• facebook
  • whatsapp
  • telegram

దట్టంగా అవినీతి కాలుష్యం

గాలి, నేల, నీరు... వీటి నాణ్యతా పరిరక్షణకు, తద్వారా ప్రజారోగ్యాన్ని పర్యావరణాన్ని సంరక్షించడానికే రాష్ట్రాల స్థాయిలో చట్టబద్ధంగా కాలుష్య నియంత్రణ మండళ్లు (పీసీబీలు) అవతరించాయి. వాటికి పైయెత్తున పర్యవేక్షణ బాధ్యతల్ని భుజాలకెత్తుకున్నామంటూ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) సైతం కొలువు తీరింది. దశాబ్దాలక్రితమే దేశంలో అలా కాలుష్య నియంత్రణ వ్యవస్థ ఏర్పాటైనా ఒరిగిందేముందని కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక లోగడే ఈసడించింది. పీసీబీ ఒక పనికిమాలిన విభాగమని తెలంగాణ హైకోర్టు గతంలో పడతిట్టిపోసింది. అయినా నేటికీ వాటి పనితీరు మెరుగుపడకపోవడం విస్మయపరుస్తోంది. రసాయన, బల్క్‌డ్రగ్‌ పరిశ్రమలు వెదజల్లుతున్న విషవాయువులతో అల్లాడిపోతున్నామని భాగ్యనగర శివారు ప్రాంతాల ప్రజానీకం నుంచి వందల సంఖ్యలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తీరిగ్గా మేలుకున్న పీసీబీ అధికారులు కాలుష్యకారక పరిశ్రమలపై దృష్టిసారించి ప్రాథమిక పరిశీలన చేపట్టారన్న కథనాలు నివ్వెరపరుస్తున్నాయి. చీకటి మాటున ఘాటువాయువుల్ని ఇష్టారాజ్యంగా వదిలేస్తున్నారంటూ ప్రజానీకం గగ్గోలు పెట్టేదాకా పీసీబీ ఏం చేస్తున్నట్లు? నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా పలు పరిశ్రమలు నిబంధనల్ని తుంగలో తొక్కడం- తరతమ భేదాలతో దేశవ్యాప్తంగా కళ్లకు కడుతున్న అవ్యవస్థ. నిఘా పెట్టి నియంత్రణ బాధ్యతలు నిష్ఠగా నిర్వర్తించాల్సిన పీసీబీలు అవినీతి మత్తులో జోగుతున్నాయి. పర్యవసానంగా- జలవనరులు విష కశ్మలమయమవుతున్నాయి. పంటల దిగుబడి కుంగడంతోపాటు ఆయా సేద్య ఉత్పత్తుల వల్ల ఆరోగ్య సమస్యలూ ముమ్మరిస్తున్నాయి. పీల్చేగాలీ గరళమై జనజీవనం కృశిస్తోంది. ప్రజల్ని ఏదో రకంగా మభ్యపెట్టడానికి, మొక్కుబడి పనితీరుకు మారుపేరుగా దిగజారిన కాలుష్య నియంత్రణ వ్యవస్థే- ఈ దారుణ నేరంలో తొలిముద్దాయి. వ్యర్థాల శుద్ధి కేంద్రాల్ని నెలకొల్పని పరిశ్రమలకు కరెంటు కోత విధించాల్సిందేనన్న సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వుల్నీ లెక్కచేయని స్థాయిలో పేరుకున్న అవ్యవస్థ- ప్రజలకు ఊపిరాడనివ్వడంలేదు!

ప్రపంచ ఆరోగ్య సంస్థ నూతన మార్గదర్శకాల ప్రకారం, యావత్‌ భారతదేశం కాలుష్యం ముప్పును ఎదుర్కొంటోంది. గాలిలో పెచ్చరిల్లుతున్న అతిసూక్ష్మ ధూళికణాలు దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌లలో సగటున తొమ్మిదేళ్లకు పైగా మానవ ఆయుర్దాయాన్ని హరించి వేస్తున్నాయి. ఊపిరితిత్తుల్ని నిర్వీర్యం చేసే ఆ ధూళికణాలు నిరుడు భాగ్యనగరంలోనే 11వేలమందిని బలిగొన్నట్లు అధ్యయనాలు వెల్లడించాయి. నలుమూలలా పరచుకుంటున్న వాయుకాలుష్యం వల్ల దేశంలో గర్భస్రావాలు, అర్ధాంతర మరణాలు జోరెత్తుతున్నాయి. చాలామందికి మెదడు పనితీరు దెబ్బతిని, మూత్రపిండాల సామర్థ్యమూ కొల్లబోతోంది. శ్వాసకోశ వ్యాధుల కేసులు ఇంతలంతలవుతున్నాయి. నీటి వనరులు కలుషితమై దేశంలో ఏటా రెండు లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు ‘నీతి ఆయోగ్‌’ లెక్కకట్టింది.  ప్రతిరోజూ టన్నులకొద్దీ పారిశ్రామిక వ్యర్థాలు, లక్షలాది లీటర్ల మురుగునీరు నదుల్ని జలప్రవాహాల్ని విషకలుషితం చేస్తుంటే- నియంత్రణ వ్యవస్థ ఏం వెలగబెడుతున్నట్లు? క్షేత్రస్థాయి స్థితిగతుల్ని కూలంకషంగా మదింపు వేసి వార్షిక నివేదికలు సమర్పించాల్సిన పీసీబీలు తూతూమంత్రంగా తెమిల్చేస్తున్నాయి. ఉత్పత్తి స్థానంలోనే కాలుష్యాన్ని నివారించడం, జనచైతన్యం పెంపొందించడం స్వీయ విధుల్లో భాగమని చాటుకునే సీపీసీబీ సైతం కీలక పాత్రపోషణలో ఘోరంగా విఫలమవుతోంది! కలుషిత పరిశ్రమల కట్టడిలో చైనా మెరుగ్గా రాణిస్తోంది. వాయునాణ్యత, నీటిశుభ్రత, పారిశుద్ధ్యం, హరితావరణం తదితరాల ప్రాతిపదికన ఆస్ట్రియా, కెనడా, డెన్మార్క్‌ ప్రభృత దేశాల సరసన ఇండియా వెలాతెలాపోతోంది. ఈ దుస్థితిని తుడిచిపెట్టే కృషిలో పౌరుల క్రియాశీల తోడ్పాటునూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడగట్టాలి. నిజాయతీపరులకు సమర్థులకు పీసీబీలు, సీపీసీబీలో ప్రాధాన్యం కల్పించి వాయునాణ్యతకు నీటి పరిశుభ్రతకు, భూసంరక్షణకు, వ్యర్థాల నిర్వహణకు వారిని నేరుగా జవాబుదారీ చేయాలి. రాజ్యాంగదత్తమైన జీవనహక్కును కాపాడేందుకు, అదే సరైన దారి!

- ఈనాడు ఎడిటోరియ‌ల్‌
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సరఫరా స్తంభిస్తే ఇక్కట్లే

‣ టర్కీపైనా ఆంక్షల కొరడా

Posted Date: 12-11-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం