• facebook
  • whatsapp
  • telegram

సౌరశక్తితో ఇంధన భద్రత

సూర్యుడు అనంత శక్తి స్వరూపుడు! సౌర కాంతులు ఉంటేనే కిరణజన్య సంయోగక్రియ ద్వారా మొక్కలు, చెట్లు పెరుగుతాయి. వాటి వల్లే మానవాళికి, ఇతర జీవజాతులకు ప్రాణవాయువు, ఆహారం అందుతున్నాయి. భానుడు ప్రసరించే వేడిమి లేకపోతే భూమి గడ్డకట్టి.. మేఘాలు ఏర్పడటం, వర్షాలు కురవడం, గాలి వీయడం వంటివేవీ జరగవు. అంతటి ప్రాధాన్యమున్న సూర్యకాంతి నుంచి విద్యుత్తును తయారు చేసుకోవడం విశ్వవ్యాప్తంగా మానవాళికి క్షేమదాయకం. నేడు ప్రపంచ సౌర దినోత్సవం సందర్భంగా..

నాగరికత పరిణామక్రమంలో యంత్రాలను కనుగొనడం మానవాళి చరిత్రలో ప్రత్యేక అధ్యాయం. వాటిని వినియోగించేందుకు ఇంధనం అవసరం కావడంతో సహజ ఇంధనాలను మండించడం ఆరంభమైంది. ముఖ్యంగా బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాల వల్ల కాలుష్యం పెరిగి అనేక దుష్పరిణామాలు తలెత్తుతున్నాయి. ప్రజలు వ్యాధుల బారిన పడుతుండటం మొదలు వాతావరణ మార్పుల వరకు అనేక విపరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సౌర, పవన విద్యుత్‌ ఉత్పత్తి, వినియోగాన్ని పెంచుకోవడం ద్వారా ఈ ముప్పును చాలా వరకు కట్టడిచేసే అవకాశముంది.

కర్బన ఉద్గారాలు..

శిలాజ ఇంధనాలు, పారిశ్రామిక కార్యకలాపాలు వంటి చర్యల కారణంగా వాతావరణంలోకి వెలువడుతున్న ఉద్గారాలను కట్టడి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2015 నాటి ప్యారిస్‌ వాతావరణ ఒప్పందం మొదలు గ్లాస్గో ఒప్పందం-2021, జీ-20 వంటి అంతర్జాతీయ వేదికలపై కర్బన ఉద్గారాలను కట్టడి చేయాలంటూ ప్రపంచ దేశాలు అనేక తీర్మానాలు చేశాయి. ముఖ్యంగా భూ ఉష్ణోగ్రతల పెరుగుదలను పారిశ్రామిక విప్లవం ముందున్న దానికి 1.5 డిగ్రీలు మించకుండా చూడాలని లక్షించాయి. 2050 నాటికి ప్రతి దేశం కర్బన ఉద్గారాలను నికర శూన్యస్థాయికి చేర్చాలనీ యోచించాయి. ప్రపంచంలో వివిధ ఇంధనాల మొత్తం వినియోగాన్ని పరిశీలిస్తే- నేటికీ సంప్రదాయేతర ఇంధన వనరుల వాటా 28.7శాతాన్ని మించలేదు. గాలి, నీటితో పోలిస్తే పర్యావరణానికి హాని జరగకుండా, సురక్షితంగా విద్యుత్తును తయారు చేసుకోవడానికి ప్రతిరోజూ మనకు లభించే సౌరశక్తి ఎంతో అనుకూలం. సూర్యుడి నుంచి 15 నిమిషాలపాటు వెలువడే శక్తి... ప్రపంచమంతటా ఏడాది పాటు వినియోగించే ఇంధనానికి సమానం! అపారంగా లభించే సౌరశక్తిని గృహ అవసరాలకే కాకుండా వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాల్లో మరింతగా వినియోగించుకోవాల్సిన అవసరముంది. భారత్‌ సమశీతోష్ణ మండలంలో ఉంది. మన దగ్గర రోజులో ఒక చదరపు మీటరు విస్తీర్ణంలో పడే సూర్యకాంతి నుంచి 4-7 యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసుకునే అవకాశముంది. ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోలార్‌ ఎనర్జీ’ అంచనాల ప్రకారం- వృథా భూముల్లో మూడు శాతం విస్తీర్ణంలో సౌర ఫలకలను ఏర్పాటు చేసుకుంటే 7.48 లక్షల మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చు. దీన్ని అందిపుచ్చుకొనేందుకు కేంద్రం 2010లో జవహర్‌లాల్‌ నెహ్రూ నేషనల్‌ సోలార్‌ మిషన్‌, ఆ తరవాత సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాను స్థాపించింది. ఆ ప్రయత్నాల ఫలితంగా ప్రస్తుతం 61.97 వేల మెగావాట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తిచేస్తూ ఆ రంగంలో భారత్‌ ప్రపంచంలోనే నాలుగో స్థానాన్ని ఆక్రమించింది. 2030 నాటికి ఈ సామర్థ్యాన్ని 2.8 లక్షల మెగావాట్లకు పెంచుకోవాలని సంకల్పించింది.

సూర్యకాంతిని పగటిపూట ఒడిసి పట్టి, నిల్వ చేసుకుని, రాత్రి వేళల్లో వాడుకోవాలి. సౌర విద్యుత్తును బ్యాటరీల్లో నిల్వచేసుకునే సౌలభ్యం అందుబాటులో ఉన్నా, అందుకు భారీగా ఖర్చవుతోంది. ఈ సమస్యకు ప్రధాని మోదీ 2018లో అంతర్జాతీయ సౌర కూటమి సమావేశం సందర్భంగా మేలిమి పరిష్కారం సూచించారు. ‘ఒకే సూర్యుడు- ఒకే ప్రపంచం- ఒకే గ్రిడ్‌’ భావనతో దేశాలన్నీ ముందడుగు వేయాలని ఆయన ఉద్బోధించారు. ప్రపంచ దేశాలు ఎప్పుడైనా, ఎక్కడైనా వాడుకునే విధంగా సౌర విద్యుత్‌ కేంద్రాలను అనుసంధానిస్తూ అంతర్జాతీయ విద్యుత్‌ సరఫరా లైన్‌ను నిర్మించాలని మోదీ సూచించారు. ఇప్పటికే ఈ విధానాన్ని 37 దేశాలు అనుసరిస్తున్నాయి. భారత్‌కు నేపాల్‌, శ్రీలంక, భూటాన్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌లతో కూడిన విద్యుత్‌ సరఫరా వ్యవస్థ ఉంది. కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యాన 2019లో ఏర్పాటైన ప్రత్యేక కమిటీ నివేదికను అనుసరించి- 140 దేశాల మధ్య సౌర విద్యుత్‌ పరస్పర సరఫరా నిమిత్తం అంతర్జాతీయ లైన్‌ ఏర్పాటు చేయాలని సూత్రపాయంగా నిర్ణయించారు. 2021లో గ్లాస్గోలో జరిగిన కాప్‌-26 వాతావరణ సదస్సు సందర్భంగా- ఐరోపా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌, అమెరికాలతో కలిసి అంతర్జాతీయ సౌర కూటమిని మరింత ముందుకు తీసుకువెళ్ళాలని భారత్‌ పిలుపిచ్చింది. ప్రపంచ బ్యాంకు సహకారంతో ‘ఒకే సూర్యుడు-ఒకే ప్రపంచం-ఒకే గ్రిడ్‌’ కోసం కార్యాచరణ ప్రణాళికలను ప్రకటించింది. ఆ మేరకు 2022లో జరిగిన ప్రపంచ సౌర సాంకేతిక సమ్మేళనంలో భారత్‌ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

సవాళ్లను అధిగమిస్తే సుసాధ్యమే..

అంతర్జాతీయ విద్యుత్‌ సరఫరా వ్యవస్థను నిర్మించుకోవడానికి భారీ స్థాయిలో పెట్టుబడులు అవసరం. సునామీలు, తుపానులు వంటి విపత్తులను, సైబర్‌ దాడులను సమర్థంగా తట్టుకుని దీని ద్వారా విద్యుత్‌ సరఫరాను కొనసాగించడం సవాలుతో కూడుకున్న పని. దేశాలన్నీ పూనుకొంటే వీటిని అధిగమించడం సాధ్యమవుతుంది. ఈ ప్రాజెక్టు సాకారమైతే- వివిధ దేశాల్లో సౌర విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా, వినియోగ వ్యవస్థల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన భద్రతకు భరోసా లభిస్తుంది. పర్యావరణానికి చేటు చేస్తున్న శిలాజ ఇంధనాల స్థానంలో స్వచ్ఛమైన, కాలుష్య రహిత సౌరశక్తి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది.

‘ఇస్రో’ నివేదిక..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) - ఉపగ్రహం ఆధారంగా వివిధ దేశాల్లో సౌరశక్తి లభ్యత ఎలా ఉంటోందన్న పట్టికను రూపొందిస్తుంది. ఈ నివేదికే అంతర్జాతీయ విద్యుత్‌ సరఫరా వ్యవస్థ ఏర్పాటుకు మార్గదర్శనం చేయనుంది. భారత్‌, ఐరోపాలు ఈ ప్రాజెక్టు విధి విధానాల రూపకల్పన బాధ్యతను ఇంధన వనరుల సంస్థ ‘టేరి’కి అప్పగించాయి. ఈ ప్రతిపాదనతో శిలాజ ఇంధనాల వినియోగాన్ని కట్టడి చేసి, సౌరశక్తిని సమర్థంగా వినియోగించుకోవడమే కాకుండా- భౌగోళికంగా తన పరపతిని పెంచుకోవచ్చని భారత్‌ భావిస్తోంది. దీనికి సంసిద్ధత వ్యక్తంచేసిన దేశాలను, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే ఆర్థిక సంస్థలను కలుపుకొని ఎక్కడికక్కడ చిన్నపాటి అంతర్జాతీయ విద్యుత్‌ సరఫరా లైన్లు నిర్మించుకోవాలని తలపోశారు. తరవాతి దశలో వాటన్నింటినీ అనుసంధానించనున్నారు. ఈ తరహాలో భారత్‌ కొన్ని సరిహద్దు (సార్క్‌) దేశాలను కలుపుకొని అంతర్జాతీయ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసుకునే వీలుంది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ శ్రామిక నైపుణ్యం.. దేశానికి వరం!

‣ అంగట్లో వ్యక్తిగత సమాచారం!

‣ కర్ణాటకలో హోరాహోరీ పోరు

‣ క్వాంటమ్‌ పోటీకి భారత్‌ సై

‣ అద్దెకు రణసేన!

‣ ఆహార శుద్ధితో ఆదాయ స్థిరత్వం

Posted Date: 12-05-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం