• facebook
  • whatsapp
  • telegram

కాలుష్యమే గంగకు పెనుశాపం

వ్యర్థాలతో పెద్ద ముప్పు

పరిశుద్ధ గంగ... మన దేశంలో ఇప్పటికీ నెరవేరని కల. మరీ తాగేస్థాయిలో కాకున్నా, స్నానం చేసేందుకైనా పనికొచ్చే రీతిలో గంగా జలాల్ని శుభ్రపరచాలన్నది మన లక్ష్యం. సంకల్పం పూని ఎన్నో దశాబ్దాలు గడిచిపోయాయి. ఈ లోపు దేశం రూపురేఖలు మారిపోయాయి. భారతీయుల జీవనశైలీ మారిపోయింది. ఇన్ని జరిగినా దేశానికి జీవనరేఖలాంటి గంగానది మాత్రం శుభ్రం కాలేదు. ప్రక్షాళన కార్యాన్ని ఎన్నో ప్రభుత్వాలు తలకెత్తుకున్నాయి. వరసపెట్టి ప్రాజెక్టులు, కార్యక్రమాలు అమలయ్యాయి. లక్షల కోట్ల రూపాయలూ ఖర్చయ్యాయి. ఒనగూడింది అంతంతే. 1986లో భారత ప్రభుత్వం గంగా కార్యాచరణ ప్రణాళిక (జీఏపీ)ను అమలులోకి తీసుకొచ్చింది. ఆశించిన ఫలితాలు రాలేదు. 2009లో అదే కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించారు. కాలుష్యాన్ని అరికట్టి, పరిరక్షించాలనే ఉద్దేశంతో గంగకు జాతీయ నది హోదా సైతం కల్పించారు. జాతీయ గంగా నదీ పరివాహక ప్రాధికార సంస్థనూ పునర్‌వ్యవస్థీకరించారు. కాలుష్యాన్ని అడ్డుకోవడం ద్వారా జలాల నాణ్యతను ఆమోదనీయ ప్రమాణాల స్థాయిలో మెరుగుపరచాలన్న లక్ష్యం అక్కడే ఉండిపోయింది. పరిస్థితిలో ఏ మార్పూ లేదు. 2014 తరవాత నమామి గంగే ప్రాజెక్టు ప్రారంభమైంది. భారీగా బడ్జెట్‌ కేటాయింపులు సమకూరాయి. ఉన్నత స్థాయిలో అవసరమైన చిత్తశుద్ధి కనబరుస్తున్నా క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో ప్రభావం లేదని నిపుణులు చెబుతున్నారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌ కింద- గంగా తీరం వెంబడి 99.33 శాతం గ్రామాలను బహిరంగ మలవిసర్జన రహితమని(ఓడీఎఫ్‌) ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. గంగానదిలో మానవ వ్యర్థాలతో కూడిన కొలీఫాం స్థాయులను తగ్గించాలన్న లక్ష్యంతో నాలుగు వేలకుపైగా గ్రామాల్లో 27 లక్షల మరుగుదొడ్లు నిర్మించినా పరిస్థితి ఏమంత తేటపడలేదంటున్నారు.

మురికి కూపం!

పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం, ఇతరత్రా కాలుష్య పదార్థాలు గంగను మురుగులా మార్చేస్తుండటం ఒక ఎత్తయితే, మానవ వ్యర్థజలాలూ పవిత్ర గంగలో కలిసి మరింత కంపుచేస్తున్నాయి. గంగ వెంబడి ఉన్న 21 ప్రాధాన్య నగరాల్లో 60 శాతం మానవ వ్యర్థాల్ని ఇప్పటికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా గంగలో కలిపేస్తున్నట్లు తాజా అధ్యయనం తేల్చిచెప్పింది. గంగానది ప్రస్థానంలో మొదటి నుంచి చివరి వరకున్న రిషీకేశ్‌, బిజ్నోర్‌, కాన్పూర్‌, వారణాసి, ప్రయాగ్‌రాజ్‌, పట్నా, హల్దియా వంటి అన్ని ప్రాంతాల్లో ‘విజ్ఞానశాస్త్ర, పర్యావరణ కేంద్రం (సీఎస్‌ఈ)’ మూడేళ్లకుపైగా నిర్వహించిన అధ్యయనం వివరాల్ని జాతీయ గంగా ప్రక్షాళన మిషన్‌కు సమర్పించింది. అయిదు లక్షలకుపైగా జనాభా కలిగిన నగరాలైన కాన్పూర్‌, ప్రయాగ్‌రాజ్‌, వారణాసి, పట్నాల్లో 52 శాతం మానవ వ్యర్థ జలాలను సురక్షిత రీతిలో శుద్ధి చేయడం లేదని వెల్లడైంది. 1.2లక్షల నుంచి అయిదు లక్షల మధ్య జనాభా ఉండే మీర్జాపూర్‌, ఫరూకాబాద్‌ వంటి చిన్నస్థాయి నగరాల్లో 84శాతం వ్యర్థాలు శుద్ధి కాకుండానే విడుదల చేస్తున్నారు. ఈ నగరాల్లో 85శాతం గృహాలకు మురుగు నీటి పారుదల వ్యవస్థతో అనుసంధానం లేదు. వీరంతా సెప్టిక్‌ ట్యాంకులు, గుంతలు వంటి పద్ధతుల్ని అనుసరిస్తున్నారు. మానవ వ్యర్థ జలాలు పైకప్పు లేని మురుగు కాలువలు, నాలాలు, మైదానాలగుండా ప్రవహిస్తూ నదీజలాల్లో కలుస్తుండటం దిగ్భ్రాంతికరం. శుద్ధి చేయని వ్యర్థ జలాలు భూమిలోకి ఇంకిపోయి, భూగర్భ జలాల్లో కలుస్తూ, బోరు బావుల ద్వారా కలుషిత జలాల రూపంలో తిరిగి గృహాల్లోకి చేరుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి నీటిని  వినియోగించిన కారణంగా కలరా, కామెర్లు, టైఫాయిడ్‌ తదితర వ్యాధుల బారిన పడుతున్నారు. అధ్యయనం చేసిన 21 నగరాల్లో రెండు శాతం జనాభా ఇప్పటికీ బహిరంగ మలమూత్ర విసర్జన అలవాట్లనే అనుసరిస్తుండగా, ఒక్క నగరం కూడా వందశాతం ‘సీవరేజీ’ వ్యవస్థను కలిగిలేదు. 15శాతం మానవ వ్యర్థ జలాలను మాత్రమే శుద్ధి చేస్తున్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ప్రకారం దేశంలోని 60శాతానికిపైగా మురుగు శుద్ధి చేయకుండానే నదులు, ప్రవాహాల్లో కలుస్తోంది. ఫలితంగా దేశంలోని సగందాకా నదులు కాలుష్యం బారిన పడ్డాయి.

సమన్వయంతోనే శుద్ధి

మురుగుకన్నా మానవ వ్యర్థ కాలుష్యంతోనే అధిక ముప్పు తలెత్తుతున్నట్లు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యర్థ జలాల శుద్ధి నిర్వహణను సమర్థంగా చేపట్టకపోతే పరిశుద్ధ జలాలతో గంగ ప్రవహించే అవకాశం లేదంటున్నారు. కాలుష్య నియంత్రణకు తీసుకునే చర్యల్లో నదిలో జలప్రవాహం తగిన రీతిలో ఉండేలా చూసుకోవడం కూడా తప్పనిసరి. ప్రక్షాళన కోసం ఉద్దేశించిన ప్రాజెక్టుల అమలు తీవ్ర ఆలస్యం అవుతుండటంతో, వ్యయం అంతకంతకూ పెరిగిపోతుండటం మరొక సమస్య. నమామి గంగ ప్రాజెక్టును సమర్థంగా అమలు చేసేందుకు కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ పది మంత్రిత్వ శాఖలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నా, సమన్వయ లోపం వేధిస్తోంది. మానవ వ్యర్థ జలాల శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడం, జీవరసాయన పద్ధతులను, అత్యాధునిక యంత్రపరికరాలను ఉపయోగించడం తదితర పకడ్బందీ చర్యలతోనే ఏళ్లనాటి సమస్య నుంచి భవిష్యత్తులోనైనా బయటపడే అవకాశం ఉంటుంది.

- శ్రీనివాస్‌ దరెగోని
 

Posted Date: 06-01-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం