• facebook
  • whatsapp
  • telegram

జీవవైవిధ్యానికి గొడ్డలి పెట్టు

క్షీణిస్తున్న అమెజాన్‌ అరణ్యాలు

అడవులు జీవవైవిధ్యానికి పట్టుగొమ్మలు. మితిమీరిన మానవ కార్యకలాపాలతో ప్రపంచవ్యాప్తంగా అడవులు క్షీణించిపోతున్నాయి. దక్షిణ అమెరికా ఖండంలోని పలు దేశాల్లో విస్తరించిన అమెజాన్‌ వర్షారణ్యాలు వేగంగా కుదించుకుపోతూ ఉండటం పర్యావరణానికి పెను విఘాతంగా పరిణమిస్తోంది. సుమారు మూడింట రెండు వంతుల అమెజాన్‌ అడవులు బ్రెజిల్‌లోనే ఉన్నాయి. విస్తీర్ణం రీత్యా ఇవి కాంగో, ఇండొనేసియా అటవీక్షేత్రాలకంటే పెద్దవి. సుమారు 67 లక్షల చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్నాయి. సువిశాల ఆవరణ వ్యవస్థతో, విస్తారమైన వృక్ష సంపదను కలిగి ఉన్నాయి. ఈ వృక్షాలు చాలా పెద్ద మొత్తంలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ను శోషించుకొంటున్నాయి. అందుకే అమెజాన్‌ అడవులకు ‘భూమికి శ్వాసకోశాల’ని పేరు. ప్రవేశించడానికి వీలుకాని పరిస్థితులవల్ల అమెజాన్‌ అడవుల్లోని చాలా ప్రాంతాలు ఇప్పటికీ వెలుగులోకి రాలేదు. ఈ తరహా పరిస్థితులే ఆయా ప్రాంతాల్లో వృక్ష, జంతుజాలం విలసిల్లడానికి, జీవ వైవిధ్యం వర్ధిల్లడానికి తోడ్పడ్డాయి. ఇప్పటికీ, బాహ్య ప్రపంచానికి ఇంకా తెలియకుండా కొన్ని స్థానిక అటవీ తెగలు ఆ ప్రాంతాల్లో నివసిస్తున్నాయని పరిశోధకుల అభిప్రాయం.

భూతాపాన్ని అరికట్టడంలో ప్రధాన పాత్ర వహిస్తున్న అమెజాన్‌ అడవులను పలు రకాల కార్యకలాపాల కోసం ధ్వంసం చేస్తున్నారు. బ్రెజిల్‌, బొలీవియా, కొలంబియా, పెరూల్లో వీటికి అధికంగా నష్టం వాటిల్లుతోంది. ఆయా దేశాల్లో మాంసం ఉత్పత్తి, ఎగుమతుల కోసం పెద్దయెత్తున పశువులను పెంచుతున్నారు. వాటి దాణాకోసం సోయా వంటి పశుగ్రాస పంటలు అధికంగా సాగు చేస్తున్నారు. పశు పెంపకం 70శాతం అడవుల నరికివేతకు కారణం. మరో 12శాతం అడవుల నాశనానికి సోయా పంట సాగు కారణం. చెరకు, పామాయిల్‌, పత్తి తదితర పంటలకోసం సైతం భారీగా అటవీక్షేత్రాలను నాశనం చేస్తున్నారు. మానవ ఆవాసాలకు, కలపకు, గనుల తవ్వకానికి అడవులను వేగంగా నరికేస్తున్నారు. కొద్దికాలం మాత్రమే ఉత్పాదకతను కలిగి ఉండే అమెజాన్‌ నేలల సహజ స్వభావంవల్ల- స్థలాన్ని మార్పుచేసే పోడు వ్యవసాయ విధానం అధికం కావడంతో అడవులు వేగంగా నశిస్తున్నాయి. భూమి కోసం అడవులను నిర్మూలించడానికి ఉద్దేశపూర్వకంగా పెట్టే మంటలు మరింత నష్టం కలిగిస్తున్నాయి. బ్రెజిల్‌లో నిర్మించిన రహదారుల వ్యవస్థవల్ల, గతంలో ప్రవేశించడానికి వీలు కాని ప్రాంతాలు కూడా బహిర్గతమయ్యాయి. రహదారుల పక్కన ఉన్న అడవులు నరికివేతకు గురయ్యాయి. 

అమెజాన్‌ అడవుల విధ్వంసం దశాబ్దాలుగా కొనసాగుతోంది. స్వతంత్ర అటవీ పర్యవేక్షణ స్వచ్ఛంద సంస్థల అధ్యయనం ప్రకారం- బ్రెజిల్‌లోని అమెజాన్‌ అడవులు 10.78 లక్షల హెక్టార్ల మేర 2021 ఆగస్టు, 2022 జులై మధ్య కాలంలోనే అంతర్ధానమయ్యాయి. పశు మాంసం ఎగుమతులపై అంతర్జాతీయంగా ఆంక్షల విధింపువల్ల 2012లో అడవుల నరికివేత చాలావరకు తగ్గింది. కానీ, తరవాతి కాలంలో ప్రభుత్వ వైఖరిలో వచ్చిన మార్పువల్ల తిరిగి బ్రెజిల్‌లోని అమెజాన్‌ అడవుల నరికివేత పెచ్చరిల్లింది. జాతీయ స్థాయిలో స్వచ్ఛంద సంస్థలు, అంతర్జాతీయ స్థాయిలో యూరోపియన్‌ యూనియన్‌, ‘ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ కో-ఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఓఈసీడీ)’ వంటి సంస్థలు విధ్వంసాన్ని ఆపాలని ఒత్తిడి చేస్తున్నాయి. 2021లో జరిగిన ఐక్యరాజ్య సమితి శీతోష్ణస్థితి మార్పు సదస్సు ‘కాప్‌-26’లో వందకు పైగా దేశాలు అమెజాన్‌ అడవుల విధ్వంసాన్ని 2030 నాటికి పూర్తిగా ఆపడానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించాయి.   

అమెజాన్‌ అరణ్యాల విధ్వంసంవల్ల జీవవైవిధ్యం తీవ్రంగా దెబ్బ తినే ప్రమాదం ఉంది. పర్యావరణానికి కోలుకోలేని నష్టం సంభవిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులకు దారితీస్తోంది. అక్కడ నివసించే హ్యాసింత్‌ మకావ్‌ (నీలిరంగు చిలుక), మిల్టన్స్‌ టిటి (వానరం) వంటి జాతులు- విచక్షణారహితంగా జరుగుతున్న అడవుల నరికివేత కారణంగా మనుగడ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయని ఎర్త్‌.ఆర్గ్‌ పేర్కొంది. అడవులు క్షీణించడంవల్ల వాతావరణంలో తేమ తగ్గి కార్చిచ్చులు తలెత్తుతున్నాయి. వేల సంవత్సరాలుగా ఆవరణ వ్యవస్థపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ఈశాన్య పెరూ లోని స్థానిక తెగలు దుష్ఫలితాలను ఎదుర్కొంటున్నాయని ‘ప్రొసీడింగ్స్‌ ఆఫ్‌ ద నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌’ జర్నల్‌ గత సంవత్సరం వెల్లడించింది. విధ్వంసం ఇలాగే కొనసాగితే, 2064 నాటికి అమెజాన్‌ అడవులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ముప్పు ఉందని పర్యావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెజాన్‌ అడవులపై ఆధారపడుతూ పశుమాంస ఉత్పత్తికి వాణిజ్య పంటలసాగుకు పాల్పడుతున్నవారిని సమర్థంగా నిలువరించగలగాలి. అక్రమ కలప, మైనింగ్‌లను నిరోధించి, 2012లో బ్రెజిల్‌ అమలు పరచిన అడవుల నరికివేత నిరోధక విధానాలను కఠినంగా కొనసాగిస్తేనే- జీవవైవిధ్యం పరిఢవిల్లగలదు.

- ఎం.రామ్‌మోహన్‌

(సహాయ సంచాలకులు, తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీ)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అందరికీ అందని బ్యాంకింగ్‌ సేవలు

‣ గాలి అందుబాటులోనూ అసమానతలు

‣ ఇంధన సంక్షోభం ముంగిట ఐరోపా

‣ అంతర్గత ప్రజాస్వామ్యం ఎండమావి

‣ ఎన్‌సీసీతో ఆర్మీలో ఆఫీసర్‌

‣ కొత్త డిగ్రీలు ఎన్నో అవకాశాలు

Posted Date: 12-09-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం