మంటలను హెలికాప్టర్ల సహాయంతో అదుపు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ, ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. రిమోట్‌ సెన్సింగ్‌ సాంకేతికత, భూసమాచార వ్యవస్థలను ఉపయోగించి మంటలు ఏర్పడే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి, ముందుగానే ఆ సమాచారాన్ని సంబంధిత క్షేత్రస్థాయి సిబ్బందికి అందించడం కొంతమేర ఉపయుక్తం.

అవగాహనతో నివారణ

శీతోష్ణస్థితి, భూవినియోగంలో మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా కార్చిచ్చులు 2050నాటికి 30శాతం, ఈ శతాబ్ది చివరి నాటికి 50శాతం పెరుగుతాయని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం 2022నాటి నివేదికలో పేర్కొంది. కార్చిచ్చులు, పేద దేశాలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయంది. కార్చిచ్చులు ఏర్పడిన తరవాత తీసుకుంటున్న చర్యల నుంచి వాటిని నిరోధించడం వైపు ప్రభుత్వాలు దృష్టి మరల్చాలని సూచించింది. మానవ ప్రేరిత చర్యలతో తలెత్తే మంటలను నిరోధించడం, సత్వరమే ఆర్పివేయడం, అవసరమైన సిబ్బంది నియామకం, పరికరాలు, వాహన సౌకర్యం కల్పించడం మొదలైన చర్యలు తీసుకోవడం, మంటల వ్యాప్తి నిరోధానికి తోడ్పడే ‘ఫైర్‌లైన్ల’ ఏర్పాటు, అడవిలో నిప్పు పడకుండా చూడటం, మంటల ఆర్పివేతలో స్థానికుల సహకారం తీసుకోవడం, కార్చిచ్చుల వల్ల తలెత్తే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడం తదితర చర్యల ద్వారా ప్రమాదాల్ని చాలామేర తగ్గించవచ్చు.

ఉపగ్రహాల సహాయంతో..

కార్చిచ్చులను నిరోధించడానికి అడవిలో అగ్గి పడకుండా చర్యలు తీసుకోవడానికి, బాటసారులకు పశువుల కాపరులకు గ్రామీణులకు అవగాహనా కార్యక్రమాలను అటవీశాఖ చేపడుతోంది. కార్చిచ్చులు ఒక ప్రాంతం నుంచి మరోప్రాంతానికి వ్యాపించకుండా ఉండటానికి మండే స్వభావంగల ఎండుటాకులు, గడ్డి మొదలైనవి తొలగించి లేదా కాల్చివేసి ‘ఫైర్‌లైన్‌’లను ఏర్పాటు చేస్తారు. అడవుల్లో ఏర్పడే  కార్చిచ్చులను ఉపగ్రహాల సహాయంతో గుర్తించి జాతీయ రిమోట్‌ సెన్సింగ్‌ కేంద్రం, భారత అటవీ సర్వే సంస్థల ద్వారా ఆయా రాష్ట్రాల అటవీశాఖలకు, క్షేత్రసిబ్బందికి వాటి అక్షాంశ, రేఖాంశాల వివరాలు, అగ్నిప్రమాదాలపై అప్రమత్తం చేసే సందేశాలు, ఎస్‌ఎంఎస్‌లు అందుతాయి. చెలరేగే మంటలను ఆర్పడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తారు. పచ్చికొమ్మలు, బీటర్స్‌ను ఉపయోగించి  మంటలను కొట్టడం ద్వారా ఆర్పుతారు. బ్లోయర్ల సాయంతో మంటలను నియంత్రిస్తారు.

- ఎం.రామ్‌మోహన్‌ 

(సహాయ సంచాలకులు, తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీ)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ విపత్తుల సునామీ

‣ సవాళ్లు రువ్వుతున్న చైనా విస్తరణవాదం

‣ మాస్కో - బీజింగ్‌ చెట్టపట్టాలు

‣ కడలికి కర్బన చికిత్స

‣ వ్యవసాయం అన్నం పెడుతోందా?

Posted Date: 07-04-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం