• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ బడ్జెట్‌ 2024-25

రూ.2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌
 


* తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క జులై 25న రాష్ట్ర బడ్జెట్‌ను  ప్రవేశపెట్టారు.


* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో పూర్తిస్థాయి పద్దును ప్రవేశపెట్టారు.  


* రూ.2,91,159కోట్లతో బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొస్తున్నట్లు మంత్రి తెలిపారు. దీనిలో మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా చెప్పారు. 


* పన్ను ఆదాయం 1,38,181.26 కోట్లు, పన్నేతర ఆదాయం రూ.35,208.44 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా 26.216.28 కోట్లు, కేంద్రం గ్రాంట్లు 21,636.15 కోట్లుగా పేర్కొన్నారు. 


* ఈ ఏడాది రూ.57,112 కోట్ల అప్పులు తీసుకోవాలని ప్రతిపాదించారు. నిజాం షుగర్స్‌ను తిరిగి ప్రారంభిస్తామని భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు.


రాష్ట్ర బడ్జెట్‌ స్వరూపమిదీ


* ఆర్థిక లోటు అంచనా రూ.49,255.41 కోట్లు 


* ప్రాథమిక లోటు అంచనా రూ.31,525.63 కోట్లు


* రెవెన్యూ మిగులు అంచనా రూ.297.42 కోట్లు


* వ్యవసాయానికి రూ.72,659 కోట్లు


* ఉద్యానశాఖకు రూ.737కోట్లు


* పశుసంవర్ధశాఖకు రూ.1,980కోట్లు


* రూ.500 గ్యాస్ సిలిండర్ పథకానికి రూ. 723కోట్లు


* గృహజ్యోతికి రూ.2,418కోట్లు


* ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.3836కోట్లు


* పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖకు రూ.29,816 కోట్లు


* రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)కు రూ.1,525 కోట్లు


* స్త్రీ, శిశు సంక్షేమానికి రూ. 2,736 కోట్లు


* ఎస్సీ సంక్షేమం రూ.33,124కోట్లు


* ఎస్టీ సంక్షేమం రూ.17,056కోట్లు


* మైనార్టీ సంక్షేమం రూ.3,003కోట్లు


* బీసీ సంక్షేమం రూ.9,200 కోట్లు


* వైద్య, ఆరోగ్యం రూ. 11,468 కోట్లు


* ట్రాన్స్‌కో, డిస్కంలకు రూ.16,410 కోట్లు


* అడవులు, పర్యావరణం రూ.1,064 కోట్లు


* పరిశ్రమల శాఖకు రూ. 2,762 కోట్లు


* ఐటీ శాఖకు రూ.774 కోట్లు


* నీటిపారుదల రంగానికి రూ.22,301 కోట్లు


* విద్యకు రూ.21,292 కోట్లు


* హోంశాఖకు రూ.9,564కోట్లు


* రోడ్లు, భవనాల శాఖకు రూ.5,790 కోట్లు


* రాజధాని హైదరాబాద్‌ సహా తెలంగాణ వ్యాప్తంగా పేట్రేగిపోతున్న గంజాయి, మాదకద్రవ్యాల వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఈ క్రమంలోనే తాజా బడ్జెట్‌లోనూ దీన్ని ప్రధానంగా ప్రస్తావించారు. 


* యువశక్తిని నిర్వీర్యం చేస్తున్న మాదకద్రవ్యాల కట్టడి, శాంతి భద్రతల కోసం హోం శాఖకు  రూ.2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క రాజధాని హైదరాబాద్‌ సహా తెలంగాణ వ్యాప్తంగా పేట్రేగిపోతున్న గంజాయి, మాదకద్రవ్యాల వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఈ క్రమంలోనే తాజా బడ్జెట్‌ లోనూ దీన్ని ప్రధానంగా ప్రస్తావించారు. 


* యువశక్తిని నిర్వీర్యం చేస్తున్న మాదకద్రవ్యాల కట్టడి, శాంతి భద్రతల కోసం హోం శాఖకు బడ్జెట్‌లో రూ.9,564 కోట్లు కేటాయించింది.


* ‘‘మాదక ద్రవ్యాల వినియోగం చాలా ప్రమాదకరం. యువత దీని బారినపడితే దేశ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారుతుంది. రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా విద్యార్థులను ఈ మహమ్మారి బారి నుంచి కాపాడేందుకు వివిధ చర్యలు తీసుకుంటున్నాం. డ్రగ్స్‌ రవాణా, వినియోగం చేస్తూ పట్టుబడితే వారిని ఉపేక్షించొద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం.


* తెలంగాణ మాదకద్రవ్య నిరోధక సంస్థకు తగిన సౌకర్యాలు కల్పించి దాన్ని బలోపేతం చేశాం. విద్యాసంస్థల్లో వీటి కట్టడికి యాంటీ డ్రగ్‌ కమిటీలు ఏర్పాటు చేసి.. 4,137 మంది విద్యార్థులను యాంటీ డ్రగ్‌ సోల్జర్స్‌గా నియమించాం. మాదకద్రవ్యాల వల్ల జరిగే హానిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సినీ ప్రముఖుల సహకారం తీసుకుంటున్నాం. వీటికి సంబంధించిన కేసుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాం. తెలంగాణను మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇస్తున్నాం’’ అని ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు.


సైబర్‌ నేరాలపై నిఘా..


* మరోవైపు నానాటికీ పెరుగుతున్న సైబర్‌ నేరాలపైనా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ విషయాన్ని కూడా మంత్రి భట్టి బడ్జెట్‌ ప్రసంగంలో ప్రస్తావించారు. ‘‘రాష్ట్రాభివృద్ధికి శాంతి భద్రతల పరిరక్షణ ఎంతో అవసరం. అభద్రతా వాతావరణంలో పెట్టుబడి పెట్టడానికి అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపించవు. ఈ మధ్య వైట్‌ కాలర్‌, సైబర్‌ నేరాలు పోలీసు వ్యవస్థకు సవాల్‌గా మారుతున్నాయి.  ఇలాంటి నేరాలను అరికట్టేందుకు సైబర్‌ సెక్యూరిటీ విభాగానికి అవసరమైన వాహనాలు అందించాం. ఆధునిక నేర పరిశోధనలో పోలీసులకు శిక్షణ ఇస్తున్నాం. 


* రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లలో సైబర్‌ క్రైమ్‌ ఫిర్యాదులను నమోదు చేసే అవకాశం కల్పించాం. ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదులు చేసేలా వెబ్‌సైట్‌, టోల్‌ఫ్రీ నంబరుపై విస్తృత ప్రచారం చేస్తున్నాం. కేంద్రం తీసుకొచ్చిన కొత్త నేర చట్టాలపై పోలీసు సిబ్బందికి అవగాహన కల్పించేలా శిక్షణా తరగతులు నిర్వహించాం’’ అని మంత్రి భట్టి వివరించారు.


బడ్జెట్‌లో వ్యవసాయానికే సింహభాగం


* తెలంగాణ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికే సింహభాగం రూ.72,659 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఇది రైతుల తలరాతలు మార్చే చరిత్రాత్మక నిర్ణయమన్నారు. దేశ చరిత్రలో వ్యవసాయ రంగానికి ఇది ఒక మైలురాయి అని తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు.


* ‘‘రైతు భరోసా సహా ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి తీరుతాం. బడ్జెట్‌ కేవలం అంకెల సమాహారం కాదు. విలువలు, ఆశల వ్యక్తీకరణ కూడా. జిల్లాల మధ్య ఆదాయ అంతరాలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటాం. అసమానతలు లేని సమసమాజ స్థాపన దిశగా అడుగులు వేస్తున్నాం. ఈ ఏడాదిలోనే రైతు కూలీలకు రూ.12వేలు అందించే బృహత్తర కార్యక్రమం చేపడతాం


* పీఎం ఫసల్‌ బీమా యోజనలో చేరాలని నిర్ణయించాం. రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. పైసా ఖర్చు లేకుండా పంటలకు పూర్తి భద్రత కల్పిస్తాం. వరి రైతులకు క్వింటాకు రూ.500 బోనస్‌ ఇవ్వాలని నిర్ణయించాం. ఆయిల్‌పామ్‌ రైతులకు అవసరమైన సాయం అందిస్తాం. 


* 2024-25 సంవత్సరానికి రాష్ట్రంలో లక్ష ఎకరాల్లో ఆ పంట సాగు లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే 77,857 ఎకరాలకు రిజిస్ట్రేషన్‌ జరగ్గా.. 23,131 ఎకరాలకు అనుమతులిచ్చాం’’ అని భట్టి విక్రమార్క చెప్పారు.


గ్యాస్‌ సిలిండర్లకు ₹723 కోట్లు.. ఉచిత విద్యుత్‌కు ₹2,418 కోట్లు



*  తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి తీసుకురావడంలో కీలక భూమిక పోషించిన ఆరు గ్యారంటీలకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో పెద్దపీట వేసింది. 


* అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, రూ.500కే గ్యాస్‌ సిలిండర్లు వంటి పథకాలను ప్రారంభించిన సర్కారు.. తాజా బడ్జెట్‌లో వాటికి నిధులు కేటాయించింది. ఆరు గ్యారంటీల్లో మరికొన్ని పథకాలనూ ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తన బడ్జెట్‌ ప్రసంగంలో ప్రస్తావించారు.


* పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర నుంచి ఊరట కల్పించేందుకు మహాలక్ష్మి పథకం కింద రూ.500కే వంటగ్యాస్ సిలిండర్‌ను తమ ప్రభుత్వం ప్రారంభించిందని భట్టి విక్రమార్క తెలిపారు. 


* ఈ పథకం వల్ల ఇప్పటి వరకు 39,57,637 కుటుంబాలకు లబ్ధి చేకూరిందని, ఇందుకు రూ.200 కోట్లను ప్రభుత్వం వెచ్చిందన్నారు. ఈ బడ్జెట్‌లో గ్యాస్‌ సిలిండర్ల కోసం రూ.723 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు.


* మహిళను మహాలక్ష్మిగా గౌరవించడం మన సంస్కృతి అని, మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ టీజీఆర్‌టీసీ నడిపే బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రయాణించే దూరంపైన, ప్రయాణించే పర్యాయాలపైన ఎటువంటి పరిమితీ విధించలేదని చెప్పారు. ఇప్పటి వరకు 68.60 కోట్ల ప్రయాణాలను మహిళలు చేశారని, పర్యవసానంగా మహిళలకు రూ.2,351 కోట్లు ఆదా అయ్యిందన్నారు. 


* ఉచిత బస్సు సౌకర్యం పరోక్షంగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతోందని పేర్కొన్నారు. ఈ పథకానికి అయ్యే ఖర్చు ఆర్టీసీకి ప్రభుత్వం నెలవారీగా చెల్లిస్తోందని, దీనివల్ల ఆర్టీసీ సంస్థ కూడా ఆర్థికంగా బలోపేతమై బిలియన్ డాలర్ కార్పొరేషన్‌గా అవతరించడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.



*  రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి 1 నుంచి గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తున్నామని భట్టి విక్రమార్క తన బడ్జెట్‌ ప్రసంగంలో ప్రస్తావించారు. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్‌ని వినియోగించుకొనే గృహాలకు ఉచిత విద్యుత్ అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యమన్నారు. 


* ప్రజాపాలన-ప్రజా సేవ కేంద్రాల ద్వారా వచ్చిన ధరఖాస్తులను స్వీకరించి అర్హులైన వారందరికి ఈ ఉచిత విద్యుత్‌ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు డిస్కంలు సున్నా బిల్లులు జారీ చేస్తున్నాయని, ప్రభుత్వం ఆ బిల్లుల మొత్తం ఛార్జీలను డిస్కంలకు చెల్లిస్తుందని చెప్పారు. 


* జులై 15 నాటికి 45,81,676 ఇళ్లల్లో వెలుగుల జిలుగులు నింపగా.. జూన్ వరకు అందించిన విద్యుత్తుకుగానూ డిస్కంలకు ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.583.05 కోట్లు చెల్లించిందన్నారు. ఈ బడ్జెట్‌లో ఉచిత విద్యుత్‌కు రూ.2,418 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు.


* నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడమే తమ ప్రధాన కర్తవ్యమని భట్టి విక్రమార్క అన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా తమ ప్రభుత్వం ‘ఇందిరమ్మ ఇళ్లు’ నూతన గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించిందని, ఈ పథకం కింద పేదలు ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించామన్నారు. 


* ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు రూ.6 లక్షలు చెల్లిస్తామన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గంలో కనీసం 3,500 ఇళ్ల చొప్పున మొత్తం 4,50,000 ఇళ్ల నిర్మాణానికి సహకారం అందించాలని నిర్ణయించామని తెలిపారు.


*  రెండు పడక గదుల ఇళ్ల పథకం కింద పూర్తయిన ఇళ్లను త్వరలోనే కేటాయిస్తామన్నారు. పూర్తికాని వాటిని సత్వరమే పూర్తి చేసి మౌలిక వసతులను కల్పించి అర్హులకు అందజేస్తామన్నారు.


* గత ప్రభుత్వ హయాంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో చెల్లింపులు జరిగేవి కాదని, తమ ప్రభుత్వం 48 గంటల్లోనే చెల్లింపులు చేస్తోందని భట్టి విక్రమార్క అన్నారు. ఇప్పటి వరకు రూ.10,556 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేశామన్నారు.


* అర్హులైన రైతులకు మాత్రమే లబ్ధి చేకూరేలా రైతుబంధు పథకం స్థానే రైతు భరోసాను తమ ప్రభుత్వం తీసుకొచ్చిందని భట్టి విక్రమార్క అన్నారు. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏటా ఎకరానికి రూ.15,000 చెల్లించాలన్నది ప్రభుత్వ సంకల్పమన్నారు. దీని అమలుకు విధివిధానాలు చర్చించి నిర్ణయించడానికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. 


* ఈ కమిటీ ఇప్పటికే పలువురి అభిప్రాయాలను సేకరించిందని, వాటిని సభలో సభ్యులందరి అభిప్రాయాన్ని తీసుకొని అమలు చేయాల్సిన విధి విధానాలపై తగిన నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.


* తెలంగాణలో వరి సాగు చాలా విస్తృతంగా జరుగుతుందని, పండిన పంటకు సరైన ధర రాక పెట్టుబడి కూడా దక్కక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో సన్న రకం వరి ధాన్యాల సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం 33 రకాల వరి ధాన్యాలను గుర్తించి, వాటిని పండించిన రైతుకు క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించాలని నిర్ణయించిందన్నారు. దీనివల్ల సన్నరకాల వరిని పండించే సాగు భూమి విస్తీర్ణం పెరిగి, రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.


విశ్వనగరంగా హైదరాబాద్‌.. అభివృద్ధికి రూ.10 వేల కోట్లు


* హైదరాబాద్‌ నగర అభివృద్ధికి భారీగా రూ.10వేల కోట్లు కేటాయించారు. శంషాబాద్‌ విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణకు రూ.100 కోట్లు, మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు రూ.1500 కోట్లు, ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాజెక్టు రూ.1,525 కోట్లు, పాతబస్తీ మెట్రో విస్తరణకు రూ.500 కోట్లు, ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు రూ.200 కోట్లు, హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు రూ.500 కోట్లు, మెట్రో వాటర్‌ వర్క్స్‌ రూ.3,385 కోట్లు, హైడ్రా సంస్థకు రూ.200 కోట్లు కేటాయించారు.


* శరవేగంగా అభివృద్ధి చెందుతున్న చారిత్రాత్మక నగరం హైదరాబాద్‌ను మరింత ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నాం.


* హైదరాబాద్‌లో ఉద్యోగ, ఉపాధి పొందుతున్నవారికి కార్యాలయాలకు దగ్గరగా, శాటిలైట్ టౌన్‌షిప్‌ల నిర్మాణాన్ని నగరం చుట్టూ ప్రోత్సహిస్తాం. ఈ టౌన్‌షిప్ లలో సరసమైన ధరల్లో పేద, మధ్యతరగతి వారికి అనుకూలమైన నివాసగృహాల నిర్మాణాలను అందించేలా కృషి చేస్తాం.


* ప్రస్తుతం మూడు ట్రాఫిక్ కారిడార్లలో మెట్రో సౌకర్యం ఉంది. వివిధ వర్గాల అవసరాలను తీర్చడంతో పాటు నగరంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో, ప్రభుత్వం 78.4 కి.మీ. పొడవున్న 5 అదనపు కారిడార్లను రూ.24,042 కోట్లతో అభివృద్ధి పరుస్తుంది. ఇందులోభాగంగా మెట్రో రైలును పాతనగరానికి పొడిగించి దానిని శంషాబాద్ విమానాశ్రయానికి అనుసంధానం చేస్తాం.


* ప్రస్తుతమున్న కారిడార్లను నాగోలు నుంచి ఎల్.బి.నగర్ వరకు విస్తరిస్తాం. నాగోలు, ఎల్.బి నగర్, చంద్రాయణగుట్ట స్టేషన్లను ఇంటర్ ఛేంజ్ స్టేషన్లగా అభివృద్ధి చేస్తాం. మియాపూర్ నుంచి పటాన్ చెరువుకు, ఎల్.బి.నగర్ నుంచి హయత్‌ నగర్ వరకు మెట్రో రైలు సౌకర్యాన్ని పొడిగించాలని కూడా ప్రణాళిక సిద్ధం చేశాం.


* హైదరాబాద్, ఔటర్ రింగ్ రోడ్డు వరకు గల ప్రాంతాలను కోర్ అర్బన్ రీజియన్‌గా గుర్తించి వాటి అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందిస్తాం. ఔటర్ రింగు రోడ్డును నగర సరిహద్దుగా పరిగణిస్తాం.


* ఓఆర్‌ఆర్‌ పరిధిలో విపత్తుల నిర్వహణకు ఒక ఏకీకృత సంస్థ ఏర్పాటు. జీహెచ్‌ఎంసీ సహా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాలు దీని పరిధిలోకి వస్తాయి.


* పట్టణ విపత్తులను నివారించడానికి, వాటిని ఎదుర్కొనడానికి తీసుకోవాల్సిన చర్యలను చేపట్టడంతో పాటు, ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొని తక్షణ రక్షణ చర్యలు తీసుకొనే విషయంలో జాతీయ, రాష్ట్రేతర సంస్థలతో సమన్వయం. 


* ఈ వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యత హైదరాబాద్ విపత్తు నివారణ, ఆస్తుల పరిరక్షణ సంస్థ  చేస్తుంది. ఈ సంస్థలో ఆస్తుల పరిరక్షణకు, విపత్తుల నిర్వహణకు ప్రత్యేక విభాగాలు. 


* మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో భాగంగా సుమారు 110 చదరపు కి.మీ. పట్టణ ప్రాంతం పునరుజ్జీవనం. నదీ తీర ప్రాంతంలో కొత్త వాణిజ్య, నివాస కేంద్రాలు, పాత హెరిటేజ్ ప్రాంతాలకు కొత్త సొబగులు.


* మూసీ నదీ పరివాహక ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టులో రిక్రియేషన్ జోన్‌లు, పాదచారుల జోన్‌లు, పీపుల్స్ ప్లాజాలు, చిల్డ్రన్స్ థీమ్ పార్కులు, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్‌ల అభివృద్ధి. లండన్ నగరంలో ఉన్న థేమ్స్ నదీ పరివాహక అభివృద్ధి తరహాలో మూవీ అభివృద్ధి. హైదరాబాద్ నగరాభివృద్ధి, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు రూ.1,500 కోట్లు ప్రతిపాదన.


* హైదరాబాద్ నగర ప్రాధాన్యం దృష్ట్యా నగరాభివృద్ధికి మరింత పెద్దపీట. GHMC, HMDA, సేవలను ప్రజలకు మరింత మెరుగ్గా అందించేందుకు GHMC పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ.3,065 కోట్లు. 


* HMDA పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ.500 కోట్లు. మెట్రో వాటర్ వర్క్స్‌కి రూ.3,385 కోట్లు ప్రతిపాదన. హైడ్రాకి రూ.200 కోట్లు


* ఎయిర్‌పోర్టు వరకు మెట్రో విస్తరణకు రూ.100 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డు కోసం రూ.200 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకి రూ.500 కోట్లు, పాత నగరానికి మెట్రో విస్తరణకి రూ.500 కోట్లు, మల్టీ మోడల్ సబర్బన్ రైలు ట్రాన్స్‌పోర్టు సిస్టమ్ కోసం రూ.50 కోట్లు


* రీజనల్ రింగ్ రోడ్ (RRR)తో అభివృద్ధి మరింత వేగవంతం. ఉత్తర ప్రాంతంలోని 158.6 కి.మీ. పొడవున్న సంగారెడ్డి- తూప్రాన్ - గజ్వేల్ - చౌటుప్పల్ రోడ్డును, దక్షిణ ప్రాంతంలోని 189  కి.మీ.ల పొడవున్న చౌటుప్పల్ -షాద్ నగర్-సంగారెడ్డి రోడ్డును, జాతీయరహదారులుగా ప్రకటించడానికి వీలుగా అప్ గ్రేడ్ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదన. 


* రీజనల్ రింగు రోడ్డు హైదరాబాద్‌ నగర ఉత్తర-దక్షిణ ప్రాంతాలనూ, తూర్పు-పశ్చిమ ప్రాంతాలనూ కలుపుతూ జాతీయరహదారి నెట్‌వర్క్‌తో అనుసంధానం.


* ఎక్స్‌ప్రెస్‌వే ప్రమాణాలను దృష్టిలోఉంచుకొని దీని నిర్మాణానికి తగినంత భూమిని సేకరించే ప్రయత్నం. ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా తొలుత నాలుగు లేన్లతో నిర్మించి దానిని ఎనిమిది లేన్ల సామర్థ్యానికి విస్తరణ.


* ప్రాథమిక అంచనాల ప్రకారం ఆర్.ఆర్.ఆర్ ఉత్తర ప్రాంత అభివృద్ధికి రూ.13,522 కోట్లు. దక్షిణ ప్రాంతాభివృద్ధికి రూ.12,980 కోట్లు ఖర్చు. దీనికోసం బడ్జెట్‌లో ప్రస్తుతం రూ.1525 కోట్ల ప్రతిపాదన.




  For More Details  


 మరింత సమాచారం  

Posted Date: 25-07-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని