• facebook
  • whatsapp
  • telegram

స్వచ్ఛ భారత్‌ కోసం ప్రజాఉద్యమం

శౌచాలయం దినం సందర్భంగా...
 

పరిశుభ్రత మానవుడి ఆత్మ గౌరవంతో ముడివడిన అంశం. పరిశుభ్రత ప్రతివ్యక్తీ స్వతహాగా ఆచరించాల్సిన అలవాటు. అంటువ్యాధుల బారిన పడకుండా ఉండాలన్నా, కరోనాలాంటి ఆకస్మిక మహమ్మారులను దూరంగా ఉంచాలన్నా- స్వచ్ఛతే పరమావధి. మనదేశంలో నిరక్షరాస్యత, పేదరికం, సంప్రదాయాలు వంటి కారణాలతో బహిరంగ మలమూత్ర విసర్జనను అలవాటుగా కొనసాగిస్తున్నారు. సాంఘిక దురాచారం వంటి బహిరంగ మలమూత్ర విసర్జన ప్రజలకు ముఖ్యంగా మహిళలకు శాపంగా మారింది. ఇది పలురకాల సమస్యలను సృష్టిస్తోంది. ఈ క్రమంలో సులభం- సురక్షితం- ఆత్మగౌరవం అనే నినాదంతో దేశంలోని ప్రతి ఇంటికీ మరుగుదొడ్డిని నిర్మించుకొని, వాడుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. మరుగుదొడ్డి వాడకంతో గ్రామీణ, పట్టణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం, ఆత్మగౌరవాన్ని కాపాడటం తద్వారా సంపూర్ణ ఆరోగ్య భారతావని నిర్మాణమే ధ్యేయంగా ప్రజలను సమాయత్తం చేస్తున్నాయి. మరుగుదొడ్లు లేకపోవడం వల్ల సంభవించే ముప్పు తొలగించడానికి ప్రజల్లో అవగాహన పెంచి, నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఏటా నవంబర్‌ 19న ప్రపంచ శౌచాలయ దినం నిర్వహిస్తున్నారు. 
 

అపారిశుద్ధ్యమే పెద్ద సమస్య
మరుగుదొడ్లు లేకపోవడం, బహిరంగ మల మూత్రవిసర్జన చేయడం తద్వారా వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత లోపించి నీరు, ఆహారం కలుషితమై అతిసారం, కలరావంటి వ్యాధుల వ్యాపిస్తున్నాయి. జనజీవనానికి భంగం కలిగిస్తున్నాయి. ‘యునిసెఫ్‌’ విడుదల చేసిన పర్యావరణ ప్రభావ అధ్యయనం ప్రకారం- బహిరంగ మలమూత్ర విసర్జన చేస్తున్న గ్రామాల్లో 11.25 శాతం భూగర్భ జలాలు కలుషితమయ్యే అవకాశం ఎక్కువని, నేల 1.13 రెట్లు, ఆహారం 1.48 రెట్లు, తాగునీరు 2.68 రెట్లు ఎక్కువగా కలుషితమయ్యే ముప్పుందని తేలింది. బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ అధ్యయనం ప్రకారం- బహిరంగ మలమూత్ర విసర్జన చేసే గ్రామాల్లోని పిల్లల్లో డయేరియా కేసులు మిగిలిన పల్లెలతో పోలిస్తే 44శాతం ఎక్కువగా నమోదైనట్లు వెల్లడైంది. బహింగ మలమూత్ర విసర్జన లేని గ్రామాల్లో ప్రతి కుటుంబం వైద్య ఖర్చులు, సమయం ఆదా చేయడం ద్వారా రూ.50 వేలదాకా పొదుపు అవుతోందని, విలువైన ప్రాణాలూ నిలుస్తున్నట్లు తెలిపింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) స్త్రీ, పురుష సమానత్వ అధ్యయనం ప్రకారం- ఇంటి పనులు, చిన్న పిల్లల సంరక్షణకు మహిళలు వెచ్చించే సమయం పదిశాతం తగ్గి, శ్రామిక శక్తిలో పాల్గొనడం 1.5శాతం పెరిగినట్లు గుర్తించింది. 
 

దేశానికి పట్టుగొమ్మల్లాంటి పల్లె లోగిళ్లలో జీవన ప్రమాణాలు మెరుగుపరిచి, పల్లెవాసుల ఆత్మగౌరవాన్ని కాపాడాలన్న సదుద్దేశంతో భారత ప్రభుత్వం 1986లో కేంద్ర గ్రామీణ పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజలే పారిశుద్ధ్య అవసరాల్ని గుర్తించి, తగిన సమాచారాన్ని రూపొందించుకొని, మానవ వనరుల అభివృద్ధి, సామర్థ్యాన్ని పెంపొందించుకొనేలా సంపూర్ణ పారిశుద్ధ్య ఉద్యమాన్ని 1999లో ప్రారంభించారు. దీనిద్వారా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణాలకు అవసరమైన నగదు ప్రోత్సాహకాలను అందించడం జరుగుతుంది. గ్రామాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు అమలు చేయడం, తద్వారా పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చి, పరిశుభ్రమైన పల్లెలను తీర్చిదిద్దాలని 2012లో నిర్మల్‌ భారత్‌ అభియాన్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. అలా కొన్నేళ్లుగా దేశాన్ని సంపూర్ణ పారిశుద్ధ్యం దిశగా నడిపించాలని, తద్వారా పరిశుభ్ర భారతావనిని సాకారం చేయాలని కృషి చేస్తున్నా ఆశించిన లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నట్లు ఎన్డీయే ప్రభుత్వం భావించింది. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచి సంపూర్ణ స్వచ్ఛతవైపు పయనించాలని 2014 అక్టోబర్‌ రెండో తేదీన స్వచ్ఛభారత్‌ మిషన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను వేగవంతం చేసి, బహిరంగ మలమూత్ర విసర్జన లేని రాష్ట్రాలుగా తీర్చిదిద్దుతూ, స్వచ్ఛభారత్‌ దిశగా ముందుకు సాగుతోంది. స్వచ్ఛభారత్‌ను సాకారంచేయడంలో భాగంగా ప్రభుత్వం వ్యక్తిగత కుటుంబ మరుగుదొడ్ల నిర్మాణం దిశగా ప్రజలను ప్రోత్సహిస్తోంది. 
 

స్వీయనియంత్రణ అవసరం
సుస్థిర పారిశుద్ధ్య పద్ధతులను అనుసరించడం, ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పించి ప్రజలను చైతన్యపరచడమే లక్ష్యంగా స్వచ్ఛభారత్‌ ప్రారంభమైంది. పర్యావరణానికి అనుకూలమైన, సురక్షితమైన, సుస్థిరమైన తక్కువ ఖర్చు, సాంకేతికతతో కూడిన పారిశుద్ధ్య పద్ధతులను ప్రోత్సహించడమే ధ్యేయంగా ఈ కార్యక్రమం సంపూర్ణ స్వచ్ఛత వైపు సాగుతోంది. దీనికితోడు, బహిరంగ మలమూత్ర విసర్జన లేని గ్రామాల కొనసాగింపు (ఓడీఎఫ్‌ ప్లస్‌) చర్యలనూ ప్రారంభించి అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణమే కాకుండా వాటిని తప్పనిసరిగా వినియోగించుకొనేలా మానసికంగానూ సంసిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు పంచాయతీలను సమాయత్తం చేయాలి. సంపూర్ణ పరిశుభ్రత సాధించిన గ్రామాలు, నగరాలుగా తీర్చిదిద్దడానికి గ్రామీణ, పట్టణ స్థానిక ప్రభుత్వాలను ప్రోత్సహించాలి. ఇందుకోసం మరుగుదొడ్ల నిర్మాణాన్ని తప్పనిసరి చేయాలి. ప్రజలంతా స్వీయ నియంత్రణ విధానాలు రూపొందించుకొని స్వచ్ఛతకు బాటలు వేయాలి. సంపూర్ణ స్వచ్ఛత సాకారమయ్యేందుకు రాజకీయ నాయకత్వం, ప్రజల ప్రాతినిధ్యం, ప్రజా భాగస్వామ్యం వంటి కీలక అంశాలను సమదృష్టితో ఆచరించాలి. ప్రజలు, విద్యార్థులు, యువత, విద్యాధికులు, స్వచ్ఛంద సంఘాలు... సంపూర్ణ స్వచ్ఛ భారత్‌ సాకారం చేయడమే పరమావధిగా కృషి చేయాలి. 
 

- ఎ. శ్యామ్‌ కుమార్‌ 
 

Posted Date: 21-11-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం