• facebook
  • whatsapp
  • telegram

పేదల నెత్తిన పరోక్షభారం

కేంద్ర ప్రభుత్వం ఆదాయ వనరులు పెంచుకొనేందుకు పరోక్ష పన్నులపై ఆధారపడుతోంది. అందులోనూ జీఎస్టీ వాటాయే అధికం. పరోక్ష పన్నులు దేశంమీద, సమాజంపై తిరోగమన ప్రభావం చూపుతాయి. పేదలపై అధిక భారం మోపుతాయి. ఇలాంటివారిపై పరోక్ష పన్నుల భారం తగ్గించాల్సిన అవసరం ఉంది.

దేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. రాబడిలో వృద్ధి ఆశాజనకంగా ఉంది. సగటున నెలకు సుమారు రూ.1.5 లక్షల కోట్లకుపైనే ఖజానాకు జమ అవుతోంది. ప్రపంచమంతా అధిక ద్రవ్యోల్బణం, అనిశ్చితి భయాలు కొనసాగుతున్న తరుణంలో భారత్‌ వంటి పెద్ద దేశాల్లో ఆర్థిక కార్యకలాపాల నమోదు పరిమాణం పెరుగుతోంది. ఇది మనతో పాటు ప్రపంచానికీ సానుకూల సంకేతమే. కానీ మొత్తం జీఎస్టీ రాబడిలో అధికభాగాన్ని సమకూరుస్తున్నది పేదలేనన్న విషయాన్ని గుర్తించాలి. కిరాణా సామగ్రి నుంచి పెట్రో ఉత్పత్తుల వరకు పెరిగిన ధరల భారాన్ని భరిస్తున్న పేద కుటుంబాలే దేశ ఖజానాను నింపుతున్నాయి.

పెరుగుతున్న రాబడులు

ప్రపంచంలోని మిగతా పెద్ద ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే ప్రస్తుతానికి భారత ఆర్థిక వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉంది. జీఎస్టీ అనేది దేశీయ వినియోగంపై విధిస్తున్న విలువ ఆధారిత పన్ను. దేశీయంగా ఉత్పత్తి చేసిన, దిగుమతి చేసుకున్న వస్తు సేవలు పెరుగుతున్నకొద్దీ జీఎస్టీ రాబడులూ పెరుగుతుంటాయి. ఇటీవలి కాలంలో మన దిగుమతులు, ఎగుమతులకంటే వేగంగా పెరుగుతున్నాయి. కరోనా అనంతర పరిణామాలు, ద్రవ్యోల్బణం ప్రభావంతో వినిమయ వస్తువుల ధరలన్నీ రెండేళ్లుగా పరుగులు తీస్తున్నాయి. ఆహారం, దుస్తులు, ఇంధనం, ఉక్కు సహా అన్నింటి ధరలూ పెరిగాయి. అధిక జీఎస్టీ వసూళ్లకు దారితీసిన అసలు పరిణామమిదే. స్థూలంగా చెప్పాలంటే దేశంలో ధరలు పెరిగేకొద్దీ ప్రభుత్వానికి పన్ను రాబడులు పెరుగుతున్నాయి.

విధానపరంగా చూస్తే జీఎస్టీ రేట్లు ప్రగతిశీలంగా కనిపిస్తాయి. సంపన్నులు వినియోగించే వస్తు సేవలపై పన్ను రేట్లు అధికంగా, పేదలు ఉపయోగించే వాటిపై తక్కువగా ఉంటాయి. కానీ ధనికుల కంటే పేద కుటుంబాలే జీఎస్టీ భారంలో ఎక్కువ వాటాను భరిస్తున్నాయని ఇటీవలి ఆక్స్‌ఫామ్‌ నివేదిక వెల్లడించింది. పేదలు వినియోగించే వాటిలో ఎక్కువగా అవసరమైన వస్తువులే ఉంటాయి. వీటి ధరలు పెరిగినా డిమాండ్‌ తగ్గదు. ఫలితంగా ఈ వస్తువులు, సేవలకు తక్కువ పన్ను రేట్లు ఉన్నప్పటికీ మొత్తం జీఎస్టీ భారంలో ఎక్కువ వాటా ఉంటుంది. ఉదాహరణకు పాల ఉత్పత్తులు, గోధుమపిండి సహా ప్యాకింగ్‌, లేబుళ్లు వేసిన ఆహార ఉత్పత్తులపై అయిదు శాతం జీఎస్టీ విధిస్తున్నారు. ఉక్కు (18శాతం), సిమెంటు (28శాతం) వంటి నిర్మాణ సామగ్రిపై అధిక పన్ను భారం పేదలపైనే ఎక్కువగా పడుతుంది. సంపన్న కుటుంబాల వినియోగం ఇందుకు పూర్తి వ్యతిరేకం. వారు వినియోగించే వస్తువులు, సేవలను అందించేందుకు ఖర్చులు అధికమైనా, ధరలను పెంచేందుకు విక్రేతలు తటపటాయిస్తారు. ఫలితంగా వాటి ధరలు నెమ్మదిగానే పెరుగుతుంటాయి. మరోవైపు, ఆదాయపు పన్ను రేట్లను పెంచడం, సంపద పన్నును తిరిగి ప్రవేశపెట్టడం కూడా పూర్తిగా సరికాదు. ఎందుకంటే గరిష్ఠ ఆదాయ పన్ను స్లాబులో ఉన్నవారిపై సెస్‌, సర్‌ఛార్జీలతో కలిపి విధిస్తున్న రేటు ఇప్పటికే చాలా ఎక్కువ. ప్రైవేటు పెట్టుబడులు అంతంతమాత్రంగా ఉన్న తరుణంలో కార్పొరేట్‌ పన్ను రేట్లు పెంచడమూ సత్పలితాలను ఇవ్వదు.

పరిష్కారమెలా?

దేశీయ ఉత్పత్తిదారులకు మద్దతుగా విధిస్తున్న అధిక ఇంధన పన్నులు, దిగుమతి సుంకాలన్నీ ద్రవ్యోల్బణాన్ని పెంచేస్తున్నాయి. అధిక ద్రవ్యోల్బణం, అధిక పన్నులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ధనికుల కంటే పేదలనే ఎక్కువగా కుంగదీస్తాయి. ప్రభుత్వం దిగుమతి చేసుకునే కనీస అవసరాల శ్రేణి వస్తువులపై సుంకాన్ని తగ్గిస్తే వాటి ధరలు తగ్గి ఆ మేరకు ప్రజలపై భారం తగ్గుతుంది. మొత్తం పన్ను భారాన్ని తగ్గించగల వస్తుసేవలపై అదనపు సెస్‌, సర్‌ఛార్జీలను తొలగించినా ప్రయోజనకరమే. ఆహార పదార్థాలు, ఔషధాలపై సున్నా పన్ను ఉంటే పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు అవి చౌకగా లభ్యమవుతాయి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలపై పన్నుల భారం తగ్గించడం- తక్కువ ఆదాయ కుటుంబాలతో పాటు వినియోగదారులందరికీ మేలు చేస్తుంది. కార్పొరేట్‌ పన్ను, వ్యక్తిగత ఆదాయ పన్ను వంటి ప్రత్యక్ష పన్నులపై ఆధారపడే విషయంలో విధానాలు మారాలి. దేశీయ ఉత్పత్తి తగ్గకుండా చూసి ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచడం, ఇంధన పన్నులు తగ్గించడం వంటివీ ఉపకరిస్తాయి. పన్ను వసూలు పరిధిని విస్తృతం చేయడానికి ఆదాయ పన్ను మినహాయింపుల్ని కనీస స్థాయికి తీసుకురావాలి. అలాగే జీఎస్టీ ఫైలింగ్‌, రిపోర్టింగ్‌ విధానాన్ని సరళీకరించి చిన్న, మధ్యతరహా పరిశ్రమలు స్వచ్ఛందంగా నమోదుకు ముందుకొచ్చే వాతావరణం తీసుకురావాలి. ఈ పరిణామం పన్ను రేట్లు పెంచకుండానే ఆదాయం పెంచేందుకు దోహదపడుతుంది. పంటలకు క్రమంగా పెరుగుతున్న కనీస మద్దతు ధరలు, ఇన్‌పుట్‌ సబ్సిడీలను ధనిక రైతులూ పొందుతున్నారు. ఇలాంటివారిని పన్ను పరిధిలోకి తేవడం సముచితమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రత్యక్ష, పరోక్ష పన్ను కింద ఉన్న మినహాయింపుల జాబితాను కుదించడం మేలు. అప్పుడే పరోక్ష పన్ను రేట్లు దిగివస్తాయి. జీఎస్టీపై అధికంగా ఆధారపడటమూ తగ్గుతుంది.

అధిక రవాణా ఖర్చులు

ముడిచమురు ధరలు తగ్గినా- పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గడంలేదు. పెట్రోలియం ఉత్పత్తులకు జీఎస్టీ వర్తించదు. కానీ ముడిచమురు ధరలు, ఇంధనాలపై కేంద్రం విపరీతంగా విధించే ఎక్సైజ్‌ సుంకంతో పాటు, రాష్ట్రాలు వడ్డించే విలువ జోడింపు పన్ను (వ్యాట్‌) ఉంటుంది. ఇవన్నీ కలిసి రవాణా ఖర్చుల్ని పెంచుతాయి. రవాణా సేవలపై 18శాతం జీఎస్టీ పడుతుంది. అధిక రవాణా వ్యయం ప్రతి రంగంలోనూ ద్రవ్యోల్బణాన్ని పెంచేస్తుంది. రోడ్లు, వంతెనల పనుల కాంట్రాక్టులపై 12శాతం జీఎస్టీ ఉంది. ఇది టోల్‌, ప్రయాణ ఛార్జీలను పెంచుతుంది. దేశంలో పరోక్ష పన్ను విధానం పనితీరును అంచనా వేయడానికి, ఆందోళనల పరిష్కారానికి జీఎస్టీ మండలి సమావేశం సరైన వేదిక. ఇక్కడ కేంద్రం మాటే నెగ్గుతోంది. పేదలపై పడే పన్ను భారంపై చర్చలు అంతగా జరగడం లేదు.

- సీహెచ్‌ మదన్‌ మోహన్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మానవాళికే సవాళ్లు

‣ రక్షణ ప్రాజెక్టుల నత్తనడక!

‣ కొత్త ఖండం అవతరించనుందా?

‣ వృద్ధిపథంలో భారతావని

‣ బొగ్గు దిగుమతితో విద్యుత్‌ ఖరీదు

‣ తైవాన్‌పై చైనా దూకుడు

Posted Date: 01-05-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం