• facebook
  • whatsapp
  • telegram

గాలి అందుబాటులోనూ అసమానతలు

గ్రీన్‌పీస్‌ అధ్యయనాంశాలు

ప్రపంచంలో ఎన్నో రకాల అసమానతల గురించి మనం వింటున్నాం. కానీ గాలి అందుబాటులోనూ అసమానతలు నెలకొన్నాయంటే నమ్మగలమా? నమ్మశక్యం కాకపోయినా... ఇది నిజం. గ్రీన్‌పీస్‌ సంస్థ ‘ఒకే ఆకాశం కింద పలురకాల గాలి’ పేరిట తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ అంశాన్ని స్పష్టం చేస్తోంది. వాయునాణ్యత కొన్ని ప్రాంతాల్లో బాగుంటే, మరికొన్ని ప్రాంతాల్లో దారుణంగా పడిపోయిందని, నాణ్యతను కొలిచే పరికరాల ఏర్పాటు విషయంలోనూ ప్రాంతాలవారీ అసమానతలు ఉంటున్నాయని ఆ నివేదిక వెల్లడించింది. ఒక్క భారతదేశమే కాదు- ప్రపంచంలోని వేర్వేరు దేశాల పరిస్థితిని క్షుణ్నంగా పరిశీలించి ఈ విషయాలను వెల్లడించింది. వాతావరణంలోకి విడుదలయ్యే ప్రమాదకర వాయువులు గాలికాలుష్యానికి కారణమవుతున్నాయి. వాతావరణ మార్పులకూ దారితీసి, అంతర్జాతీయంగా ముప్పు వాటిల్లజేస్తున్నాయి. ఈ దుష్ప్రభావాలు అన్నిచోట్లా ఒకేలా ఉండటం లేదు. కొన్ని ప్రాంతాల్లో వీటి ప్రభావం తీవ్రంగా ఉంటోందని పరిశోధనలో తేలింది.

వాయుకాలుష్యంవల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 90 లక్షల వరకు అర్ధాంతర మరణాలు సంభవిస్తున్నాయి. అల్పాదాయ, మధ్యాదాయ దేశాలపై కాలుష్య ప్రభావం తీవ్రంగా ఉంది. 2021లో ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రజారోగ్య పరిరక్షణ కోసం వాయునాణ్యత ప్రమాణాలను పునర్నిర్వచించింది. పీఎం 2.5 ధూళికణాలను అతి తక్కువ మోతాదులో పీల్చినా ఆరోగ్యం దెబ్బతింటుంది. పిల్లలు, వృద్ధులు, గర్భిణులపై ఇవి మరింత ప్రభావం చూపుతాయి. ఘనపు మీటరుకు అయిదు మైక్రోగ్రాముల లోపు మాత్రమే పీఎం 2.5 గాఢత ఉండాలన్నది ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రమాణం. చాలా ప్రాంతాల్లో వాయునాణ్యత సమాచారం సరిగ్గా అందకపోవడం వల్ల... అంటే సమాచార అందుబాటులో అసమానతల వల్ల తమ చుట్టూ ఉండే గాలి ఏమాత్రం నాణ్యమైనదో తెలియక చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారు. పీఎం 2.5 కాలుష్యం వల్ల గుండెకవాటాల వ్యాధులు, ఆస్థమా లాంటి శ్వాసకోశ వ్యాధులు సంభవిస్తున్నాయి. ఇవి ముందస్తు మరణాలకు కారణమవుతున్నాయి. స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అంతర్జాతీయ మానవహక్కుగా ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ ఎప్పుడో గుర్తించింది. నాణ్యమైన గాలి లభించకపోవడం కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు, సమానత్వ హక్కుకు సంబంధించినది కూడా.

భారత్‌, మలేసియా, థాయ్‌లాండ్‌, ఫిలిప్పీన్స్‌, ఇండొనేసియా, టర్కీ, దక్షిణాఫ్రికా, కొలంబియా దేశాల్లో పరిస్థితులను గ్రీన్‌పీస్‌ సంస్థ అధ్యయనం చేసింది. ఈ దేశాల్లో అత్యధికశాతం ప్రజలు- ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించినదాని కంటే అతి తక్కువ వాయునాణ్యత కలిగిన ప్రాంతాల్లో జీవిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రమాణాల కంటే అయిదు రెట్లు ఎక్కువ కాలుష్యంతో భారత్‌ అగ్రస్థానంలో ఉంది. ఆ తరవాతి స్థానాల్లో టర్కీ, థాయ్‌లాండ్‌, దక్షిణాఫ్రికా నిలిచాయి. అధ్యయనం నిర్వహించిన దేశాలన్నింటిలో సగానికి పైగా జనాభాకు వారి నివాసప్రాంతాలకు 25 కిలోమీటర్లలోపు వాయునాణ్యత పర్యవేక్షణ కేంద్రాలు లేవు. భారతదేశ జనాభాలో 56శాతం అత్యంత కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో నివసిస్తోంది. గర్భిణి స్త్రీలలో 62శాతం కాలుష్యానికి గురవుతున్నారు. దిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం, బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణా, పశ్చిమ్‌ బెంగాల్‌, త్రిపుర, పంజాబ్‌, ఝార్ఖండ్‌, రాజస్థాన్‌ లాంటి రాష్ట్రాల్లో వాయు నాణ్యత తీసికట్టుగా ఉంది. ఈ రాష్ట్రాల్లో 90శాతం జనాభా ఉండే ప్రాంతాల్లో ఘనపు మీటరుకు 50 మైక్రోగ్రాములు, అంతకంటే ఎక్కువ పీఎం 2.5 గాఢత ఉంది. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు కొంతలో కొంత మేలు. ఉత్తరాదిన ఎడారుల నుంచి వచ్చే ధూళితో పాటు... పంట వ్యర్థాల దహనం కారణంగా కాలుష్యతీవ్రత పెరుగుతోందని పరిశోధకులు చెబుతున్నారు. వాయునాణ్యత పర్యవేక్షణ కేంద్రాల అందుబాటు విషయానికొస్తే- ఒక్క దిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం, చండీగఢ్‌లలో మాత్రమే 90శాతం జనాభాకు అయిదు కిలోమీటర్లలోపు కనీసం ఒక కేంద్రం అందుబాటులో ఉంది. ప్రభుత్వం దేశవ్యాప్తంగా పటిష్ఠమైన వాయునాణ్యత పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటుచేయాలి. వాయునాణ్యత సమాచారాన్ని ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలి. కాలుష్యం ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాల్లో హెచ్చరికలు జారీచేయడం ద్వారా ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకొనేందుకు సహకరించాలి. ప్రస్తుతమున్న జాతీయ వాయునాణ్యత ప్రమాణాలను వెంటనే సవరించాలి. ఇందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ముందడుగు వేయాలి. ‘జాతీయ స్వచ్ఛ గాలి కార్యక్రమం (ఎన్‌క్యాప్‌)’ కింద చేపట్టాలనుకున్న కార్యక్రమాలన్నీ అమలయ్యేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. 1981 నాటి గాలి (కాలుష్య నియంత్రణ, నివారణ) చట్టాన్ని పటిష్ఠంగా అమలుచేయాలి. నగరాల్లో ప్రజారవాణాను పెంచాలి. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలకు దిగి వాయు కాలుష్యాన్ని కట్టడి చేయకపోతే ఆ రక్కసి కోరలకు మరెందరో బలి అయ్యే పెనుముప్పు పొంచే ఉంది!

- సంజనా రఘురామ్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఇంధన సంక్షోభం ముంగిట ఐరోపా

‣ అంతర్గత ప్రజాస్వామ్యం ఎండమావి

‣ ఎన్‌సీసీతో ఆర్మీలో ఆఫీసర్‌

‣ కొత్త డిగ్రీలు ఎన్నో అవకాశాలు

Posted Date: 12-09-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం