• facebook
  • whatsapp
  • telegram

  హరిత భారతం... అందరి స్వప్నం

* పర్యావరణ సంరక్షణ తక్షణ కర్తవ్యం

వాతావరణ మార్పులవల్ల దుష్పరిణామాలు ముంచుకొస్తున్న తరుణంలో ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ సంరక్షణకు ఉద్యమ స్థాయిలో నడుం బిగించాల్సిన అవసరం ఉంది. పర్యావరణ సంక్షోభంతో ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాదపుటంచుల నుంచి పర్యావరణాన్ని గట్టెక్కించడానికి ఉద్దేశించిన కీలకమైన పారిస్‌ ఒప్పందాన్ని అమలు చేసే దిశగా సమాయత్తమవుతున్న భారత్‌ తాజాగా 2020-21 బడ్జెట్‌లో పర్యావరణం, వాతావరణ మార్పులకు సంబంధించిన అంశాల కోసం రూ.4,400 కోట్లు కేటాయించింది. ప్రధానంగా కాలుష్యం బారినపడి ఉక్కిరిబిక్కిరవుతున్న నగరాల్లో వాయు కాలుష్యాన్ని నివారించేందుకు, క్షీణించిపోతున్న వాయు నాణ్యతను కాపాడేందుకు ప్రాధాన్యమివ్వడం గమనార్హం. ఉత్తర భారతంతోపాటు దక్షిణాదిన ప్రధాన నగరాల్లో గాలి నాణ్యత సూచీలు అధ్వాన స్థాయికి చేరుకున్నాయంటే వాయు కాలుష్యం తీవ్రత స్పష్టమవుతోంది. శీతాకాలం వచ్చిందంటే చాలు పొగమంచుకు తోడు పెచ్చరిల్లుతున్న వాయు కాలుష్యం ప్రాణాంతకంగా మారుతోంది. ఈ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని వాయు కాలుష్యాన్ని నివారించి, ప్రజలకు స్వచ్ఛమైన, నాణ్యమైన గాలిని అందించేందుకు ప్రణాళికలు రూపొందించుకుని, సమగ్ర కార్యాచరణతో ముందుకు వచ్చే రాష్ట్రాలను ప్రోత్సహించి, ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవాలన్న కేంద్రం ఉద్దేశం- పర్యావరణ పరిరక్షణ దిశగా కీలకమైన ముందడుగుగా భావించవచ్ఛు ఇందుకోసం స్వచ్ఛమైన, నాణ్యమైన వాయు విధానాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్రం చర్యలు చేపట్టడం శుభసూచకం. ఇందుకు సంబంధించిన విధివిధానాలు, ప్రమాణాలను రూపొందించే బాధ్యతను కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖకు అప్పగించారు.

తాజాగా పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులకు కేటాయించిన బడ్జెట్‌లో రూ.460 కోట్లు కాలుష్య నియంత్రణ చర్యల కోసమే కేటాయించారు. జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం కింద చేపట్టే కార్యక్రమాలకు ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు. జాతీయ హరిత భారత మిషన్‌ కోసం కేంద్ర ప్రభుత్వం మొత్తంగా ఈ బడ్జెట్‌లో రూ.311 కోట్లు కేటాయించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా అడవుల విస్తీర్ణాన్ని పెంపొందించేందుకే రూ.246 కోట్లు కేటాయించారు. పెరుగుతున్న పట్టణీకరణ, పారిశ్రామికీకరణల మూలంగా అంతరించిపోతున్న అడవులకు తోడు అటవీ ప్రాంతాల్లో రగులుకుంటున్న కార్చిచ్చు వల్ల ఏటా భారీస్థాయిలో అటవీ విస్తీర్ణం తగ్గిపోతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కార్చిచ్చుల నివారణ, నియంత్రణ కోసం ప్రత్యేకంగా రూ.50 కోట్లు కేటాయించారు.


తీవ్రతరమవుతున్న పరిస్థితులు
భారత్‌లో శిలాజ ఇంధనాల వినియోగం మూలంగా వెలువడుతున్న కాలుష్యంతో ఏటా పది లక్షల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని, పెచ్చరిల్లుతున్న కాలుష్యం ఫలితంగా ఏటా 9.80 లక్షల మంది శిశువులు నెలలు నిండకుండానే జన్మిస్తున్నారని ఇటీవల గ్రీన్‌పీస్‌ సంస్థ నిర్వహించిన ఆగ్నేయాసియా అధ్యయనంలో వెల్లడైంది. వాతావరణంలోకి ఇబ్బడి ముబ్బడిగా విడుదలవుతున్న కర్బన ఉద్గారాల మూలంగా ఉత్పన్నమవుతున్న వాయుకాలుష్యంతో భారీగా నష్టపోతున్న దేశాల జాబితాలో భారత్‌ మూడో స్థానంలో ఉందంటే పరిస్థితులు ఎంతగా చేయిదాటిపోయాయో అర్థమవుతోంది. భారత్‌లో విస్తరిస్తున్న వాయు కాలుష్యం మూలంగా ఏటా వాటిల్లుతున్న నష్టం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 5.4శాతానికి సమానంగా ఉందన్నది అత్యంత కఠిన వాస్తవం. దేశీయంగా సంభవిస్తున్న ప్రతి ఎనిమిది మరణాల్లో ఒకటి వాయు కాలుష్యం మూలంగా చోటు చేసుకుంటున్నదేనని తెలుస్తోంది. ఇప్పటి వరకు పలు ప్రభుత్వాలు అనుసరిస్తూ వచ్చిన విధానాలను పరిశీలించినట్లయితే వాతావరణ మార్పులు, పర్యావరణ సంక్షోభాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోగా పెద్దగా ఆసక్తినీ ప్రదర్శించలేదని స్పష్టమవుతోంది. వ్యాపార, వాణిజ్య సంస్థలు, రాజకీయ పక్షాలు... వృద్ధిరేటు, అభివృద్ధిపై చూపుతున్న శ్రద్ధలో ఇసుమంతైనా పర్యావరణం పైకి మళ్ళించకపోవడంతో పీల్చేగాలిలో స్వచ్ఛత, శుద్ధత ఉండని పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. పర్యావరణ పరిరక్షణ సంరక్షణలో భాగంగా వాతావరణ మార్పులు, భూతాపాన్ని అరికట్టేందుకు బడ్జెట్‌ కేటాయింపుల్లోనూ చిన్నచూపు చూస్తూ నామమాత్రంగా నిధులు విదిల్చి చేతులు దులిపేసుకోవడంతోనే ప్రస్తుతం ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయనే వాదనలున్నాయి. ప్రస్తుతం భారత్‌లో వాతావరణ మార్పులు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయనేందుకు- భీకర తుపానులు, వరదలు, కరవు, చలికాలంలో మండే ఎండలు, వేసవిలో కుండపోతగా వానలు, భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలే నిదర్శనం. ఈ పరిస్థితుల్లో సుస్థిరాభివృద్ధితో పాటు, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచుకోవాలంటే ప్రాణికోటికి ముప్పు వాటిల్లజేస్తున్న కర్బన ఉద్గారాలను పూర్తిగా అదుపు చేయాలి.


ఇండియా వ్యూహాత్మక గమనం
పారిస్‌ ఒప్పందం మేరకు 2021 జనవరి ఒకటో తేదీ నాటికి భూతాపాన్ని కట్టడి చేసే కార్యాచరణను పట్టాలెక్కించాలన్న కృతనిశ్చయంతో భారత ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది. దీనిలో భాగంగానే పాతబడిన, కర్బన ఉద్గారాల నియంత్రణకు అనుగుణంగా లేని థర్మల్‌ విద్యుత్కేంద్రాలను మూసివేయాలని కేంద్రం నిర్ణయించింది. అటు దేశ జనాభాలో 70 శాతానికి పైగా ప్రజలకు ఊతం అందిస్తున్న వ్యవసాయ రంగంలోనూ శిలాజ ఇంధనాల వినియోగాన్ని నివారించి రైతాంగాన్ని సౌర విద్యుత్తు వైపు ప్రోత్సహించేందుకు ‘ప్రధానమంత్రి కుసుమ్‌’ పథకాన్ని దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 35 లక్షల సౌర పంపు సెట్లను అమర్చుకునేందుకు, రైతులు ముందుకు రావడం పర్యావరణ పరిరక్షణ చైతన్యానికి, స్పృహకు నిదర్శనంగా పేర్కొనవచ్ఛు అయితే, దేశవ్యాప్తంగా రైతాంగం నిరుపయోగంగా ఉన్న తమ భూముల్లో సౌర విద్యుత్తు ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవడానికి, ఉత్పత్తయిన సౌర విద్యుత్తును పవర్‌గ్రిడ్‌కు అనుసంధానం చేయడానికి ముందుకొచ్చే దిశగా ప్రోత్సాహం కల్పించినట్లయితే కొంతలో కొంతైనా కర్బన ఉద్గారాలకు కళ్లెం వేయొచ్ఛు.

భూతాపంతో ఆర్థిక అసమానతలు
నానాటికీ కబళిస్తున్న వాయుకాలుష్యానికి కళ్లెం వేయాలంటే నీతిఆయోగ్‌ రూపొందించిన అత్యవసర కార్యాచరణ ప్రణాళికలను క్షేత్రస్థాయిలో ఆచరణాత్మకంగా స్వీకరించాలి. ప్రపంచ వాయు నాణ్యత సూచీలో 180 దేశాల జాబితాలో భారత్‌ అట్టడుగున ఉండటం కలవరపరచే అంశమే. మరో అంతర్జాతీయ అధ్యయనం ప్రకారం ప్రపంచంలోని 20 అత్యంత కాలుష్యభరిత నగరాల్లో 15 భారత్‌లో ఉన్నాయంటే దేశ ప్రజలను ఆఖరుకు పీల్చేగాలే కబళించి వేస్తున్నదన్నది కఠోర వాస్తవం. ప్రధానంగా దేశంలో మోటారు వాహనాలు వెదజల్లుతున్న కాలుష్యం, పారిశ్రామిక వాడల నుంచి వెలువడుతున్న ఉద్గారాలు వాతావరణంలో కలుస్తుండటం వల్ల ఉబ్బసం, శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఏటా మూడున్నర లక్షల వరకు శిశువుల్లో ఆస్త్మా కేసులు వెలుగు చూస్తుండగా, పెద్దవారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌, పక్షవాతం కేసులు నమోదవుతున్నాయి. వీటికి ప్రధాన కారణం వాయు కాలుష్యమే. గడచిన అర్ధశతాబ్దం నుంచీ పెరుగుతున్న భూతాపం దేశాల మధ్య ఆర్థిక అసమానతలకు తెరతీసింది. సంపన్న దేశాలు ఆర్థికంగా మరింత పరిపుష్టమవుతుంటే, అభివృద్ధి చెందుతున్న దేశాలు మరింత పేదరికంలోకి జారుకుంటున్నాయి. కర్బన ఉద్గారాలు, వాయు కాలుష్యం, భూతాపం, వాతావరణ మార్పుల వంటి వైపరీత్యాలు ప్రపంచాన్ని పర్యావరణ సంక్షుభిత స్థాయికి నెట్టేస్తున్నాయి. బ్రిటన్‌లో దాదాపు 53శాతం, న్యూజిలాండ్‌లో 49శాతం, కెనడాలో 32శాతం జనావాస ప్రాంతాలు పర్యావరణ ఆత్యయిక పరిస్థితిని గుర్తించి కర్బన ఉద్గారాల నియంత్రణకు కార్యాచరణను ఉద్ధృతం చేయడాన్ని తక్కిన దేశాలు స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి. వాహన రంగంలో శిలాజ ఇంధనాల వినియోగాన్ని నియంత్రించడానికి; సౌర విద్యుత్తు, విద్యుత్తు వాహనాల రంగంలో భారీ యెత్తున పెట్టుబడుల కల్పనకు ప్రోత్సాహకాలు, రాయితీలు కల్పించాలి. జనసమ్మర్దం అధికంగా ఉండే నగరాలు, పట్టణాల్లో సమర్థమైన, మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థను సమకూర్చడం ద్వారా వాయు కాలుష్యాన్ని అదుపు చేయవచ్ఛు ఈ దిశగా అత్యుత్తమ ప్రజారవాణా వ్యవస్థలున్న దేశాలుగా బెర్లిన్‌, షాంఘై, లండన్‌, పారిస్‌, మాడ్రిడ్‌, సియోల్‌లను ప్రపంచదేశాల నిపుణులు కీర్తిస్తున్నారు. ఈ స్ఫూర్తి మనదేశంలోనూ వెల్లివిరియాల్సిన అవసరం ఉంది. అందుకు ప్రజా చైతన్యమూ పెరగాలి. అంతరించిపోతున్న అడవులను కాపాడుకోవాలి. ప్రతి పౌరుడూ పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యతాయుతంగా మెలగాలి. మితిమీరుతున్న కర్బన ఉద్గారాలు, వాయు కాలుష్యాన్ని కట్టడి చేయకపోయినట్లయితే ఈ భూమి మీద జీవిస్తున్న జీవరాశుల్లో అయిదోవంతు జీవుల మనుగడకు ముప్పు పొంచి ఉంది. భూమి మీద నివసిస్తున్న మనుషుల్లో మనదే ఆఖరితరం అయ్యే అవకాశం ఉందన్న నిపుణుల మాటలూ కొట్టిపారేయలేనివే. అందుకే ప్రజలకు ప్రాణాన్ని అందిస్తున్న వాయువు ఆయువు తీయకుండా ఉండాలంటే ప్రకృతిని, పర్యావరణాన్ని సంరక్షించుకోవడమే నేడు ప్రజలు, పాలకుల ప్రధాన, ప్రథమ ప్రాధాన్యం కావాలి. అప్పుడే కాలుష్య భారతాన్ని హరిత భారత్‌గా తీర్చిదిద్దాలన్న కల సాకారమవుతుంది.

 డాక్ట‌ర్ జి.వి.ఎల్ విజ‌య్ కుమార్‌
భూ విజ్ఞాన‌శాస్త్ర నిపుణుడు

Posted Date: 28-03-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం