• facebook
  • whatsapp
  • telegram

స్వావలంబనలో కీలక మైలురాయి



రక్షణ రంగంలో స్వావలంబనను బలంగా కాంక్షిస్తున్న ఇండియా- ఆ ప్రయాణంలో తాజాగా కీలక ముందడుగు వేసింది. ప్రధాన యుద్ధట్యాంకు(ఎంబీటీ)ల్లో వినియోగించడం కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి ఇంజిన్‌ను విజయవంతంగా పరీక్షించి సత్తా చాటింది.


ప్రపంచంలోని అగ్రగామి సైనిక శక్తుల్లో ఒకటిగా వెలుగొందుతున్న ఇండియా- ఆయుధాలు, ఇతర రక్షణ ఉత్పత్తుల కోసం ఇప్పటికీ విదేశాలపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. ప్రధాన యుద్ధట్యాంకులకు అవసరమైన సమర్థ ఇంజిన్‌ను సైతం ఇంతకాలంగా మనం సొంతంగా తయారు చేసుకోలేకపోయాం. ఆ వైఫల్యాన్ని అధిగమిస్తూ- ప్రభుత్వరంగ సంస్థ భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ లిమిటెడ్‌ (బీఈఎంఎల్‌) 1500 అశ్విక సామర్థ్యం (హెచ్‌పీ) ఉన్న ఇంజిన్‌కు తాజాగా రూపకల్పన చేసింది. మైనస్‌ 40 డిగ్రీల సెల్సియస్‌ శీతల వాతావరణంలో, 55 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలో, అయిదు వేల మీటర్ల ఎత్తయిన ప్రాంతాల్లో... ఇలా ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా అది సమర్థంగా పనిచేయగలదు. పలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను తనలో ఇముడ్చుకున్న ఈ ఇంజిన్‌- ప్రపంచంలోని మరే దేశ ఆధునిక ఇంజిన్‌కూ తీసిపోదు. మైసూరులో దాని తొలి ప్రయోగ పరీక్ష విజయవంతం కావడంతో దేశ రక్షణ రంగంలో సరికొత్త అధ్యాయానికి తెరతీసినట్లయింది.


స్వదేశీ ఇంజిన్‌ తయారీ ప్రాజెక్టుకు బీఈఎంఎల్‌ 2020 ఆగస్టులో శ్రీకారం చుట్టింది. ప్రస్తుత ప్రయోగ పరీక్ష విజయవంతమవడంతో తొలి తరం ఇంజిన్ల తయారీ పూర్తయినట్లే. వచ్చే ఏడాది మధ్యకల్లా రెండో తరం యంత్రాల తయారీ సాకారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవి అన్ని పరీక్షలను అధిగమించి, సైనిక వినియోగానికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే- అర్జున్‌ మార్క్‌-1ఏ సహా భవిష్యత్తు తరం ప్రధాన యుద్ధట్యాంకుల్లో వినియోగం కోసం మనం విదేశాలపై ఆధారపడాల్సిన అగత్యం తప్పుతుంది. నిజానికి అర్జున్‌ ఎంబీటీల్లో జర్మనీ తయారీ ఇంజిన్లను వాడాలని గతంలో నిర్ణయించారు. ఆ దేశం నుంచి కొనుగోలుకు రంగం సిద్ధమైంది. అయితే, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో అక్కడ అవసరమవుతున్న ఇంజిన్లు, ఇతర సామగ్రిపైనే ప్రధానంగా దృష్టి సారించిన ఆ దేశ కంపెనీ- ముందుగా నిర్దేశించుకున్న సమయానికి తాము దిల్లీకి ఇంజిన్లు సరఫరా చేయలేమంటూ చేతులెత్తేసింది. కనీసం 3-4 ఏళ్ళపాటు వేచి ఉండాల్సిందేనని తేల్చిచెప్పింది. దానివల్ల అర్జున్‌ మార్క్‌-1ఏ యుద్ధట్యాంకుల ఉత్పత్తి ఆలస్యమవడం అనివార్యంగా కనిపించింది. ఈ సవాలును అవకాశంగా మలచుకోవాలని సంకల్పించుకున్న ఇండియా- అర్జున్‌ ఎంబీటీలతోపాటు ‘ఫ్యూచర్‌ రెడీ కాంబాట్‌ వెహికిల్స్‌ (ఎఫ్‌ఆర్‌సీవీ)’ కోసం స్వదేశీ ఇంజిన్ల తయారీని వేగవంతం చేసింది. అందులో భాగంగా బీఈఎంఎల్‌ ప్రస్తుత ఇంజిన్‌ను తొలిసారిగా పరీక్షించింది. ఇదొక విప్లవాత్మకమైన ముందడుగు. ఇదే స్ఫూర్తితో రక్షణ రంగంలో స్వావలంబన సాధనకు ఇండియా వడివడిగా అడుగులు వేయాలి.


భారత్‌లో రక్షణ రంగ ఉత్పత్తి విలువ 2022-23లో తొలిసారి లక్ష కోట్ల రూపాయల మార్కు దాటింది. ఆ ఏడాది రూ.16 వేల కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. ఇవి శుభ పరిణామాలు. అయితే ప్రపంచంలోకెల్లా అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశం ఇప్పటికీ మనదేనని స్టాక్‌హోం అంతర్జాతీయ శాంతి పరిశోధక సంస్థ (సిప్రి) తాజా నివేదికలో తేల్చిచెప్పింది. చైనా, పాకిస్థాన్‌ల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో మనం ఎప్పటికప్పుడు భారీగా ఆయుధాలను సమకూర్చుకోక తప్పడంలేదు. ఈ సవాలునూ మరో అవకాశంగా మలచుకోవాలి. సాయుధ బలగాల ఆధునికీకరణ కోసం 2030 దాకా ఏటా రూ.1.5 లక్షల కోట్ల వరకు వ్యయం చేయాలని భారత్‌ భావిస్తోంది. ఆ బృహత్తర ప్రక్రియలో స్వదేశీ మంత్రాన్ని పఠించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. రక్షణ రంగంలో అంతర్జాతీయ ఉత్పత్తి కేంద్రంగా ఎదగాలని ఇండియా కోరుకుంటోంది. దాన్ని సుసాధ్యం చేసేందుకు ప్రభుత్వం మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలి. వ్యూహాత్మక భాగస్వామ్యం (ఎస్‌పీ) నమూనా కింద భారత్‌లో తయారీ ప్రాజెక్టులను సత్వరమే పట్టాలెక్కించేందుకు అవసరమైన దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. భారత్‌లాంటి పెద్ద దేశం ఆయుధ దిగుమతులపై ఆధారపడితే వ్యూహాత్మక స్వతంత్రత ప్రమాదంలో పడే అవకాశాలు అధికమవుతాయి. దేశీయంగా రక్షణ ఉత్పత్తులను పెంచితే ఆర్థిక భద్రత తదితర ప్రయోజనాలు సమకూరతాయి.


- ఎం.నవీన్‌ కుమార్‌ గౌడ్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మద్దతుకు భరోసా.. రైతుకు దిలాసా!

‣ స్వేచ్ఛా వాణిజ్యంలో మరో ముందడుగు

‣ స్వల్ప వ్యయం సత్వర న్యాయం

‣ సాయుధ సంపత్తిలో స్వయం సమృద్ధి

‣ సేద్య సంక్షోభానికి ఎరువు

Posted Date: 27-03-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం