• facebook
  • whatsapp
  • telegram

శ్రామిక నైపుణ్యం.. దేశానికి వరం!

జనాభా విషయంలో చైనాను భారత్‌ మించిపోయింది. 142.86 కోట్ల మందితో ప్రపంచంలోనే అత్యధిక జనాభాగల దేశంగా అవతరించింది. శ్రామిక నైపుణ్యాలను, ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకుంటే అధిక జనాభా దేశానికి వరంగా మారుతుంది. లేనిపక్షంలో జనభారం ఆర్థికాభివృద్ధికి ఆటంకంగా పరిణమిస్తుంది.

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్‌ తదుపరి పయనం ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తిగా మారింది. పెరుగుతున్న జనాభా దేశాభివృద్ధికి తోడ్పడుతుందా, లేదంటే ఆటంకంగా మారుతుందా అన్నది ప్రభుత్వాల విధి విధానాలపై ఆధారపడి ఉంది. ఇప్పటికే పేదరికం, ఆకలి, పోషకాహార లోపం వంటి సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వాలకు సవాలుగా మారింది. పెరుగుతున్న జనాభాకు మెరుగైన వైద్య ఆరోగ్య సదుపాయాలు.. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం కష్టమవుతుంది.

తక్కువ తలసరి ఉత్పాదకత..

జనాభా పెరుగుదల వల్ల తలసరి సహజవనరుల లభ్యత తగ్గుతుంది. భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువ మంది ప్రజలకు వ్యవసాయమే ప్రధాన ఆదాయ వనరు. అధిక జనాభా ప్రచ్ఛన్న నిరుద్యోగితకు దారితీయడమే కాకుండా, తలసరి ఉత్పాదకతనూ తగ్గిస్తుంది. భూమిలేని కార్మికుల సంఖ్య పెరగడంతో వారి ఆదాయాలు కోసుకుపోతాయి. స్థూలంగా చెప్పాలంటే తక్కువ తలసరి ఉత్పాదకత.. పొదుపు, పెట్టుబడులను తగ్గిస్తుంది. ఫలితంగా భూమిపై మెరుగైన సాంకేతికత, యంత్ర పరికరాలను ఉపయోగించడం సాధ్యం కాదు. ఈ కారణంగా వ్యవసాయంలో మూలధన నిర్మాణం దెబ్బతింటుంది. పర్యవసానంగా ఆహార ఉత్పత్తులు తగ్గి, పోషణ సమస్య ప్రజలకు మరింత భారంగా మారుతుంది. జనాభా భారీ విస్ఫోటాన్ని ప్రభుత్వాలు భారంగా కాకుండా, ఒక అవకాశంగా పరిగణించాలన్న వాదనలు ఉన్నాయి. అమెరికా, బ్రిటన్‌, జపాన్‌ వంటి అభివృద్ధి చెందిన దేశాలు దశాబ్దాలుగా ఈ కోణంలోనే దృష్టి సారించి జనాభాను బలమైన శ్రామికశక్తిగా మలచుకొని అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయి. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం- చైనా జనాభాలో శ్రామికశక్తి వాటా      67శాతం. అమెరికా (65 శాతం), జపాన్‌ (58 శాతం), బ్రిటన్‌ (63 శాతం). అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశం 68 శాతం శ్రామికశక్తితో అగ్రస్థానంలో ఉంది. అయితే మొత్తం శ్రామికుల్లో నైపుణ్యం కలిగినవారు ఎంతశాతం ఉన్నారన్నదే కీలకం. చైనాలో 24శాతం, అమెరికాలో 52శాతం, బ్రిటన్‌లో 68శాతం, జపాన్‌లో 80శాతం నిపుణులైన కార్మికులు ఉండగా- భారత్‌లో మాత్రం అలాంటివారు కేవలం మూడు శాతమే! ఇందువల్లే భారత్‌ తన వాస్తవ ఉత్పాదకశక్తి కంటే చాలా తక్కువగా వస్తుసేవలను ఉత్పత్తి చేస్తోంది. జనాభా పెరుగుదల విషయమై ఆందోళనను పక్కనపెట్టి, ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసుకునేలా ఈ జన సంపదను సమర్థంగా వినియోగించుకోవాల్సిన మార్గాలను ప్రభుత్వాలు అన్వేషించాల్సిన తరుణం ఆసన్నమైంది. ప్రజల సగటు వయసు భారత్‌లో తక్కువే. చైనా (37), అమెరికా (37), పశ్చిమ ఐరోపా (45), జపాన్‌ (49) దేశాల్లో కంటే తక్కువగా భారత్‌లో ప్రజల సగటు వయసు 28 సంవత్సరాలుగా ఉంది. దీన్ని డెమోగ్రాఫిక్‌ డివిడెండ్‌గా పేర్కొంటాం. దీన్ని ఎంతసమర్థంగా ఉపయోగించుకుంటామన్నది దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.ప్రస్తుతం మన దేశంలో ఏటా సుమారు 2.5 కోట్ల మంది చదువులు పూర్తిచేసుకుని ఉద్యోగ మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నారు. వీరిలో 70 లక్షల మందికే ఉద్యోగాలు లభిస్తున్నాయి. మిగిలిన 1.8 కోట్ల మంది నిరుద్యోగులుగా మిగులుతున్నారు. ఇలా ఏటికేడు నిరుద్యోగులు పెరిగితే డెమోగ్రాఫిక్‌ డివిడెండ్‌.. జనాభా విపత్తుగా మారుతుంది. ఈ పరిస్థితి తలెత్తకుండా, డెమోగ్రాఫిక్‌ డివిడెండ్‌ దేశ ప్రగతికి తోడ్పడేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా విద్య, ఆరోగ్యం వంటి ప్రాథమిక సామాజిక రంగాలలో తగినన్ని పెట్టుబడులు పెట్టాలి. మౌలిక వసతుల కల్పన ద్వారా ఆర్థికాభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాబోయే 25 సంవత్సరాల్లో ఇండియాను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు అధిక జనాభాను అవకాశంగా పరిగణించాలి. మానవ వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు కార్మిక మార్కెట్‌లో సంస్కరణలు చేపట్టాలి. ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలి.

ఇలా ముందుకు..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్య సంరక్షణ, విద్య, శ్రామిక నైపుణ్యాల మెరుగుదల, ఉపాధి కల్పనకు ప్రాధాన్యమివ్వాలి. ఈ రంగాల్లో పెట్టుబడులు పెంచాలి. ఫలితంగా మానవ వనరుల రూపంలో మూలధనం పెరుగుతుంది. ఇది దేశ ఆర్థిక వికాసానికి, పేదరిక నిర్మూలనకు దోహదపడి సమగ్ర సమాజాన్ని సృష్టించడంలో కీలకంగా నిలుస్తుంది. ఆధునిక ఆర్థిక వ్యవస్థకు అవసరమైన నైపుణ్యాలను పుణికిపుచ్చుకొనేలా దేశంలోని కార్మికశక్తికి శిక్షణ ఇవ్వాలి. ఇందుకు జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎస్‌డీసీ)ను బలోపేతం చేసుకోవడంతో పాటు వృత్తి విద్యా సంస్థలను దేశవ్యాప్తంగా నెలకొల్పాలి. దేశంలో ఇరవై సంవత్సరాలు నిండనివారు మొత్తం జనాభాలో 42శాతానికి పైనే ఉన్నారు. వీరందరికీ మెరుగైన విద్యను అందించినప్పుడే డెమోగ్రాఫిక్‌ డివిడెండ్‌ ప్రయోజనాలను పూర్తిస్థాయిలో అందుకోగలం. లేకుంటే సమీప భవిష్యత్తులో మన దేశం జనాభా విపత్తును ఎదుర్కోవలసి వస్తుంది. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యలో సరైన పెట్టుబడులు పెట్టడం ద్వారా విద్యా ప్రమాణాలను మెరుగుపరచుకోవాలి. ఈ దిశగా ప్రభుత్వం ఇటీవల ఉన్నత విద్య విత్త సంస్థ (హెచ్‌ఈఎఫ్‌ఏ)ను ఏర్పాటు చేయడం స్వాగతించదగ్గ పరిణామం. యువతను శ్రామికశక్తిలోకి చేర్చుకునేందుకు దేశం ఏటా కోటి ఉద్యోగాలను సృష్టించాలి. వాణిజ్య రంగం పట్ల ప్రజల్లో మక్కువను పెంచి, వ్యవస్థాపక నైపుణ్యాలను వారికి అలవరచడం ఉద్యోగాల సృష్టికి ఊతమిస్తుంది. ప్రపంచ బ్యాంకు ఇటీవల విడుదలచేసిన ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ సూచికలో భారత్‌ మెరుగైన ర్యాంకు సాధించడం శుభసూచకం. స్టార్ట్‌-అప్‌ ఇండియా, భారత్‌లో తయారీ వంటి కార్యక్రమాలను సమర్థంగా అమలుచేస్తే- అధిక జనాభా భారత్‌కు వరమే అవుతుంది.

ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి

నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పగ్గాలు చేపట్టినప్పటి నుంచి దేశ ప్రజల సగటు వయసు (డెమోగ్రాఫిక్‌ డివిడెండ్‌)ను తరచూ ప్రస్తావిస్తున్నారు. దేశ ఆర్థికాభివృద్ధికి, సాధికారతకు యువత ఎలా దోహదపడుతుందో తన ప్రసంగాల్లో పేర్కొంటున్నారు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే భారత్‌లో తయారీ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, జాతీయ యువజన విధానం వంటివి రూపొందించింది. అయినప్పటికీ 97శాతం శ్రామికుల్లో నైపుణ్యాలు కొరవడుతున్నాయి. దాంతో వారు తమ అర్హతలకు తగిన ఉద్యోగాలను పొందలేకపోతున్నారు. ఎంతోమంది నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు. ఈ పరిస్థితి ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచుతోంది.

- డాక్టర్‌ సత్యనారాయణమూర్తి

(రాజస్థాన్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యులు)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అంగట్లో వ్యక్తిగత సమాచారం!

‣ కర్ణాటకలో హోరాహోరీ పోరు

‣ క్వాంటమ్‌ పోటీకి భారత్‌ సై

‣ అద్దెకు రణసేన!

‣ ఆహార శుద్ధితో ఆదాయ స్థిరత్వం

Posted Date: 06-05-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం