• facebook
  • whatsapp
  • telegram

ఉదజని... కొత్త ప్రత్యామ్నాయ ఇంధనం?

పర్యావరణానికి శ్రేయోదాయకం

దేశంలో పెట్రోలు, డీజిల్‌ ధరలు ఎంత పెరిగినా మన దగ్గర వాటితో నడిచే వాహనాల వినియోగమే ఎక్కువ. ప్రత్యామ్నాయ ఇంధన వనరులుగా వచ్చిన సీఎన్‌జీ వంటి వాటికి ఇప్పటికీ ఆదరణ తక్కువే. బ్యాటరీ, ఎలెక్ట్రికల్‌ వాహనాల వంటి ప్రత్యామ్నాయాలు ఇప్పుడిప్పుడే కాస్త జనం దృష్టిలో పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా ఉదజని(హైడ్రోజన్‌)ని తెరపైకి తెచ్చింది. ఏకంగా జాతీయ హైడ్రోజన్‌ మిషన్‌ను 2021 బడ్జెట్‌లో ప్రకటించి ఆశ్చర్యపరచింది. కేవలం కర్బన రహిత ఇంధనాన్ని తయారుచేయడమే కాక ఉదజని ఆధారిత ఆర్థిక వ్యవస్థను రూపుదిద్దాలన్న బృహత్తర లక్ష్యంతో ప్రభుత్వం ఈ మిషన్‌ ఏర్పాటుకు పూనుకొందని ఇంధనవనరుల శాఖలోని ఉన్నతాధికారులు చెబుతున్నారు. మరో రెండు నెలల్లో కేంద్ర ప్రభుత్వం దీనిపై ఓ ముసాయిదా ప్రణాళిక తయారుచేసి ప్రజల ముందు ఉంచబోతోందని నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ (ఎంఎన్‌ఆర్‌ఈ) కార్యదర్శి ఇందుశేఖర్‌ చతుర్వేది వెల్లడించారు.  

ఏమిటీ హైడ్రోజన్‌ మిషన్‌ లక్ష్యాలు?

హైడ్రోజన్‌ను ఇంధన వనరుగా ఉపయోగించడం, హరిత ఉదజని తయారీ, ఉదజని ఆధారిత ఆర్థిక వ్యవస్థ రూపకల్పన అనే మూడు కీలకాంశాలే ఎజెండాగా జాతీయ హైడ్రోజన్‌ మిషన్‌కు కేంద్రం రూపకల్పన చేసింది. దాదాపు 150 సంవత్సరాల నుంచి దీనిమీద ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. 1970ల్లో చమురు ధరలు శరవేగంగా పెరగడం ప్రారంభించడంతో శిలాజ ఇంధనంగా ఉన్న హైడ్రోజన్‌ను ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చన్న ఆలోచన బలంగా రూపుదిద్దుకుంది. హోండా, టయోటా,  హ్యుందాయ్‌ లాంటి విదేశీ వాహన తయారీ సంస్థలు ఉదజని (హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ సెల్స్‌)తో నడిచే వాహనాల తయారీపై దృష్టి సారించాయి. హైడ్రోజన్‌, ప్రకృతిలో విస్తృతంగా లభించే మూలకమే. హైడ్రోజన్‌ను- దాన్ని సేకరించే వనరును బట్టి మూడు రకాలుగా విభజించారు. శిలాజ ఇంధనాల  (సహజ వాయువుల) నుంచి తీసే గ్రే హైడ్రోజన్‌ ఇప్పుడు అత్యధికంగా ఉత్పత్తి అవుతోంది. శిలాజ ఇంధనాల నుంచి తీసినా కర్బనంతో కలిసి ఉండటం వల్ల నిల్వ ఉంచడానికి అవకాశం ఉండేది బ్లూ హైడ్రోజన్‌. పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి తీసే హరిత (గ్రీన్‌) ఉదజని వీటన్నింటిలో ఉత్తమమైనది. దీన్ని ఇనుము, ఉక్కు, రసాయన పరిశ్రమల్లోనూ రవాణా రంగంలోనూ డీకార్బనైజ్‌ ఏజెంట్‌గా వినియోగిస్తున్నారు.

దేశంలో విద్యుత్‌ తయారీ ప్రధానంగా బొగ్గుపైనే ఆధారపడి ఉంది. ఎలెక్ట్రిక్‌ వాహనాలను ఛార్జ్‌ చేసుకోవాలన్నా వాటిని బొగ్గు ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌తోనే ఛార్జి చేయాలి. అంటే తిరిగి మళ్ళీ అది పర్యావరణానికే నష్టం. ఈ పరిస్థితుల్లో పునరుత్పాదక ఇంధనంతో ఛార్జి చేసుకోగలిగే ఎలెక్ట్రిక్‌ వాహనాలపై పలు దేశాలు దృష్టి పెట్టాయి. నార్వేలో 99శాతం ఎలెక్ట్రిక్‌ వాహనాలను జలవిద్యుత్‌ ప్రాజెక్టుల నుంచి వచ్చే విద్యుత్తుతోనే ఛార్జి చేస్తారు. మన దగ్గర ఆ స్థానాన్ని ఉదజని ఆక్రమించే అవకాశాలున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. గత ఏడాది అక్టోబరులో దేశంలోనే తొలిసారిగా దిల్లీలో హైడ్రోజన్‌ స్పైక్డ్‌ కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (హెచ్‌- సీఎన్‌జీ)తో బస్సులు నడిపారు. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ పేటెంట్‌ పొందిన ఓ కొత్త సాంకేతికతతో ఈ హెచ్‌-సీఎన్‌జీని తయారుచేశారు. మరోవైపు విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ ఎన్టీపీసీ లేహ్‌-దిల్లీ మధ్య హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ సెల్‌ ఆధారంగా పది ఎలెక్ట్రిక్‌ బస్సులను ప్రయోగాత్మకంగా నడుపుతోంది. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లోనూ హరిత ఉదజని ఉత్పత్తి కేంద్రం నెలకొల్పాలని యోచిస్తోంది. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ బస్సులు నడపడానికి అవసరమైన ఉదజని తయారీ కోసం ప్రత్యేకంగా ఫరీదాబాద్‌లో ఓ యూనిట్‌ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు తయారుచేస్తోంది.

కొరవడిన మౌలిక వసతులు

భారీ వాహనాలు, నౌకలను- బ్యాటరీ, ఎలెక్ట్రిక్‌ వంటి ఇంధనంతో నడిపేందుకు భారీగా విద్యుత్‌ ఖర్చవుతుంది. ఉదజనితో నింపిన భారీ బ్యాటరీలు వినియోగించడం వల్ల సుదూర ప్రాంతాలకు ప్రయాణించే భారీ ట్రక్కులు, నౌకలు, విమాన ప్రయాణాలకు సైతం ఇవి ఉపయోగపడతాయని నిపుణుల అంచనా. ఇది సాధ్యమైతే ప్రత్యామ్నాయంగానే కాదు- శక్తిమంతమైన ఇంధన వనరుగా ఉదజని ఆవిర్భవిస్తుంది. హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ సెల్స్‌తో నడిచే కారు నుంచి విడుదలయ్యే కర్బన ఉద్గారాలు దాదాపు సున్నా కావడంతో పర్యావరణపరంగానూ ఎంతో మేలు జరుగుతుంది. హైడ్రోజన్‌తో నడిచే వాహనాల తయారీని ప్రోత్సహించడం, వాటి కొనుగోలుకు రాయితీలివ్వడం, ఫిల్లింగ్‌ స్టేషన్లు భారీ సంఖ్యలో ఏర్పాటు చేయడం వంటివి విస్తృత స్థాయిలో చేపడితేనే ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా దీన్ని నిలబెట్టగలిగే అవకాశం ఉంటుంది. ఎంఎన్‌ఆర్‌ఈకి హైడ్రోజన్‌పై పరిశోధన, అభివృద్ధికి ఈ ఏడాది రూ.25 కోట్లు కేటాయించారు. ఇలా నామమాత్రం కేటాయింపులు కాకుండా దండిగా నిధులిస్తే, ఉదజని ఇంధన వినియోగంపై ప్రభుత్వ లక్ష్యసాధనలో అడుగులు కాస్త వేగంగా ముందుకు పడతాయి.  

- శ్యాంప్రసాద్‌ ముఖర్జీ కొండవీటి
 

Posted Date: 19-03-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం