• facebook
  • whatsapp
  • telegram

ప్రపంచానికి సౌరశక్తి అనుసంధానత

భారత్‌ బృహత్‌ ప్రణాళిక

పర్యావరణంలో ప్రతికూల మార్పుల కట్టడి కోసం అంతర్జాతీయ సమాజం తంటాలు పడుతున్న వేళ భారత్‌ సరికొత్త పరిష్కార మార్గాన్ని తెరమీదకు తెచ్చింది. మానవాళి మనుగడకు ప్రధాన ఆధారాల్లో ఒకటైన సౌరశక్తిని సంపూర్ణంగా వినియోగించుకోవడం ద్వారా ఒకప్పటిలా తిరిగి ప్రకృతి సమతౌల్యాన్ని సాధించవచ్చని సూచించింది. గ్ల్లాస్గో వేదికగా జరిగిన కాప్‌-26 సదస్సులో అందుకోసం ‘ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్‌ (ఓఎస్‌ఓడబ్ల్యూఓజీ)’ అనే బృహత్తర ప్రాజెక్టును ప్రతిపాదించింది. ప్రపంచమంతటినీ ఒకే గ్రిడ్‌తో అనుసంధానించడం దాని లక్ష్యం. అవసరాలకు అనుగుణంగా ఏ దేశానికైనా, ఎప్పుడైనా సౌర విద్యుత్తును సరఫరా చేసేందుకు అది తోడ్పడుతుంది. కర్బన ఉద్గారాల సమస్యకు పరిష్కారంగా నిలుస్తుంది. భవిష్యత్తు గతిని సమూలంగా మార్చే శక్తి ఉన్న ఈ ప్రాజెక్టును పట్టాలకెక్కించడంలో మన దేశం ఎంతవరకు సఫలీకృతమవుతుందన్నది, ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

ఖండాంతర గ్రిడ్‌

శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించి, సౌరశక్తిని సమర్థంగా వినియోగించుకోవడమే లక్ష్యంగా భారత్‌ ఇప్పటికే వందకు పైగా దేశాలను అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్‌ఏ) పేరుతో ఏకం చేసింది. ప్రపంచమంతటినీ ఒకే గ్రిడ్‌తో అనుసంధానం చేసే ఓఎస్‌ఓడబ్ల్యూఓజీ ఆలోచనను 2018లో ఐఎస్‌ఏ తొలి సమావేశంలోనే ప్రధాని నరేంద్ర మోదీ పంచుకున్నారు. కాప్‌-26 సదస్సులో దాన్ని ప్రపంచ నేతల దృష్టికి తీసుకొచ్చారు. పునరుత్పాదక ఇంధన రంగంలో ఇప్పటిదాకా మన దేశం తలపెట్టిన అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఇదే. సాధారణంగా పగటి వేళల్లోనే సూర్యకాంతి ద్వారా మనం విద్యుత్తును ఉత్పత్తి చేయగలం. రాత్రివేళల్లో విద్యుత్తు సరఫరా గిరాకీని అందుకోలేం. దానికి పరిష్కార మార్గంగా ఈ ప్రాజెక్టుకు భారత్‌ రూపకల్పన చేసింది. భూమి ఒకసారి తనచుట్టూ తాను తిరగడానికి 24 గంటల సమయం పడుతుంది. ప్రపంచంలో ఎప్పుడూ ఏదో ఒకచోట పగలు ఉంటుంది. అక్కడ ఉత్పత్తయ్యే విద్యుత్తునే గ్రిడ్‌ సహాయంతో నేరుగా హైఓల్టేజ్‌ కేబుళ్ల ద్వారా ఇతర దేశాలకు రాత్రివేళల్లోనూ సరఫరా చేయవచ్చు. ఈ ప్రాజెక్టులో భాగంగా కనీసం 140 దేశాలను గ్రిడ్‌ ద్వారా అనుసంధానించాలన్నది ఇండియా ప్రణాళిక. దీనిపై పలు దేశాలతో సమాలోచనలు జరిపింది. ఓఎస్‌ఓడబ్ల్యూఓజీ విషయంలో భారత్‌తో కలిసి నడిచేందుకు బ్రిటన్‌, అమెరికా ముందుకొచ్చాయి. ఓఎస్‌ఓడబ్ల్యూఓజీలో భాగంగా తొలుత ఇప్పటికే ఉన్న జాతీయ, ప్రాంతీయ గ్రిడ్‌లను ఒకదానితో ఒకటి కలుపుతారు. వాటిని అనుసంధానిస్తూ అంతర్జాతీయంగా ఉమ్మడి గ్రిడ్‌ను ఆవిష్కరిస్తారు. 2035 నాటికి ఆసియా, ఐరోపా, ఆఫ్రికాలను ఖండాంతర గ్రిడ్‌తో అనుసంధానించాలన్న లక్ష్యంతో ‘అంతర్జాతీయ ఇంధన అంతర అనుసంధానత అభివృద్ధి, సహకార సంస్థ’కు చైనా 2016లోనే శ్రీకారం చుట్టింది. స్కాండినేవియన్‌ దేశాలను కలుపుతూ నార్డ్‌ పూల్‌ ప్రాజెక్టు ఇప్పటికే అమలులో ఉంది. అవి ప్రాంతీయ గ్రిడ్‌లే. వాటికి భిన్నంగా ఓఎస్‌ఓడబ్ల్యూఓజీ యావత్‌ ప్రపంచాన్ని ఏకం చేస్తుంది. రాబోయే కొన్ని నెలల్లోనే ఈ ప్రణాళిక పట్టాలు ఎక్కవచ్చునన్న అంచనాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 2020లో ఉత్పత్తి అయిన విద్యుత్తులో 35.1 శాతానికి బొగ్గే ఆధారం. మొత్తంగా గత ఏడాది 61.3శాతం కరెంటు- శిలాజ ఇంధనాల ద్వారానే వచ్చింది. ఆ ఇంధనాల వాడకంవల్ల పర్యావరణానికి తీరని నష్టం వాటిల్లుతోంది. నిజానికి మానవాళి ఏడాది అవసరాలకు సరిపడా విద్యుత్తును ఉత్పత్తి చేయగల సూర్యరశ్మిని భూ ఉపరితలం ఒక్క గంటలోనే సంగ్రహిస్తుంటుంది! ఆ శక్తిని ఒడిసిపట్టి సౌర విద్యుత్తు ఉత్పత్తిని పెంచడం ద్వారా శిలాజ ఇంధన వాడకాన్ని తగ్గించవచ్చు.

సమన్వయం సాధ్యమేనా?

ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్‌ ఆలోచన గొప్పదే అయినా అది ఎంతవరకు కార్యరూపం దాలుస్తుందన్నదానిపై పలు సందేహాలున్నాయి. భారత్‌లోనే అన్ని ప్రాంతాలను ఒకే గ్రిడ్‌కు అనుసంధానించడం ఇటీవల అతికష్టం మీద సాధ్యమైంది. అలాంటిది వందకు పైగా దేశాలు సమన్వయంతో ముందుకు సాగడం అంత తేలిక కాదు. అందరికీ ఆమోదయోగ్యమైన నిబంధనల్ని రూపొందించాలి. గ్రిడ్‌ నిర్వహణలో లోపాలకు తావివ్వకూడదు. పారదర్శక ధరలకే విద్యుత్తును విక్రయించాలి. వివాదాలు తలెత్తితే పరిష్కరించుకునేందుకు సమర్థ వ్యవస్థను ఏర్పాటుచేయాలి. ఆయా దేశాల మధ్య ఉండే సరిహద్దు తగాదాలు, ఇతర వివాదాలూ ప్రాజెక్టుకు విఘాతంగా మారే అవకాశం ఉంది. పశ్చిమ దేశాలతో భారత్‌ అనుసంధానం కావాలంటే పాకిస్థాన్‌ లేదా అఫ్గానిస్థాన్‌ల గుండా గ్రిడ్‌ వెళ్ళాలి. అందుకు అక్కడి ప్రభుత్వాలు ఎంతమేరకు సహకరిస్తాయన్నది సందేహమే. గ్రిడ్‌కు అవసరమైన మౌలిక వసతులను సమకూర్చుకోవడమూ తేలికేమీ కాదు. కొన్నిచోట్ల మహాసముద్రాల లోపలి నుంచి కేబుళ్లు ఏర్పాటు చేయాల్సి వస్తుంది. అది చాలా ఖర్చుతో కూడుకున్నది. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) వంటి సంస్థల అండ లేకుండా ఈ ప్రాజెక్టు ముందుకు సాగడం అసాధ్యం. మన దేశానికి పేరు తెచ్చిపెడుతుంది కాబట్టి చైనా అడ్డుపుల్లలు వేసే అవకాశాలూ లేకపోలేదు. వాటన్నింటినీ విజయవంతంగా అధిగమిస్తేనే భారత బృహత్తర ప్రణాళిక ముందుకు సాగుతుంది.

- నవీన్‌ కుమార్‌

 

 

‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 14-01-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం