• facebook
  • whatsapp
  • telegram

ధరణీతలానికి పట్టణీకరణ సెగ

ప్రణాళికల క్షాళన తక్షణావసరం

 

 

భూగోళం ఊహించిన దాని కంటే అత్యంత వేగంగా వేడెక్కుతోందని, భవిష్యత్తులో ఇది మానవాళి పాలిట పెనుముప్పుగా పరిణమించనుందని వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి నియమించిన అంతర ప్రభుత్వాల కమిటీ (ఐపీసీసీ) ఇటీవల విడుదల చేసిన నివేదికలో హెచ్చరించింది. అధిక ఉష్ణోగ్రతలవల్ల వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకోవడంతో మంచు కొండలు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతాయని, అసాధారణ వర్షాలు, వరదలు, తుపానులు, కార్చిచ్చులు లాంటి ప్రకృతి వైపరీత్యాలు తరచూ సంభవిస్తాయని కమిటీ తన నివేదికలో వెల్లడించింది. 2050 నాటికి ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్‌ మేర పెరుగుతాయని గత నివేదికలో విశ్లేషించిన కమిటీ... 2030 నాటికే ఆ పరిస్థితి ఎదురవుతుందని కొత్తగా వివరించింది. ఇప్పటికే 1.1 డిగ్రీల సెల్సియన్‌ మేర ఉష్ణోగ్రతల్లో పెరుగుదల నమోదైందని ఆందోళన వ్యక్తం చేసింది.

 

తిలాపాపం తలా పిడికెడు...

భూతాపం పెరగడానికి కారణమైన కార్బన్‌డయాక్సైడ్‌, మీథేన్‌, నైట్రస్‌ ఆక్సైడ్‌ వంటి గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాల విడుదలలో పట్టణీకరణే ప్రధాన దోషి. విశ్వవ్యాప్తంగా నగరాలు 75శాతం కర్బన ఉద్గారాల్ని వెలువరిస్తున్నాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచంలోని 25 మహా నగరాలు 52శాతం ఉద్గారాలను విడుదల చేస్తున్నాయి. భూఉపరితలంపై రెండు శాతం విస్తీర్ణంలో మాత్రమే ఉన్న నగరాలు అధిక భాగం ఉద్గారాలకు కారణం కావడం ఆందోళనకరం. గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాల్లో అధిక భాగం ఆసియా నగరాలే వెలువరిస్తున్నప్పటికీ- తలసరి ఉద్గారాల విడుదలలో అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా నగరాలు ముందున్నాయి. చైనాలోని షాంఘె, జపాన్‌లోని టోక్యో నగరాలు అత్యధిక ఉద్గారాలను వెలువరిస్తున్నాయి. ఏటా మూడు వేల కోట్ల టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ వాతావరణంలోకి విడుదల అవుతోందని ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం అంచనా వేసింది.

 

నగరాల్లో నానాటికీ పెరుగుతున్న నివాస, వాణిజ్య భవనాలు, ఘన వ్యర్థ పదార్థాలు, రవాణా, విద్యుదుత్పత్తి, వినియోగం, పారిశ్రామికీకరణ, తరిగిపోతున్న వృక్ష సంపద, పట్టణాల విస్తరణ, వలసలతో పెరుగుతున్న జనాభా... గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాల విడుదలకు ప్రధాన కారకాలు. కాంక్రీట్‌తో నిర్మించిన భవనాలు కర్బన ఉద్గారాలను అధికంగా వెలువరిస్తాయి. 1990 నుంచి 2020 మధ్య కాలంలో భవనాల నుంచి వెలువడే ఉద్గారాలు మూడు శాతం మేర పెరిగాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అమెరికా, ఐరోపా దేశాల్లో నివాస భవనాల నుంచి వెలువడే ఉద్గారాలు ఆయా దేశాలు విడుదల చేసే మొత్తం ఉద్గారాల్లో 60శాతానికి సమానం. నగరాల్లో రోజూ కోట్ల టన్నుల ఘన, ద్రవ వ్యర్థ పదార్థాలు పోగవుతున్నాయి. వాటిని పునర్వినియోగించడమో, డంపింగ్‌ యార్డుల్లో తవ్విన పెద్ద గుంతల్లోకి తరలించడమో చేస్తున్నారు. ఘన వ్యర్థ పదార్థాలు కుళ్ళిపోయి కార్బన్‌ డయాక్సైడ్‌, మీథేన్‌ వంటి గ్రీన్‌హౌస్‌ వాయువులు ఉత్పత్తి అయి వాతావరణంలోకి విడుదల అవుతాయి. ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ ప్రక్రియ వెలువరించే మొత్తం ఉద్గారాల్లో మీథేన్‌ 40-70శాతం, కార్బన్‌డయాక్సైడ్‌ 30-60శాతం దాకా ఉంటాయి. పలు నగరాల్లో రోడ్డు రవాణా ద్వారా వెలువడే ఉద్గారాలు 30శాతం మేర ఉంటే- రైల్వేలు, జలమార్గాల ఉద్గారాల శాతం 15 వరకు ఉంది. బొగ్గు, సహజ వాయువు వంటి శిలాజ ఇంధనాలను మండించడం ద్వారా జరిగే విద్యుదుత్పత్తి ప్రక్రియలో 25శాతం దాకా ఉద్గారాలు విడుదల అవుతున్నాయి. గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాల విడుదలలో సింహభాగం విద్యుదుత్పత్తి రంగానిదే. పారిశ్రామికీకరణ ద్వారా కర్బన ఉద్గారాలతో పాటు మానవ ఆరోగ్యానికి, పర్యావరణానికి చేటు కలిగించే విష వాయువులు విడుదలవుతున్నాయి. పంట పొలాలు, అడవులు హరించుకుపోవడంతో పచ్చదనం కనుమరుగవుతోంది. ఫలితంగా కర్బన ఉద్గారాల పరిమాణం పెరిగిపోతోంది.

 

చిన్న నగరాలే ముద్దు

ఇండియాలోని నగరాల్లో భూతాపం తీవ్రంగా ఉంది. వేసవిలో వేడి గాలులతో, వర్షాకాలంలో కుండపోతగా కురిసే అసాధారణ వర్షాలతో నగర ప్రజలు అల్లాడుతున్నారు. సముద్ర మట్టాల పెరుగుదల కారణంగా తీరప్రాంత నగరాలకు ముంపు ముప్పు పొంచి ఉందని అంతర ప్రభుత్వాల కమిటీ హెచ్చరిస్తోంది. ప్యారిస్‌ ఒప్పందం నిర్దేశించిన లక్ష్యాల మేరకు గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాల నివారణకు ప్రపంచ దేశాలు కృషి చేయడం లేదు. ప్రాంతీయ, జాతీయ, స్థానిక స్థాయిల్లో- నిర్దేశించిన లక్ష్యాల మేరకు కార్యక్రమాల అమలుతోనే భూతాపం తగ్గించడం సాధ్యమవుతుంది. భవన నిర్మాణంలో పర్యావరణ హితకర నిర్మాణ సామగ్రి వినియోగించాలి. సమర్థ ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ పద్ధతులను అవలంబించాలి. అడవుల విస్తీర్ణాన్ని పెంచాలి. శిలాజ ఇంధనాల వాడకం స్థానంలో పునరుద్ధరణీయ ఇంధన వనరులను వినియోగించాలి. మహానగరాల విస్తరణకు అడ్డుకట్టవేసి చిన్ననగరాల అభివృద్ధికి బాటలు వేయాలి. నూతన నగరాల నిర్మాణంలో విద్యుత్‌ వినియోగం తక్కువగా ఉండే విధానాలకు రూపకల్పన చేయాలి. నగరాల అభివృద్ధి ప్రణాళికలు పర్యావరణానికి అనుకూలంగా ఉండాలి. వాతావరణాన్ని చల్లబరచే సాంకేతికతలను అభివృద్ధి చేయాలి. అప్పుడే ప్యారిస్‌ ఒప్పందంలో నిర్దేశించిన మేరకు 1.5 డిగ్రీల సెల్సియస్‌ మేరకు భూతాపాన్ని తగ్గించే అవకాశముంటుంది. ఈ లక్ష్య సాధనలో పటిష్ఠమైన పట్టణీకరణ వ్యూహాలతో నగరాలు కీలకపాత్ర నిర్వర్తించవలసిన అవసరం ఉంది.

 

లక్ష్యాలను విస్తరించాలి

ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం అంతర్జాతీయ, జాతీయ, స్థానిక స్థాయిల్లో వాతావరణ మార్పులపై చైతన్యం తీసుకురావడానికి సదస్సులను, శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అందుకోసం ప్రపంచ బ్యాంకు ఇటీవల నగరాల కూటమితో ఒక సంయుక్త కార్యక్రమాన్ని రూపొందించింది. కర్బన ఉద్గారాల నివారణకు సంబంధించి నగరాలకు నైపుణ్యాలను, సాంకేతికతలను అందిస్తోంది. ఉద్గారాల విడుదల తగ్గించడానికి ప్రస్తుతం దేశాలు ఏర్పరచుకొన్న లక్ష్యాలు ఫలితాలను సాధించడానికి ఏమాత్రం సరిపోవని ‘ఫ్రాంటియర్స్‌ ఇన్‌ సస్టెయినబుల్‌ సిటీస్‌’ నివేదిక తేల్చింది. భవిష్యత్తులో 70శాతం ప్రజలు నగరాల్లోనే నివసిస్తారని, అందువల్ల ఉద్గారాల నివారణలో ప్రధాన బాధ్యత నగరాలదే అని నివేదిక స్పష్టం చేసింది. చాలా నగరాలు ఇప్పటికే పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగానికి, స్వచ్ఛ ఉత్పత్తి పద్ధతుల ఆవిష్కరణకు కృషి చేస్తున్నాయి. తొమ్మిది నగరాలు, 70 పర్యావరణ పరిరక్షణ సంస్థలు కలిసి కర్బన రహిత నగరాల సాధనకు ఒక ఫోరంగా ఏర్పడ్డాయి. తలసరి ఉద్గారాలను తగ్గించడంలో ఓస్లో, హూస్టన్‌, సియాటిల్‌, బొగోటా నగరాలు విజయం సాధించాయి.

 

- పుల్లూరు సుధాకర్‌ 

(పట్టణాభివృద్ధి వ్యవహారాల నిపుణులు)
 

Posted Date: 28-09-2021 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం