• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణ హితంగా విత్తనశుద్ధి

* వ్యయం తగ్గించే విధానాలు అవసరం


    కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ 27 రకాల పురుగు మందులను నిషేధిస్తూ మే 14న ముసాయిదా ప్రకటన జారీ చేసింది. మనుషులు, జంతువులపై విషప్రభావం చూపుతున్నాయనే కారణంగా వాటిని నిషిద్ధ జాబితాలో చేర్చారు. ఈ నిర్ణయంపై అభ్యంతరాలు, సూచనలు అందజేయడానికి ప్రభుత్వం 45 రోజుల గడువు ఇచ్చింది. ఆ రసాయనాల్లో థిరమ్‌, క్యాప్టన్‌, డెల్టామత్రిన్‌, కార్బెండిజం, మలాథియన్‌, క్లోరోఫైరిఫోస్‌ తదితర పురుగు మందులున్నాయి. డీడీవీపీ/ డైక్లోరవోస్‌గా పిలిచే రసాయనాన్ని డిసెంబరు 31 తరవాత పూర్తి స్థాయిలో నిషేధించనున్నారు. పర్యావరణపరంగా సురక్షిత భారత్‌ దిశగా అడుగులు వేసే క్రమంలో అత్యంత విషప్రభావం కలిగిన పురుగు మందుల్ని నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి బదులు ప్రత్యామ్నాయంగా కొత్తరకాలు, జీవ క్రిమిసంహారక మందులు అందుబాటులో ఉన్నందువల్ల రైతులు, భారత ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామంపై తేనెటీగల పెంపకం, సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు, మసాలా దినుసుల పరిశ్రమ ప్రతినిధులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
    ఈ పరిణామాన్ని విత్తన పరిశ్రమ కోణంలోనూ పరిశీలించాల్సిన అవసరం ఉంది. ప్రతిపాదిత నిషేధ జాబితాలో ఉన్న పురుగు మందులను పంటలపై చీడపీడల్ని పారదోలడానికి మాత్రమే కాకుండా, విత్తన పరిశ్రమలోనూ విస్తృతంగా ఉపయోగిస్తారు. విత్తనాలు, మట్టి ద్వారా వ్యాపించే చీడపీడలు, కీటకాల నుంచి రక్షించేందుకు విత్తనశుద్ధిలోనూ వాడతారు. థిరమ్‌, క్యాప్టన్‌, డెల్లాత్రిన్‌, కార్బెండిజమ్‌ వంటి రసాయన ఉత్పత్తుల్ని ప్రధానంగా విత్తనశుద్ధి ప్రక్రియలో ఉపయోగిస్తారు. డెల్టామత్రిన్‌ అనే కీటకనాశినిని మొక్కజొన్న, సజ్జలు, జొన్నలు, పొద్దుతిరుగుడు, ఆవాలు, కూరగాయల విత్తనాల్లో మట్టి ద్వారా సోకే తెగుళ్ల నుంచి రక్షించేందుకు శుద్ధి ప్రక్రియలో వాడతారు. ఈ ప్రక్రియ చవకైనదే కాకుండా, విత్తన పరిశ్రమలో దశాబ్దాలుగా వాడుకలో ఉంది. శిలీంధ్రనాశనిగా పేరున్న కార్బెండిజాన్ని ఉపయోగించేందుకూ పెద్దగా ఖర్చవదు. థిరమ్‌ రసాయనాన్ని కూడా విత్తనశుద్ధి ప్రక్రియ చేపట్టేందుకు సమర్థమైన పురుగుమందుగానూ, విత్తనాలు, మట్టి ద్వారా ఉత్పన్నమయ్యే వ్యాధులు, రోగకారకాలపై చక్కగా పనిచేసే అత్యుత్తమ సాధనంగా భావిస్తారు. వరి, పప్పుధాన్యాల విత్తనోత్పత్తి విషయంలో ఈ తరహా ప్రక్రియ మరింతగా అవసరమవుతుంది. ఇక్కడ హైబ్రీడ్‌ రకాల పంటలతో పోలిస్తే విత్తనాలు చౌకగా అందుబాటులో ఉంటాయి. ఇలాంటి విత్తన ఉత్పత్తిదారులకు లాభం తక్కువగా ఉండటం వల్ల వాటి శుద్ధి ప్రక్రియలో అధిక ధరలు వెచ్చించి పురుగు మందుల్ని వినియోగించలేరు. గోధుమ, వరి వంటి పంటల విషయంలో థిరమ్‌, కార్బెండజిమ్‌లనూ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. విత్తనశుద్ధి వ్యయం చాలా తక్కువగా ఉన్నందువల్ల ఇది రైతులకు, విత్తన కంపెనీలకు ఉపయుక్తంగా ఉంటుంది. ప్రస్తుత నిషేధ ఉత్తర్వుల అమలుకు ముందు విత్తనశుద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ రసాయనాలు, పురుగు మందులను ప్రతిపాదించే అవకాశం ఉంది. ఇప్పటికే ఉన్న పురుగు మందులను నిషేధించేందుకు దశలవారీ విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది.
    విత్తనశుద్ధి రసాయనాలుగా అందించే కొత్త రసాయనాల వ్యయాల్ని భరించగలగడం మరో కీలకాంశం. అవి ఎక్కువ ఖరీదైనవైతే విత్తనాల ధరపై ప్రభావం పడుతుంది. ఫలితంగా రైతులపై పెట్టుబడి భారం పడటానికి ఇది దారి తీస్తుంది. ప్రస్తుతమున్న ప్రామాణిక విత్తనశుద్ధి రసాయనాలకు సరసమైన, తగిన ప్రత్యామ్నాయాలు లేనయిట్లయితే- విత్తనాలు, మట్టి ద్వారా వ్యాపించే వ్యాధుల వల్ల రైతులు పెద్దయెత్తున నష్టాలను చవిచూసే ప్రమాదం ఉంటుంది. ఇది మొత్తం ఉత్పాదకత తగ్గడానికి, రైతులు, విత్తన పరిశ్రమ, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ లాభదాయకతపై ప్రభావం పడటానికీ దారితీస్తుంది.
    ప్రతిపాదిత నిషేధం సైతం దశలవారీ పద్ధతిలో మూడునాలుగేళ్లలో అమలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెటింగ్‌ వ్యవస్థలో ఉండిపోయిన విత్తనాలను గడువు తేదీ వరకు అమ్ముకునేందుకు అనుమతించాలి. రైతులు, విత్తన పరిశ్రమకు సమర్థమైన పరిష్కారం చూపేందుకు రసాయన పురుగు మందులతో కూడిన విత్తనశుద్ధితోపాటు- ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత పద్ధతులను అనుమతించడాన్నీ భారత ప్రభుత్వం పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ప్రకృతి పరమైన సవాళ్లను ప్రకృతి ద్వారానే ఎదుర్కొనే రీతిలో నానో సాంకేతిక పరిజ్ఞాన ప్రక్రియలు, జీవ నియంత్రణ సాధనాలను అభివృద్ధి చేసేందుకు ఐకార్‌, ఐఏఆర్‌ఐ వంటి ప్రభుత్వ సంస్థలు పరిశోధన, అభివృద్ధి చేపట్టాల్సిన అవసరం ఉంది. మనకు సహజసిద్ధంగా తోడ్పడే కోట్లాది సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు- చీడపీడలు, వ్యాధులపై పోరాడి ప్రయోజనం కలిగిస్తాయి. దీనివల్ల పర్యావరణానికీ హాని కలగదు. ఇలాంటి ఉత్పత్తులన్నీ ప్రభుత్వ వ్యవస్థ పరిధిలోనే అభివృద్ధి చేయాలి. అవి పేటెంట్‌ రహితంగా ఉండాలి. దీనివల్ల వ్యవసాయ, అనుబంధ రంగాల్లో వ్యయాలు తగ్గుతాయి. ఫలితంగా, భారత రైతులతోపాటు- పర్యావరణానికీ ప్రయోజనం కలుగుతుంది.

 

- ఇంద్రశేఖర్‌సింగ్‌


 

Posted Date: 25-06-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం