• facebook
  • whatsapp
  • telegram

బీజింగ్‌ లెక్క తప్పింది..

హిమాలయ దేశం నేపాల్‌లో రాజకీయాలు మరో ఆసక్తికర మలుపు తీసుకున్నాయి. భారత అనుకూలవాదిగా పేరున్న షేర్‌బహదూర్‌ దేవ్‌బాను ప్రధాని పదవికి దూరంగా ఉంచాలన్న కుయుక్తితో చైనా దత్తపుత్రుడు కె.పి.శర్మ ఓలి ఏర్పాటు చేసిన సంకీర్ణం మూడు నెలలు కాకముందే కూలిపోయింది. నేపాల్‌ను తన గుప్పిట్లో పెట్టుకోవాలని కలలు కంటున్న బీజింగ్‌కు ఇది శరాఘాతమే!

రాచరిక పాలనకు ముగింపు పలికి నేపాల్‌ 2008లో ప్రజాస్వామ్య-గణతంత్ర దేశంగా అవతరించించింది. అప్పటి నుంచి దేశ రాజకీయాలు అనేక మలుపులు తిరిగాయి. నిరుడు నవంబరులో జరిగిన పార్లమెంటరీ ఎన్నికలు, ఇటీవల ముగిసిన దేశాధ్యక్ష ఎలెక్షన్లలోనూ అదే పరిస్థితి నెలకొంది. నేపాల్‌లో సీపీఎన్‌(యూఎంఎల్‌), సీపీఎన్‌(ఎంసీ) పార్టీలు రెండు ప్రధాన కమ్యూనిస్టు శక్తులు. చైనా చొరవతో 2017 నాటి పార్లమెంటరీ ఎన్నికల్లో అవి జట్టుగా పోటీ చేశాయి. స్పష్టమైన మెజారిటీ సాధించి అధికారాన్ని దక్కించుకున్నాయి. సీపీఎన్‌(ఎంసీ)కి పుష్పకమల్‌ దహల్‌ ఛైర్మన్‌. ఈయన ప్రచండ పేరుతో ప్రసిద్ధులు. సీపీఎన్‌(యూఎంఎల్‌) అధినేత ఓలి. 2018లో ఈ రెండు పార్టీలు కలిసి నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ(ఎన్‌సీపీ)గా అవతరించాయి. ప్రధాని పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలని ఓలి, ప్రచండ అలిఖిత ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని ప్రకారం- తొలుత ఓలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అధికార పగ్గాలు చేజిక్కాక ఆయన వైఖరి పూర్తిగా మారిపోయింది. పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకున్న ఓలి- ప్రధాని పదవిపై ఒప్పందమేమీ లేదంటూ ప్లేటు ఫిరాయించారు. ఫలితంగా ఎన్‌సీపీ మళ్ళీ రెండు పూర్వ పార్టీలుగా చీలిపోయింది. ప్రచండ మద్దతు ఉపసంహరించుకోవడంతో ఓలి సర్కారు 2021లో కూలిపోయింది. చివరకు దేవ్‌బా నేతృత్వంలోని నేపాలీ కాంగ్రెస్‌(ఎన్‌సీ) సహా మరికొన్ని పార్టీలతో ప్రచండ చేతులు కలిపారు. ఆ తరవాత దేవ్‌బా ప్రధాని పీఠమెక్కారు.

నిరుటి పార్లమెంటరీ ఎన్నికల్లో ఎన్‌సీ, సీపీఎన్‌(ఎంసీ) జట్టుగా బరిలో దిగి మెజారిటీ సీట్లను గెలుచుకున్నాయి. 89 స్థానాలతో నేపాలీ కాంగ్రెస్‌ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. సీపీఎన్‌ (యూఎంఎల్‌) 78 సీట్లతో ద్వితీయ స్థానంలో నిలిచింది. సీపీఎన్‌(ఎంసీ) 32 స్థానాలతో మూడో స్థానం దక్కించుకుంది. ఎన్‌సీ, సీపీఎన్‌(ఎంసీ) సంకీర్ణమే అధికారంలో కొనసాగుతుందని తొలుత భావించినా... ప్రధాని పదవిపై దేవ్‌బా, ప్రచండ మధ్య విభేదాలు పొడసూపాయి. వారిద్దరూ ఆ పీఠాన్ని చెరో రెండున్నరేళ్లు పంచుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు! అయితే ముందుగా తానే పదవిని చేపడతానంటూ ప్రచండ పట్టుపట్టడంతో పరిస్థితి మొదటికొచ్చింది. అదే అదనుగా భావించిన ఓలి- చైనా పెద్దల ఆదేశాలతో రంగంలోకి దిగారు. ప్రచండకు మద్దతు ప్రకటించి, కొన్ని చిన్న పార్టీలతో కలిసి సంకీర్ణంలో చేరారు. ప్రచండకే ప్రధాని పీఠాన్ని కట్టబెట్టారు. అయితే, సంకీర్ణంలో చేరినప్పటినుంచే ఓలి ఆధిపత్య ధోరణి ప్రదర్శించడం ప్రారంభించారు. సీపీఎన్‌(ఎంసీ)లో చీలికలు సృష్టించేందుకూ ప్రయత్నించారు. ఈ కుయుక్తులను గ్రహించి ప్రచండ అప్రమత్తమయ్యారు. మరోవైపు ఓలి-ప్రచండ ఎంతోకాలం కలిసికట్టుగా ఉండలేరని ఎన్‌సీ నాయకులకు తెలుసు. అందుకే వారు ప్రచండ విషయంలో దూకుడుగా వ్యవహరించలేదు. ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా లేకున్నా, పార్లమెంటులో ప్రచండకు వారు మద్దతు ప్రకటిస్తూ వచ్చారు. అధ్యక్ష ఎన్నికల వేళ ఓలి, ప్రచండల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. విశ్వాస పరీక్షలో తనకు మద్దతు ప్రకటించినందుకు కృతజ్ఞతగా ఎన్‌సీ అభ్యర్థిని అధ్యక్ష ఎన్నికల్లో బలపరుస్తున్నట్లు ప్రచండ ప్రకటించారు. అది ఓలి ఎంతమాత్రమూ ఊహించని పరిణామం. ఇప్పటికే స్పీకర్‌ పదవిని సీపీఎన్‌(యూఎంఎల్‌) దక్కించుకుంది. అధ్యక్ష పదవీ వారికే వెళ్తే ఓలి మరింత శక్తిమంతుడవుతాడని ప్రచండ భావించారు. అధ్యక్ష ఎన్నికల్లో ఎన్‌సీ అభ్యర్థి విజయం సాధించారు. దాంతో ప్రచండ సర్కారుకు ఓలి మద్దతు ఉపసంహరించుకోవడం, ప్రభుత్వానికి దేవ్‌బా పార్టీ అండగా నిలవడం చకచకా జరిగిపోయాయి.

దక్షిణాసియాపై పూర్తిస్థాయి పట్టు కోసం తహతహలాడుతున్న బీజింగ్‌- నేపాల్‌ను తన చెప్పుచేతల్లో ఉంచుకోవాలని చిరకాలంగా యోచిస్తోంది. వివాదాస్పద బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌(బీఆర్‌ఐ)లో కాఠ్‌మాండూను భాగస్వామ్య పక్షంగా చేర్చుకొని పలు ప్రాజెక్టులు చేపట్టింది. బీఆర్‌ఐతో సంబంధం లేని పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రాజెక్టులనూ అందులో భాగంగానే చూపిస్తూ గొప్పలు చెప్పుకొనేందుకు ప్రయత్నిస్తోంది. తమ చేతిలో కీలుబొమ్మ వంటి ఓలి నేపాల్‌లో కింగ్‌మేకర్‌గా ఉంటే ఆ దేశాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకోవచ్చని చైనా భావించింది. తాజా పరిణామాలతో దాని ప్రణాళికలకు అనూహ్యంగా ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

- ఎం.నవీన్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ శత్రు ఆస్తుల వేలం

‣ రాష్ట్రాలతో సఖ్యత.. అభివృద్ధికి రాచబాట

‣ వినియోగం క్షీణిస్తే ఆర్థికంగా మందగతే

‣ మూలధన వ్యయం.. లొసుగుల మయం!

‣ ఇరాన్‌ సౌదీల కొత్త నెయ్యం

‣ వనాలు.. మానవాళికి రక్షా కవచాలు!

Posted Date: 25-03-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం