• facebook
  • whatsapp
  • telegram

కర్ణాటకలో హోరాహోరీ పోరు

కర్ణాటక ఎన్నికల్లో అన్ని పార్టీలూ హోరాహోరీగా తలపడుతున్నాయి. భాజపాకు కాంగ్రెస్‌ గట్టి పోటీ ఇస్తోంది. మరోవైపు జేడీఎస్‌ సైతం తన ఉనికిని చాటుకొనే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి పరిస్థితులు చివరికి హంగ్‌ అసెంబ్లీకి దారి తీస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 

కర్ణాటకలోని భాజపా ప్రభుత్వాన్ని 40శాతం కమిషన్‌ సర్కార్‌ అని   అభివర్ణిస్తూ అవినీతిని ప్రధాన ప్రచారాస్త్రంగా కాంగ్రెస్‌ మలచుకొంది. మొదట్లో ఇది ఆ పార్టీకి మంచి ఊపును తెచ్చింది. అయితే, స్థానిక కాంగ్రెస్‌ నాయకులు భాజపా కేంద్ర నాయకులను సైతం అవినీతిపరులుగా చిత్రీకరించడంతో   పరిస్థితి కొంత మారినట్లుగా కనిపిస్తోంది. దీంతో ప్రస్తుత ఎన్నికలను మోదీకి, కాంగ్రెస్‌కు మధ్య పోరాటంగా మార్చడానికి భాజపాకు అవకాశం చిక్కినట్లయింది. కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీని విషసర్పంగా అభివర్ణించడం రాజకీయంగా దుమారం రేపింది. తరవాత తన విమర్శ భాజపాను ఉద్దేశించి చేసినదంటూ ఖర్గే స్పష్టం చేసినా కొంత నష్టం వాటిల్లింది. స్థానిక నేతలను కాంగ్రెస్‌ పార్టీ ఉత్సాహంగా బరిలోకి ఉరికించినా, భాజపా సామాజిక మాధ్యమాల్లో దూకుడుగా ప్రచారం చేసి పైచేయి సాధించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం చేయడానికి దిల్లీ నుంచి జాతీయ స్థాయి నాయకులను భాజపా మోహరించింది. ప్రధాని మోదీ ‘నమో’యాప్‌ ద్వారా 24 లక్షల భాజపా కార్యకర్తలతో సంభాషిస్తూ వారిలో కదనోత్సాహాన్ని ఉరకలెత్తించారు.

లింగాయత్‌ల మొగ్గు ఎటువైపు?

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మొదలుకొని పలువురు భాజపా జాతీయ నాయకులు కర్ణాటకలో విస్తృతంగా ప్రచారం చేశారు. మోదీని అభివృద్ధికి ప్రతీకగా, అమిత్‌ షా, యోగి ఆదిత్యనాథ్‌లను హిందూత్వ చిహ్నాలుగా భాజపా ప్రచారం చేస్తోంది. ముస్లిములకు నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేసి వాటిని లింగాయత్‌, ఒక్కలిగలకు చెరిసగం పంచి, ముస్లిములను ఈబీసీ కోటా కిందకు చేర్చే ప్రక్రియ ఎన్నికల్లో లబ్ధి చేకూరుస్తుందని భాజపా ఆశిస్తోంది. ఇటీవల జరిగిన నాలుగు సర్వేల్లో రెండు కాంగ్రెస్‌కు అనుకూలంగా, రెండు భాజపాకు మొగ్గుచూపుతూ వచ్చాయి. కర్ణాటక జనాభాలో 17శాతమైన లింగాయత్‌లు రాష్ట్రంలోని మొత్తం 224అసెంబ్లీ  నియోజకవర్గాలకుగాను 100 స్థానాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. ఈ సీట్లలో అత్యధికం ఉత్తర కర్ణాటకలోనివే. యడియూరప్ప  నాయకత్వంలో లింగాయత్‌లు గత 20 ఏళ్లుగా భాజపా వెనక మోహరించారు. ఈ వర్గానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి జగదీశ్‌ శెట్టర్‌, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవది భాజపా నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్ళారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీని లింగాయత్‌ల వ్యతిరేకిగా భాజపా చిత్రీకరిస్తోంది. గతంలో లింగాయత్‌ వర్గానికి చెందిన వీరేంద్ర పాటిల్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించిన వైనాన్ని ఓటర్లకు గుర్తుచేస్తోంది. మరోవైపు, రాహుల్‌ గాంధీని లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించిన ఉదంతం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. కర్ణాటకలో రాహుల్‌ భారత్‌ జోడో యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన రావడం శుభసంకేతంగా ఆ పార్టీ భావిస్తోంది. అయితే అదానీ, అంబానీల పేరిట మోదీపై ధ్వజమెత్తడం ద్వారా రాహుల్‌ కర్ణాటక ఎన్నికల ప్రచారాన్ని స్థానిక సమస్యల నుంచి పక్కకు మళ్ళించినట్లయింది. ప్రాంతీయ సమస్యలపైనే దృష్టి కేంద్రీకరించడం- విజయానికి దగ్గరి దారి అనే వ్యూహాన్ని రాహుల్‌, ఖర్గేలు విస్మరించారనే విమర్శలున్నాయి. మరోవైపు జేడీ(ఎస్‌) సైతం మెరుగైన ఫలితాలు సాధించేందుకు కసరత్తు చేస్తోంది.

హిమాచల్‌ వ్యూహం

హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల్లో తమకు గెలుపు సాధించిపెట్టిన వ్యూహాన్ని కర్ణాటకలోనూ అమలు చేయాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. హిమాచల్‌ మాదిరిగా ఇక్కడా గృహజ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. గృహలక్ష్మి పథకం కింద 1.5 కోట్ల గృహిణులకు ఒక్కొక్కరికి నెలకు రూ.2,000 ఆర్థిక సహాయం అందిస్తామని, అన్నభాగ్య పథకం కింద నిరుపేద కుటుంబాలకు 10 కిలోల ఉచిత బియ్యం అందిస్తామని హస్తం పార్టీ హామీ ఇచ్చింది. యువ నిధి యోజన కింద   నిరుద్యోగ పట్టభద్రులు, డిప్లొమా పట్టాదారులకు నెలకు రూ.3,000,  రూ.1,500 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని, ప్రభుత్వ రవాణా వాహనాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ వసతి కల్పిస్తామని వాగ్దానాలు గుప్పించింది. పేదలకు ఇలాంటి ఉచితాలకన్నా నికరమైన అభివృద్ధి, సంక్షేమం వల్లే అసలైన లబ్ధి చేకూరుతుందని భాజపా ప్రచారం చేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కోవడానికి భాజపా పలు కొత్త ముఖాలను పోటీకి నిలిపింది. మొత్తానికి కాంగ్రెస్‌ పార్టీకి రాజకీయంగా అనుకూల పరిస్థితులు ఉన్నా, వాటిని సద్వినియోగం చేసుకోగలదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. త్రిముఖ పోరులో పరిస్థితులు హంగ్‌కు దారితీసే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలున్నాయి.

- నీరజ్‌ కుమార్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ క్వాంటమ్‌ పోటీకి భారత్‌ సై

‣ అద్దెకు రణసేన!

‣ ఆహార శుద్ధితో ఆదాయ స్థిరత్వం

‣ బీజింగ్‌ మధ్యవర్తిత్వం ఫలిస్తుందా?

‣ పేదల నెత్తిన పరోక్షభారం

‣ మానవాళికే సవాళ్లు

‣ రక్షణ ప్రాజెక్టుల నత్తనడక!

Posted Date: 01-05-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం