• facebook
  • whatsapp
  • telegram

సంరక్షణ కొరవడి సంక్షోభంనానాటికీ నీటి కొరత సవాలుగా మారుతోంది. వేగంగా పెరుగుతున్న జనాభా, కాలుష్యం, అడ్డూ అదుపూ లేని జల వినియోగం వంటివి సరికొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. తాజాగా బెంగళూరువాసుల నీటి కష్టాల నేపథ్యంలో అందరూ జాగ్రత్తపడాలి. అన్ని నగరాలు, పట్టణాలు, పల్లెల్లో ప్రతి నీటిబొట్టును భద్రంగా కాపాడుకోవాలి.


చేజారుతున్న జలసిరులు

వాతావరణ మార్పులు, మానవ చర్యలతో వర్షాలు తగ్గిపోయి భూగర్భ జలాలపై ఒత్తిడి అధికమై తాగునీటికి కటకట ఏర్పడుతోంది. ముంచుకొస్తున్న ముప్పును నివారించేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. సముద్రంలో వృథాగా కలిసిపోయే జలాల్నీ సమర్థంగా ఒడిసిపట్టుకోలేని దుస్థితి నెలకొంది. మేజర్‌, మైనర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులూ సరైన నిర్వహణకు నోచుకోక వాటిలోనూ నీటి నిల్వ సామర్థ్యాలు తగ్గిపోతున్నాయి. దీంతో వరసగా పదేళ్లు సమృద్ధిగా వర్షాలు కురిసినా, ఒక్క ఏడాది కరవుతో నీటి కోసం నానా తంటాలు పడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. పలు రాష్ట్రాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న నీటి ఎద్దడికి ప్రధాన కారణం ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించుకోలేక పోవడమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. వాన నీటి సంరక్షణ, నీటి పొదుపు, పునర్వినియోగం ద్వారా జల సంక్షోభం తలెత్తకుండా అడ్డుకునే అవకాశం ఉన్నా ఆ దిశగా ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతున్నాయి.


ముంచుకొస్తున్న ముప్పు

ఐరాస నీటి అభివృద్ధి నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 26శాతం ప్రజలు సురక్షిత తాగునీటికి దూరంగా ఉన్నారు. నీటి కొరత ఒక్క దేశానికి, ప్రాంతానికే పరిమితమైన సమస్య కాదు. విశ్వవ్యాప్తంగా అనేక దేశాలు జల సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. జనాభా పెరుగుదల, పట్టణీకరణ, పారిశ్రామీకరణ, వాతావరణ మార్పులు, అసమర్థ నీటి నిర్వహణ చర్యలు తదితర కారణాలతో ప్రజలు నీటి కోసం అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ప్రపంచ నీటికొరత ముప్పు సంస్థ అట్లాస్‌ ఇటీవల వెల్లడించిన నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 25 దేశాలు నీటి లభ్యత విషయంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. జనాభా లెక్కన చూస్తే దాదాపు 400 కోట్ల ప్రజలు ఏడాదిలో కనీసం ఒకనెల రోజులు నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశాలు ఆర్థికంగానూ నష్టపోతాయని ఆ నివేదిక అంచనా వేసింది. ప్రపంచ జీడీపీలో ఇది 31శాతమని పేర్కొంది. ఇందులో సగం వాటా ఇండియా, మెక్సికో, ఈజిప్ట్‌, తుర్కియే నుంచే కోల్పోతుందని హెచ్చరించింది. ప్రపంచ జనాభాలో 18శాతం వాటా కలిగిన భారత్‌- నీటి వనరుల విషయంలో మాత్రం నాలుగు శాతానికే పరిమితమైంది. వీటికి కూడా ప్రధాన ఆధారం వర్షాలే. రుతుపవనాల ద్వారా కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే 70నుంచి 80శాతం వర్షపాతం నమోదవుతోంది. కేంద్ర జలసంఘం గణాంకాల ప్రకారం వర్షాల ద్వారా దేశానికి ఏటా 4000 బిలియన్‌ ఘనపు మీటర్ల (బీసీఎం) నీరు సమకూరుతోంది. భూగోళ, వాతావరణ పరిస్థితులతో ఆవిరయ్యే నీటి లెక్కలు తీసేసిన తరవాత 1,126 బీసీఎంల నీరు వినియోగానికి అందుబాటులోకి వస్తోంది. ఇందులో 690 బీసీఎంలు నదులు, చెరువులు, సరస్సుల ద్వారా లభ్యమవుతుండగా- 436 బీసీఎంల నీరు భూగర్భంలోకి ఇంకుతోంది. మొత్తంగా సమకూరుతున్న నీటిలో 85 నుంచి 90శాతం వ్యవసాయానికి, మిగతా నీరు పరిశ్రమలు, తాగునీరు, గృహ అవసరాలకు వినియోగిస్తున్నారు. ప్రపంచంలో సేద్యానికి అత్యధికంగా నీటిని వినియోగిస్తున్న దేశం ఇండియాయే. ఆహార ఉత్పత్తుల్లో అగ్రస్థానంలో ఉన్న బ్రెజిల్‌, అమెరికా, చైనాకన్నా భారత్‌ ఎక్కువ నీటిని వ్యవసాయానికి వినియోగిస్తోంది. ఆయా దేశాలతో పోలిస్తే, ఒకేరకం పంటల సాగుకు భారత్‌లో రెండు, మూడురెట్లు అధికంగా నీటిని వాడుతున్నారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇలా వినియోగిస్తున్న నీటిలో 90శాతాన్ని భూగర్భం నుంచి బోరుబావుల ద్వారా తోడేస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. బిందు సేద్యం, సాగులో సాంకేతికత వంటి విధానాలను అవలంబించడం ద్వారా నీటి వినియోగాన్ని 45శాతం మేర తగ్గించి, పెట్టుబడి ఖర్చులు ఆదా చేసుకొని దిగుబడి పెంచుకునే అవకాశం ఉన్నా ఆ దిశగా రైతులను ప్రోత్సహించేవారు కరవయ్యారు. అధిక నీరు అవసరమయ్యే వరి, చెరకు వైపు ఎక్కువ మంది రైతులు మళ్ళడం కూడా భూగర్భ జలాలు తగ్గిపోవడానికి కారణం అవుతోంది. ఏటా వర్షాకాలంలో సముద్రంలో కలుస్తున్న అపార జలరాశిని ఒడిసి పట్టుకోవడంలో, నిల్వ చేసుకోవడంలో భారత్‌ యత్నాలు అవసరమైన స్థాయిలో ఉండటం లేదు.


రైతులకు ప్రోత్సాహం

నీటి నిర్వహణను మెరుగుపరచుకోకపోతే 2050 నాటికి ఇండియా తీవ్ర నీటి కొరత ఎదుర్కొనే దేశంగా మారుతుందని ఐరాస హెచ్చరించింది. ఈ క్రమంలో 2030 నాటికి భారత్‌ నిర్దేశించుకున్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవాలంటే జలవనరుల రంగంలో సంస్కరణలు అవసరం. రాజస్థాన్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, బిహార్‌, హరియాణా, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో చేపట్టిన జలసంరక్షణ పథకాలు భూగర్భ జలాలు పెరిగేందుకు కొంతమేర దోహదపడుతున్నాయి. నమామి గంగే తరహా ప్రాజెక్టులను ఇతర నదుల పరిరక్షణ విషయంలోనూ చేపట్టాల్సిన అవసరముంది. వాన నీటిని ఒడిసి పట్టేలా రైతులను ప్రోత్సహించాలి. వ్యవసాయ క్షేత్రాల్లో ఫామ్‌పాండ్‌లు, కందకాలు తవ్వుకోవాలి. బిందు, తుంపర సేద్యం ద్వారా సమర్థ నీటి వినియోగాన్ని విస్తరించాలి. పరిశ్రమల్లో నీటిని శుద్ధిచేసి పునర్వినియోగించే విధానాన్ని తప్పనిసరి చేయాలి. భూగర్భ జలాలను పెంచేందుకు ఇంకుడు గుంతలు, బోరు రీఛార్జి ఛాంబర్లు నిర్మించాలి. మురుగునీటి శుద్ధి కేంద్రాలను పెంచాలి. జలం లేకుంటే జీవం లేదన్న విషయంలో చిన్నప్పటి నుంచే అవగాహన పెంచాలి. జల సంరక్షణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.


విలువైన పాఠాలు

కొన్ని దేశాలు నీటి పొదుపు విషయంలో ప్రపంచానికి విలువైన పాఠాలు నేర్పుతున్నాయి. ఎడారి దేశమైన సౌదీ అరేబియా చుక్క నీటినీ వృథాగా పోనివ్వడం లేదు. జాతీయ జల వ్యూహం ద్వారా వ్యర్థ జలాలను సమర్థంగా పునర్వినియోగిస్తూ దేశాన్ని జలసిరులతో సుసంపన్నం చేశారు. 2019 గణాంకాల ప్రకారం సౌదీలో ప్రతి ఒక్కరూ సగటున ఏటా 67 ఘనపు మీటర్ల నీటిని పునర్వినియోగిస్తున్నారు. ఇజ్రాయెల్‌ వాన నీటి సంరక్షణలో ఉత్తమ విధానాలు పాటించి మిగులు జలాలను సాధించింది. పొరుగు దేశాలకూ నీటి సహాయం చేస్తోంది. వరదనీటి సంరక్షణలో గరిష్ఠ సత్ఫలితాలను అందిపుచ్చుకోవడంలో వియత్నాం, చిలీ, పెరూ, మెక్సికో, బెల్జియం పోటీ పడుతున్నాయి.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ స్వావలంబనలో కీలక మైలురాయి

‣ మద్దతుకు భరోసా.. రైతుకు దిలాసా!

‣ స్వేచ్ఛా వాణిజ్యంలో మరో ముందడుగు

‣ స్వల్ప వ్యయం సత్వర న్యాయం

‣ సాయుధ సంపత్తిలో స్వయం సమృద్ధి

‣ సేద్య సంక్షోభానికి ఎరువు

Posted Date: 27-03-2024గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని