• facebook
  • whatsapp
  • telegram

కార్చిచ్చులతో పచ్చదనం బుగ్గిపాలుఅకస్మాత్తుగా పుట్టుకొస్తున్న కార్చిచ్చులు పచ్చని వనాలను బుగ్గి చేస్తున్నాయి. కొన్నిచోట్ల అవి వేగంగా విస్తరిస్తూ అటవీ సిబ్బందికి సవాలు విసురుతున్నాయి. దావానలాల నివారణకు ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవాలి.


ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో గత నవంబర్‌ నుంచి ఇప్పటిదాకా తొమ్మిది వందలకు పైగా కార్చిచ్చులు సంభవించాయి. ఇటీవలి దావానలంలో అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. 2500 ఎకరాలకు పైగా అడవి అగ్నికి ఆహుతయ్యింది. ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఉపగ్రహాల సాయంతో కార్చిచ్చులను గుర్తించి వెంటనే రాష్ట్రాలకు సమాచారం అందిస్తుంది. దాని ఆధారంగా స్థానిక అటవీ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగుతుంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 28 నుంచి మే అయిదు నాటికి దేశవ్యాప్తంగా అత్యధిక కార్చిచ్చులు ఉత్తరాఖండ్‌లోనే (325) సంభవించాయి. ఆ తరవాతి స్థానాల్లో ఒడిశా (196), ఛత్తీస్‌గఢ్‌ (148), మధ్యప్రదేశ్‌ (105) నిలిచాయి. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో 44.5శాతం భూభాగంలో అడవులు వ్యాపించి ఉన్నాయి. అక్కడ దావానలాల సమస్య తీవ్రంగా ఉంది.  


సంక్లిష్ట విధి

అటవీ స్థితి నివేదిక-2021 ప్రకారం దేశంలో 54.4శాతం వనాల ప్రాంతం తరచూ కార్చిచ్చులకు గురవుతోంది. దాదాపు 95శాతం దావానలాలకు మానవ చర్యలే కారణం. ఎండుగడ్డిని తగలబెడితే, ఆ తరవాత మళ్ళీ చిగుళ్లు వచ్చి పశువులకు పచ్చిమేత లభిస్తుందని భావించి కొందరు నిప్పు పెడుతున్నారు. వ్యవసాయం కోసం మరికొందరు అడవులను మంటలపాలు చేస్తున్నారు. కొన్నిచోట్ల కాల్చిన బీడీ, సిగరెట్లను నిర్లక్ష్యంగా అడవిలో పడేస్తున్నారు. వీటివల్ల మంటలు ఎగసి చుట్టుపక్కల అటవీ భూభాగానికి వేగంగా పాకుతున్నాయి. సోషల్‌ మీడియాలో ఎక్కువ వీక్షణల కోసం ఉత్తరాఖండ్‌లోని చమేలి జిల్లాలో అడవికి నిప్పుపెట్టిన ముగ్గురు ఇటీవల అరెస్టయ్యారు. అటవీ చట్టం ప్రకారం వనాల్లో నిప్పుపెట్టడం శిక్షార్హం. నేరం రుజువైతే ఏడాది వరకు జైలుశిక్ష, జరిమానా విధిస్తారు.


నిరుడు ఇండియాలో తగినంత వర్షపాతం లేదు. శీతాకాలంలో మంచు తక్కువగా కురిసింది. దానివల్ల నేలలో తేమ శాతం తగ్గి కార్చిచ్చులు మరింత పెరిగాయి. రాలిపోయిన పైన్‌ చెట్ల ఆకులు, శంఖం ఆకృతిలో ఉండే దాని కాయలు చాలా నెమ్మదిగా కుళ్ళి నేలలో కలుస్తాయి. ఇవి భూమిపై పెద్దమొత్తంలో పోగుపడి కార్చిచ్చులను తీవ్రతరం చేస్తున్నాయి. పైగా, పైన్‌ చెట్లభాగాల్లో సులభంగా మండే స్వభావం కలిగిన రెజిన్‌ అనే కర్బన పదార్థం ఉంటుంది. దానివల్ల పైన్‌ చెట్లకు త్వరగా మంటలు అంటుకొంటున్నాయి. పైన్‌ చెట్ల ఆకులను స్థానికులు సేకరించి వాటి నుంచి ఒక రకం పిడకలు, కాగితపు సంచులు, ఎరువును తయారు చేస్తారు. ఇలా ఆకులు సేకరించడం వల్ల కార్చిచ్చులను తగ్గించవచ్చు. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో వాటి సేకరణను ప్రోత్సహించడానికి ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించారు. కార్చిచ్చులను ఆర్పడం అటవీ ఉద్యోగుల విధి. అయితే, సరైన దారిలేని సుదూర పర్వతమయ అటవీ ప్రాంతాల్లోకి వెళ్ళి దావానలాలను ఆర్పడం అంత తేలిక కాదు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం, బలమైన గాలుల వల్ల కార్చిచ్చులు భీకరరూపం దాలుస్తాయి. ఈ మంటల తీవ్రత వల్ల అటవీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని డిండోరీలో రాత్రంతా మంటలను ఆర్పిన అటవీ అధికారి రాజేంద్ర కుస్రె ఆరోగ్యం దెబ్బతిని మృత్యువాత పడ్డారు. కర్ణాటకలో 2013-23 మధ్య కార్చిచ్చులను నిలువరించే క్రమంలో 19 మంది అటవీ సిబ్బంది మరణించారు.  


సరైన చర్యలు

అటవీ ప్రాంతంలో సాధారణంగా సంభవించే కార్చిచ్చులు తెగుళ్లను అదుపు చేస్తాయి. అయితే, మంటల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు జరిగే నష్టం పూరించలేనిది. దావానలాల వల్ల జీవవైవిధ్యం దెబ్బతింటుంది. లేత దశలోని మొక్కలు చనిపోతాయి. నేలపై పడిన విత్తనాలు కాలిపోతాయి. వేగంగా వెళ్ళలేని సరీసృపాలు, ఉభయచర జీవులు మంటలకు ఆహుతి అవుతాయి. కార్చిచ్చుల వల్ల ఆహార కొరత ఏర్పడి, ఆవాసాలు దెబ్బతిని వన్యప్రాణులు అడవి బయటకు వచ్చే ప్రమాదం ఉంది. ఒక ప్రాంతంలో ఏటా కార్చిచ్చులు ఏర్పడితే అక్కడ అడవి పెరుగుదల మందగిస్తుంది. అందుకే, దావానలాలను వెంటనే ఆర్పివేయడానికి ప్రభుత్వాలు తగిన చర్యలను తీసుకోవాలి. అవసరమైతే హెలికాప్టర్లు, ప్రత్యేక విమానాలతో నీటిని గుమ్మరించాలి. ఖర్చుకు వెనకాడకూడదు. కార్చిచ్చులు ఇతర ప్రాంతాలకు పాకకుండా కట్టడి చేసేందుకు అడవిలో అక్కడక్కడా గడ్డిపొదలు, చెట్ల ఆకులు తదితరాలను కొన్ని మీటర్ల మేర తొలగిస్తారు. వీటిని ‘ఫైర్‌లైన్లు’గా పేర్కొంటారు. అడవుల్లో వీటిని విస్తృతంగా ఏర్పాటు చేయాలి. కార్చిచ్చులను అదుపు చేయడం కన్నా, నివారించే చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా, అటవీ రక్షణకు ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యం ఇచ్చి- సరిపడా నిధులు, సిబ్బందిని కేటాయించాలి. అడవుల సంరక్షణ పట్ల ప్రజావగాహనను పెంపొందించడం మరో కీలకాంశం.


- ఎం.రామ్‌మోహన్‌

(సహాయ సంచాలకులు, తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీ)
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పౌరస్వేచ్ఛకు సంకెళ్లు

‣ దేశ ఆర్థికానికి వెన్నుదన్ను

‣ మన ఎన్నికలపై డ్రాగన్‌ కుతంత్రాలు

‣ ఆయువు తోడేస్తున్న వాయువు

‣ బంగ్లాలో ప్రబలుతున్న భారత్‌ వ్యతిరేకత

Posted Date: 18-05-2024గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం