• facebook
  • whatsapp
  • telegram

నిబద్ధతతోనే ప్లాస్టిక్‌కు అడ్డుకట్ట

నియంత్రణ, ప్రత్యామ్నాయాలతో కట్టడి

మానవుడి దైనందిన జీవితంతో ప్లాస్టిక్‌ వినియోగం పెనవేసుకుపోయింది. దీనివల్ల క్యాన్సర్‌వంటి ప్రాణాంతక వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నా- ప్లాస్టిక్‌ వాడకం అనివార్యంగా మారింది. ప్లాస్టిక్‌ వస్తువుల మన్నిక, లభ్యత బాగా ఉండటం, జీవనశైలి మార్పులు, తక్కువ ధర, నిర్వహణ వంటివే ఇందుకు కారణాలు. దేశంలోని పట్టణ జనాభా ఇప్పుడున్న 38 కోట్ల నుంచి 2030 నాటికి 60 కోట్లకు పెరుగుతుందని అంచనా. పట్టణీకరణవల్ల వ్యర్థాల ఉత్పత్తి 2030కల్లా మూడు రెట్లవుతుందని నిపుణులు అంటున్నారు. అధిక జనాభాకు అనుగుణంగా వస్తువుల డిమాండ్‌, వినియోగం పెరిగి- వ్యర్థాలు పోగుపడుతున్నాయి. పర్యావరణ పరిరక్షణకు అవరోధంగా మారి గాలి, నీరు, నేల కలుషితమై జీవుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో- ప్లాస్టిక్‌ నియంత్రణ ఆవశ్యకం. లేకుంటే విపరీతంగా పెరుగుతూ పర్యావరణంలో కలిసిపోతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాల దాటికి మానవాళితో పాటు, జంతుజాలం అంతరించే ప్రమాదం ఉంది. కాబట్టి, ప్లాస్టిక్‌ వ్యర్థాల నియంత్రణే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నిరుడు ‘పరిశుభ్రతే సేవ’ పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది.

కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు 2017-18 నివేదిక ప్రకారం దేశంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు రోజుకు సుమారు 26,000 టన్నుల మేర ఉత్పత్తవుతున్నాయి. దాదాపు 70శాతం ప్యాకేజింగ్‌ ఉత్పత్తులు అనతి కాలంలోనే ప్లాస్టిక్‌ వ్యర్థాలుగా మారుతున్నాయి. ఇవి భూమిలో కలిసి, ప్రవాహాలను, భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉత్పత్తి అయిన మొత్తం ప్లాస్టిక్‌లో 10శాతం లోపే సమగ్రంగా పునర్వినియోగానికి నోచుకుంటున్నాయి. కొన్ని ప్లాస్టిక్‌ వ్యర్థాలు భూమిలో కలిసి కుళ్లిపోవడానికి 450 సంవత్సరాలు పడుతుందని నివేదికలు తెలుపుతున్నాయి. ఏటా ప్రపంచవ్యాప్తంగా 80 లక్షల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్రాల్లో కలిసిపోతున్నాయి. ఇప్పటివరకూ 15 కోట్ల టన్నుల వ్యర్థాలు సముద్రాల్లో పోగుపడినట్లు అంచనా. ఇది ఇలాగే కొనసాగితే 2050 నాటికి సముద్రాల్లో చేపల కంటే ప్లాస్టిక్‌ అధికంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్‌లో తాగునీటిలోనూ ప్లాస్టిక్‌ ఉంటోందని అధ్యయనాలు చెబుతున్నాయి. అప్పుడే పుట్టిన శిశువు రక్తంలో సైతం ప్లాస్టిక్‌ ఉండటం విస్మయానికి గురి చేస్తోంది. దీనివల్ల క్యాన్సర్‌, హార్మోన్లలో మార్పులు, గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి.

కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖ, పర్యావరణ సంరక్షణ చట్టం-1986లోని సెక్షన్లు 3, 6, 25 కల్పించిన అధికారాలతో 2016లో ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు రూపొందించారు. 2018లో వీటిని సవరించారు. ఇవి వ్యర్థాలు సృష్టించేవారికి, స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ, ఉత్పత్తిదారులు, దిగుమతిదారులకు వర్తిస్తాయి. ఈ నిబంధనల ప్రకారం పునర్వినియోగ ప్లాస్టిక్‌తో చేసిన క్యారీ బ్యాగులు లేదా ఉత్పత్తులను ఉపయోగించకూడదు. మొదటి సారి ఉపయోగిస్తున్న లేదా రీసైకిల్‌ చేసిన ప్లాస్టిక్‌ బ్యాగులు 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉండకూడదు. కేంద్ర ప్రభుత్వం ఒకసారి మాత్రమే ఉపయోగించే (సింగిల్‌ యూజ్‌) ప్లాస్టిక్‌ను 2022 నాటికి దశల వారీగా నియంత్రించాలని, పిలుపునిచ్చి, కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఒకసారి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్‌ ఉత్పత్తులపై పలు రాష్ట్రాలు నిషేధం విధించాయి. ప్లాస్టిక్‌ బ్యాగులు, కప్పులు, ప్లేట్లు, చిన్న బాటిల్స్‌, స్ట్రాలను ఇకపై ఉత్పత్తి చేయకూడదు, వాడకూడదు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల పరిధిలో పనిచేసే ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ వెదురు సీసాలను తయారుచేస్తోంది. ప్లాస్టిక్‌ గ్లాసు స్థానంలో మట్టి గ్లాసులను ఉత్పత్తి చేస్తున్నారు. ఇలా పర్యావరణ హితకరమైన పరికరాల వినియోగంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలూ పెరగనున్నాయి. అసోచామ్‌, ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ నివేదిక ప్రకారం 2019-20లో ప్యాకేజింగ్‌ పరిశ్రమ అత్యధికంగా ప్లాస్టిక్‌ను వినియోగిస్తోంది. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా 60 దేశాలు అనుసరించిన పది పద్ధతులను ప్రభుత్వాలకు సూచించింది. వ్యర్థాల సేకరణ, నిల్వ, రవాణాలకు ప్రణాళికను రూపొందించుకొని, అమలు చేసేందుకు పురపాలికలు, గ్రామ పంచాయతీలను సిద్ధం చేయాలి. ప్లాస్టిక్‌ సేకరణ కేంద్రాలను విస్తృతంగా నెలకొల్పాలి. ఆధునిక సాంకేతికతతో ప్లాస్టిక్‌ నుంచి కొత్త ఉత్పత్తులు, సంపద సృష్టించాలి. తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా సహజ సంపద సంరక్షణకు వీలవుతుంది. ప్లాస్టిక్‌ వ్యర్థాల నియంత్రణకు దశాబ్దాలుగా ప్రణాళికలు రూపొందిస్తున్నా- ఆచరణలో సంతృప్తికర ఫలితాలను సాధించలేకపోతున్నారు. మితిమీరిన ప్లాస్టిక్‌ వినియోగానికి కళ్లెం వేయాలంటే పాలకుల్లో నిబద్ధత అవసరం. అదొక్కటే సరిపోదు. ప్రజల్లో చైతన్యం, వారి భాగస్వామ్యం ఉంటేనే కట్టడి సాధ్యమవుతుంది!

- ఎ.శ్యామ్‌కుమార్‌
 

Posted Date: 26-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం