• facebook
  • whatsapp
  • telegram

మహాసముద్రాలకు మానవ ముప్పు

ప్రపంచ సాగర దినోత్సవం

సముద్రాలంటే కేవలం నీటి వనరులు కావు. భూమ్మీది సకల జీవరాశులకు అవే ఆధారాలు... ప్రాణవాయువు దాతలు. వాటిని సంరక్షించుకోవడం ద్వారా మాత్రమే మానవాళి సుస్థిరాభివృద్ధి సాధిస్తుందన్న అవగాహనను పెంచడానికి ఏటా జూన్‌ 8న ఐరాస ప్రపంచ సాగర దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. సముద్ర వనరుల వినియోగంలో విచక్షణారాహిత్యంతో ఆహార భద్రత, జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యతలకు ఎదురవుతున్న ఆటంకాలను చర్చిస్తూ ఈ ఏడాది దినోత్సవాన్ని జరుపుతోంది. భూ ఉపరితల     విస్తీర్ణంలో దాదాపు 71 శాతంలో పరచుకున్న సాగరాలు, ప్రపంచవ్యాప్త నీటి వనరుల్లో 97 శాతానికి ఆలవాలాలు. ఎన్నో రకాల మొక్కలు,  జీవజాతులకు ఆవాసాలైన ఇవి ఆహార ఉత్పత్తిలో కీలకమైనవి. వివిధ వ్యాధుల చికిత్సలో అత్యవసరమైన ఔషధాల తయారీలోనూ వీటి పాత్ర గణనీయమైనదే. భూమిపై పర్యావహణ వ్యవస్థ కట్టుదిట్టంగా ఉండాలంటే సముద్రాలు, తీరప్రాంతాలు దెబ్బతినకూడదు.

తీరప్రాంతాలకు తీరని నష్టం

జీవకోటికి ప్రాణావసరమైన ఆక్సిజన్‌లో యాభై శాతానికి పైగా సముద్రాలే సమకూర్చుతున్నాయి. మానవాళి ఉత్పత్తి చేసే బొగ్గుపులుసు వాయువు (కార్బన్‌ డయాక్సైడ్‌)లో దాదాపు 40 శాతాన్ని సముద్రాలు గ్రహించి వాతావరణ మార్పులను నియంత్రించడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మూడొందల కోట్లకు పైగా ప్రజలు సముద్ర వనరుల ద్వారానే జీవనోపాధి పొందుతున్నారు. విశ్వవ్యాప్త వాణిజ్యంలో 90 శాతం  సముద్ర మార్గాల ద్వారానే జరుగుతుంది. అంతర్జాతీయ ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ అధ్యయనం మేరకు సాగరాల వల్ల ఏడాదికి 1.5 లక్షల కోట్ల డాలర్ల సంపద సృష్టి జరుగుతోంది. 2030 నాటికి ఇది మూడు లక్షల కోట్ల డాలర్లకు చేరుతుంది అని అంచనా. ఇలా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి సముద్రాలు ఎంతగానో దోహదపడుతున్నాయి. అభివృద్ధి పేరుతో మానవాళి అనుసరిస్తున్న విధానాల ఫలితంగా వాతావరణంలో బొగ్గుపులుసు వాయువు శాతం అధికమవుతోంది. తద్వారా వాతావరణం వేడెక్కి, మంచు   పర్వతాలు కరిగి సముద్రమట్టాలు పెరుగుతున్నాయి. దానితో తీరప్రాంతాలు కోతకు గురవుతున్నాయి. భూఉపరితలం నుంచి శుద్ధి చేయని వ్యర్థజలాలతో పాటు ప్లాస్టిక్‌ వ్యర్థాలు, ఓడల నుంచి భారీస్థాయిలో ఒలికిపోతున్న చమురు తదితరాలతో సముద్రాలు కలుషితమవుతున్నాయి. దానితో సాగర జీవుల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. మితిమీరిన చేపల వేట, ఓడల రాకపోకలకు అనుగుణంగా లోతు పెంచడానికి కడలి అడుగు భాగాల నుంచి అధిక మోతాదులో ఇసుకను వెలికి తీయడం, ఆనకట్టల నిర్మాణాలు, భార ఖనిజాల కోసం తీరప్రాంతాల్లో చేస్తున్న విచ్చలవిడి తవ్వకాలతో సముద్రాలకు తీరని నష్టం వాటిల్లుతోంది. వీటి మూలంగా సాగరాల్లో లభ్యమయ్యే పెద్ద చేపల్లో 90 శాతం పైగానే అంతరించిపోయాయి. పగడపు దిబ్బలు 50 శాతం నాశనమయ్యాయి. పారిస్‌ ఒప్పందంలో పేర్కొన్నట్లు ఈ శతాబ్దం చివరి నాటికి వాతావరణ ఉష్ణోగ్రతల్లో వృద్ధిని కనీసం 1.5 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గించాలి. అలా కాని పక్షంలో వాతావరణం మరింతగా వేడెక్కి సముద్ర మట్టాలు పెరిగి లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి.

భారత్‌కు సుమారు 7,517 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతం ఉంది. దీని సాయంతో దేశీయ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించవచ్చని, జీవనోపాధులను ఇబ్బడిముబ్బడిగా పెంచవచ్చని శక్తి, వనరుల సంస్థ చెబుతోంది. తీర ప్రాంత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 12 ప్రధాన, 200 చిన్న ఓడరేవుల ద్వారా సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థలో కీలకభూమిక వహిస్తున్నాయి. స్థూల జాతీయోత్పత్తిలో నాలుగు శాతం వరకు దోహదం చేస్తున్నాయి. ప్రపంచంలో చైనా (16 శాతం) తరవాత మన దేశమే అతిపెద్ద చేపల ఉత్పత్తిదారు(14 శాతం). ఈ రంగం 1.6 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. అయితే, సముద్ర నీరు వేడెక్కడంతో తుపానులు పెరిగి ప్రజలకు, పర్యావరణానికి నష్టం వాటిల్లుతోంది. జాతీయ తీర పరిశోధన కేంద్రం నివేదిక ప్రకారం భారత్‌లో ఇప్పటికే 33 శాతం తీర ప్రాంతాలు చాలా దెబ్బతిన్నాయి. పశ్చిమతీరం కంటే తూర్పు తీరంలోనే ఈ సమస్య ఎక్కువగా ఉంది. మరోవైపు బంగాళాఖాతంతో పోలిస్తే చల్లగా ఉండే అరేబియా సముద్రపు నీళ్లు కొన్నేళ్లుగా బాగా వేడెక్కుతున్నాయి. దానితో ఆ సంద్రంలో అతితీవ్ర తుపానులు ఏర్పడి ఆ తీర ప్రాంత రాష్ట్రాలను భారీగా దెబ్బతీస్తున్నాయి. ఇటువంటి పరిణామాలు దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తాయి.

సమష్టి కృషి అవసరం

మహాసాగరాలు, సముద్ర వనరులను పరిరక్షించడం, వాటిని సక్రమంగా ఉపయోగించడం ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఒకటి. దీన్ని సాధించాలంటే ప్రపంచ దేశాలన్నీ కలిసి రావాలి. సమష్టిగా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలి. సముద్ర కాలుష్యాన్ని నివారించడానికి చర్యలు వేగవంతం చేయాలి. తీరప్రాంత పర్యావరణ వ్యవస్థలకు రక్షణ కల్పించాలి. ఆనకట్టల నిర్మాణాలను, తీరాల్లో తవ్వకాలను అదుపుచేయాలి. సాగర గర్భాలను గుల్లచేసే రవాణా పద్ధతులను నియంత్రించాలి. సాగర వాతావరణాన్ని దెబ్బతీయకుండానే వాటి ఆధారంగా ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసుకోవడంపై దృష్టిసారించాలి. మానవాళి మనుగడకు మహాసముద్రాలే ఆధారమనే ఎరుకతో ప్రభుత్వాలు కదిలినప్పుడే పర్యావరణ భద్రతకు సరైన పూచీ లభిస్తుంది!  

- ఆచార్య నందిపాటి సుబ్బారావు

(ఆంధ్ర విశ్వవిద్యాలయ భూవిజ్ఞాన శాస్త్ర విశ్రాంత ఆచార్యులు)
 

Posted Date: 08-06-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం