• facebook
  • whatsapp
  • telegram

రష్యాపై పనిచేయని ఆంక్షలు

యుద్ధం చేయాలంటే సైనిక, ఆయుధ శక్తికి తోడు ఆర్థిక దన్నూ అవసరం. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని రష్యా దీర్ఘకాలం కొనసాగించకుండా అడ్డుకోవాలంటే దాని ఆర్థిక శక్తిని బలహీనపరచాలి. మాస్కోకు ప్రధాన ఆదాయ వనరులైన చమురు, సహజవాయువు, ఆయుధ ఎగుమతులను దెబ్బతీయాలి. జీ7 దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలను విధించడం వెనక వ్యూహమిదే. అయితే, అవి అనుకున్న ఫలితాలను అందించడంలేదు.

తాము అందించిన ఆయుధాలతో రష్యా దూకుడును ఉక్రెయిన్‌ నిలువరించగలిగింది కాబట్టి మాస్కో కన్నా తమ శస్త్రాస్త్రాలే మిన్న అని అమెరికా, నాటోలు భావిస్తున్నాయి. భవిష్యత్తులో రష్యన్‌ ఆయుధాలను ఎవరూ కొనకుండా చూడాలని అవి ఆశిస్తున్నాయి. ఎవరి ఆయుధాలు ఆధునికమైనవో, శక్తిమంతమైనవో ఉక్రెయిన్‌ యుద్ధం ముగిసిన తరవాత కానీ తేలదు. ఆ లోగా రష్యన్‌ చమురు, గ్యాస్‌ ఎగుమతులపై జీ7 ఆంక్షలు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. రష్యా చమురుకు పీపాకు జీ7 గరిష్ఠంగా 60 డాలర్ల ధర నిర్ణయించింది. అంతకన్నా ఎక్కువ ధరకు ఎవరూ రష్యన్‌ చమురు కొనకూడదని నిర్దేశించింది. అయితే, రష్యా 60 డాలర్ల కన్నా తక్కువ ధరకే భారత్‌, చైనా, తుర్కియేలకు చమురును విక్రయిస్తోంది. చమురు ధరపై పరిమితికి ప్రపంచంలో అతిపెద్ద ఎగుమతిదారైన సౌదీ అరేబియానూ ఒప్పించాలని జీ7 చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ధరపై పరిమితి (సీలింగ్‌) విధించే ఏ దేశానికీ చమురును విక్రయించేది లేదని సౌదీ తేల్చి చెప్పింది.

నెరవేరని ఆశ

మొత్తం 10 చమురు ఎగుమతి దేశాలతో ఏర్పడిన ఒపెక్‌ ప్లస్‌ సంఘంలో రష్యా, సౌదీలు ప్రధాన భాగస్వాములు. జీ7 కూటమి చెప్పినట్లు తక్కువ ధరకు చమురు విక్రయించి నష్టపోవడానికి సౌదీతో పాటు ఇతర చమురు ఎగుమతి దేశాలు సిద్ధంగా లేవు. ఈ ఏడాది ఫిబ్రవరి అయిదు నుంచి నౌకల ద్వారా రష్యా డీజిల్‌ దిగుమతులను నిషేధిస్తున్నట్లు ఐరోపా సమాఖ్య (ఈయూ) ప్రకటించింది. అంతకుముందు నుంచే రష్యా, సౌదీలు ముడి చమురు ధరపై జీ7 విధించిన పరిమితిని నీరుగార్చే చర్యలు చేపట్టాయి. మార్చి నెల మొదటి 10 రోజుల్లోనే సౌదీ అరేబియా 25లక్షల పీపాల రష్యన్‌ డీజిల్‌ను కొనుగోలు చేసింది. సౌదీ దీన్ని శుద్ధి చేసి ఐరోపాతోపాటు అనేక ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఉంది. ఏతావతా రష్యాపై పాశ్చాత్య దేశాల ఆంక్షలు ఆశించిన ప్రభావం చూపలేక పోతున్నాయి. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన వెంటనే రష్యాకు పాశ్చాత్య బ్యాంకుల్లో ఉన్న 30,000 కోట్ల డాలర్ల విదేశ మారక నిల్వలను స్తంభింపజేశారు. రష్యాలో మాస్టర్‌ కార్డు, వీసా, గూగుల్‌ పే, ఆపిల్‌ పే కార్యకలాపాలు నిలిచిపోయినా- ప్రత్యామ్నాయాలను క్రెమ్లిన్‌ కనుగొంది. ఆంక్షల వల్ల 2022లో రష్యా జీడీపీ 10శాతం దాకా కోసుకుపోతుందని అమెరికా అంచనా వేసింది. వాస్తవంలో 2.1శాతమే తరుగు పడిందని ఐఎంఎఫ్‌ వెల్లడించింది. పైగా ఈ ఏడాది రష్యా 0.3శాతం వృద్ధి రేటును సాధిస్తుందని అంచనా వేసింది. దీన్నిబట్టి జీ7 ఆంక్షలతో రష్యా కుదేలవుతుందనే ఆశ అడియాస అయిందని భావించవచ్చు.

ప్రస్తుతం రష్యాలో నిరుద్యోగమేమీ విజృంభించలేదు. పాకిస్థాన్‌ మాదిరిగా క్రెమ్లిన్‌ కరెన్సీ విలువ పడిపోలేదు. అమెరికా, ఐరోపాలలో మాదిరిగా రష్యాలో ఏ బ్యాంకూ కుప్పకూలలేదు. రష్యా సూపర్‌ మార్కెట్లలో పాశ్చాత్య సరకులు ఇప్పటికీ లభ్యమవుతున్నాయి. లేదంటే వాటికి స్థానిక ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. సాధారణ రష్యన్ల జీవితం యథావిధిగా సాగిపోతోంది. విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా ఆత్మ నిర్భరత సాధించాలని రష్యన్లు కోరుకుంటున్నారు.

యువాన్లలో చెల్లింపులు

అమెరికా, ఐరోపా దేశాల నుంచి రష్యాకు ఎగుమతులు బాగా తగ్గిపోయినా ఇతర దేశాల ద్వారా పాశ్చాత్య సరకులు మాస్కోకు చేరుతున్నాయి. ఉదాహరణకు 2022 ప్రథమార్ధంలో ఆర్మేనియా నుంచి రష్యాకు ఎగుమతులు 49శాతం పెరిగాయి. చైనా స్మార్ట్‌ఫోన్లు, వాహనాలు రష్యన్లకు విరివిగా అందుబాటులో ఉన్నాయి. ఆంక్షల అనంతరం రష్యా నుంచి 191 విదేశీ కంపెనీలు వెళ్ళిపోయాయి. మరో 1,169 సంస్థలు ఆదే ఆలోచనలో ఉన్నాయి. 1,223 కంపెనీలు రష్యాలోనే ఉండిపోతామంటున్నాయి. 496 సంస్థలు వేచిచూసే ధోరణిలో ఉన్నాయని కీవ్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ వెల్లడించింది. మరోవైపు డాలర్‌ ఆధిపత్యాన్ని దెబ్బతీయడానికి రష్యా, చైనాలు గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. పాశ్చాత్య దేశాలు శాసిస్తున్న ప్రపంచ విధానానికి ప్రత్యామ్నాయంగా బహుళ ధ్రువ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని రష్యా, చైనాలు ఇటీవల ప్రకటించాయి. చైనా అధ్యక్షుడు షీ జిన్‌ పింగ్‌ తాజాగా రష్యాను సందర్శించినప్పుడు ఈ ప్రకటన వెలువడింది. ఇకపై ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాలతో రష్యా ఆర్థిక లావాదేవీలకు చైనా కరెన్సీ యువాన్‌ను ఉపయోగిస్తామని మాస్కో అధినేత పుతిన్‌ ఇప్పటికే ప్రకటించారు. సౌదీ అరేబియా సైతం చైనాకు ఎగుమతి చేసే చమురుకు చెల్లింపులను యువాన్లలో స్వీకరించే విషయం పరిశీలిస్తోంది. ఇటీవల ఇరాన్‌, సౌదీల మధ్య చైనా సయోధ్య కుదిర్చిన దరిమిలా సౌదీ పెట్రో డాలర్లకు బదులు పెట్రో యువాన్లను స్వీకరించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. బ్రిక్స్‌లో సౌదీ, ఇరాన్‌లు సైతం చేరితే- అది బహుళ ధ్రువ ప్రపంచ సాకారానికి తొలి మెట్టు అవుతుంది.  

ప్రపంచ వాణిజ్య యుద్ధం

రష్యాపై పాశ్చాత్య దేశాల ఆంక్షలు ప్రధానంగా చమురు ఎగుమతులకు, ఆర్థిక, సైనిక రంగాలకే పరిమితమయ్యాయి. అణు విద్యుదుత్పత్తి కోసం అమెరికా ఇప్పటికీ రష్యా నుంచి యురేనియాన్ని దిగుమతి చేసుకుంటోంది. రష్యాకు కంప్యూటర్‌ చిప్‌ల ఎగుమతిని నిషేధించినా దొడ్డిదారిలో అవి మాస్కోకు చేరుతున్నాయి. మొత్తానికి అమెరికా, ఐరోపాల ఆర్థిక ఆంక్షలు ఇరాన్‌, ఉత్తర కొరియాలపై పనిచేసినంతగా రష్యాపై ప్రభావం చూపడంలేదు. ప్రపంచ చరిత్రలో ఆర్థిక ఆంక్షలు ఒక్క దక్షిణాఫ్రికాపైనే సఫలమయ్యాయి. అక్కడి శ్వేతజాతి దురహంకార ప్రభుత్వాన్ని కాళ్ల బేరానికి తేవాలని ప్రపంచం ఏకతాటిపై నిలిచింది కాబట్టి ఆంక్షలు సఫలమయ్యాయి. నాటి దక్షిణాఫ్రికా మాదిరిగా నేడు రష్యా ఒంటరి కాదు. క్రెమ్లిన్‌తో వ్యాపార, ఆర్థిక లావాదేవీలను నెరపుతున్న చైనా, భారత్‌ వంటి దేశాలపై ఎటువంటి ఆంక్షలూ లేవు. ఈ దేశాలపైనా ఆంక్షలు విధించాలని ఉక్రెయిన్‌ కోరుతోంది. అదే జరిగితే ప్రపంచీకరణకు తెరపడి ప్రపంచ వాణిజ్య యుద్ధం మొదలవుతుంది. ఇప్పటికే బ్యాంకింగ్‌ సంక్షోభం, ద్రవ్యోల్బణం వంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అమెరికా, ఐరోపాలు అందుకు సిద్ధపడతాయా అన్నదే కీలక ప్రశ్న!

- ఏఏవీ ప్రసాద్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ బీజింగ్‌ లెక్క తప్పింది..

‣ శత్రు ఆస్తుల వేలం

‣ రాష్ట్రాలతో సఖ్యత.. అభివృద్ధికి రాచబాట

‣ వినియోగం క్షీణిస్తే ఆర్థికంగా మందగతే

‣ మూలధన వ్యయం.. లొసుగుల మయం!

‣ ఇరాన్‌ సౌదీల కొత్త నెయ్యం

‣ వనాలు.. మానవాళికి రక్షా కవచాలు!

Posted Date: 25-03-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం