• facebook
  • whatsapp
  • telegram

మాస్కో - బీజింగ్‌ చెట్టపట్టాలు

చైనా అధ్యక్షుడిగా జీవితకాలం కొనసాగేందుకు మార్గం సుగమం చేసుకున్న అనంతరం జిన్‌పింగ్‌ ఇటీవల రష్యాలో పర్యటించారు. అంతర్జాతీయ రాజకీయాల్లో ఇది ఆసక్తిని పెంచింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడితో పశ్చిమ దేశాలు; రష్యా చైనాలు రెండు కూటములుగా ఆవిర్భవించాయి. ఇలాంటి పరిస్థితుల్లో జిన్‌పింగ్‌ పర్యటన ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించింది.

ఉక్రెయిన్‌పై దాడి అనంతరం పాశ్చాత్య దేశాలు రష్యామీద తీవ్ర ఆంక్షలు విధించాయి. చైనాతో పాటు పలు దేశాలు వాటిని పట్టించుకోకుండా రష్యాతో వాణిజ్య సంబంధాలు నెరపుతున్నాయి. ఇటీవల రష్యాలో జిన్‌పింగ్‌ పర్యటనకు ముందు ఉక్రెయిన్‌పై యుద్ధానికి ముగింపు పలికేందుకు డ్రాగన్‌ 12 సూత్రాలతో ప్రణాళికను రూపొందించింది. దానిపై తన పర్యటనలో జిన్‌పింగ్‌ ఎక్కువగా మాట్లాడలేదు. ఉక్రెయిన్‌పై దాడి అనంతరం మాస్కో, బీజింగ్‌ల మధ్య వాణిజ్యం ఇతోధికమైంది. రష్యా ఎగుమతుల్లో అధిక భాగం చైనాకే కొనసాగుతున్నాయి. మాస్కో నుంచి బీజింగ్‌ భారీయెత్తున చమురు, సహజవాయువులను దిగుమతి చేసుకుంటోంది. నాటో, పాశ్చాత్య దేశాల కూటమిని ఎదుర్కొనేందుకు బీజింగ్‌తో సంబంధాలు తప్పనిసరని రష్యా నాయకత్వం భావిస్తోంది.

డ్రాగన్‌ వ్యూహం

చైనా ఆయా దేశాలతో పలు రీతుల్లో స్నేహ సంబంధాలను కొనసాగిస్తోంది. జిన్‌పింగ్‌కు రష్యాతో సంబంధాల కన్నా పుతిన్‌తో వ్యక్తిగత స్నేహం ఎక్కువ. పాశ్చాత్య దేశాల కూటమిని ఎదుర్కొనేందుకు ఇరుదేశాలు కలిసి నడుస్తున్నాయి. నిరుడు ఇరు దేశాల నేతలు సమావేశమైనప్పుడు తమ మధ్య స్నేహం అవధులు లేనిదని వ్యాఖ్యానించారు. మాస్కోతో స్నేహాన్ని బీజింగ్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునేందుకు ఇష్టపడటం లేదన్న సందేశాన్ని ఇటీవలి జిన్‌పింగ్‌ పర్యటన అందించింది. ఉక్రెయిన్‌ సమస్యను పరిష్కరించేందుకు బీజింగ్‌ రూపొందించిన ప్రణాళికలో రష్యా ఆక్రమించిన దొనెట్స్క్‌, లుహాన్స్క్‌, జపోరీజియా, ఖేర్సన్‌ ప్రాంతాల గురించి ఎలాంటి ప్రస్తావనా లేదు. పైగా 2014లో రష్యా ఆక్రమించిన క్రిమియా సమస్య అలాగే ఉంది. దాంతో బీజింగ్‌ శాంతి ప్రణాళిక రష్యా ఆక్రమణలోని ప్రాంతాలను దాని పాలనలోనే శాశ్వతంగా ఉంచేందుకు యత్నిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, సహచర ప్రపంచం ఎలాంటి కష్టనష్టాలకు లోనైనా తన ఆర్థిక ప్రగతి మాత్రం మందగించకూడదన్న దురాలోచన బీజింగ్‌కు ఉంది.

ప్రపంచంలో అత్యధిక సహజవాయు నిక్షేపాలు రష్యాలో ఉన్నాయి. ఇప్పటికే సైబీరియా నుంచి పైపులైన్‌ ద్వారా భారీగా సహజవాయువును చైనా కొనుగోలు చేస్తోంది. తాజాగా మరో పైపులైనును నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది మంగోలియా మీదుగా నిర్మితం కానుంది. ఐరోపాకు గ్యాస్‌ సరఫరాలో రష్యాకు ఆంక్షలు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితులను చైనా తనకు అనుకూలంగా మలచుకుంటోంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల్లో చైనా రెండో స్థానంలో ఉంది. వస్తు ఉత్పత్తుల విషయంలో డ్రాగన్‌దే అగ్రస్థానం. అంతర్జాతీయంగా ఆర్థికశక్తిగా ఎదగాలని తహతహలాడుతున్న బీజింగ్‌కు ఇంధన వనరులు పరిమితంగా ఉన్నాయి. దాంతో తప్పనిసరిగా దిగుమతులపై ఆధారపడుతోంది. ఉక్రెయిన్‌పై దండయాత్రతో పాశ్చాత్య ప్రపంచ విమర్శలను ఎదుర్కొంటున్న పుతిన్‌కు ఆర్థికంగా బలోపేతమైన డ్రాగన్‌ చేయూత అవసరం. ఈ క్రమంలో జిన్‌పింగ్‌ పర్యటన పుతిన్‌కు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇరు దేశాల మధ్య 16,500 కోట్ల డాలర్ల విలువైన పలు ఒప్పందాలు కుదిరాయి. ఇటీవల ప్రపంచ రాజకీయాల్లో చైనా చురుకైన పాత్ర పోషిస్తోంది. ఎన్నాళ్లుగానో వైరి పక్షాలుగా ఉన్న సౌదీ అరేబియా, ఇరాన్‌ల మధ్య శాంతి ఒప్పందానికి ఇటీవల బీజింగ్‌ మధ్యవర్తిత్వం నెరిపింది. ఇలాంటి పరిస్థితుల్లో చైనాతో స్నేహం రష్యాకు కలిసివచ్చే అంశమే. అయితే అంతిమంగా లబ్ధి పొందనున్న దేశం మాత్రం చైనాయే! భవిష్యత్తులో తైవాన్‌ను విలీనం చేసుకునేందుకు సైనిక చర్యకు డ్రాగన్‌ దిగితే- పాశ్చాత్య దేశాల కూటమి తీసుకునే చర్యల నుంచి రక్షణకు మాస్కో ముందుకొచ్చేందుకు ఈ పర్యటన తోడ్పడుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

అప్రమత్తత అవసరం

ఇండో-పసిఫిక్‌ వ్యూహాన్ని చైనా గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఈ కూటమి తనను దిగ్బంధనం చేయవచ్చని డ్రాగన్‌ ఆందోళన చెందుతోంది. భారత్‌ను అన్ని వైపులా కట్టడి చేసేందుకు అమలుచేస్తున్న ముత్యాలసరంపై మాత్రం చైనా నోరు మెదపడం లేదు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో కూటముల పేరుతో సైనికీకరణకు వ్యతిరేకమని చైనా, రష్యాలు సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. ఈ ప్రకటనలో రష్యా పాశ్చాత్య కూటమిపైనే విమర్శలు సంధించింది. ఇండియా ప్రస్తావనను అది తీసుకురాలేదు. రెండో ప్రపంచయుద్ధం అనంతరం ప్రచ్ఛన్న పోరు తరహాలో ఇలాంటి కూటముల ఏర్పాటు తగదని ఇరు దేశాలు వ్యాఖ్యానించాయి. వాస్తవానికి హిందూ మహాసముద్రంతో చైనాకు ఎలాంటి సంబంధం లేదు. ఇటీవల అక్కడ చైనా నౌకల సంచారం పెరుగుతోంది. కొలంబో నౌకాశ్రయంలో కొన్ని నెలల క్రితం చైనా నిఘా నౌక లంగరు వేసింది. వీటన్నింటి దృష్ట్యా చైనా విస్తరణ కాంక్షను సమర్థంగా నిలువరించేందుకు భారత్‌ అప్రమత్తతతో వ్యవహరించాలి.

- కె.శ్రీధర్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కడలికి కర్బన చికిత్స

‣ వ్యవసాయం అన్నం పెడుతోందా?

‣ రష్యాపై పనిచేయని ఆంక్షలు

‣ బీజింగ్‌ లెక్క తప్పింది..

‣ శత్రు ఆస్తుల వేలం

‣ రాష్ట్రాలతో సఖ్యత.. అభివృద్ధికి రాచబాట

Posted Date: 29-03-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం