• facebook
  • whatsapp
  • telegram

సౌరశక్తిని ఒడిసిపట్టే వ్యూహం

అవకాశాలు అపారం

శిలాజ ఇంధనాల వినియోగంవల్ల భూతాపం నానాటికీ అధికమవుతోంది. దీన్ని కట్టడి చేసేందుకు సౌరశక్తి వంటి పునరుత్పాదక ఇంధన వనరులకు మళ్ళడం చాలా అవసరం. భూ ఉష్ణోగ్రతలో 50శాతం పెరుగుదల గడచిన మూడు దశాబ్దాల్లోనే సంభవించిందని ఐక్యరాజ్య సమితి అధ్యయనాలు చాటుతున్నాయి. శిలాజ ఇంధనాలనుంచి వెలువడే కర్బన ఉద్గారాల్లో 62శాతం పెరుగుదల సైతం ఇదే కాలంలో సంభవించింది. ఈ కర్బన ఉద్గారాలను అరికడుతూనే, ప్రజల్లో అన్ని వర్గాలకూ విద్యుత్తు అందేలా చూడటం తప్పనిసరి. అప్పుడే సరైన అభివృద్ధికి ఆస్కారం లభిస్తుంది. భారత్‌లో నేటికీ 20 కోట్లమంది కరెంటు వినియోగానికి నోచుకోవడం లేదు. జనాభా వృద్ధి చెందుతున్నకొద్దీ విద్యుత్‌ వినియోగమూ అధికమవుతుంది. అలాగే జనావళి అవసరాలనుబట్టి అన్ని రంగాల్లో విద్యుత్తుకు గిరాకీ పెరుగుతుంది. దీనికి అనుగుణంగా సౌరశక్తి ఉత్పాదనను గరిష్ఠంగా పెంచాలి. తద్వారా స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధికి ఢోకా లేకుండా చూసుకోవాలి. 2015లో కుదిరిన పారిస్‌ వాతావరణ ఒప్పందం ప్రకారం ఇండియా ఈ దశాబ్దాంతానికల్లా 40శాతం విద్యుదుత్పాదనను పునరుత్పాదక ఇంధనాల నుంచి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

చౌకగా విద్యుదుత్పత్తి

కర్బన ఉద్గారాలతో కాలుష్యం పెచ్చరిల్లి ప్రజారోగ్యం దెబ్బతింటోంది. ప్రస్తుతం 90శాతం మానవాళి కలుషిత వాయువును పీలుస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. భారత్‌లో అర్ధాంతర మరణాలకు మూడో అతిపెద్ద కారణం వాయు కాలుష్యమే. దీనివల్ల ఏటా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచంలో అత్యంత కాలుష్యభరితమైన 30 నగరాల్లో 21 భారత్‌లోనే ఉన్నాయి. పంట వ్యర్థాల దహనం, పారిశ్రామిక కాలుష్యం, మోటారు వాహనాల నుంచి వెలువడే పొగ జాతీయ రాజధాని ప్రాంత(ఎన్‌సీఆర్‌) ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మితిమీరుతున్న కాలుష్యం కారణంగా భారత్‌లోని నదుల్లో నత్రజని పాళ్లు ఇతోధికమవుతున్నాయి. ఫలితంగా వాటిలో నాచు విస్తరించి జలచరాలకు ఆమ్లజని అందడం లేదు.

పర్యావరణ విధ్వంసాన్ని నివారిస్తూ, కాలుష్యాన్ని కట్టడి చేస్తూ నానాటికీ విద్యుత్తుకు పెరుగుతున్న గిరాకీని తీర్చాలంటే శిలాజ ఇంధనాలకు బదులుగా పునరుత్పాదక శక్తి వనరులను ఆశ్రయించవలసిందే. ఈ క్రమంలో విద్యుదుత్పాదన దెబ్బతినకుండా చూడటం ముఖ్యం. అందుకే భారత విధానకర్తలు కాలుష్య రహిత సౌరశక్తికి ప్రాధాన్యమిస్తున్నారు. ఇళ్లు, కార్యాలయ భవనాలు, పారిశ్రామిక షెడ్ల పైకప్పులపై అమర్చిన సౌర ఫలకాలతో విద్యుత్తును తక్కువ ఖర్చుకే ఉత్పత్తి చేయవచ్చు. అది చాలా సురక్షితం కూడా. ఏటా 250 నుంచి 300 రోజులపాటు ఎండలు కాచే ప్రాంతాల్లో పైకప్పుపై ఒక కిలోవాట్‌ సౌర విద్యుదుత్పాదన యూనిట్‌ను ఏర్పరిస్తే, 25 ఏళ్ల వ్యవధిలో 30 టన్నుల కర్బన ఉద్గారాలను నివారించవచ్చు. ఇది 50 చెట్లు పీల్చుకొనే బొగ్గపులుసు వాయువుకు సమానం. భారత్‌ వచ్చే ఏడాది చివరినాటికి 100 గిగావాట్ల సౌర విద్యుదుత్పాదన సామర్థ్యాన్ని సాధించాలనుకొంటోంది. అందులో 40 మెగావాట్లను పైకప్పుపై ఏర్పాటుచేసే సౌర యూనిట్ల నుంచే ఉత్పత్తి చేయాలని లక్షిస్తోంది. రాష్ట్రాల్లో పైకప్పు సౌర విద్యుత్‌ ఫలకాల యూనిట్‌ ఏర్పాటుకు కేంద్రం 30శాతం రాయితీ ఇస్తోంది. ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన కొన్ని రాష్ట్రాల్లోనైతే ఏకంగా 70శాతం సబ్సిడీ అందిస్తోంది. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, సిక్కిం, జమ్మూకశ్మీర్‌, లక్షదీవులు ఈ జాబితాలో ఉన్నాయి.

సరైన విధానం అవసరం

ఇటీవలి కాప్‌26 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటిష్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌లు సంయుక్తంగా ‘ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్‌’ పేరిట అంతర్జాతీయ సౌర గ్రిడ్‌ పథకాన్ని ప్రారంభించారు. భారత్‌లో సౌర విద్యుదుత్పాదనకు పుష్కలంగా అవకాశాలున్నప్పటికీ- కొన్ని పరిమితులూ కనిపిస్తున్నాయి. సాధారణంగా ఇండియాలో, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు చిన్నవిగా ఉండటంతో పైకప్పుపై విద్యుదుత్పాదన సామర్థ్యం తక్కువగా ఉంటుంది. ఉత్తరార్ధ గోళంలో ఉన్న భారతదేశంలో సూర్యకాంతి దక్షిణపు వాలుతో ఉండే పైకప్పుల మీద ధారాళంగా పడుతుంది. దీన్ని ఉపయోగించుకునే విధంగా సౌర ఫలకాలను అమర్చాలి. ఇల్లు లేదా భవనం అవసరాలు తీరిన తరవాత మిగిలిన విద్యుత్తును పంపిణీ సంస్థలకు అందించడానికి సరైన విధానం రూపొందించాలి. దీనికోసం నెట్‌ మీటరింగ్‌ పద్ధతిని అనుసరిస్తే- మిగులు విద్యుత్‌ గ్రిడ్‌కు చేరి, సూర్యకాంతి పడని రోజుల్లో వినియోగించుకునే సౌలభ్యం కలుగుతుంది. మొత్తంమీద కొన్ని పరిమితులున్నా తన సౌర విద్యుదుత్పాదన సామర్థ్యాన్ని పెంచుకొంటోంది. గడచిన ఏడేళ్లలోనే తన సౌర విద్యుదుత్పాదన సామర్థ్యాన్ని 17 రెట్లు పెంచుకున్నట్లు గ్లాస్గో సదస్సులో భారత్‌ ప్రకటించింది. ప్రస్తుతం ఈ సామర్థ్యం 45 గిగావాట్లకు చేరింది. భారత్‌ 2070కల్లా కర్బన ఉద్గారాల్లో నెట్‌ జీరోను సాధించడానికి సౌరశక్తి ప్రధాన సాధనం కాబోతోంది.

- అషాద్‌ మోఫిజ్‌
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సరఫరా స్తంభిస్తే ఇక్కట్లే

‣ టర్కీపైనా ఆంక్షల కొరడా

‣ పర్యావరణానికి తూట్లు

‣ చిత్తశుద్ధితోనే... భూతాప నియంత్రణ

Posted Date: 01-12-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం