• facebook
  • whatsapp
  • telegram

బీజింగ్‌ మధ్యవర్తిత్వం ఫలిస్తుందా?

భిన్న ధ్రువాలుగా పేరున్న సౌదీ అరేబియా, ఇరాన్‌ మధ్య సయోధ్య కుదర్చడం ద్వారా ప్రపంచ దేశాలను  చైనా ఇటీవల ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్‌-పాలస్తీనా వివాద పరిష్కారానికి మధ్యవర్తిత్వం నెరపేందుకు సిద్ధమవుతోంది. తద్వారా పశ్చిమాసియాలో అమెరికాకు ప్రత్యామ్నాయ శక్తిగా, అంతర్జాతీయ స్థాయిలో అగ్రదేశంగా గుర్తింపు పొందాలన్నది బీజింగ్‌ యోచన.

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో ఇటీవల ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్‌, పాలస్తీనా విదేశాంగ మంత్రులతో చైనా విదేశాంగ మంత్రి ఫోన్‌లో విడివిడిగా మాట్లాడారు. ఆ రెండు దేశాల మధ్య వివాదానికి శాశ్వతంగా తెరదించే దిశగా శాంతిచర్చల పునరుద్ధరణలో క్రియాశీల పాత్ర పోషించాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారు. బీజింగ్‌ చొరవను ఇజ్రాయెల్‌, పాలస్తీనా స్వాగతించాయి. దాంతో- పశ్చిమాసియాపై చైనా పట్టు పెరిగేందుకు మరో కీలక ముందడుగు పడినట్లయిందని విశ్లేషకులు చెబుతున్నారు. వెస్ట్‌బ్యాంక్‌, గాజాస్ట్రిప్‌ అనే రెండు భూభాగాలుగా పాలస్తీనా విడివడి ఉంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు పాలస్తీనాను అధికారికంగా గుర్తించినా, ఐక్యరాజ్య సమితిలో పూర్తిస్థాయి సార్వభౌమ దేశంగా ఇంకా సభ్యత్వం దక్కలేదు. వెస్ట్‌బ్యాంక్‌ (తూర్పు జెరూసలెం సహా), గాజాలు తమ భూభాగాలేనన్నది ఇజ్రాయెల్‌ వాదన. ఇది యూదులు, అరబ్బుల మధ్య ఘర్షణగా మారి రక్తపాతానికి కారణమవుతోంది. ప్రస్తుతం వెస్ట్‌బ్యాంక్‌లో పాలస్తీనా విమోచన సైన్యం(పీఎల్‌ఓ) పరిపాలన కొనసాగుతుండగా, హమాస్‌ తిరుగుబాటుదారుల నియంత్రణలో గాజా ఉంది. ఇజ్రాయెల్‌-పాలస్తీనా వివాద పరిష్కారానికి అమెరికా మధ్యవర్తిత్వంలో ఏళ్లతరబడి చర్చలు కొనసాగినా అవి నిష్ఫలమయ్యాయి. 2014 తరవాత సంప్రతింపులు దాదాపుగా నిలిచిపోయాయి. ఇటీవల ఇజ్రాయెల్‌-పాలస్తీనా ఘర్షణలు మరింత ముదిరాయి. ఈ తరుణంలో మధ్యవర్తిత్వ ప్రతిపాదనతో చైనా ముందుకురావడం ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఇజ్రాయెల్‌-పాలస్తీనా వివాద పరిష్కారం కోసం 2013లోనే చైనా నాలుగు అంశాల ప్రణాళికను ప్రతిపాదించింది. ‘రెండు దేశాల విధానం (యూదులకు ఇజ్రాయెల్‌, పాలస్తీనియన్లకు పాలస్తీనా దేశాలను వేర్వేరుగా ఏర్పాటు చేయడం)’ అందులోని కీలక అంశం. 2021లోనూ చైనా ఆ ప్రణాళికను మరోసారి తెరమీదకు తీసుకొచ్చింది. పాలస్తీనాను సర్వస్వతంత్ర దేశంగా, తూర్పు జెరూసలెంను దాని రాజధానిగా గుర్తించాలని ప్రతిపాదించినా ముందడుగు పడలేదు. ఇప్పుడు మళ్ళీ అవే ప్రతిపాదనలతో రంగంలోకి దిగుతోంది. వాస్తవానికి పాలస్తీనాకు మావో జెడాంగ్‌ హయాం నుంచీ చైనా అండగా నిలిచింది. పీఎల్‌ఓకు ఆయుధాలు సరఫరా చేసింది. ఇజ్రాయెల్‌పై పోరాటానికి సైనిక శిక్షణ సైతం ఇచ్చింది. 1970వ దశకం తరవాత తటస్థ వైఖరిని అవలంబించడం ప్రారంభించింది. ఇజ్రాయెల్‌తో చైనా వాణిజ్య భాగస్వామ్యం గణనీయంగా పెరగడమే అందుకు కారణం. ఇప్పటికీ పాలస్తీనాపై చైనాకు సానుభూతి ఉంది. రెండింటి మధ్య సంబంధాలు బలంగానే ఉన్నాయి. ఈ కారణంగానే చైనా మధ్యవర్తిత్వం ఫలించే అవకాశాలున్నాయన్నది కొందరు విశ్లేషకుల అభిప్రాయం.

పశ్చిమాసియాపై అమెరికా పట్టు సడలుతున్నట్లే కనిపిస్తోంది. ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి వైదొలగడం, సౌదీ అరేబియాతో సంబంధాలకు బీటలువారడం అందుకు ప్రధాన కారణాలు. ఇరాక్‌, అఫ్గానిస్థాన్‌ల విషయంలో అనుసరించిన వైఖరి కారణంగా వాషింగ్టన్‌పై పశ్చిమాసియా దేశాల్లో విశ్వాసం సన్నగిల్లింది. సౌదీ-ఇరాన్‌ మధ్య రాజీ కుదిర్చిన చైనా... పశ్చిమాసియాపై అమెరికాను మించి పట్టు సాధించాలని భావిస్తోంది. అక్కడి దేశాలతో తనకున్న వాణిజ్య భాగస్వామ్యాన్ని అందుకు ఊతంగా చేసుకుంటోంది. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌-పాలస్తీనా వివాద పరిష్కారంలో ఇరుసుగా మారగలిగితే ప్రాంతీయంగా చైనా పట్టు పదిలమవుతుంది. అయితే- చైనాను మధ్యవర్తిగా అంగీకరించడం ద్వారా అమెరికాను దూరం చేసుకునేందుకు ఇజ్రాయెల్‌ సాహసిస్తుందా అనేది ప్రశ్నార్థకమే. తూర్పు జెరూసలెం రాజధానిగా పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించేందుకు ఇజ్రాయెలీ నేతలు అంగీకరించే అవకాశాలూ తక్కువే. వెస్ట్‌బ్యాంక్‌లో తమ జనావాసాల పెంపునకు కట్టుబడి ఉన్నామని నెతన్యాహు సర్కారు ఇటీవలే స్పష్టంచేసింది. పశ్చిమాసియాలో అమెరికా స్థానాన్ని భర్తీ చేయగల సామర్థ్యం చైనాకు ఉందా అనేదీ సందేహమే. ఈ ప్రాంతంలో వాషింగ్టన్‌కు పదుల సంఖ్యలో సైనిక స్థావరాలు ఉన్నాయి. ప్రస్తుతానికి సైనికపరంగా జోక్యం చేసుకోకుండా దౌత్య, ఆర్థిక విధానాలతోనే పశ్చిమాసియాలో బీజింగ్‌ ముందుకుసాగవచ్చన్న విశ్లేషణలు వెలువడుతున్నా, తమ భద్రతకు హామీ ఇవ్వకపోతే చైనాను అక్కడి దేశాలు పూర్తిగా విశ్వసించడం కష్టమే. ఇజ్రాయెల్‌-పాలస్తీనా వివాద పరిష్కార ప్రయత్నంతోపాటు పశ్చిమాసియాపై పట్టు పెంచుకునే ప్రణాళికల్లో బీజింగ్‌కు కఠిన సవాళ్లు ఎదురవడం ఖాయం.

- ఎం.నవీన్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పేదల నెత్తిన పరోక్షభారం

‣ మానవాళికే సవాళ్లు

‣ రక్షణ ప్రాజెక్టుల నత్తనడక!

‣ కొత్త ఖండం అవతరించనుందా?

‣ వృద్ధిపథంలో భారతావని

‣ బొగ్గు దిగుమతితో విద్యుత్‌ ఖరీదు

‣ తైవాన్‌పై చైనా దూకుడు

Posted Date: 01-05-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం