• facebook
  • whatsapp
  • telegram

రాజ్యాంగ విలువలకు నిలువు పాతర

ప్రజాస్వామ్యం అంటే అందరూ ఒకే పాట పాడటం కాదు. అలా ఆలపించడమే ‘దేశభక్తి’కి నిదర్శనమంటే, అంతకంటే చోద్యం లేదు! మూడేళ్ల క్రితం ఈ అంశాన్నే స్పష్టీకరించిన భారతీయ న్యాయ సంఘం(లా కమిషన్‌)- దేశ శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వ విధానాల్లోని లోపాలను ప్రశ్నించడం, చర్చించడం, నిర్మాణాత్మకంగా విమర్శించే స్వేచ్ఛ ప్రజలకు ఉంటుందని ఉద్ఘాటించింది. కొందరు వ్యక్తుల కఠిన భావాలు  కొంతమందికి మింగుడుపడలేదని వారిని ‘రాజద్రోహులు’గా ఈసడించడం కుదరదని తేల్చిచెప్పింది. కానీ, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది? మాట్లాడటమే మహాపాపం అన్నట్లుగా రైతులు, విద్యార్థులు, సామాజిక ఉద్యమకారులు, పాత్రికేయులు, కార్టూనిస్టుల నుంచి భిన్న రంగాల ప్రముఖుల వరకు ఎందరిపైనో సెక్షన్‌ 124(ఏ) కింద రాజద్రోహం కేసులు బనాయిస్తున్నారు. గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా ప్రవర్తిస్తున్న పోలీసులు- పౌరుల భావప్రకటనా హక్కును నిర్లజ్జగా నిష్పూచీగా బలి తీసుకుంటున్నారు. అలనాటి ఉన్మత్త రాజుల్లేరు... జనాన్ని కాల్చుకుతిన్న పైశాచిక రాచరికాలూ లేవు... అయినా ఆంగ్లేయులు అంటగట్టి పోయిన ‘రాజద్రోహం’ నిబంధన మాత్రం భారతీయ శిక్షాస్మృతికి పట్టిన ఏలిన నాటి శనిగా మిగిలిపోయింది. దాన్ని తొలగించే ప్రతిపాదనేదీ లేదని కేంద్ర ప్రభుత్వం తాజాగా లోక్‌సభలో ప్రకటించింది. నూటయాభై ఏళ్లుగా పౌరహక్కులను కబళిస్తున్న ఆ కరకు శాసనాన్ని అలాగే కొనసాగించడమంటే- సమున్నతమైన రాజ్యాంగ విలువలకు నిలువునా పాతరేయడమే! 

తెల్లదొరల పాలనను తప్పుపట్టినందుకు 1891లో ‘బంగోబాసి’ పత్రికా సంపాదకులు జోగేంద్ర చంద్రబోసుపై తొలిసారి 124(ఏ) కింద కేసు నమోదైంది. వలస కార్మికులను దిక్కులేని పక్షులుగా మార్చి, మానవ మహావిషాదానికి మూలకారణమైన నిరుటి లాక్‌డౌన్‌కు సంబంధించి సర్కారీ విధానాలను తూర్పారబట్టినందుకు ప్రముఖ పాత్రికేయులు వినోద్‌ దువాపై రాజద్రోహం అభియోగాలను మోపారు. అప్పటికీ ఇప్పటికీ రాజ్య స్వభావంలో వీసమెత్తు మార్పు రాలేదనడానికి నిదర్శనమిదే! స్వాతంత్య్రోద్యమాన్ని అణచివేయడమే లక్ష్యంగా ఆంగ్లేయులు తెచ్చిన ఆ నల్ల నిబంధన ఇంకా అవసరమా అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఇటీవల సంధించిన సూటిప్రశ్న నూటికి నూరుపాళ్లు సమంజసమే! ప్రభుత్వం పట్ల ఏ రకంగానైనా అవిశ్వాసం, అవిధేయతలను ప్రదర్శించడాన్ని 124(ఏ) నేరంగా నిర్వచిస్తోంది. ఆ ‘పాప పరిహారానికి’ మూడేళ్ల నుంచి యావజ్జీవ  కారాగారవాసం అనుభవించాలని అది నిర్దేశిస్తోంది. వలస పాలకుల దౌష్ట్యానికి ప్రతీక అయిన ఆ నిబంధన, స్వతంత్ర భారతానికి గుదిబండగా మారకూడదని రాజ్యాంగ నిర్మాణ సభలో సభ్యులు అభిలషించారు. ‘హింసాత్మక విధానాలను అనుసరించకుండా ప్రభుత్వాన్ని పడగొట్టడం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు కావాలి. సర్కారు పెడపోకడలను ఎండగడుతూ, ప్రజలకు వాటిపై అవగాహన కల్పించడం ఆ హక్కును వినియోగించుకోవడంలో భాగం. కాబట్టి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడాన్ని నేరంగా పరిగణించకూడదు’ అని దిగువసభకు ద్వితీయ స్పీకర్‌గా సేవలందించిన ప్రముఖ నాయకులు ఎం.అనంతశయనం అయ్యంగార్‌ అప్పట్లో స్పష్టీకరించారు. 124(ఏ)ను ఎంత త్వరగా వదిలిం చుకుంటే దేశానికి అంత మంచిదని ప్రథమ ప్రధాని నెహ్రూ అభిప్రాయపడ్డారు. అప్రజాస్వామికమైన ఆ నిబంధన నేటికీ కర్కశంగా కోరచాస్తూ- జాతినేతల ఆకాంక్షలను అపహాస్యం చేస్తోంది. భిన్నాభిప్రాయాలను ప్రకటించే పౌరులు, రాజకీయ ప్రత్యర్థులను పీడించే పదునైన ఆయుధంగా పాలకులకు అది మహబాగా అక్కరకొస్తోంది!

కుడంకుళం అణు విద్యుత్కేంద్రం ఏర్పాటును వ్యతిరేకించిన పాపానికి 2011-13 మధ్య తమిళనాడులో దాదాపు తొమ్మిది వేల మంది రాజద్రోహులయ్యారు! భూమిహక్కుల కోసం గళమెత్తిన పది వేలకు పైగా ఝార్ఖండ్‌ గిరిజనులు ఆ తరవాతి కాలంలో అదే వేటకత్తి బారినపడ్డారు. 2019లో రాష్ట్ర ముఖ్యమంత్రి కాగానే ఆ కేసులను ఉపసంహరించిన హేమంత్‌ సొరెన్‌- పౌరుల భద్రతకు చట్టాలు భరోసాగా నిలవాలి తప్ప వారిని చెండుకుతినడానికి అవి సాయపడకూడదని స్పష్టంచేశారు. జాతీయ నేర గణాంకాల సంస్థ లెక్కల ప్రకారం 2014-20 మధ్య దేశవ్యాప్తంగా 399 రాజద్రోహం కేసులు దాఖలయ్యాయి. వాటిలో కేవలం ఎనిమిది కేసుల్లోనే నేరాభియోగాలు రుజువయ్యాయి. కేదార్‌నాథ్‌ సింగ్‌ (1962) కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించిన ప్రాతిపాదికలను తుంగలోతొక్కుతూ చెలరేగిపోతున్న అధికార యంత్రాంగం- 124(ఏ) కింద అసమ్మతివాదులను నేరగాళ్లుగా తీర్మానించేస్తోంది. పౌరసత్వ సవరణ చట్టంపై వెల్లువెత్తిన నిరసనలు, మహోద్ధృతంగా సాగిన రైతు ఉద్యమ సందర్భాల్లో ఎంతోమందిపై ఆ కఠోర శాసనాన్ని ప్రయోగించారు. నలుగురికన్నా ఎక్కువ మంది గుమిగూడరాదనే సెక్షన్‌ 144ను ఎవరైనా ఉల్లంఘిస్తే సెక్షన్‌ 188 (ఆదేశాల ఉల్లంఘన) కింద కేసులు పెట్టవచ్చు. దానికి బదులుగా ప్రజలపై 124(ఏ) కత్తిని దూయడమంటే- చట్టాన్ని తప్పుగా అన్వయించడమే కాదు, నిరసనకారులను భయభ్రాంతులకు లోనుచేయాలన్న దురాలోచన అది!

‘ప్రశ్నించడం, విమర్శించడం మీడియా, ప్రతిపక్షాల హక్కు. మీకు నచ్చలేదు కదా అని రాజద్రోహం కేసు పెడతామంటే హాస్యాస్పదమవుతుంది’ అని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఇటీవల ఆ అభియోగాలు దాఖలైన సందర్భంగా భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు స్పందించారు. ఆసేతుహిమాచలం కొన్నాళ్లుగా అవే దుర్మార్గ దుర్విధానాలు పెచ్చరిల్లుతున్నాయి. జస్టిస్‌ దీపక్‌ గుప్తా, జస్టిస్‌ మదన్‌ బి.లోకుర్‌ వంటి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తులతో పాటు ఆలోచనాపరులెందరో వాటిపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తప్పుడు కేసులు నమోదుచేసే అధికారులను వాటికి జవాబుదారీ చేసి, బాధితులకు వారి నుంచే తగిన పరిహారం ఇప్పించాలని సూచిస్తున్నారు. నిర్నిరోధంగా సాగిపోతున్న హక్కుల హననానికి అడ్డుకట్ట పడాలంటే- 124(ఏ) పూర్తిగా రద్దుకావాలి. రాజద్రోహ చట్టానికి పురుడుపోసిన బ్రిటన్‌- స్వదేశంలో దాన్నెప్పుడో చెత్తబుట్టలో పడేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఇండియా ప్రతిష్ఠ ఇనుమడించాలంటే ఇక్కడా ఆ బాటలో నడవాల్సిందే. జీవించే హక్కుకు ఉరి బిగిస్తున్న ‘ఉపా’, ‘అఫ్సా’ చట్టాలపైనా సమీక్ష జరగాల్సిందే. విభిన్న భావాల సంఘర్షణలోంచే ప్రజాస్వామ్యం వికసిస్తుంది. ప్రగతిశీల ప్రజాశక్తుల ప్రశ్నలు, విమర్శలకు స్థానం లేని చోట నియంతృత్వం రాజ్యమేలుతుంది. భారతదేశం ఆ దుస్థితిలోకి జారిపోకూడదంటే- హేయ చట్టాల సంకెళ్ల నుంచి సత్వరం స్వేచ్ఛ పొందాల్సిందే! 

- శైలేష్‌ నిమ్మగడ్డ
 

******************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ నీరుగారుతున్న ‘సహ’ స్ఫూర్తి

‣ మద్దతు దక్కని కడగండ్ల సాగు

‣ చిన్నారులకు మెరుగైన భవిష్యత్తు

‣ కొండలకూ వ్యర్థాల ముప్పు

Posted Date: 13-12-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం