• facebook
  • whatsapp
  • telegram

అందరికీ అందని బ్యాంకింగ్‌ సేవలు

లోపాలను సరిచేస్తేనే ‘జన్‌ధన్‌’తో ప్రయోజనం

ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించడం, ఆహార భద్రతను కల్పించడం, జీవన ప్రమాణాల పెంపు, మౌలిక వసతులు, ఉపాధి కల్పన వంటి 17 లక్ష్యాలతో సుస్థిరాభివృద్ధి సాధనకు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ప్రణాళిక రూపొందింది. 2030 నాటికి ఈ లక్ష్యాల సాధనకు ఏడేళ్ల క్రితమే సభ్యదేశాలు పూనిక వహించాయి. సుస్థిరాభివృద్ధి సాధనకు ఆర్థిక సమ్మిళిత వృద్ధి కీలకం. ఇందుకోసం పొందుపరచిన లక్ష్యాల్లో ఎనిమిది ఆర్థిక సమ్మిళిత వృద్ధికి సంబంధించినవే. ఇందులో పేదలకు పొదుపు మార్గాలను చూపించడం, సంస్థాగత రుణాలకు అవకాశం కల్పించి వారిని ప్రైవేటు వడ్డీ వ్యాపారుల బారి నుంచి రక్షించడం వంటివి ఒక భాగం.

‘అనుసంధానం’తో మెరుగైన ఫలితాలు

కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సమ్మిళిత వృద్ధి సాధనలో భాగంగా 2014 ఆగస్టు 28న ప్రవేశపెట్టిన ‘జన్‌ధన్‌ యోజన’కు ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. దేశ ప్రజలందరికీ... ముఖ్యంగా బ్యాంకింగ్‌ సేవలకు నోచుకోని వారికి, వెనకబడిన వర్గాలకు వాటిని అందుబాటులోకి తేవడం ఈ పథకం ముఖ్య లక్ష్యం. తద్వారా అందరికీ బీమా, పింఛను, రుణ సేవలందించడం ప్రభుత్వ ఉద్దేశం. ఆర్థిక సమ్మిళిత వృద్ధికి చెందిన గత పథకాలకు ఇది భిన్నం. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు ప్రమాద బీమా, జీవిత బీమా ఓవర్‌ డ్రాఫ్ట్‌కు ఉపకరించే రుపే డెబిట్‌ కార్డును ఈ పథకం అందిస్తుంది. 2018 వరకు గడువు విధించిన కేంద్రం- తరవాత కొన్ని మార్పుచేర్పులతో గడువును మరి కొన్నాళ్లు పొడిగించింది. ఈసారి కొత్తగా చేరిన ఖాతాదారులకు గతంలో తీసుకున్న ‘ప్రతీ కుటుంబం’ ప్రాతిపదిక నుంచి ఖాతాను ‘ప్రతీ వ్యక్తి’ అని మార్చింది. ప్రమాద బీమాను రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షలకు, ఓవర్‌ డ్రాఫ్ట్‌ సదుపాయాన్ని అయిదు వేల రూపాయల నుంచి పది వేల రూపాయలకు పెంచింది. లబ్ధిదారుల గరిష్ఠ వయసును 60 నుంచి 65 ఏళ్లకు పొడిగించింది. తరవాతి కాలంలో జన్‌ధన్‌ ఖాతాలను ఆధార్‌, మొబైల్‌ నంబర్లకు అనుసంధానించడంవల్ల మెరుగైన ఫలితాలు రావడం మొదలైంది. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల కింద సొమ్ము వారి ఖాతాలోనే నేరుగా జమ కావడం ప్రారంభమైంది. దీనివల్ల లబ్ధిదారులు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరిగే శ్రమ తప్పింది. 2015 ఆగస్టు నాటికి 17.9 కోట్ల ఖాతాలు ఉండగా; కేంద్రం చేసిన మార్పుల కారణంగా 2022 ఆగస్టు నాటికి అవి 46.25 కోట్లకు పెరిగాయి. కొత్తగా ఖాతాలు తెరిచిన వారిలో అత్యధికులు మహిళలే. డిపాజిట్లు 2015 ఆగస్టు నుంచి 2022 ఆగస్టు నాటికి 7.6 రెట్లు పెరిగాయి. అంటే సగటు డిపాజిట్‌ ఖాతా విలువ రూ.3,761కు పెరిగింది. రుపే కార్డులు రెట్టింపయ్యాయి. తాజాగా 72.5శాతం ఖాతాదారులు రుపే కార్డులు కలిగిఉన్నారు. దాంతో కొవిడ్‌ కష్టకాలంలో కేంద్రం గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద ప్రకటించిన నగదును వెంటనే గ్రామీణ ఖాతాదారులకు అందించగలిగింది. బ్యాంకింగ్‌పై పెద్దగా అవగాహన లేని పేదవర్గాలకు... ముఖ్యంగా మారుమూల ప్రాంతవాసులకు సేవలందించడంలో యూపీఐ విధానం అక్కరకొచ్చింది. అందులోని ‘సింగిల్‌ క్లిక్‌ యాప్‌’ ఆధారిత బదిలీ ద్వారా పలు ప్రయోజనాలు లభించాయి. ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్‌ఎంఈ)లకు కూడా రుణాలు లభిస్తున్నాయి. 2016లో స్వల్ప సంఖ్యలో ఉన్న యూపీఐ లావాదేవీలు 2022 నాటికి రూ.7,195 కోట్ల విలువకు చేరాయి.

అధిగమించాల్సిన సవాళ్లెన్నో

అర్హులందరికీ... ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్‌ సేవలను విస్తరించడంలో ప్రభుత్వానికి పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఖాతాల్లో లావాదేవీలు తరచూ స్తంభించిపోతున్నాయి. ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా బ్యాంకింగ్‌ సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వడంలేదు. గ్రామీణ ప్రజల్లో ఏటీఎమ్‌లను ఉపయోగించుకొనే పరిజ్ఞానం కొరవడుతోంది. ఈ-బ్యాంకింగ్‌, ప్రభుత్వ పథకాలపై సరైన సమాచారం అందరికీ అందడంలేదు. డిజిటల్‌ సౌకర్యాలు తగిన స్థాయిలో లేవు. సైబర్‌ నేరాలు పెరిగిపోవడం, డేటా గోప్యత వంటివి సవాళ్లుగా మారాయి. పేదరికం, నిరక్షరాస్యతల వల్ల భారత్‌లో ఆర్థిక సమ్మిళిత వృద్ధిని సాధించడం అంత సులభమేమీ కాదు. ఈ రెండు సూచీలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉన్నాయి. అస్సాం, బిహార్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఒడిశా, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, మణిపుర్‌లలో గ్రామీణ పేదరికం 30శాతం కన్నా ఎక్కువే ఉంది. ఆయా ప్రాంతాల్లో పేదలు డిపాజిట్ల ఖాతాల వినియోగంలో చురుగ్గా పాల్గొనలేకపోతున్నారు. భారత్‌లో 27శాతం నిరక్షరాస్యులే. బిహార్‌, యూపీ, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఇది 30 నుంచి 38శాతం మధ్యలో ఉంది. బ్యాంకులు ఈ విషయంలో ఎన్ని దిద్దుబాటు చర్యలు తీసుకున్నప్పటికీ- లబ్ధిదారులకు ఆంగ్లంలో పరిజ్ఞానం లేకపోవడంతో ఇతరుల సాయం తీసుకోవలసి వస్తోంది. దీనివల్ల గోప్యంగా ఉండాల్సిన ఖాతాల సమాచారం కొంతమంది మోసగాళ్లకు తెలిసిపోతోంది. దాంతో అర్హులందరికీ ఆర్థిక సేవలందించాలనే ఆశయం పూర్తిస్థాయిలో నెరవేరడంలేదు. పాలకులు ఈ తరహా లోపాలపై దృష్టి సారించి, వాటిని సరిచేయాలి. బ్యాంకులు ఖాతాదారులకు రక్షణ కల్పించే భద్రతతో కూడిన డిజిటల్‌ సాంకేతికతను పాటించడం తక్షణావసరం. ఈ దిశగా పాలకులు కృషి చేయాలి. గ్రామాల్లో లబ్ధిదారులకు అందుబాటులో ఉండేది బ్యాంకింగ్‌ సిబ్బందే. కాబట్టి లబ్ధిదారుల ప్రశ్నలకు సమాధానాలు చేప్పేలా సిబ్బందికి శిక్షణ కల్పించడం చాలా అవసరం. ఇవన్నీ సాకారం అయినప్పుడే జన్‌ధన్‌ ఖాతాలు మరింత ఊపందుకొని ఆర్థిక డిజిటల్‌ విప్లవానికి బాటలు పడతాయి.

పేదరిక నియంత్రణ కోసం...

స్వాతంత్య్రం సిద్ధించే నాటికి భారత్‌లో 70శాతం పైగా ప్రజలు పేదరికంలో ఉన్నారు. నాటి నుంచి పాలకులు పేదరిక నిర్మూలనకు, తద్వారా సమ్మిళిత వృద్ధి సాధనకు ప్రవేశ పెట్టిన పలు పథకాలు కొంతవరకు ఫలితాలనిచ్చాయి. దాంతో గత 75 సంవత్సరాల్లో పేదరికం తగ్గుముఖం పట్టి ప్రస్తుతం 20-25శాతం చుట్టూ పరిభ్రమిస్తోంది.

పేదరికం ఒక కుటుంబానికి చెందిన అంశమే అయినా, సమ్మిళిత వృద్ధి దేశంలో ఉన్న బడుగు-బలహీనవర్గాలు, మహిళలు, దివ్యాంగులు తదితర వర్గాలన్నింటికీ సంబంధించినది.

ఆర్థిక సమ్మిళిత అభివృద్ధికి బ్యాంకుల జాతీయీకరణ, ప్రాధాన్య రంగాలకు బ్యాంకులు రుణ సదుపాయం అందించడం, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల స్థాపన వంటివి దోహదం చేశాయి.

బ్యాంకుశాఖల విస్తరణ, స్వాభిమాన్‌ పథకం కింద దేశవ్యాప్తంగా ఆర్థిక సమ్మిళిత కార్యక్రమాల నిర్వహణ తదితరాలూ పేదరికం తగ్గేందుకు కొంతమేర కారణమయ్యాయి.

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ గాలి అందుబాటులోనూ అసమానతలు

‣ ఇంధన సంక్షోభం ముంగిట ఐరోపా

‣ అంతర్గత ప్రజాస్వామ్యం ఎండమావి

‣ ఎన్‌సీసీతో ఆర్మీలో ఆఫీసర్‌

‣ కొత్త డిగ్రీలు ఎన్నో అవకాశాలు

Posted Date: 12-09-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం