• facebook
  • whatsapp
  • telegram

భూతాపం.. నగరం నరకం!ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కర్బన ఉద్గారాలు వాతావరణ మార్పులను ప్రేరేపిస్తున్నాయి. దానివల్ల భూతాపం కట్టుతప్పుతోంది. తత్ఫలితంగా నగరాల్లో వడగాడ్పులు, అసాధారణ వర్షాలు, వరదలు, వాయు కాలుష్యం తదితరాలు పెచ్చరిల్లుతున్నాయి. దాంతో నగర జీవనం నరకమయంగా మారుతోంది.


ఏడాదిన్నరలో కురవాల్సిన వర్షం ఇటీవల దుబాయిలో ఒక్కరోజే పడింది. ఒమన్‌-యూఏఈ సరిహద్దుల్లో ఉన్న అల్‌అయిన్‌ నగరంలో 255 మిల్లీమీటర్ల వర్షం ఒక్కరోజే కురిసి విలయాన్ని సృష్టించింది. టాంజానియా, కెన్యా, బ్రెజిల్‌లలోనూ భారీ వర్షాలతో వరదలు ముంచెత్తి వందలాది ప్రాణాలు గాలిలో కలిశాయి. గతంలో ఇండియాలోని నగరాల్లోనూ పోటెత్తిన వరదలు జనజీవితాన్ని అతలాకుతలం చేశాయి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులూ నగరాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వడగాడ్పుల బారిన పడి తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది ఇప్పటిదాకా సుమారు ఇరవైమందిదాకా ప్రాణాలు కోల్పోయారు. పెచ్చరిల్లుతున్న వాయు కాలుష్యం సైతం నగరాలకు ఊపిరాడకుండా చేస్తోంది.


కర్బన ఉద్గారాల ఉత్పత్తి 

వాతావరణ మార్పులకు నగరాలే కారణమని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వాటి మూలంగా అత్యధికంగా ప్రభావితం అవుతున్నవీ నగరాలే! భూ ఉపరితలంపై రెండు శాతం విస్తీర్ణంలోనే నగరాలు విస్తరించి ఉన్నాయి. అయితే, విశ్వవ్యాప్తంగా నగరాలు 75శాతం కర్బన ఉద్గారాలను వెలువరిస్తున్నాయి. హరిత గృహ వాయువుల్లో అధిక భాగాన్ని ఆసియా నగరాలే వెలువరిస్తున్నా, తలసరి ఉద్గారాల విషయంలో అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా నగరాలు ముందున్నాయి. నగరాలకు పోటెత్తుతున్న వలసలు, అడ్డూ ఆపూ లేకుండా విస్తరిస్తున్న నివాస, వాణిజ్య భవనాలు, భారీగా పెరుగుతున్న వాహనాలు, తరిగిపోతున్న వృక్ష సంపద తదితరాలు హరితగృహ వాయు ఉద్గారాలు కట్టుతప్పడానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. పలు నగరాల్లో రోడ్డు రవాణా ద్వారా 30శాతం, రైల్వేలు, జలమార్గాల ద్వారా 15శాతం కర్బన ఉద్గారాలు వెలువడుతున్నాయి. బొగ్గును మండించి విద్యుత్తును ఉత్పత్తి చేయడం, పారిశ్రామికీకరణ వల్లా పెద్దమొత్తంలో కర్బన ఉద్గారాలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటివల్ల మానవ ఆరోగ్యం దెబ్బతింటోంది. పర్యావరణానికి చేటు కలుగుతోంది. మరోవైపు అడవులు తరిగిపోతుండటం పుడమికి పెను శాపంగా మారింది.


వాతావరణ మార్పుల వల్ల కలిగే విపత్తుల నష్టాన్ని నివారించడానికి నాణ్యమైన మౌలిక వసతుల కల్పన, సన్నద్ధత తప్పనిసరి. సరైన మురుగు, వరద నీటి వ్యవస్థలు, భూగర్భ డ్రైనేజీలు నగరాల్లో వరదలను నిలువరిస్తాయి. చెరువులు, నాలాల ఆక్రమణలకు అడ్డుకట్ట వేయగలిగితే వరదల ముంపును అరికట్టవచ్చు. అధిక ఉష్ణోగ్రతలతో ఇండియాలో ఏటా సగటున 84 వేల మంది విగత జీవులవుతున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. వడగాడ్పులను ఎదుర్కోవడానికి రక్షణ చర్యలు సూచిస్తే సరిపోదు. భూతాపం తగ్గించే మార్గాలను అన్వేషించాలి. ముఖ్యంగా శిలాజ ఇంధనాల వినియోగం తగ్గించాలి. పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించాలి. వనాల పెంపకమూ మరో కీలకాంశం. నగరాల అభివృద్ధి ప్రణాళికలు పర్యావరణ హితకరంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నానాటికీ విస్తరిస్తున్న రవాణా రంగమే వాయు కాలుష్యానికి ప్రధాన కారణం. ప్రజా రవాణా వ్యవస్థను పటిష్ఠం చేయడం, ప్రైవేటు వాహనాల వినియోగం తగ్గేలా చూడటం, విద్యుత్‌ వాహనాలను ప్రోత్సహించడం ద్వారా వాయు కాలుష్యాన్ని నిలువరించవచ్చు. వాతావరణ మార్పులతో పర్వత నగరాలు ప్రత్యేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. హిమానీనదాలు కరిగిపోవడం, అసాధారణ వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తులు తరచూ వాటిలో సంభవిస్తున్నాయి. మైదాన ప్రాంత అభివృద్ధి ప్రణాళికలను పర్వత నగరాలకూ వర్తింపచేయడం ప్రధాన సమస్యగా మారింది. భూతాపం పెరగడంతో సముద్రజలాలు వేడెక్కుతున్నాయి. దానివల్ల ఏర్పడుతున్న తుపానులు తీరప్రాంతాల్లో కల్లోలం సృష్టిస్తున్నాయి. దుబాయి, ముంబయి మొదలైన ప్రాంతాల్లో అసాధారణ వర్షపాతానికి, వరదలకు అరేబియా సముద్రం వేడెక్కడమే కారణం. వాతావరణ మార్పుల దుష్ప్రభావాల నుంచి విముక్తి పొందడం రాజ్యాంగం కల్పించిన జీవన, సమానత్వపు హక్కుల్లో అంతర్భాగమని సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టీకరించింది. పారిస్‌ ఒప్పందం మొదలుకొని ఇప్పటి వరకు జరిగిన ‘కాప్‌’ సదస్సులు వాతావరణ మార్పులకు సంబంధించి ఘనమైన తీర్మానాలు చేశాయి. అయితే, ఆచరణలో చిత్తశుద్ధి కొరవడుతోంది.


సమర్థ వ్యూహాలు అవసరం

ప్రపంచం 2030 నాటికి ఏటా కనీసం 560 విపత్తులను ఎదుర్కొంటుందని, వాటివల్ల దాదాపు నాలుగు కోట్ల మంది దుర్భర దారిద్య్రంలోకి జారిపోతారని వాతావరణ మార్పులపై అంతర ప్రభుత్వాల కమిటీ, ఐరాస విపత్తుల ఉపశమన సంస్థ నివేదికలు హెచ్చరిస్తున్నాయి. వాతావరణ మార్పుల నియంత్రణలో పట్టణ ప్రభుత్వాలదే ప్రధానపాత్ర అని ఐరాస నివేదిక స్పష్టం చేసింది. తీరైన పట్టణ ప్రణాళికలు, సుపరిపాలనతో వాతావరణ మార్పుల ఒత్తిడిని నగరాలు గణనీయంగా తట్టుకోగలవని నివేదిక వివరించింది. అయితే, పురపాలికలను నిధులలేమి వేధిస్తోంది. నైపుణ్య సిబ్బంది కొరత, రాష్ట్ర ప్రభుత్వాల మితిమీరిన జోక్యం, అధికారాలు, విధుల కుదింపు వల్ల అవి సమర్థంగా పని చేయలేకపోతున్నాయి. విపత్తుల నియంత్రణకు జాతీయ, రాష్ట్ర, స్థానిక వ్యూహాలు, ప్రణాళికలను అనుసరించాలని ఐరాస సూచించింది. విపత్తుల నివారణకు ముందస్తు హెచ్చరికల వ్యవస్థ చాలా కీలకం. పురపాలికలకు సమధిక నిధులను సైతం కేటాయించాలి. నగరాల్లో హరిత భవనాల నిర్మాణానికి ప్రాధాన్యమివ్వాలి. ముఖ్యంగా చిన్న నగరాల అభివృద్ధికి బాటలు వేయాలి. పర్యావరణ మార్పులను కట్టడి చేయడానికి సరైన వ్యూహాలను రూపొందించి సమర్థంగా అమలు చేయాలి. అప్పుడే నగరాల్లో జీవనం సంక్షోభంలోకి జారుకోకుండా నిలువరించవచ్చు.


తీవ్ర నష్టం

వాతావరణ మార్పులతో సంభవించే విపత్తులు నగరాల మౌలిక వసతులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అల్పాదాయ, వర్ధమాన దేశాల ప్రజలే అధికంగా విపత్తుల బారిన పడుతున్నారని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఐరాస విపత్తుల నివారణ నివేదిక ప్రకారం గత యాభై సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా 12వేల ప్రకృతి విపత్తులు సంభవించాయి. వాటివల్ల 20లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. రూ.35లక్షల కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించింది. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఇండియాలో గత రెండు దశాబ్దాల కాలంలో విపత్తుల కారణంగా సుమారు లక్ష మంది మృత్యువాతపడ్డారు. ప్రపంచంలో ఎక్కువగా వరదల బారిన పడుతున్న దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో నిలుస్తోంది. ప్రకృతి విపత్తుల వల్ల ఇండియాకు ఏటా రూ.70వేల కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లుతున్నట్లు పరిశీలనలు వెల్లడిస్తున్నాయి. వాతావరణ మార్పుల నివారణ విధానాలను చేపట్టకపోతే 2050 నాటికి దేశ దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధి తొమ్మిది శాతం మేర క్షీణిస్తుందని ఆర్‌బీఐ ఇటీవల హెచ్చరించింది.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సముద్ర భద్రతకు భారత్‌ భరోసా

‣ అమెరికా ధోరణి మారుతోంది..

‣ ప్రజాస్వామ్యంపై దాడి

‣ ఎగవేతలు అరికడితే.. మరింత రాబడి!

‣ కార్చిచ్చులతో పచ్చదనం బుగ్గిపాలు

‣ పౌరస్వేచ్ఛకు సంకెళ్లు

Posted Date: 18-05-2024గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని