• facebook
  • whatsapp
  • telegram

సహజత్వం కోల్పోతున్న వాతావరణం

విపరిణామాలకు అదే కారణం

ప్రపంచంలో పారిశ్రామికీకరణ, పట్టణీకరణ వేగంగా విస్తరిస్తూ- పచ్చదనం తరిగిపోతోంది. ఫలితంగా భూతాపం, వాయు కాలుష్యాలు పెచ్చరిల్లుతున్నాయి. నేలపై పెరిగిన ఉష్ణోగ్రతవల్ల తేమతో కూడిన గాలి వేడెక్కి- ఊర్ధ్వదిశగా పయనిస్తుంది. అక్కడి చల్లటి, పొడి పవనాలను ఈ వేడిగాలి తాకినప్పుడు తుపానులు ఏర్పడతాయి. ఒక ప్రాంతంలో కుండపోత వర్షాలు, మరోచోట కరవు వాతావరణం ఏర్పడటానికి వాతావరణంలోని ఈ పెను మార్పుల ప్రభావమే కారణమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ప్యారిస్‌ ఒప్పందం ప్రకారం ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలో పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయకపోతే, వాతావరణంలో శరవేగంతో మార్పులు చోటుచేసుకొని ప్రపంచాన్ని ప్రమాదకర పరిస్థితిలోకి నెట్టివేస్తాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలోని బ్రౌన్‌ యూనివర్సిటీకి చెందిన భూవిజ్ఞాన, పర్యావరణ, గ్రహశాస్త్ర విభాగం జరిపిన పరిశోధన (2021) ప్రకారం భూతాపం పెరగడంవల్ల భారత్‌లో రుతుపవనాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. వాతావరణంలో తేమశాతం పెరిగి రాబోయే సంవత్సరాల్లో భారీ వర్షపాతాలు నమోదవుతాయి. వీటి ప్రభావం దక్షిణ భారతంపై తీవ్రంగా ఉంటుంది.

ఇండియాలో జూన్‌-సెప్టెంబరు మధ్య కాలంలో ఏర్పడే నైరుతి రుతుపవనాలతో దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయి. అక్టోబరు-డిసెంబరు మధ్య కాలంలో వచ్చే ఈశాన్య రుతుపవనాలవల్ల తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో భారీ వర్షాలు నమోదవుతాయి. ఇవి ప్రకృతిలో సహజంగా జరిగే ప్రక్రియలు. అయితే, వాతావరణంలో పెరుగుతున్న వాయు కాలుష్యంవల్ల రుతుపవనాలతో సంబంధం లేకుండా వర్షాలు పడుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ‘లా నినా’ అనే ప్రక్రియ వాతావరణంలో సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడటానికి ముఖ్య కారణం. ఇది పసిఫిక్‌ మహాసముద్రంలో క్రమ పద్ధతిలో సంభవిస్తూ ఉంటుంది. గడచిన దశాబ్దంలో 2010-12, 2016, 2017-18, 2020-21 మధ్య కాలాల్లో ఇది వాతావరణంలో సంక్లిష్ట పరిస్థితులకు కారణమైంది. భారతదేశంలో తేమను ఉత్పన్నం చేసే ‘లా నినా’ ప్రభావం తాజాగా 2020లో మొదలైంది. 2022 ఫిబ్రవరి వరకు ఉంటుంది. దీనివల్లే ఇటీవల దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో భీకర గాలులు, భారీ వర్షాలతో కూడిన తుపానులు సంభవించాయి. 2020లో పశ్చిమ్‌ బెంగాల్‌, ఒడిశాల్లో ‘అంఫన్‌’, మహారాష్ట్ర, గోవా, గుజరాత్‌ రాష్ట్రాల్లో ‘నిసర్గ’ విలయతాండవం చేశాయి. అదే సంవత్సరం చెన్నై, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లను ‘నివార్‌’ తుపాను వణికించింది. కేరళ, తమిళనాడులో ‘బురేవి’ తీవ్ర అలజడికి కారణమైంది. ఈ ఏడాది మేలో సంభవించిన అత్యంత తీవ్రమైన ‘తౌక్టే’ తుపానువల్ల గుజరాత్‌, దిల్లీ, కేరళ, లక్షద్వీప్‌, గోవా, కర్ణాటక, మహారాష్ట్రలలో తీవ్ర నష్టం సంభవించింది. ఒడిశా, పశ్చిమ్‌ బెంగాల్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో ‘యాస్‌’ బీభత్సం సృష్టించింది. గులాబ్‌ వల్ల ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, ఒడిశా, మహారాష్ట్రలలో నష్టం సంభవించింది. ఇటీవల జవాద్‌ తుపాను ఒడిశా, పశ్చిమ్‌ బెంగాల్‌లలో; ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపింది. 

భారతదేశంలో కొన్నిప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. మరికొన్ని ప్రాంతాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నాయి. ఉదాహరణకు గత కొన్ని నెలల్లో తెలుగురాష్ట్రాల్లోని హైదరాబాద్‌, వరంగల్‌, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో, తమిళనాడులోని చెన్నైలో, ఒడిశాలో తీవ్ర వర్షపాతం నమోదై వరద ప్రవాహాలు ముంచెత్తాయి. ఆకస్మిక వరదలతో ప్రాణ, ఆస్తి నష్టాలతో పాటు విద్యుత్‌, రవాణా వ్యవస్థలు ఛిన్నాభిన్నమయ్యాయి. పట్టణ ప్రాంతాల్లో వాన నీటి సహజ ప్రవాహ మార్గాలను కబ్జా చేసి, కట్టడాలను నిర్మించడం వరదల ఉద్ధృతికి మరో ప్రధాన కారణం. చెరువులు, కుంటల వంటివి ఆక్రమణకు గురి కాకుండా ప్రభుత్వాలు కచ్చితమైన నిబంధనలు రూపొందించాల్సి ఉంది. జలవనరుల సంరక్షణవల్ల పట్టణాల్లో ఆకస్మిక వరదలను కొంతవరకు నివారించవచ్చు. తుపానులు, వరదల వంటి ప్రకృతి విపత్తులతో దేశ ఆర్థిక రంగం కుదేలవుతుంది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఇలాంటి విధ్వంసాలు భవిష్యత్తులో సర్వసాధారణంగా మారవచ్చు. వీటిని ఎవరూ నియంత్రించలేరు. ఈ అసాధారణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు శాస్త్ర సాంకేతిక, విపత్తు నిర్వహణ యంత్రాంగాన్ని నిరంతరం అప్రమత్తంగా ఉంచాలి. భూతాపాన్ని కట్టడి చేయడంలో భాగంగా కర్బన ఉద్గారాలను తగ్గించే కఠిన నియంత్రణ చర్యలను ప్రపంచంలోని అన్ని దేశాలూ పాటించాలి. పచ్చదనాన్ని పెంచేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపాల్సిన అవసరం ఉంది. ఇంతకుమించిన ప్రత్యామ్నాయాలేవీ లేవని గుర్తించాలి. రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురవడం సహజ సిద్ధమైన ప్రక్రియ. విచ్చలవిడిగా వనరులను దుర్వినియోగపరచడం వంటి చర్యలకు స్వస్తి పలికి- వాతావరణంలోని సహజత్వాన్ని కాపాడటం ద్వారా విపరిణామాలను అడ్డుకోవచ్చు.

- ఆచార్య నందిపాటి సుబ్బారావు 

(ఆంధ్ర విశ్వవిద్యాలయ భూవిజ్ఞాన శాస్త్ర విశ్రాంత ఆచార్యులు)
 

******************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పొదుపుతోనే భావి వెలుగులు

‣ గాడితప్పిన పట్టణీకరణ

‣ రాజ్యాంగ విలువలకు నిలువు పాతర

‣ చిరకాల మిత్రుల సహకార సవారీ

Posted Date: 15-12-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం