• facebook
  • whatsapp
  • telegram

  భూమికి ఊపిరితిత్తులు!

సహజ వనరుల్లో చిత్తడి నేలల ప్రాముఖ్యం అంతా ఇంతా కాదు. నీటి నిల్వ లేదా అధిక తేమ ఎల్లప్పుడూ లేదా ఒకటి, రెండు రుతువులపాటు నిలిచి ఉండే భూమిని చిత్తడి నేలలు అంటారు. సముద్ర ప్రాంతాలు, నదీ తీరాలు, చెరువులు, సరస్సులు, నీటిముంపు ప్రాంతాలు, తీరాల సమీపంలోని ఉప్పునీటి కయ్యలు, మడ అడవులు, మానవ నిర్మిత చేపల చెరువులు, వరి పొలాలు, సాగునీటి ఆనకట్టలు వంటివి చిత్తడి నేలల కోవకు చెందుతాయి. మానవాళి మనుగడకు ఈ నేలలు ఎంతో కీలకం. నేడు మహా నగరాలుగా వృద్ధి చెందిన ముంబయి, కోల్‌కతా, చెన్నై, టోక్యో, న్యూయార్క్‌ వంటివన్నీ జలవనరుల చుట్టూ చిత్తడి నేలల ఆధారంగా వృద్ధి చెందినవే. ప్రపంచవ్యాప్తంగా 127.5 కోట్ల హెక్టార్ల విస్తీర్ణంలో వ్యాపించిన ఈ చిత్తడి నేలలు 15 లక్షల కోట్ల డాలర్ల వార్షిక ఆదాయం సమకూరుస్తున్నాయని అంచనా. ఇవి దాదాపు 18 శాతం జనాభాకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో జీవనోపాధి కల్పిస్తున్నాయి. భారత్‌లో 18.4 శాతం మేర భూభాగంలో ఆరు కోట్ల హెక్టార్ల పరిధిలో 19 రకాల చిత్తడి నేలలను గుర్తించారు. ఇవి సాగు, తాగునీరు అందిస్తూ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతోమందికి ఉపకరిస్తున్నాయి. దాదాపు 80 శాతం మేర వరిసాగు చిత్తడి నేలల పరిధిలోనే సాగుతోంది. పర్యావరణానికి, ఆహార భద్రతకు అపారంగా అక్కరకొచ్చే ఈ నేలలు ప్రపంచవ్యాప్తంగా క్రమంగా తగ్గిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.

ఆహార ఉత్పత్తికి, అపార మత్స్య సంపదకు ఊతమిస్తూ ఈ నేలలు కోట్లమందికి ఆహార భద్రత కల్పిస్తున్నాయి. భూమికి ఊపిరితిత్తులుగా పనిచేసే చిత్తడి నేలలు వరదలు, కరవు కాటకాల వంటి ప్రకృతి విపత్తుల నుంచి ప్రజలను కాపాడుతున్నాయి. ఈ నేలలు నీటిని వడబోసి, అందులోని విష కాలుష్యాలను వేరుచేసి, ఆ నీటిని తాగడానికి ఉపయుక్తంగా మారుస్తాయి. ప్రపంచంలోని దాదాపు 100 కోట్లమంది ప్రజలకు ఈ చిత్తడి నేలలు జీవనాధారంగా ఉపయోగపడుతున్నాయి. చిత్తడి నేలల్లో పెరిగే మడ అడవులు- తీవ్ర సముద్ర ఉప్పెనలు, వాయుగుండాల నుంచి తీరప్రాంత ప్రజలను కాపాడుతున్నాయి. ఈ నేలల్లోని వృక్ష సంపద- వాతావరణంలోని బొగ్గుపులుసు వాయువును శోషించి, శాశ్వతంగా స్థిరీకరించి, కాలుష్యాన్ని అడ్డుకుంటోంది. జీవ వైవిధ్యానికి పేరెన్నికగన్న ఈ నేలల్లో భూమ్మీద ఉండే వృక్ష, జంతు రాశుల్లో దాదాపు 40 శాతం మేర మనుగడ సాగిస్తున్నాయి.

మానవాళికి మహోపకారమై నిలుస్తున్న ఈ చిత్తడి నేలలు ముప్పు అంచున కొట్టుమిట్టాడుతున్నాయి. 1900-2000 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా 60 శాతం చిత్తడి నేలలు కనుమరుగయ్యాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. భారత్‌లో 1970 నుంచి 2015 వరకు 35శాతం చిత్తడి నేలలు అదృశ్యమైనట్లు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. వ్యవసాయ అవసరాలకోసం, పట్టణాల విస్తరణకు ఈ నేలలకు కృత్రిమంగా ‘మురుగు’ కల్పించి వీటిని వాణిజ్య భూములుగా మార్చేస్తుండటం ఇవి కనుమరుగు కావడానికి ముఖ్య కారణం. పరిశ్రమలనుంచి వెలువడే రసాయన కాలుష్యాలను, ఇతర వ్యర్థాలను ఈ నేలల్లోకి విడుదల చేస్తుండటంతో వీటి నాణ్యత, సామర్థ్యం బాగా తగ్గింది. వాతావరణ మార్పులు సైతం చిత్తడి నేలల జీవావరణాన్ని ఛిద్రం చేసి, ఆయా జీవుల మనుగడను దెబ్బతీస్తున్నాయి. వ్యవసాయ రంగంలో ఉపయోగించే రసాయన కాలుష్యాలు కూడా ఈ నేలల సామర్థ్యం తగ్గడానికి కారణమవుతున్నాయి. పట్టణాలు, నగరాల్లోని వ్యర్థాలను ఈ నేలల్లో పారవేస్తుండటంవల్ల ఇవి అంతరిస్తున్నాయి. గడచిన యాభయ్యేళ్ల కాలంలో చిత్తడి నేలల్లో సుమారు 60 శాతం మత్స్య సంపద, పక్షులు, క్షీరద సంతతి, సరీసృపాలు, ఉభయచరాలు ఇప్పటికే అంతరించినట్లు పరిశోధనలు తెలుపుతున్నాయి. మరో 35 శాతం మేర చిత్తడి నేలల్లో జీవరాశులు అంతరించే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు బలంగా వినిపిస్తున్నాయి. భారత్‌తోపాటు అంతర్జాతీయంగానూ ఇదే పరిస్థితి నెలకొంది. పారిశ్రామికాభివృద్ధివల్ల ప్రపంచవ్యాప్తంగా త్వరితగతిన క్షీణిస్తున్న చిత్తడినేలల సమస్యపై 1971 ఫిబ్రవరి 2న ఇరాన్‌లోని ‘రామ్‌సార్‌’ పట్టణంలో ఓ సదస్సు నిర్వహించారు. ఆ సదస్సులో భారత్‌తోపాటు 164 దేశాలు చిత్తడి నేలల పరిరక్షణకు ఉమ్మడి ఒప్పందాలపై సంతకాలు చేశాయి. భారత్‌లో 25 ప్రాంతాలను ‘రామ్‌సార్‌ ప్రాంతాలు’గా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కొల్లేరు సరస్సు ‘రామ్‌సార్‌’ ప్రాంతాల్లో ఒకటి. దేశంలోని మరో 115 చిత్తడి నేల ప్రాంతాలను జాతీయ పరిరక్షణ పథకం కింద ప్రత్యేకంగా గుర్తించారు. తీరప్రాంతాలలోని బీల, తంపర, మడ అడవులను ఈ రెండో విభాగంలో చేర్చారు. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని 1997 ఫిబ్రవరి 2న తొలిసారి జరిపారు. నాటినుంచి ఏటా దీన్ని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఒక్కో కొత్త అంశంపై దృష్టిపెడుతూ ఈ చిత్తడి నేలల దినోత్సవాలు జరుపుతారు. ఈ ఏడాది చిత్తడి నేలల్లో జీవ వైవిధ్యాన్ని నినాదంగా ఎంచుకున్నారు.

చిత్తడి నేలల అవసరాన్ని తెలియజెప్పి, సమాజాన్ని చైతన్యపరచడం ద్వారానే వాటిని పరిరక్షించుకోవడం సాధ్యమవుతుంది. అందుకోసం వివిధ స్థాయుల్లోని విద్యాలయాల్లో అవగాహన తరగతులు నిర్వహించాలి. సాగునీరు, వ్యవసాయ, మత్స్య, అటవీ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో ఈ నేలల పరిరక్షణకు కృషి చేయాలి. దీంతోపాటు ప్రజలు తమ ప్రాంతాలకు సమీపంలోని చిత్తడి నేలలను గుర్తించి వాటిని రాష్ట్ర, జిల్లా జాబితాలలో ‘నోటిఫై’ చేయించాలి. తద్వారా వాటి పరిరక్షణకు భరోసా దొరుకుతుంది. ఈ నేలలను కాపాడుకునేందుకు కట్టుదిట్టమైన చట్టాలు చేయాలి. దానితోపాటు ఆక్రమణదారుల నుంచి వాటికి రక్షణ కల్పిస్తేనే ఈ అమూల్యమైన వనరులు మనగలుగుతాయి.

- డాక్టర్‌ పి.గురుమూర్తి
(రచయిత - నేల విజ్ఞాన శాస్త్ర నిపుణులు)

Posted Date: 28-03-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం