• facebook
  • whatsapp
  • telegram

భార లోహాలతో జలగరళం

భూగర్భ జలాలు కలుషితం

నిత్యావసరంగా ఉపయోగించే భూగర్భ జలమే గరళంగా మారితే దిక్కేది? పంజాబ్‌లో ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంది. కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ తాజాగా విడుదల చేసిన వివరాల ప్రకారం, పంజాబ్‌లోని 16 జిల్లాల పరిధిలోని భూగర్భ జలాల్లో పరిమితికి మించిన స్థాయిలో యురేనియం, ఆర్సెనిక్‌, క్రోమియం, కాడ్మియం, సీసం లాంటి భార లోహాలున్నాయి. మొత్తం 23 జిల్లాలతో కూడిన పంజాబ్‌లో మాల్వా, మాఝా, దోబాల పేరిట స్థూలంగా మూడు ప్రాంతాలున్నాయి. వీటిలో 14 జిల్లాలున్న మాల్వా ప్రాంతం అతి పెద్దది. అక్కడి మాన్సా, ఫరీద్‌కోట్‌, సంగ్రూర్‌ జిల్లాల్లో- ఆర్సెనిక్‌ చాలా ప్రమాదకర స్థాయిలో ఉంది. అలాగే భటిండా, ఫిరోజ్‌పుర్‌, ముక్త్‌సర్‌ జిల్లాల్లో- సీసం అధికంగా ఉంది. ఫతేగఢ్‌ సాహిబ్‌, లూథియానా, పటియాలా, సంగ్రూర్‌ జిల్లాల్లో- కాడ్మియం ఎక్కువగా ఉంది. భటిండా, మోగా, ఫరీద్‌కోట్‌, ఫతేగఢ్‌ సాహిబ్‌, ఫిరోజ్‌పుర్‌, లూథియానా, ముక్త్‌సర్‌, పటియాలా, సంగ్రూర్‌ జిల్లాల్లో- యురేనియం అధిక మోతాదుల్లో ఉన్నట్లు గుర్తించారు.

దోబా, మాఝా ప్రాంతాలదీ ఇదే పరిస్థితి. మాఝాలోని అమృత్‌సర్‌, తరణ్‌ తరణ్‌, గుర్‌దాస్‌పుర్‌ జిల్లాల్లోని భూగర్భ జలాల్లో ఆర్సెనిక్‌ మోతాదు చాలా ఎక్కువ స్థాయిలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 800 గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. పంజాబ్‌లో కొన్ని ప్రాంతాలు తప్ప, దాదాపు అన్ని నగరాలు, పట్టణాలు భూగర్భ జలాలపైనే ఆధారపడతాయి. బోరు నుంచి వచ్చే నీటినే తాగుతారు. భార లోహాలతో విషపూరితమైన నీరు పంజాబీల ఆరోగ్యాన్ని పెద్దయెత్తున దెబ్బతీస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. దిద్దుబాటుచర్యల్లో భాగంగా- త్వరలోనే పరిశోధనలు ప్రారంభించనున్నట్లు కేంద్రం చెబుతోంది.

హిమాలయ పర్వతాల్లోని కొన్ని రాళ్లు, ఇండో-బర్మన్‌ పర్వతశ్రేణి నుంచి వచ్చే జలాల్లో ఆర్సెనిక్‌ ఉంటుందని గతంలో పరిశోధకులు పేర్కొన్నారు. బయోటైట్‌, మాగ్నెటైట్‌, ఇల్మెనైట్‌, ఓలివిన్‌, పైరాగ్జిన్‌ లాంటి ఖనిజాల్లో ఈ భారలోహం కనిపిస్తుంది. ఇవి నదీ పరీవాహక ప్రాంతాలకు చేరినప్పుడు ఆ నీటిలో కలిసి ఆర్సెనిక్‌ను విడుదల చేస్తాయి. అలా క్రమంగా భూగర్భ జలాల్లోకి ఆర్సెనిక్‌ చేరుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదంతా సుదీర్ఘ కాలంలో జరిగే ప్రక్రియ. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పాదరసం, సీసం, క్రోమియం, కాడ్మియం, సెలీనియం స్థాయి అధికంగా ఉండటంతోపాటు, పరిమితినీ దాటిపోయినట్లు 2009 నాటి పరిశోధనల్లో వెల్లడైంది. అయినా, సమస్య తీవ్రతపై ప్రభుత్వాలు దృష్టిపెట్టలేదు. వ్యవసాయంలో విస్తృతంగా వాడుతున్న ఎరువులు, పురుగు మందుల వ్యర్థాలు కూడా నీటిలో కలుస్తున్నాయి. పారిశ్రామిక వ్యర్థ జలాలూ తమవంతుగా ప్రజారోగ్యానికి చేటు చేస్తున్నాయి.

ఆర్సెనిక్‌ కలిసిన నీటిని తాగడం వల్ల కాలేయం, మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. ఇది ‘స్లో పాయిజన్‌’లా పని చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సీసం, యురేనియం, ఇతర భారలోహాల ప్రభావం మానవ శరీరంపై తీవ్రంగానే ఉంటుంది. పంజాబ్‌లో, ముఖ్యంగా మాల్వా ప్రాంతంలో పలు జిల్లాల్లో ఇటీవలి కాలంలో క్యాన్సర్‌ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. పంజాబ్‌లో నదీ కాలుష్యంపై పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థ- ‘నరోవా పంజాబ్‌ మంచ్‌’ కన్వీనర్‌ గుర్‌ప్రీత్‌ సింగ్‌ చాంద్‌బాజా లాంటి ఉద్యమకారులు విస్తృతంగా ప్రచారం చేస్తూ, ప్రజల్లో అవగాహన పెంపొందించే ప్రయత్నంలో ఉన్నారు. ప్రభుత్వం వైపు నుంచి మాత్రం ఇలాంటి చర్యలు మచ్చుకైనా కానరావడం లేదు. భూగర్భ జలాలను నేరుగా వినియోగించడం ప్రమాదకరమన్న అంశంపై పంజాబ్‌ వాసులలో అవగాహన పెంచేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాల్సి ఉంది. తాగునీటి అవసరాలు తీర్చేందుకు రక్షిత మంచినీటి పథకాలను అమలు చేయడం తక్షణావసరం.  

దేశవ్యాప్తంగా 47,873 ఆవాస ప్రాంతాల్లో తాగునీటి వనరులకు సంబంధించి నాణ్యతా పరమైన సమస్యలు ఉన్నట్లు జల్‌శక్తి శాఖ ఇటీవల విడుదల చేసిన ఓ నివేదికలో తెలిపింది. అస్సాంలోని 1,194 గ్రామాల్లోని భూగర్భ జలాల్లో ఆర్సెనిక్‌ కాలుష్యం ఉంది. అక్కడే 19,745 గ్రామీణ ప్రాంతాల్లో ఐరన్‌ ఎక్కువగా ఉంది. రాజస్థాన్‌లోని 1,358 గ్రామాల్లో ఫ్లోరైడ్‌ జలాల సమస్య ఉంది. ప్రజారోగ్య పరిరక్షణలో కీలకమైన- సురక్షిత తాగునీటి సరఫరా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ తరహా సమస్యల విషయంలో ఎప్పటికప్పుడు తాత్కాలిక చర్యలు తీసుకోవడం తప్ప, సమస్య శాశ్వత పరిష్కారానికి మార్గాలను వెదకాలన్న చిత్తశుద్ధి కరవైంది. ఈ దిశగా కార్యాచరణ చేపడితే తప్ప ప్రజారోగ్యం గాడినపడే అవకాశం ఉండదన్న విషయాన్ని ప్రభుత్వాలు గుర్తెరగాలి.

- కామేశ్‌
 

Posted Date: 03-09-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం