• facebook
  • whatsapp
  • telegram

భూమాతకు గుండెకోత

ఎడారీకరణ, కరవు కట్టడి దినోత్సవం నేడు

మానవ చర్యలతో 70 శాతానికి పైగా నేల సహజత్వం కోల్పోయింది. దాన్ని పునరుజ్జీవింప చేసుకోవాలంటే మన ఉనికికి మూలమైన ప్రకృతితో తిరిగి అనుబంధం ఏర్పరచుకోవాలి. 2050 నాటికి 970 కోట్లకు పెరిగే ప్రపంచ జనాభా ఆహార అవసరాల కోసం నేటి నుంచే మన బంగరు భూములను పరిరక్షించుకుందాం.

- గుటెర్రస్‌, ఐరాస ప్రధాన కార్యదర్శి

మానవుడి స్వార్థ చర్యలతో ఇప్పటికే ప్రకృతికి ఎనలేని హాని కలిగింది. నింగి, నీరు, నేల... సమస్తం కాలుష్యం కోరల్లో చిక్కాయి. తత్ఫలితంగా సంభవిస్తున్న పర్యావరణ మార్పుల దుష్పరిణామాలు కోకొల్లలు. అందులో ఒక వినాశకర విపత్తు ఎడారీకరణ. ఇది- భూసారం, పచ్చదనం, జీవ వైవిధ్యం, వ్యవసాయం, జీవనోపాధి, ఆహార భద్రతలకు పెనుముప్పుగా మారి ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈ ముప్పు ఏటికేడు విస్తరిస్తూ ప్రపంచవ్యాప్తంగా మెట్టప్రాంతాల్లో నివసించే 270 కోట్ల మంది ప్రజల జీవనానికి శాపంలా పరిణమించింది. ఆర్థిక, పర్యావరణ, వ్యవసాయ సంక్షోభాలకు ఆజ్యంపోసి, కొన్ని జీవ జాతుల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది. ఈ ముప్పును దృష్టిలో పెట్టుకుని మానవాళి, భూగోళ సంక్షేమానికి ఐక్యరాజ్య సమితి ప్రత్యేక కార్యాచరణకు పిలుపిచ్చింది. సహజత్వాన్ని కోల్పోయిన నేలతల్లిని కాపాడుకోవాలంటూ- ‘పునరుద్ధరణ, భూమి, పునరుజ్జీవం’ అంశాలను ఈ ఏడాది ప్రపంచ ఎడారీకరణ, కరవు కట్టడి దినోత్సవం ఇతివృత్తాలుగా ప్రకటించింది. ఎడారీకరణపై ఐరాస పోరుకు సంబంధించి అత్యున్నత స్థాయి సదస్సుకు అధ్యక్షత వహించిన భారత ప్రధాని మోదీ- జూన్‌ 14న దృశ్యమాధ్యమం ద్వారా అంతర్జాతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచ దేశాలు ఏకతాటిపైన నిలబడి పర్యావరణ సవాళ్లు, ఎడారీకరణను సమర్థంగా ఎదుర్కోవాలని పిలుపిచ్చారు. దెబ్బతిన్న 2.6 కోట్ల హెక్టార్ల భూమిని 2030లోపు పునరుద్ధరించేందుకు భారత్‌ కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. పదేళ్లలో దేశంలో 30 లక్షల హెక్టార్ల అటవీ భూమిని పెంచగలిగామని, నేల పునరుద్ధరణ ద్వారా ఉత్పాదకత పెరిగి ఆహార భద్రత, జీవనోపాధి సులభమవుతుందని వెల్లడించారు.

విస్తరిస్తున్న ముప్పు

ఎడారీకరణ సమస్య వర్షాధార లేదా మెట్ట భూములుగా పిలిచే ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంది. భూగోళంలో 38 శాతం మెట్ట భూములు విస్తరించాయి. ఈ ప్రాంతాల్లో 270 కోట్ల మంది జీవిస్తున్నారు. ప్రపంచంలోని 44 శాతం సాగు భూమి మెట్ట ప్రాంతాల్లోనే ఉంది. సంక్షేమం, అభివృద్ధి సూచీల్లో మెట్ట ప్రాంత ప్రజలు బాగా వెనకబడిపోయారు. వాతావరణ మార్పుల ప్రభావమూ ఈ ప్రాంతాలపైనే అధికంగా ఉంటోంది. నీటి కొరత, వర్షాభావం పంటల ఉత్పాదకతను తగ్గిస్తున్నాయి. ఎడారీకరణ ప్రక్రియ వల్ల పచ్చదనం, వృక్ష సముదాయం తగ్గి గాలి దుమారాలు, దుమ్ము తుపానులు పెరుగుతున్నాయి. జీవ వైవిధ్యంలో మార్పులు వస్తున్నాయి. మృత్తికా క్షమక్షయం (నేల క్షీణత) కారణంగా, ప్రజల అవసరాలకు, ప్రకృతి వనరులకు మధ్య భారీ అంతరం ఏర్పడింది. అంటార్కిటికా మినహా, మిగతా ఆరు ఖండాల్లో ఎడారీకరణ వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచంలోని మూడోవంతు భూభాగం ఈ ముప్పులో ఉంది. ఐరోపా సంఘం ప్రపంచ ఎడారీకరణ అట్లాస్‌ ప్రకారం- 75 శాతం నేల క్షీణతకు గురైంది. 2050 నాటికి 90 శాతం క్షీణిస్తుంది. 2030 నాటికి అయిదు కోట్ల మంది నిర్వాసితులుగా మారుతారు. వంద దేశాలు ప్రభావానికి గురవుతాయి. పచ్చదనాన్ని కబళించే ఈ విపత్తు ప్రభావం మన దేశంపైనా ఎక్కువగానే ఉంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, విజ్ఞానశాస్త్ర, పర్యావరణ కేంద్రం, జాతీయ నేలల సర్వే, భూవినియోగ ప్రణాళిక బ్యూరో తదితర సంస్థల అధ్యయనాల ప్రకారం దేశ భౌగోళిక విస్తీర్ణంలో సుమారు 30 శాతం నేలలు ఎడారీకరణ బారిన పడ్డాయి. రెండు మూడు రాష్ట్రాలు మినహా మిగతా అంతటా ఈ ప్రభావం ఉంది. ముఖ్యంగా రాజస్థాన్‌, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌, నాగాలాండ్‌, త్రిపుర వంటి రాష్ట్రాలు అధిక ముప్పును ఎదుర్కొంటున్నాయి. దక్షిణాదిలో రెండు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు ఎడారీకరణకు గురయ్యాయి. ఎడారీకరణతో ఇసుక, దుమ్ము తుపానుల ముప్పు ఎక్కువవుతుంది. బలమైన గాలికి పొలాల్లోని తేలికపాటి ఇసుక రేణువులు, మట్టి ఎగిరిపోయి నేలలు పొడిబారతాయి. ధూళి కణాలు వాతావరణంలో విస్తరించి వేడిని పెంచుతాయి. మేఘాలపై ప్రభావం చూపి వర్షాలను తగ్గిస్తాయి. తేమ శాతం తగ్గడం వల్ల నేల శ్వాస వ్యవస్థ దెబ్బతింటుంది. ఫలితంగా సూక్ష్మజీవుల ఉనికి తగ్గి నిర్జీవమై, పంటల దిగుబడి క్షీణిస్తుంది. దుమ్ము తుపానులు మానవుల ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం చూపుతాయి. ఉపరితల జలాలు కలుషితమవుతాయి.

ఉత్పాదకతకు చేటు

ఏదైనా ఒక ప్రాంతంలోని పంటభూములు కాలక్రమంలో సాగు యోగ్యత, ఉత్పాదకత కోల్పోయి నిర్జీవ నేలలుగా మారడమే ఎడారీకరణ. గత అయిదు దశాబ్దాల్లో వర్షాల తీరులో సంభవించిన మార్పులు, భూ వాతావరణంలో కర్బన ఉద్గారాలు పెరగడం, పచ్చదనం తగ్గడం, సాగు పద్ధతులు మారడం, భూసారం క్షీణించడం... వంటివి దీనికి ప్రధాన కారణాలు. ముఖ్యంగా మృత్తికా క్షమక్షయం/ నేల క్షీణత ఎడారీకరణకు మూలం. వరదలు, గాలులు, భూములను అధికంగా దున్నడం, అడవుల నరికివేత, దహనం, అశాస్త్రీయ నేల- నీటి వినియోగం, భూతాపం, ఆర్థిక, భౌగోళిక, సాంకేతిక, వ్యవస్థాగత, సాంస్కృతిక, రాజకీయ విధానాలు, అంతర్జాతీయ వ్యాపారం తదితరాలు నేల క్షీణతకు ప్రధాన కారణాలని అధ్యయనాలు స్పష్టంచేస్తున్నాయి.

ప్రకృతి పునరుజ్జీవమే పరిష్కారం

భావితరాల మనుగడ, ప్రకృతి వనరుల రక్షణ అనేవి మనం చేపట్టే చర్యలపైనే ఆధారపడి ఉన్నాయి. నేల శాశ్వతంగా నిర్జీవమైతే పునరుద్ధరణ ఎవరి తరమూ కాదు. సమగ్ర జల, భూ నిర్వహణ విధానాలు, సేంద్రియ సాగు పద్ధతులే ఈ ముప్పును నియంత్రిస్తాయి. అడవుల పునరుద్ధరణ, పచ్చదనం పెంపు, కాలుష్య కట్టడి, వాన నీటి సంరక్షణ, సహజ వనరుల హేతుబద్ధ వినియోగంపైనే మానవాళి ఆహారం, ఆరోగ్యం, జీవనోపాధి ఆధారపడి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం రిమోట్‌ సెన్సింగ్‌ పరిజ్ఞానం ద్వారా కరవు నేలలు, ఎడారీకరణకు గురవుతున్న ప్రాంతాల చిత్రాలను నిరంతరం సేకరిస్తూ తదనుగుణంగా చర్యలు చేపట్టాలి. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, తలసరి మొక్కల సాంద్రతలో అట్టడుగున ఉన్న దేశ పరిస్థితిని మెరుగు పరచాలి. అప్పుడే పుడమి పచ్చదనంతో పునరుజ్జీవం చెందుతుంది. ప్రాణికోటి ప్రశాంత జీవనానికి నివాస యోగ్యంగా మారుతుంది.

- ఎం.కరుణాకర్‌ రెడ్డి (‘వాక్‌ ఫర్‌ వాటర్‌’ వ్యవస్థాపకులు)

Posted Date: 17-06-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం