• facebook
  • whatsapp
  • telegram

కేంద్ర బడ్జేట్‌ 2024 - 2025

పేదలు, రైతులు, యువత, మహిళల అభ్యున్నతే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్‌
 


వచ్చే రెండేళ్లలో కోటి మంది రైతులను ప్రకృతి వ్యవసాయం దిశగా ప్రోత్సహించనున్నాం. కూరగాయల ఉత్పత్తిని పెద్ద ఎత్తున చేపట్టేలా క్లస్టర్లను ఏర్పాటు చేస్తాం. వివిధ రకాల నేలలకు అనువైన 32 ఉద్యాన పంటలకు సంబంధించి భిన్న వాతావరణ పరిస్థితులను సమర్థంగా తట్టుకొని అత్యధిక ఫలసాయాన్ని అందించే 109 రకాల విత్తనాలను ప్రభుత్వం త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది.
 


పేదలు, రైతులు, యువత, మహిళల అభ్యున్నతి.. వికసిత భారత్‌ లక్ష్యాలుగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ రూ.48.20 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ప్రోత్సహించేలా.. దానిని ఎంచుకున్న వారికి మాత్రం కాస్త ఊరట కల్పించారు. పాత విధానంలో ఉన్నవారికి ముఖం చాటేశారు. తగినంత ఉపాధి అవకాశాలు కల్పించలేదన్న కోపంతో గత ఎన్నికల్లో యువత భాజపాకు దూరమైందన్న విషయాన్ని గ్రహించిన ఆర్థికమంత్రి ఈసారి ఆ లోటును భర్తీచేసే ప్రయత్నం చేశారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ప్రాధాన్యమిచ్చారు. ఎంఎస్‌ఎంఈ రంగానికి ప్రోత్సాహకాలు ప్రకటించి ఎక్కువ మందికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు బాటలు వేశారు. ప్రైవేటు సంస్ధలు కొత్తగా ఉద్యోగాలు కల్పించినప్పుడు వారికి తొలినెల జీతం తామే చెల్లిస్తామని ప్రకటించి కొత్త సంప్రదాయానికి తెరతీశారు. రైతులపై పెట్టుబడి భారం తగ్గించే ఉద్దేశంతో కోటిమంది రైతులను ప్రకృతి సాగువైపు మళ్లించాలని నిర్ణయించారు. వీరికి చేయూతనివ్వడానికి 10 వేల జీవ ఎరువుల కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. బంగారం, మొబైళ్లపై సుంకాలు తగ్గిస్తున్నట్లు చెప్పారు. మొత్తంగా తొమ్మిది ప్రాధాన్య అంశాలను మంగళవారం పార్లమెంటు ముందుంచారు. ఆమెకు ఇది వరసగా ఏడో బడ్జెట్‌. 


సడలిన పట్టును బిగించే యత్నం 

2019 ఎన్నికల్లో భాజపా గెలిచిన 303 సీట్లు 2024 నాటికి 243కు పడిపోవడానికి దారితీసిన కారణాలనువిశ్లేషించుకొని వాటిని సరిదిద్దుకొనే దిశలో ఈసారి బడ్జెట్‌ తీసుకొచ్చారు. మోదీ మూడోసారి అధికారం చేపట్టడానికి చేయూతనిచ్చిన ఆంధ్రప్రదేశ్, బిహార్, ఒడిశా ప్రజల రుణం తీర్చుకొనే ప్రయత్నం చేశారు. వచ్చే ఏడాది ఎన్నికలకు వెళ్లనున్న బిహార్‌కు రూ.60,000 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. సామాజిక న్యాయాన్ని సంపూర్ణంగా సాధించాలన్న సంకల్పంతో చేనేతకారులు, స్వయం సహాయక సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వీధి వ్యాపారులకు పీఎం విశ్వకర్మ, పీఎం స్వనిధి, జాతీయ జీవనోపాధి మిషన్, స్టాండప్‌ ఇండియాల ద్వారా మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దేశీయ విద్యాసంస్థల్లో చదువుకోసం తీసుకునే రూ.10 లక్షల్లోపు రుణాలపై 3% వడ్డీ రాయితీ ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) ద్వారా పేదలకు మరో 3 కోట్ల ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు.


కోటిమందికి ఇంటర్న్‌షిప్‌ 

మహిళలకు ప్రయోజనం కల్పించే పథకాలకు కొత్త పద్దులో రూ.3 లక్షల కోట్లు కేటాయించారు. గిరిజనుల సామాజిక, ఆర్థిక అభ్యున్నతి కోసం ‘ప్రధానమంత్రి జన జాతీయ ఉన్నత గ్రామ అభియాన్‌’ను ప్రారంభించబోతున్నట్లు నిర్మల ప్రకటించారు. స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పొందుతున్నవారి వ్యాపార సామర్థ్యాలను పెంచేందుకు వీలుగా ముద్రా రుణాల పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచారు. వచ్చే   ఐదేళ్లలో కోటిమంది యువతకు దేశంలోని అగ్రశ్రేణి 500 కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌ కల్పించి వారి ఉద్యోగ సామర్థ్యాన్ని పెంచేందుకు కొత్త పథకాన్ని ప్రకటించారు. ఇందుకోసం ఒక్కో అభ్యర్థికి నెలకు రూ.5వేల భృతి చెల్లించబోతున్నారు. దేశంలో ఐదేళ్లలో 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి, నైపుణ్యం, ఇతర అవకాశాలు కల్పించడానికి రూ.2 లక్షల కోట్లు కేటాయించారు. 100 నగరాల్లో పారిశ్రామిక పార్కులు అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. వచ్చే ఐదేళ్ల్లలో పట్టణ పేదల కోసం రూ.10 లక్షల కోట్లతో కోటి ఇళ్లు నిర్మించాలని సంకల్పించారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.2.2 లక్షల కోట్లు సమకూర్చాలని నిర్ణయించారు. స్వయం ఉపాధిపై ఆధారపడిన వీధి వ్యాపారులకు మేలు చేసేందుకు వీలుగా ఎంపిక చేసిన నగరాల్లో వచ్చే ఐదేళ్లలో 100 వారపు సంతలు అభివృద్ధి చేయబోతున్నట్లు ప్రకటించారు. 


మహిళల పేరిట ఆస్తులకు స్టాంపు డ్యూటీ తగ్గింపు 

మహిళా సాధికారతను ప్రోత్సహించేందుకు వీలుగా వారి పేర్లపై రిజిష్టరయ్యే ఆస్తులపై స్టాంప్‌డ్యూటీ తగ్గించనున్నట్లు నిర్మల చెప్పారు. వ్యయ సర్దుబాటు నిధి (వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌) సమకూర్చి ప్రైవేటు పెట్టుబడులను  ప్రోత్సహించాలని నిర్ణయించారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన నాలుగో దశ కింద 25వేల గ్రామీణ ఆవాస ప్రాంతాలకు రహదారి అనుసంధానత కల్పించనున్నట్లు ప్రకటించారు. ఒకవైపు అప్పులు, ఆర్థిక లోటును తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తూనే మరోవైపు సామాజిక, ఆర్థిక న్యాయం చేయాలన్న పట్టుదలతో ఉన్నట్లు ఆర్థికమంత్రి ఈ బడ్జెట్‌ ద్వారా ప్రకటించారు. 


మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా.. 

దేశాన్ని ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి కావాల్సిన ఉపాధి, ఉద్యోగ, మౌలిక వసతులు, నైపుణ్యం, పారిశ్రామికీకరణ లాంటి ప్రధాన అంశాలకు బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రధానమైన మూలధన వ్యయం కోసం ఈ ఏడాది రూ.11.11 లక్షల కోట్లు కేటాయించారు. దేశ ఆర్థిక పురోగతి ఇకపైనా కాంతులీనుతూనే ఉంటుందని నిర్మల చెప్పారు. రాష్ట్రాలూ తమ పరిధిలో మౌలిక వసతులను అభివృద్ధి చేసుకోవడానికి రూ.1.5 లక్షల కోట్ల వడ్డీరహిత రుణాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 2025-26 సంవత్సరంలో విత్తలోటు స్థూల జాతీయోత్పత్తిలో 4.9 శాతం ఉంటుందన్నారు. పర్యావరణానికి పెద్దపీట వేస్తూ అధునాతన ‘అల్ట్రా సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ ప్లాంట్లు’ నిర్మించాలని నిర్ణయించారు. పరిశ్రమల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలను తగ్గించేందుకూ లక్ష్యాలు నిర్దేశించారు. బడ్జెట్‌ అన్నివర్గాలకు మేలు చేసేలా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. విపక్షాలు మాత్రం ఈ కేటాయింపులపై పెదవి విరిచాయి.


ధరలు తగ్గేవి..


దిగుమతి చేసుకున్న మొబైల్‌ ఫోన్లు

సెల్‌ఫోన్‌ ఛార్జర్లు 

బంగారం, వెండి, ప్లాటినం

క్యాన్సర్‌ ఔషధాలు 

వైద్య పరికరాలు

తోలు వస్తువులు

రొయ్యలు, చేపల మేత

ఉక్కు, జౌళి

యంత్ర పరికరాలు


ధరలు పెరిగేవి..


టెలికం గేర్లు

పీవీసీ ఫ్లెక్స్‌ బ్యానర్లు

ప్రయోగశాల రసాయనాలు

సోలార్‌ మాడ్యూళ్ల తయారీలో వినియోగించే సోలార్‌ గ్లాస్‌ 

అమోనియం నైట్రేట్‌

నాన్‌ బయోడిగ్రేడబుల్‌ ప్లాస్టిక్‌ ఉత్పత్తులు


 



విమానయాన రంగానికి రూ.2,357 కోట్లు
 


ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు రూ.2,357.14  కోట్లు కేటాయించారు. 2023-24కు సవరించిన బడ్జెట్‌ కేటాయింపులు రూ.2,922.12 కోట్లతో పోలిస్తే ఈ మొత్తం తక్కువే. ప్రాంతీయ విమాన అనుసంధాన (ఉడాన్‌) పథకానికి రూ.502 కోట్లు ఇవ్వనున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన రూ.850 కోట్లతో పోలిస్తే ఈ మొత్తమూ తక్కువే. 

‣ 22 విమానాశ్రయాల పునరుజ్జీవానికి రూ.502 కోట్లను వినియోగిస్తారు. 124 ఆర్‌సీఎస్‌ మార్గాలను, నార్త్‌ ఈస్ట్‌ కనెక్టివిటీ నిమిత్తం వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌నూ ప్రకటించారు.

డ్రోన్, డ్రోన్‌ విడిభాగాలకు ఉద్దేశించిన ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకం కింద రూ.57 కోట్లు కేటాయించారు. 2023-24లో ఈ మొత్తం రూ.33 కోట్లే.

డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ), బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ(బీసీఏఎస్‌)కు వరుసగా రూ.302.64 కోట్లు, రూ.89 కోట్లు కేటాయించారు. 

హోటల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు రూ.57.14 కోట్లను ప్రతిపాదించారు.

ప్రభుత్వరంగంలో ఎయిరిండియా ఉన్నప్పుడు, పదవీ విరమణ చేసిన వారికి వైద్య ప్రయోజనాలను అందించడం కోసం రూ.85 కోట్లు ఇవ్వనున్నారు. 2023-24లో ఇలా రూ.51 కోట్లు అందించారు. 
విమాన, నౌకా రంగాల్లో ఎంఆర్‌వో కార్యకలాపాలకు ప్రోత్సాహకాలు

దేశంలో విమానయాన, నౌకాశ్రయ రంగాల్లో నిర్వహణ, మరమ్మతు, ఓవర్‌హాల్‌(ఎంఆర్‌వో) కార్యకలాపాలకు మద్దతునిచ్చేందుకు బడ్జెట్‌లో కేంద్రం కొన్ని ప్రోత్సాహకాలను ప్రకటించింది. 

మరమ్మతుల నిమిత్తం దిగుమతి చేసుకున్న విడిభాగాలను, తిరిగి పంపేందుకు ఉన్న గడువును ప్రస్తుత ఆరు నెలల నుంచి ఏడాదికి పొడిగించారు. 

వారంటీ కింద ఉన్న వస్తువులను తిరిగి దిగుమతి చేసుకునేందుకు ఇచ్చే గడువును కూడా మూడేళ్ల నుంచి అయిదేళ్లకు పెంచారు. 
ఇదీ ప్రభావం: ప్రస్తుతం విమానయాన రంగంలో చాలా వరకు ఎంఆర్‌వో కార్యకలాపాలు దేశం వెలుపలే జరుగుతున్నాయి. దేశీయంగా ఈ కార్యకలాపాలు పెంచడానికి కేంద్రం చేపడుతున్న చర్యల్లో ఇవీ భాగమే. ఈ నెల మొదట్లో ఏకీకృత వస్తు సేవల పన్ను (ఐజీఎస్‌టీ) రేటును అన్ని విమానయాన, విమానయాన ఇంజిన్‌ విడిభాగాలకు ఏకరీతిన 5 శాతంగా నిర్ణయించారు. అంతక్రితం ఈ రేటు 5-28 శాతం మధ్య ఉండేది. 


విమానాలు, నౌకల లీజింగ్‌ సులువుగా

విమానాలు, నౌకల లీజింగ్‌కు సంబంధించిన నిధుల సమీకరణ పద్దతులను సమర్థంగా, సులువుగా చేపట్టేందుకు వీలు కల్పించనున్నట్లు బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించింది. ఒక ‘వేరియబుల్‌ కంపెనీ స్ట్రక్చర్‌’ ద్వారా ప్రైవేటు ఈక్విటీ పూల్డ్‌ నిధులను ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించిన నిర్దిష్ట వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.


చమురు కంపెనీలకు మూలధన సాయం రూ.లక్ష
 


ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్‌ కంపెనీలకు అంతక్రితం ప్రణాళిక ప్రకారం ఇవ్వాల్సిన రూ.30,000 కోట్ల మూలధనాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఇంధన రిటైల్‌ కంపెనీలు రికార్డు స్థాయి లాభాలను నమోదు చేయడం ఇందుకు నేపథ్యం. 

ఇలా ప్రకటించి.. అలా రద్దు చేసి..: హెచ్‌పీసీఎల్, ఐఓసీ, బీపీసీఎల్‌ ఇంధన మార్పిడి (బీఎస్‌6కు) ప్రణాళికలకు ఊతమిచ్చేందుకు గతేడాది ఫిబ్రవరి 1న బడ్జెట్‌లో రూ.30,000 కోట్ల నిధిని ప్రభుత్వం ప్రతిపాదించింది. మధ్యంతర బడ్జెట్‌లో ఈ మూలధన మద్దతును సగం చేసి రూ.15,000 కోట్లకు పరిమితం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ, కర్ణాటకలోని మంగళూరుల్లో వ్యూహాత్మక నిల్వలను పెంచుకోవడం కోసం, ముడి చమురు కొనుగోలు చేయడానికి గతేడాది బడ్జెట్‌లో రూ.5,000 కోట్లు కేటాయించారు. మధ్యంతర బడ్జెట్‌లో ఆ ప్రతిపాదననూ వాయిదా వేశారు. ఈ రెండు ప్రణాళికలను తాజా బడ్జెట్‌లో రద్దు చేశారు. సవరించిన కేటాయింపుల ప్రకారం..  రూ.లక్ష మాత్రమే మూలధనం కింద ఇవ్వనున్నారు. 

మూడు ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్‌ కంపెనీలు కలిసి 2023-24లో రూ.81,000 కోట్ల లాభాలను పొందాయి. చమురు సంక్షోభానికి ముందు, వార్షిక లాభాలైన రూ.39,356 కోట్లతో పోలిస్తే ఇవి చాలా ఎక్కువ. అందుకే వాటికి మూలధన సాయం ప్రతిపాదనను కేంద్రం రద్దు చేసింది.

 


పలు రంగాలకు కేటాయింపులు ఇవీ..
 


రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు కేంద్రం ఎలాంటి వడ్డీ లేకుండా రూ.1.5 లక్షల కోట్ల దీర్ఘకాలిక రుణసాయం అందించనుంది. రాబోయే ఐదేళ్లలో మౌలిక సదుపాయాలకు బలమైన మద్దతు అందిస్తామని, దీంతోపాటు రహదారి ప్రాజెక్టులను మరో రూ.26వేల కోట్లతో అభివృద్ధి చేస్తామని నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. అమృత్‌సర్‌-కోల్‌కతా పారిశ్రామిక కారిడార్‌లో గయ వద్ద పారిశ్రామిక నోడ్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. మొత్తం పెట్టుబడి వ్యయం  జీడీపీలో 3.4%.. అంటే రూ.11,11,111 కోట్లు ఉంటుందని చెప్పారు.


రైల్వేకు రూ.2,62,200 కోట్లు
 


రైల్వేలకు బడ్జెట్‌లో మొత్తం రూ.2,62,200 కోట్లు కేటాయించారని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు. అందులో రూ.1,08,795 కోట్లు (41.5%) భద్రతా కార్యకలాపాలకే వెచ్చిస్తామని మంగళవారం ఆయన తెలిపారు  తమ శాఖకు చేసిన కేటాయింపుల్లో అగ్రభాగాన్ని రైళ్ల భద్రతా కార్యకలాపాలు, కవచ్‌ వ్యవస్థను నెలకొల్పడంపైనే ఖర్చుచేస్తామని మంత్రి వివరించారు. వీటిలో ప్రధానంగా పాత పట్టాల స్థానే కొత్తవి వేయడం, సిగ్నలింగ్‌ వ్యవస్థను మెరుగుపరచడం, ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం, కవచ్‌ వ్యవస్థ నెలకొల్పడంపై ఖర్చు చేస్తామని తెలిపారు. వీటన్నింటిలోనూ కవచ్‌ వ్యవస్థ తమకు అత్యంత ప్రాధాన్య అంశమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘కవచ్‌ 4.0 వ్యవస్థకు ఇటీవలే రీసెర్చ్‌ డిజైన్స్‌ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆర్గనైజేషన్‌ నుంచి అనుమతి లభించింది. దీన్ని శరవేగంగా నెలకొల్పుతాం.

 2014లో రైల్వేలకు కేవలం రూ.35వేల కోట్లే ఇచ్చారు. ఇప్పుడది రూ.2.62 లక్షల కోట్లకు చేరుకుంది. 2014కు ముందు 60 ఏళ్లలో 20వేల కిలోమీటర్ల రైలుమార్గాలనే విద్యుదీకరించారు. గడిచిన పదేళ్లలో 40వేల కిలోమీటర్ల మార్గాలను విద్యుదీకరించాం. అలాగే 2014లో సగటున రోజుకు 4 కి.మీ. రైలుమార్గం వేశారు. గత ఆర్థిక సంవత్సరంలో సగటున రోజుకు 14.5 కి.మీ. రైలుమార్గాలు వేశాం. ఆ ఆర్థిక సంవత్సరం మొత్తంలో 5,300 కి.మీ. రైలుమార్గాలు కొత్తగా వేశాం. గడిచిన పదేళ్లలో రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణ, బాటిల్‌నెక్‌ల తొలగింపు, కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఇంజిన్లు, బోగీల తయారీ లాంటి చర్యలు తీసుకున్నాం. ఇవన్నీ ఇక మీదటా కొనసాగుతాయి. 
 


జనరల్‌ బోగీల తయారీ ముమ్మరం

భారతీయ రైళ్లు ప్రధానంగా దిగువ, మధ్యతరగతి ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని సేవలు అందిస్తున్నాయి. ఒక రైల్లో మూడింట రెండొంతులు జనరల్‌ బోగీలు, ఒక వంతు ఏసీ బోగీలు ఉంటాయి. జనరల్‌ బోగీలకు పెరుగుతున్న డిమాండు దృష్ట్యా ఈ ఆర్థిక సంవత్సరంలో 2,500 అదనపు జనరల్‌ బోగీలు ఉత్పత్తి చేయాలని నిర్ణయించాం. మరో నిర్ణయం ప్రకారం, పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా 10వేల జనరల్‌ బోగీలు ఉత్పత్తి చేయాలి. బడ్జెట్‌లో ఈ రెండు అంశాలూ ఉన్నాయి. రైల్వే ఉద్యోగాల విషయానికి వస్తే, పదేళ్ల యూపీయే పాలనలో 4.11 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. పదేళ్ల మోదీ పాలనలో 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. అంటే యూపీయే హయాం కంటే 20 శాతం ఎక్కువ’’ అని అశ్వినీ వైష్ణవ్‌ వివరించారు.


‘రక్షణ’కు స్వల్ప పెంపు
 


తాజా బడ్జెట్‌లో రక్షణ పద్దు కింద రూ.6,21,940 కోట్లను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించారు. ఇంచుమించుగా మధ్యంతర బడ్జెట్‌లో చేసిన కేటాయింపుల (రూ.6,21,540 కోట్లు)నే కొనసాగించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో చేసిన కేటాయింపుల కన్నా ఇది 4.79 శాతం ఎక్కువ. సవరించిన అంచనాల (రూ.6.23 లక్షల కోట్లు)తో పోలిస్తే స్వల్పంగా తక్కువ. తూర్పు లద్దాఖ్‌లో చైనాతో సరిహద్దు వివాదం కొనసాగుతుండటం, వ్యూహాత్మక జలమార్గాల్లో భద్రతా స్థితిగతుల్లో వేగంగా చోటుచేసుకుంటున్న మార్పుల నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. 

ఆయుధాలు, యుద్ధవిమానాలు, యుద్ధనౌకలు, సైనిక హార్డ్‌వేర్‌ కొనుగోలుకు ఉద్దేశించిన పెట్టుబడి వ్యయం కింద రూ.1.72 లక్షల కోట్ల కేటాయింపు

‣ రోజువారీ నిర్వహణ వ్యయాలు, వేతనాల కోసం ఉద్దేశించిన రెవెన్యూ వ్యయం కింద రూ.2.82 లక్షల కోట్లు. రక్షణ శాఖ పెన్షన్ల కోసం రూ.1,41,205 కోట్లు.  

సరిహద్దు రహదారి సంస్థకు పెట్టుబడి వ్యయం కింద రూ.6,500 కోట్లు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో)కు రూ.23,855 కోట్లు. 


ఆరోగ్యానికి రూ.90,958 కోట్లు


కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖకు ఈసారి బడ్జెట్‌లో రూ.90,958.63 కోట్లు కేటాయించారు. 2023-24 సవరించిన అంచనాల (రూ.80,517.62 కోట్లు) కంటే ఇది 12.96% అధికం. ట్రాస్టుజుమాబ్‌ డెరక్స్‌టెకాన్, ఆసిమెర్టినిబ్, డుర్వాలుమాబ్‌ అనే మూడు క్యాన్సర్‌ మందులపై కస్టమ్స్‌ డ్యూటీ మినహాయింపు ప్రకటించారు. దీంతోపాటు ఎక్స్‌రే ట్యూబులు, మెడికల్‌ ఎక్స్‌రే మిషన్లలో ఉపయోగించే ఫ్లాట్‌ ప్యానల్‌ డిటెక్టర్లపై ప్రాథమిక కస్టమ్స్‌ డ్యూటీ మారుస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఆయుష్‌ మంత్రిత్వశాఖకు రూ.3,712.49 కోట్లు కేటాయించారు. మొత్తం రూ.90,958.63 కోట్లలో రూ.87,656.90 కోట్లను ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖకు, రూ.3,301.73 కోట్లను ఆరోగ్య పరిశోధన శాఖకు కేటాయించారు. జాతీయ ఆరోగ్యమిషన్‌కు రూ.36వేల కోట్లు, పీఎంజేఏవైకి రూ.7,300 కోట్లు కేటాయించారు. ఎయిమ్స్‌ లాంటి స్వతంత్ర సంస్థలకు మొత్తం రూ.18,013.62 కోట్లు కేటాయించారు. వీటిలో దిల్లీ ఎయిమ్స్‌కు రూ.4,523 కోట్లు దక్కాయి. ఐసీఎంఆర్‌కు రూ.2,732.13 కోట్లు ఇచ్చారు.


స్త్రీలు, బాలికల పథకాలకు రూ.3 లక్షల కోట్లు

మహిళలు, శిశువులపై కేంద్ర ప్రభుత్వం వాత్సల్యం చూపింది. మహిళా, శిశు సంక్షేమ శాఖకు ఈ బడ్జెట్‌లో కేటాయింపులు గతేడాది కంటే 2.5 శాతం స్వల్పంగా పెంచింది. ఈ శాఖకు 2024-25 బడ్జెట్‌లో రూ.26,092 కోట్లు కేటాయించారు. గతేడాది సవరించిన బడ్జెట్‌ అంచనాల్లో కేటాయింపులు రూ.25,448 కోట్లు. వివిధ శాఖలు మహిళలు, బాలికలకు అమలు చేసే కేంద్రీకృత పథకాల కోసం రూ.3 లక్షల కోట్లకు పైగా నిధులను కేటాయించింది. మహిళల నేతృత్వంలో అభివృద్ధిని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో  అవసరమైన నిధులు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.


మహిళలకు వసతి గృహాలు

శ్రామికశక్తిలో స్త్రీ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంలో భాగంగా మహిళా వసతి గృహాలు ఏర్పాటుచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. సామర్థ్య పథకం పరిధిలో  మహిళల వసతి గృహాలు, స్వధార్‌ గృహ్, ప్రధానమంత్రి మాతృ వందన యోజన తదితరాలకు రూ.2,516 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో వీటికి సవరించిన బడ్జెట్‌ కేటాయింపులు రూ.2,325 కోట్లు.


శిశువుల సంరక్షణకు రూ. 21,200 కోట్లు

కేంద్రం అమలుచేస్తున్న పథకాల కోసం మహిళ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖకు  రూ. 25,848 కోట్లు కేటాయించారు. మహిళా సాధికారత, బాలల సంరక్షణ, మెరుగైన పోషకాహారం పంపిణీకి సంబంధించి సాక్ష్యం అంగన్‌వాడీ, పోషణ్‌ 2.0, మిషన్‌ వాత్సల్య, మిషన్‌ శక్తి తదితరాలకు కూడా గణనీయంగానే కేటాయించారు. పోషకాహార లోప నివారణ, శిశువుల సంరక్షణే లక్ష్యంగా రూ. 21,200 కోట్లు కేటాయించారు. బాలల సంక్షేమం, వారి సంరక్షణ సేవల కోసం ఉద్దేశించిన మిషన్‌ వాత్సల్యకు రూ. 1,472 కోట్లు ఖర్చు చేయనున్నారు. సంబల్, సామర్థ్య ఉప పథకాలుగా విభజించిన మిషన్‌ శక్తికి రూ. 3,145 కోట్లు కేటాయించారు. సంబల్‌ ఉప పథకం కింద బేటీ బచావో.. బేటీ పఢావోకు, మహిళల భద్రతకు ఉద్దేశించిన ‘వన్‌ స్టాప్‌ సెంటర్‌’కు రూ.629 కోట్లు ఖర్చు చేయనున్నారు.


మోడల్‌ స్కిల్‌ స్కీం కింద రుణాలు

పరిశ్రమల సహకారంతో క్రెష్‌లు ఏర్పాటు చేయించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. స్త్రీల ఆర్థికాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, స్వయం సహాయక సంఘాల మహిళలకు మార్కెట్‌ అందుబాటు లాంటి కార్యక్రమాలు చేపడతామన్నారు. ‘మోడల్‌ స్కిల్‌ లోన్‌ స్కీం’ కింద రూ.7.5 లక్షల వరకు రుణాలు ఇస్తామని, ఇవి ఏటా 25వేల మంది విద్యార్థులకు ప్రయోజనం కల్పిస్తాయని అన్నారు.

మరికొన్నింటికి..

‣ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ కోఆపరేషన్‌ అండ్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ (ఎన్‌ఐపీసీసీడీ)కు రూ.88.87 కోట్లు

‣  సెంట్రల్‌ అడాప్షన్‌ రిసోర్స్‌ ఏజెన్సీ (సీఏఆర్‌ఏ)కు రూ.11.40 కోట్లు

యూనిసెఫ్‌కు భారత్‌ విరాళంగా రూ.5.60 కోట్లు

 నిర్భయ నిధికి రూ.500 కోట్లు


తెలంగాణకు మొండి చెయ్యే
 


రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు కేంద్ర బడ్జెట్‌లో నిధులు దక్కలేదు. పలు ప్రాజెక్టులు, పథకాలకు నిధులివ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా దిల్లీ వెళ్లి ప్రధాని మోదీకి వినతిపత్రం సైతం ఇచ్చారు. రాష్ట్ర ఆర్థికశాఖ కేంద్రానికి విడిగా వివరాలను కూడా పంపింది. అయినా ప్రధాన ప్రాజెక్టులకు నిధులేవీ పెద్దగా రాలేదు. తెలంగాణ ఏర్పడిన తరవాత తొలిసారి రాష్ట్రం నుంచి భాజపా తరఫున 8 మంది లోక్‌సభకు ఎంపికయ్యారు. వారి నుంచి ఇద్దరికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కింది.   

ఈ నేపథ్యంలో ఈసారైనా నిధులు ఆశించిన స్థాయిలో దక్కుతాయని రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూసింది. కేంద్ర బడ్జెట్‌ కేటాయింపులను బట్టే రాష్ట్ర బడ్జెట్‌ను ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత మూడేళ్లుగా కేంద్రం నుంచి గ్రాంట్ల పద్దు కింద పూర్తిస్థాయిలో నిధులు రాక తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఇటీవల ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కేంద్ర పథకాల ద్వారా అన్ని రాష్ట్రాలకు జనాభా నిష్పత్తిలో నిధులు కేటాయించాలని సైతం కోరారు. కానీ అలా రావడం లేదు. ఉదాహరణకు గతేడాది(2023-24)లో అన్ని రాష్ట్రాలకు కలిపి కేంద్ర ప్రాయోజిత పథకాల(సీఎస్‌ఎస్‌) కింద రూ.4.60 లక్షల కోట్లను కేంద్రం   విడుదల చేయగా తెలంగాణకు కేవలం 1.4 శాతం(రూ.6,577 కోట్లు) మాత్రమే వచ్చినట్లు రాష్ట్ర ఆర్థికశాఖ తెలిపింది. 

కానీ జనాభా ప్రాతిపదికన 3 శాతం కింద దాదాపు రూ.14 వేల కోట్లు రావాలని అంచనా. గతేడాది రాష్ట్ర బడ్జెట్‌లో రూ.41,259 కోట్లు కేంద్రం నుంచి గ్రాంట్లుగా వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. చివరికి అందులో రూ.9,729 కోట్లు రావడంతో పలు శాఖల్లో అనుకున్న విధంగా నిధులు విడుదల కాలేదు. ఈసారి అలా జరగకుండా కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తాయనే పక్కా అంచనాలతో రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందించాలని ప్రభుత్వం కసరత్తు చేసింది. కేంద్ర బడ్జెట్‌ను పరిశీలిస్తే రాష్ట్ర ప్రాజెక్టులు, సంస్థలు, పథకాలకు నిధులేమీ పెద్దగా కేటాయించలేదని ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌ చుట్టూ ప్రాంతీయ వలయ రహదారికి, హైదరాబాద్‌లో మెట్రో రైలు రెండోదశ ప్రాజెక్టుకు, మూసీ రివర్‌ అర్బన్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టుకు... ఇలా ఎన్నింటికో సాయం కోసం కేంద్రానికి ప్రతిపాదనలను సమర్పించినా వాటిలో ఏ ప్రాజెక్టుకూ భారీగా నిధులు దక్కలేదని రాష్ట్ర అధికారులు వివరించారు.


ఎదురు చూపులే...

దాదాపు పదేళ్లుగా విభజన హామీల అమలు కోసం ఎదురుచూస్తున్న తెలంగాణకు ఈ సారి కేంద్ర బడ్జెట్‌లోనూ నిరాశే మిగిలింది.  భారీగా యువతకు అవకాశాలు ఉండే కాజీపేట రైల్వేకోచ్‌ల కర్మాగారం, బయ్యారం ఉక్కు కర్మాగారం వంటి పెద్ద ప్రాజెక్టులను విభజన చట్టంలోని 13వ షెడ్యూలులోని పదో అంశంగా చేర్చారు. వాటికి కేంద్రం కరుణిస్తుందని ఆది నుంచి యువత ఎదురుచూస్తోంది. కానీ ఈసారీ మంజూరు కాలేదు. కోచ్‌ల కర్మాగారానికి అవసరమైన భూమి అందుబాటులో ఉంది. కాజీపేటలో రైల్వే జంక్షన్‌ ఉంది. ఇలా ఎన్నో సానుకూలతలున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఆచరణ సాధ్యం కాదని కేంద్రం ఆది నుంచి వాదిస్తోంది. మరోవైపు ఈ మధ్యకాలంలోనే కోచ్‌ల కర్మాగారాన్ని గుజరాత్‌లో ఏర్పాటు చేసింది. 

విశాఖ ఉక్కు కర్మాగారంతో పోల్చితే తక్కువ దూరంలో బొగ్గుగనులు ఉండి, ఇతరత్రా అనుకూలతలున్నా బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం ఇవ్వడం లేదు. ఏజెన్సీ ప్రాంతంలో కర్మాగారం ఏర్పాటు చేయడం వల్ల ఆరు జిల్లాలకు ప్రయోజనం చేకూరేది. బయ్యారానికి సమీపంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని గనులను గుజరాత్‌లోని ఉక్కు కర్మాగారానికి కేటాయించింది. ప్రస్తుతం కిషన్‌రెడ్డి గనుల శాఖ మంత్రి కావడంతో ఈసారి బడ్జెట్‌లో దాని మంజూరుకు ఆటంకాలు తొలగిపోతాయని అందరూ భావించినా సాకారం కాలేదు. 

తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో హామీ ఇచ్చి... చివరికి లోక్‌సభ ఎన్నికలకు ముందు గత డిసెంబరులో దానికి సంబంధించిన బిల్లును ఆమోదించింది. విశ్వవిద్యాలయం స్థాపనకు రూ.900 కోట్లు మంజూరు కావాల్సి ఉండగా... ఆ కేటాయింపులు కూడా జరగలేదు. 

తెలంగాణలో ఏదైనా ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విభజన చట్టంలో ఉంది. దీనిని పరిగణనలోకి తీసుకొని గత భారాస ప్రభుత్వం పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరింది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కోరారు. ఈసారీ అది మంజూరు కాలేదు. 

విభజన చట్టం ప్రకారం హైదరాబాద్‌- వరంగల్, హైదరాబాద్‌-నాగ్‌పుర్‌ పారిశ్రామిక నడవా (కారిడార్‌)లను మంజూరు చేసి నిధులివ్వాలని పదేళ్లుగా రాష్ట్ర కోరుతోంది. ఈసారీ వాటిని పట్టించుకోలేదు. బెంగళూరు నడవాలో హైదరాబాద్‌ను జత చేస్తామని ప్రకటించింది. దీని వల్ల ప్రయోజనాలు పరిమితమే. 

‣ అలాగే కేంద్రం నుంచి వెనుకబడిన ప్రాంత అభివృద్ధి నిధులు రావాలి. పదేళ్లుగా విడుదల చేయడం లేదు. 

2019-20 నుంచి 2023-24 సంవత్సరాలకు సంబంధించిన గ్రాంట్లు రూ.1,800 కోట్లు పెండింగులో ఉన్నాయి.

తెలంగాణలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు ఇస్తామని, కొత్త పరిశ్రమలకు ఐదేళ్ల తర్వాత యంత్రాల కొనుగోలుపై పన్ను మినహాయింపులు వర్తిస్తాయని విభజన చట్టంలో చెప్పింది. ఈ లెక్కన రాష్ట్రానికి రూ.పది వేల కోట్లకు పైగా నిధులు రావాలి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి నిధులు అందలేదు.  

తెలంగాణకు ఉద్యాన విశ్వవిద్యాలయంపై కేంద్రం హామీ ఇచ్చినా అందుకు చొరవ చూపలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే 2014 డిసెంబరు 22న కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరిట తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం ప్రారంభించింది. దీనికి కేంద్రం నిధులివ్వలేదు. ఏపీలోని విశ్వవిద్యాలయం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు రాలేదు. 

విభజన చట్టం కింద నాలుగు వేల మెగావాట్ల థర్మల్‌ విద్యుత్తు కేంద్రం ఏర్పాటు చేయాలి. రామగుండంలో ఎన్టీపీసీ 1,600 మెగావాట్ల ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. మిగిలిన 2,400 మెగావాట్లవి ఇంకా ఏర్పాటు చేయాల్సి ఉంది.

ఈ చట్టప్రకారం జిల్లాకు ఒకటి చొప్పున నవోదయ పాఠశాలలు ఇవ్వలేదు. ఐఐఎం, ఐఐటీహెచ్‌ వంటి ఉన్నత విద్యాసంస్థలను కోరినా కేంద్రం వాటిని మంజూరు చేయలేదు. ఇవే కాకుండా మరెన్నో విభజన హామీలకు కేంద్ర బడ్జెట్‌లో ప్రాధాన్యం దక్కలేదు.


వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్ల కేటాయింపు
 


సాగు ఉత్పాదకత పెంచడమే లక్ష్యంగా బడ్జెట్‌లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు కేంద్ర ప్రభుత్వం రూ.1.52 లక్షల కోట్లు కేటాయించింది. రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. తాము చేపట్టబోయే వివిధ పథకాలు, కార్యక్రమాల గురించి బడ్జెట్‌ ప్రసంగంలో మంత్రి ప్రస్తావించారు.

ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని అధిక దిగుబడి ఇచ్చే వంగడాల అభివృద్ధికి వ్యవసాయ పరిశోధనలకు ప్రోత్సాహం

అధిక ఉత్పత్తినిచ్చే 109 నూతన వంగడాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకునే 32 ఆహార, పండ్ల పంటల రకాల విడుదల

దేశంలో పప్పుధాన్యాల ఉత్పత్తి, నిల్వ, మార్కెటింగ్‌ వ్యవస్థ బలోపేతం 

ఆవాలు, వేరుసెనగ, నువ్వులు, సోయాబీన్, పొద్దుతిరుగుడు లాంటి నూనెగింజల ఉత్పత్తిలో ఆత్మనిర్భరత సాధనకు కృషి

కూరగాయల సేకరణ, నిల్వ, మార్కెటింగ్‌ నిమిత్తం రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, సహకార సంఘాలు, అంకుర సంస్థలకు ప్రోత్సాహం. 

‣ రొయ్యల సాగు, ప్రాసెసింగ్, ఎగుమతులకు నాబార్డు ద్వారా ఆర్థిక సాయం  వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా కోటి మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేపట్టేలా ప్రోత్సాహం.. వారి ఉత్పత్తులకు ధ్రువీకరణ, బ్రాండింగ్‌  10 వేల బయో-ఇన్‌పుట్‌ వనరుల కేంద్రాల ఏర్పాటు దేశవ్యాప్తంగా 400 జిల్లాల్లో డిజిటల్‌ పంటల సర్వే


కొత్త సహకార విధానం

దేశ సమగ్రాభివృద్ధికి జాతీయ సహకార విధానాన్ని కేంద్రం అమలులోకి తీసుకురానుంది. గ్రామీణ ఆర్థికం సత్వర అభివృద్ధి, ఉద్యోగావకాశాల కల్పనను వేగవంతం చేయడమే ఈ కొత్త విధానం లక్ష్యమని మంత్రి వెల్లడించారు. 5 రాష్ట్రాల్లో జన సమర్థ్‌ ఆధారిత కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. రాష్ట్రాల భాగస్వామ్యంతో రైతులు, వారి భూములకు మూడేళ్లలో డిజిటల్‌ ప్రజా మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.


జల వనరులకు రూ.30,233 కోట్లు

‣ బిహార్‌లోని కోసి, అస్సాంలోని బ్రహ్మపుత్ర నదుల పరీవాహక ప్రాంతాల్లో ప్రాజెక్టులకు నిధులను కేంద్రం కేటాయించింది. 

జల వనరులకు, నదుల అభివృద్ధికి, గంగా నది ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.30,233.83 కోట్లను కేటాయించింది. ఇది గత ఏడాది కంటే 55శాతం అధికం. ప్రధాన ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు, నమామి గంగా మిషన్‌-2కు ఈ సారి కేటాయింపులు భారీగా పెరిగాయి.

‣ హిమాచల్‌ ప్రదేశ్‌లో గత ఏడాది వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల పునరుద్ధరణకు సహాయం చేస్తామని మంత్రి ప్రకటించారు.

జాతీయ హైడ్రాలజీ ప్రాజెక్టు, భూగర్భ జలాలను పెంచే అటల్‌ భూజల్‌ యోజనకు నిధులను పెంచింది.

ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజనకు ఈసారి రూ.9,339 కోట్లను కేంద్రం కేటాయించింది.


భూసంస్కరణలపై రాష్ట్రాలతో సంప్రదింపులు

‣ భూసంస్కరణలపై రాష్ట్రాలతో కేంద్రం సంప్రదింపులు జరుపుతుందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. 

‣ ఆక్సిలరేటెడ్‌ ఇరిగేషన్‌ ప్రోగ్రాం(ఏఐపీ), ఇతర పథకాల కింద రూ.11,500 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులకు ఆర్థిక తోడ్పాటు అందిస్తామన్నారు. 

‣ ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కింలను ఆదుకుంటామని చెప్పారు. 


గ్రామీణ భూములకు భూ-ఆధార్‌

భూసంస్కరణల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని భూములకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య(యూఏఎన్‌) లేదా భూ-ఆధార్‌ కేటాయించాలని, పట్టణ ప్రాంతాల్లోని భూముల రికార్డులన్నీ డిజిటలీకరించాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించారు. ఈ సంస్కరణలను సమర్థంగా అమలు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం అవసరమని.. అందుకు రాష్ట్రాలతో కలిసి పనిచేస్తామని తెలిపారు. వచ్చే మూడేళ్లలోపు పూర్తి చేసేందుకు రాష్ట్రాలకు అవసరమైన ఆర్థిక తోడ్పాటు అందిస్తామన్నారు.

‣ గ్రామీణ ప్రాంతాల్లో భూపరిపాలన, ప్రణాళిక, నిర్వహణ, పట్టణ ప్రాంతాల్లో అర్బన్‌ ప్లానింగ్, ఉప చట్టాల రూపకల్పన బాధ్యతలను రాష్ట్రాలు నెరవేర్చాల్సి ఉంటుందని చెప్పారు. ‘‘సంస్కరణల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని రకాల భూములకు యూనిక్‌ ల్యాండ్‌ పార్సిల్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌(యూఎల్‌పీఐఎన్‌) లేదా భూ-ఆధార్‌ కేటాయింపు; భూసర్వే పటాల డిజిటలీకరణ, ప్రస్తుత యజమానులకు అనుగుణంగా సబ్‌-డివిజన్‌ పటాల సర్వే, భూముల రిజిస్ట్రీ, దానికి రైతుల అనుసంధానం ఉంటాయి. పట్టణ ప్రాంతాల్లోని భూదస్త్రాలను జీఐఎస్‌ మ్యాపింగ్‌ ద్వారా డిజిటలీకరిస్తాం. ఆస్తి రికార్డుల నిర్వహణ, పన్ను వసూళ్లకు ప్రత్యేక ఐటీ ఆధారిత వ్యవస్థ ఏర్పాటవుతుంది. 

దీని వల్ల పట్టణ ప్రాంత స్థానిక సంస్థలూ ఆర్థికంగా బలోపేతమవుతాయి’’ అని కేంద్ర మంత్రి వివరించారు. సంస్కరణలను వేగవంతంగా అమలు చేయడంలో భాగంగా రాష్ట్రాలకు ప్రోత్సాహం అందించేందుకు 50 ఏళ్ల పాటు వడ్డీరహిత రుణాల్లో గణనీయ మొత్తాన్ని కేటాయించాలని ప్రతిపాదిస్తున్నట్లు ప్రకటించారు.


బిహార్‌ రోడ్లకు రూ.26 వేల కోట్లు


బిహార్‌లోని రహదారి ప్రాజెక్టులకు రూ.26 వేల కోట్ల నిధులను కేంద్రం ప్రతిపాదించింది. బహుళపాక్షిక అభివృద్ధి సంస్థల ద్వారా ఆర్థిక సహకారం అందించేందుకు కేంద్రప్రభుత్వం కృషి చేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. జాతీయ రహదారుల కోసమే రూ.20వేల కోట్లు కేటాయించనున్నట్లు ప్రకటించింది. పట్నా-పుర్నియాలను కలుపుతూ ఎక్స్‌ప్రెస్‌వే అభివృద్ధి చేస్తామని పేర్కొంది. బక్సర్‌-భాగల్‌పుర్, బోధ్‌గయా-రాజ్‌గిర్‌-వైశాలీ-దర్భంగాలను అనుసంధానిస్తామని తెలిపింది. 

‣ బక్సర్‌ జిల్లాలో గంగానదిపై రెండులేన్ల వంతెన నిర్మాణం, భాగల్‌పుర్‌లోని పిర్‌పౌంతీలో రూ.21,400 కోట్ల అంచనాతో 2,400 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తామని కేంద్రం పేర్కొంది. రాష్ట్రంలో పర్యటకాన్ని మరింత అభివృద్ధి చేయడంలో భాగంగా గయ, రాజ్‌గిర్‌లలో టెంపుల్‌ కారిడార్‌ల అభివృద్ధితోపాటు వరదల నుంచి రాష్ట్రాలను రక్షించేందుకు రూ.11,500 కోట్లతో వరదల నియంత్రణ నిర్మాణాలు చేపడతామని హామీ ఇచ్చింది. పర్యటక కేంద్రంగా నలందా అభివృద్ధి, ఎయిర్‌పోర్టులు, మెడికల్‌ కాలేజీలు, క్రీడా రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని తెలిపింది. 


విద్యకు భారీగా కోతలు


కేంద్ర బడ్జెట్‌లో విద్యారంగానికి భారీగా కోతపెట్టారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1.29 లక్షల కోట్లు కేటాయించగా, ఈసారి రూ.1.20 లక్షల కోట్లే ఇచ్చి.. రూ.9వేల కోట్లు తగ్గించారు. కొన్నింటికి పెంచి, మరికొన్నింటికి తగ్గించారు. ప్రపంచస్థాయి విద్యాసంస్థలకు గత బడ్జెట్‌లో రూ.1,300 కోట్లు, ఈసారి రూ.1,800 కోట్లు కేటాయించారు. యూజీసీకి అత్యధికంగా 60.99 శాతం తగ్గింది. గత సంవత్సరం రూ.6,409 కోట్లు ఇవ్వగా, ఈసారి రూ.2,500 కోట్లకు పరిమితం చేశారు. ఐఐఎంలకూ రూ.331 కోట్ల నుంచి రూ.212 కోట్లకు తగ్గించారు. ఐఐటీలకు గత సంవత్సరం రూ.10,384.21 కోట్లు కేటాయించగా, ఇప్పుడది రూ.10,324.50 కోట్లకు చేరింది. కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు మాత్రం 28% పెంచారు. గత సంవత్సరం రూ.12,000.08 కోట్లు ఇవ్వగా, ఈసారి అది రూ.15,472 కోట్లయ్యింది. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, ఎన్‌సీఈఆర్‌టీ, పీఎంశ్రీ పాఠశాలలకు కొద్దిగా పెరిగింది.


స్వదేశీ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యకు రూ.10లక్షల రుణం

స్వదేశీ విద్యాసంస్థల్లో ఉన్నతవిద్య అభ్యసించే విద్యార్థులకు రూ.10 లక్షల వరకు విద్యారుణాలు ఇస్తారు. యేటా లక్ష మంది విద్యార్థులకు వడ్డీలో 3% రాయితీ అందుతుంది. ఇప్పటివరకు ఏ ప్రభుత్వ పథకాల కింద లబ్ధికి అర్హులు కాని యువత కోసం ఈ రుణ పథకం ప్రవేశపెట్టినట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. 3% వడ్డీ రాయితీకి ఈ-ఓచర్లను నేరుగా విద్యార్థులకే అందిస్తామన్నారు.


పట్టణ ప్రగతికి పట్టం

దేశంలో పట్టణాలు, నగరాల ప్రాతిపదికన అభివృద్ధికి ఊతమివ్వడానికి కేంద్రం 2024-25 మధ్యంతర బడ్జెట్‌లో వ్యూహాత్మక ప్రతిపాదనలు చేసింది. నగరాలను ‘‘ప్రగతి హబ్బులు’’గా అభివర్ణించి... రానున్న ఐదేళ్లలో వాటి ప్రగతికి రాష్ట్రాలతో కలిసి పని చేస్తామంది. ఆర్థిక, రవాణా ఆధారిత, పట్టణ ప్రణాళికలతో మెట్రో నగరాల శివారు ప్రాంతాలను క్రమపద్ధతిలో అభివృద్ధి చేస్తామంది. పట్టణ పేదలు, మధ్యతరగతి ప్రజల సొంతింటికల సాకారానికి భారీగా నిధులను కేటాయించింది. 

ఇవీ వివరాలు... 

‣  దేశంలో 30 లక్షలు అంతకన్నా ఎక్కువ జనాభా ఉన్న 14 పెద్ద నగరాలకు రవాణా ఆధారిత ప్రగతి ప్రణాళికను ప్రతిపాదించిన ప్రభుత్వం... మెట్రోల శివారు ప్రాంతాల కోసం సృజనాత్మక పునర్‌ అభివృద్ధి కోసం ఫ్రేమ్‌వర్క్‌ను సిద్ధం చేస్తామంది. 

‣  పట్టణాల్లోని కోటి పేద, మధ్య తరగతి కుటుంబాలు ఇళ్లను నిర్మించుకోవడానికి ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన-అర్బన్‌ 2.0కు రూ.10 లక్షల కోట్లను కేటాయించింది. ఇందులో వడ్డీ రాయితీ పథకానికి రూ.2.2 లక్షల కోట్లను ప్రత్యేకించింది. 

‣  రెంటల్‌ హౌసింగ్‌ మార్కెట్లను ప్రోత్సహించడంలో భాగంగా అద్దె ఇళ్ల లభ్యతను పెంచుతామంది. పారిశ్రామిక కార్మికులకు డార్మిటరీ తరహా వసతితో అద్దె గృహాల కోసం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రాజెక్టు చేపడతామంది.  

‣  ఎంపిక చేసిన 100 నగరాల్లో వీక్లీ హట్స్‌ (వారాంతపు సంతలు) లేదా స్ట్రీట్‌ ఫుడ్‌ హబ్‌లను ఏర్పాటు చేస్తామంది. 

‣  రాష్ట్రాలు, బహుపాక్షిక బ్యాంకుల భాగస్వామ్యంతో... దేశంలోని 100 నగరాలకు నీటి సరఫరా, మురుగునీటి శుద్ధి, ఘనవ్యర్థ్యాల నిర్వహణ, సేవలను ప్రాజెక్టులను తెస్తామంది. శుద్ధి చేసిన నీటితో నగరాల సమీపంలోని చెరువులను నింపి, వ్యవసాయానికి ఉపయోగపడేలా చేస్తామని ప్రకటించింది.  


నైపుణ్యాలపై ‘కోటి’ ఆశలు!

ఉద్యోగాలకు తగిన నైపుణ్యాలు సాధించే దిశగా.. విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు కల్పించడంపై తాజా బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయం ఊరట కానుంది. వచ్చే ఐదేళ్లలో ఏకంగా కోటి మంది విద్యార్థులకు టాప్‌ 500 పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్‌ అవకాశం కల్పిస్తామని కేంద్రం పేర్కొంది. అంటే ఏటా 20 లక్షల మందికి అవకాశం లభిస్తుంది. విద్యార్థులకు నెలకు రూ.5 వేల చొప్పున స్టైపెండ్‌ కూడా చెల్లిస్తామని తెలిపింది.

‣  వృత్తి విద్యాకోర్సులైన ఇంజినీరింగ్, ఫార్మసీ తదితరాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు పెద్దఎత్తున ప్రవేశాలు పొందుతున్నారు. వీరందరికీ ఇంటర్న్‌షిప్‌ వల్ల అధిక ప్రయోజనం కలగనుందని భావిస్తున్నారు.


ఇంతవరకు ఐటీ కంపెనీల్లోనే..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్, ఫార్మసీ తదితర ముఖ్యమైన వృత్తివిద్యా కోర్సుల విద్యార్థులు కొంతమందే ఇంటర్న్‌షిప్‌ చేయగలుగుతున్నారు. ముఖ్యంగా ఐటీ కంపెనీలే ప్రాంగణాలకు వచ్చి బీటెక్‌ రెండు, మూడో సంవత్సరాల్లో ఉండగానే ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. 

‣  అనేక కంపెనీలు సొంతంగా 3-6 నెలల కాలానికి స్టైపెండ్‌ చెల్లిస్తున్నాయి. మిగిలిన రంగాల్లోని పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్‌ కావాలంటే స్వయంగా విద్యార్థులు వెళ్లి ప్రయత్నించుకోవాల్సిన పరిస్థితి. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఇంటర్న్‌షిప్‌లను తప్పనిసరి చేస్తూ 2018 నవంబరులోనే మార్గదర్శకాలను విడుదల చేసినా.. అమలు అంతంతమాత్రంగానే ఉంది. 


కేంద్ర నిర్ణయంతో ఊరట..

‘ఎంతోమంది విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌ అవకాశం కోసం అడుగుతూ ఉంటారు. తెలిసిన మేరకు సహాయం చేస్తుంటాం. ఇప్పుడు కేంద్ర నిర్ణయం విద్యార్థులకు ఎంతో ఊరటనివ్వనుంది. ఇంటర్న్‌షిప్‌నకు ఎంపిక చేసేందుకు ఎటువంటి మార్గదర్శకాలు రూపొందిస్తారో చూడాలి’’ అని జేఎన్‌టీయూహెచ్‌ రెక్టార్‌ ఆచార్య కె.విజయకుమార్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. 

‣ ‘దేశవ్యాప్తంగా 50 శాతం మంది ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లోనే ఉద్యోగ నైపుణ్యాలు ఉంటున్నాయని ఏటా ఏఐసీటీఈ, వీబాక్స్‌ సంయుక్తంగా విడుదల చేసే నివేదిక చెబుతోంది. ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు పెరిగితే విద్యార్థులు కూడా ఆత్మవిశ్వాసంతో పనిచేయగలుగుతార’ని ఆయన తెలిపారు.


హోంశాఖ బలోపేతం

కేంద్ర హోంశాఖకు రూ.2,19,643.31 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో అధిక భాగం  (రూ.1,43,275.90 కోట్లు).. అంతర్గత భద్రత, సరిహద్దులు,  కీలక సంస్థలను రక్షించే సీఆర్పీఎఫ్, బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్‌ వంటి బలగాలకు దక్కాయి. 2024-25కు సంబంధించిన మధ్యంతర బడ్జెట్‌లో రూ.2,02,868.70 కోట్లను కేటాయించగా.. ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్‌లో దాదాపు రూ.17వేల కోట్లు పెంచడం విశేషం. 

‣  370 అధికరణం రద్దు నాటి నుంచి కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష నియంత్రణలో ఉన్న జమ్మూకశ్మీర్‌కు రూ.42,277.74 కోట్లు కేటాయించారు. 

‣  విపత్తు నిర్వహణకు రూ.6,458 కోట్లు కేటాయించారు. రాష్ట్రాలకు సహాయ, పునరావాసం, గ్రాంట్‌- ఇన్‌-ఎయిడ్‌ తదితరాలకు ఈ సొమ్మును ఖర్చు పెడతారు. 

‣ ‘సేఫ్‌ సిటీ’ ప్రాజెక్టుకు రూ.214.44 కోట్లు, జాతీయ ఫోరెన్సిక్‌ సైన్స్‌ యూనివర్సిటీ రూ.80 కోట్లు, రాష్ట్రీయ రక్ష విశ్వవిద్యాలయానికి రూ.90 కోట్లు కేటాయించారు. 


సీబీఐకి నిధుల కోత

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి రూ.951.46 కోట్లను తాజా బడ్జెట్‌లో కేటాయించారు. గడిచిన ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 1.79 శాతం తక్కువ. 2023-24కు సంబంధించిన సవరించిన బడ్జెట్‌ అంచనాల ప్రకారం రూ.968.86 కోట్లను ఈ విభాగానికి కేటాయించారు. గిరిజనుల సామాజిక, ఆర్థికాభ్యున్నతికి..జన్‌జాతీయ ఉన్నత్‌ గ్రామ అభియాన్‌
 


గిరిజనుల సామాజిక, ఆర్థిక పరిస్థితుల మెరుగుకు కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. వారి సంక్షేమాన్ని ఆకాంక్షించి ‘ప్రధానమంత్రి జన్‌జాతీయ ఉన్నత్‌ గ్రామ్‌ అభియాన్‌’కు శ్రీకారం చుడుతున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. అత్యధిక గిరిజన జనాభా ఉన్న గ్రామాలు, జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నామని, 63,000 గిరిజన గ్రామాల్లోని 5 కోట్ల మంది గిరిజనులకు ‘జన్‌జాతీయ ఉన్నత్‌ గ్రామ్‌ అభియాన్‌’ కింద లబ్ధి చేకూరనుందని కేంద్ర మంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు.

‣  గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కేంద్రం రూ. 13,000 కోట్లను కేటాయించింది. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి మారుమూల ప్రాంతాల్లో ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల ఏర్పాటుకు రూ.6,399 కోట్లు ఖర్చు చేయనున్నారు.

‣ ఉన్నత విద్యను అభ్యసించే ఎస్టీ విద్యార్థుల నేషనల్‌ ఫెలోషిప్‌ స్కాలర్‌షిప్‌నకు రూ.165 కోట్లు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీల సంక్షేమానికి రూ.6611.69 కోట్లు కేటాయించారు. 

‣  ప్రధానమంత్రి ఆది ఆదర్శ్‌ గ్రామ యోజన కింద రాష్ట్రాలకు అందించే ఆర్థిక సాయాన్ని కేంద్రం పెంచింది. దీనికి ఈ బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయించారు.


డిజిటల్‌ విశ్వవిద్యాలయం ఇక సాకారం

జాతీయ డిజిటల్‌ విశ్వవిద్యాలయం (ఎన్‌డీయూ) ఎట్టకేలకు పట్టాలు ఎక్కనుంది. తాజా బడ్జెట్‌లో కేంద్రం దానికి రూ.100 కోట్లు కేటాయించింది. ఉన్నత విద్యలో జాతీయ స్థూల నమోదును 2035 నాటికి 50 శాతానికి పెంచాలన్న లక్ష్యంతో 2022-23 బడ్జెట్‌లోనే ఎన్‌డీయూను కేంద్రం ప్రతిపాదించింది. అయితే, ఆ బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. గత ఏడాది బడ్జెట్‌లో రూ.4 కోట్లు మాత్రమే చూపగా...తాజా బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించడం విశేషం. అంటే ఈ విద్యా సంవత్సరంలో ఎన్‌డీయూ అందుబాటులోకి రానుందని స్పష్టమవుతోంది. 


యూజీసీకి 61 శాతం నిధుల కోత..

విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) నిధుల్లో భారీగా కోత పడింది. గత ఏడాది బడ్జెట్‌లో రూ.6,409 కోట్లు కేటాయించగా... ఈసారి రూ.2,500 కోట్లు మాత్రమే ప్రతిపాదించారు. అంటే ఏకంగా 61 శాతం నిధులు తగ్గాయి. కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు నిధులు రూ.12,394 కోట్ల నుంచి ఈసారి రూ.15,928 కోట్లకు పెరిగాయి. అంటే రూ.3,534 కోట్లు అధికం. కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు నేరుగా నిధులు పెంచడం వల్ల యూజీసీకి తగ్గినట్లుగా కనిపిస్తోందని ఆ సంస్థ ఛైర్మన్‌ ఆచార్య మామిడాల జగదీష్‌ కుమార్‌ తెలిపారు. ఏఐసీటీఈకి మాత్రం గత బడ్జెట్‌ మాదిరిగానే ఈ దఫా కూడా రూ.400 కోట్లు కేటాయించారు.


మాల్దీవులకు కోత

పొరుగు దేశాలతో బంధాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ‘పొరుగుకే తొలి ప్రాధాన్యం’ విధానం కింద భారత్‌ అభివృద్ధి సాయం అందిస్తోంది. ఇందులో భాగంగా తాజా బడ్జెట్‌లో భారత ప్రభుత్వం పలు కేటాయింపులు జరిపింది. భూటాన్‌కు అత్యధికంగా రూ.2వేల కోట్లను కేటాయించగా.. మాల్దీవులకు మాత్రం గణనీయంగా తగ్గించింది. గతేడాది ఈ ద్వీప దేశానికి రూ.770కోట్లను కేటాయించగా ఈసారి రూ.400 కోట్ల ఖర్చుకు పరిమితం చేసింది.

‣  2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను విదేశీ వ్యవహారాల శాఖకు రూ.22,154 కోట్లు కేటాయించింది. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లోనూ దాదాపు ఇవే కేటాయింపులు ఉన్నాయి. అయితే, అప్పుడు మాల్దీవులకు రూ.600 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించగా.. ప్రస్తుత పూర్తి బడ్జెట్‌లో మాత్రం ఆ మొత్తాన్ని తగ్గిస్తూ రూ.400 కోట్లకు పరిమితం చేసింది.

‣ తాజాగా భూటాన్‌కు రూ.2068 కోట్లు, నేపాల్‌కు రూ.700 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. శ్రీలంకకు రూ.245 కోట్లను ప్రత్యేకించింది. ఇరాన్‌తో అనుసంధాన ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్రం.. ఆ దేశంలోని చాబహార్‌ పోర్టు నిర్వహణకు రూ.100 కోట్లను ప్రకటించింది. అఫ్గానిస్థాన్‌కు తాజా బడ్జెట్‌లో రూ.200 కోట్లు, బంగ్లాదేశ్‌కు రూ.120 కోట్లు, మయన్మార్‌కు రూ.250 కోట్లు కేటాయించింది.  

‣  చైనా అనుకూలుడుగా పేరొందిన మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు.. కొన్నాళ్ల క్రితం భారత్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలకు బీటలు వారాయి. ప్రధాని మోదీ పిలుపుతో భారత్‌ పర్యాటకులు లక్షద్వీప్‌ వైపు మొగ్గు చూపడం మొదలయ్యింది. దీంతో పర్యాటకపరంగా తీవ్రంగా దెబ్బతిన్న మాల్దీవుల ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపట్టినప్పటికీ భారత్‌ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది.



    ♦ Union Budget 2024-25 

Posted Date: 24-07-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని