• facebook
  • whatsapp
  • telegram

అద్దెకు రణసేన!

అంతర్జాతీయ మార్కెట్‌ వ్యవస్థలో పోరాటమూ వ్యాపార వస్తువైంది. యుద్ధం ప్రైవేటీకరణకు లోనైంది. ఒకప్పుడు అంతర్యుద్ధాలు, తిరుగుబాట్లకు కిరాయి సైనికులను వ్యక్తిగత ప్రాతిపదికపై నియోగిస్తే, ఇప్పుడంతా సంస్థాగతమైపోయింది. నిర్దిష్ట పారితోషికానికి ప్రభుత్వాల తరఫున పోరాట విధులను నిర్వహించే ప్రైవేటు సైనిక కంపెనీలు భారీగా పుట్టుకొచ్చాయి.

అమెరికా, బ్రిటన్‌లలో ప్రైవేటు సైనిక కంపెనీ (పీఎంసీ)లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఫ్రాన్స్‌, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాలు పరిమిత సంఖ్యలో ఈ కిరాయి సంస్థల సేవలు ఉపయోగించుకొంటున్నాయి. రష్యా తానూ తక్కువ తినలేదంటోంది. ఇరాక్‌ యుద్ధంలో అమెరికా, నాటో దేశాలు భారీయెత్తున పీఎంసీలను నియోగించాయి. రష్యన్‌ ప్రైవేట్‌ మిలిటరీ కాంట్రాక్టరైన వాగ్నర్‌ గ్రూప్‌ ఉక్రెయిన్‌లో బాహ్మూట్‌ నగరాన్ని ఇటీవల కైవసం చేసుకున్నట్లు ప్రకటించింది. ఆఫ్రికాలో రష్యా ఆర్థిక, సైనిక ప్రాబల్యాన్ని విస్తరించడానికి రష్యా అధినేత వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆశీస్సులతోనే వాగ్నర్‌ గ్రూపు ఏర్పాటైంది. దాదాపు 30,000 మంది కిరాయి సైనికులున్న వాగ్నర్‌కు ప్రస్తుతం సూడాన్‌లో జరుగుతున్న అంతర్యుద్ధంలోనూ ప్రమేయం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. సూడాన్‌లోని బంగారం, మాంగనీస్‌, సిలికాన్‌, యురేనియం భారీ నిక్షేపాలపై వాగ్నర్‌ కన్ను వేసిందని పాశ్చాత్య వర్గాలు భావిస్తున్నాయి. 1993 నుంచి 2019 వరకు సూడాన్‌ను పాలించిన సైనిక నియంత ఒమర్‌ అల్‌ బషీర్‌ తమ దేశంలో బంగారం నిక్షేపాలు వెలికితీయడానికి ఎం-ఇన్వెస్ట్‌ అనే రష్యన్‌ సంస్థకు లైసెన్సు ఇచ్చారు. ఆ సంస్థను నెలకొల్పినది వాగ్నర్‌ గ్రూపే. 2019లో అల్‌ బషీర్‌ను కూలదోసి అధికారంలోకి వచ్చిన ఇద్దరు సేనా నాయకుల్లో ఒకరైన  జనరల్‌ మహమ్మద్‌ హందాన్‌ దగాలో బంగారం గనులను స్వాధీనం చేసుకున్నారు. ఆయన కూడా వాగ్నర్‌తో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్నారు. సూడాన్‌లో బంగారం తవ్వకాలు నిర్వహిస్తున్న మెరో గోల్డ్‌ కూడా వాగ్నర్‌ గ్రూపు ముసుగు సంస్థ అంటూ దానిపై అమెరికా ఆంక్షలు విధించింది. వాగ్నర్‌ చాడ్‌ దేశంలోనూ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఉదాహరణకు సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌ దేశంలో నడుస్తున్న అంతర్యుద్ధంలో ప్రభుత్వం తరఫున 1,890 మంది వాగ్నర్‌ శిక్షకులు పోరాడుతున్నారు. ఆ దేశంలోని అరుదైన కలప, బంగారం నిక్షేపాల నుంచి వాగ్నర్‌ గ్రూపు భారీ లాభాలు ఆర్జించిందని అంచనా. లిబియా, మాలీ దేశాల్లోనూ వాగ్నర్‌ కిరాయి సైనికులు పోరాట విధులు నిర్వహిస్తున్నారు.

జర్మన్‌ స్వరకర్త రిచర్డ్‌ వాగ్నర్‌ పేరిట రష్యన్‌ వ్యాపారవేత్త యెవ్‌ గెనీ ప్రిగోజిన్‌ 2014లో స్థాపించిన వాగ్నర్‌ గ్రూప్‌ ఉక్రెయిన్‌తోపాటు అనేక దేశాల్లో మరణమృదంగం మోగిస్తోంది. అమెరికా, ఐరోపాలలో సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న ఇంటర్నెట్‌ రిసెర్చ్‌ ఏజెన్సీ స్థాపకుడు తానేనని ప్రిగోజిన్‌ ఇటీవల బహిరంగంగా ఒప్పుకొన్నారు. 2016 అమెరికన్‌ అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్‌ ఓడి డొనాల్డ్‌ ట్రంప్‌ గెలవడానికి సామాజిక మాధ్యమాల్లో రష్యా చేసిన ప్రచారమూ తోడ్పడిందనే ఆరోపణలు వచ్చాయి. పుతిన్‌, ప్రిగోజిన్‌లిద్దరూ సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో జన్మించారు. పేద కుటుంబంలో పుట్టిన ప్రిగోజిన్‌ 1980లలో చోరీ నేరానికి తొమ్మిదేళ్ల జైలు శిక్ష అనుభవించారు. తరవాత ఆహార సరఫరా వ్యాపారం (కేటరింగ్‌)లో ప్రవేశించి రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌లో గౌరవ విందులకు భోజనాలు సమకూర్చేవారు. అలా పుతిన్‌ కళ్లలో పడి రష్యన్‌ సైన్యం, పాఠశాలలకు ఆహారం సరఫరా చేయడానికి విలువైన కాంట్రాక్టులు పొందారు. ప్రిగోజిన్‌ ప్రారంభించిన కిరాయి సేన వాగ్నర్‌ గ్రూపు పుతిన్‌ తరఫున ఆఫ్రికా, పశ్చిమాసియాలలో పోరాటాలు సాగిస్తోంది.

ఉక్రెయిన్‌ అధ్యక్ష పదవికి 2024లో పోటీ చేస్తానని ప్రిగోజిన్‌ ప్రకటించారు. తాజాగా రష్యాలో ‘ఏ జస్ట్‌ రష్యా పార్టీ’ అనే రాజకీయ పక్షాన్ని తన గుప్పిట్లోకి తీసుకొంటున్నట్లు వార్తలు వచ్చాయి. అయినప్పటికీ పుతిన్‌ కనుసన్నల్లోనే నడుస్తారని చెబుతున్నారు. వృద్ధాప్యం, అనారోగ్యాల వల్ల పుతిన్‌ ఎంతో కాలం అధ్యక్షుడిగా కొనసాగలేరని, బహుశా పుతిన్‌ వారసుడిగా ప్రిగోజిన్‌ అవతరించవచ్చని రాజకీయ వర్గాల అంచనా. 2022 నుంచి చాలామంది రష్యన్‌ అతిసంపన్నులు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. తన ఆఫ్రికా వ్యాపారాల ద్వారా భారీగా ఆర్జించినా, ప్రిగోజిన్‌కు అలాంటి పరిస్థితి రాలేదు. ఆయన్ను తీర్చిదిద్దిన వ్యక్తి పుతిన్‌ కావడమే దీనికి కారణం కావచ్చు. ఫక్తు అవకాశవాది, వ్యాపారంలో దిట్ట అయిన ప్రిగోజిన్‌ భవిష్యత్తులో రష్యా రాజకీయాల్లో చక్రం తిప్పినా ఆశ్చర్యం లేదని మార్క్‌ గాలియాటి అనే రష్యన్‌ వ్యవహారాల నిపుణుడి అంచనా.

- ఏఏవీ ప్రసాద్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆహార శుద్ధితో ఆదాయ స్థిరత్వం

‣ బీజింగ్‌ మధ్యవర్తిత్వం ఫలిస్తుందా?

‣ పేదల నెత్తిన పరోక్షభారం

‣ మానవాళికే సవాళ్లు

‣ రక్షణ ప్రాజెక్టుల నత్తనడక!

Posted Date: 01-05-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం