• facebook
  • whatsapp
  • telegram

అమెరికా ధోరణి మారుతోంది..అఫ్గానిస్థాన్‌ నుంచి అగ్రరాజ్యం అర్ధాంతరంగా వెనుదిరిగిన తరవాత అమెరికా-పాక్‌ సంబంధాలు గాడితప్పాయి. ఇటీవల భౌగోళికంగా, రాజకీయంగా ఎన్నో పరిణామాలు సంభవించడంతో పాక్‌తో సంబంధాల పునరుద్ధరణకు అమెరికా యత్నిస్తున్నట్లు అర్థమవుతోంది.


పాకిస్థాన్‌ విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వైఖరిలో ఇటీవల మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. భద్రతాపరంగానే కాకుండా ఇతర అంశాల్లోనూ పాకిస్థాన్‌తో సంబంధాల పునరుద్ధరణకు అగ్రరాజ్యం యత్నిస్తున్న సంకేతాలు గోచరిస్తున్నాయి. పాక్‌ పార్లమెంటరీ ఎన్నికలు ముగిసి ఈ ఏడాది మార్చిలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ నేత షెహబాజ్‌ షరీఫ్‌ ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. ఆ తరవాతి నుంచి పాక్‌కు మళ్ళీ చేరువయ్యేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది. వాస్తవానికి దశాబ్దాలుగా అమెరికా భద్రత అంశాల్లో ముఖ్యంగా అఫ్గాన్‌లో అగ్రరాజ్యం/నాటో ప్రయోజనాల విషయంలో పాక్‌ కీలక పాత్ర పోషిస్తూ వచ్చింది. అఫ్గాన్‌ నుంచి అమెరికా దళాలు అర్ధాంతరంగా వెనుదిరగాల్సి రావడం, 2021 ఆగస్టులో తాలిబన్లు మళ్ళీ అధికారం చేపట్టడంతో పరిస్థితి మారిపోయింది. అఫ్గాన్‌ నుంచి అవమానకర రీతిలో నిష్క్రమించాల్సి రావడం అంతకు కొద్దిరోజుల ముందే అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన బైడెన్‌ ప్రతిష్ఠను దెబ్బతీసింది.


అఫ్గాన్‌ నుంచి నాటో దళాల ఉపసంహరణ నిర్ణయాన్ని బైడెన్‌కన్నా ముందు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్‌ హయాములో తీసుకున్నారు. కానీ, బైడెన్‌ కీర్తి దెబ్బతింది. అప్పటి నుంచి, పాక్‌తో బైడెన్‌ ఎడమొహం పెడమొహం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. గతంలో ప్రధానులుగా పనిచేసిన ఇమ్రాన్‌ఖాన్‌, షెహబాజ్‌ షరీఫ్‌లతో ఆయన దూరం పాటించారు. అమెరికాతో భౌగోళిక-ఆర్థిక సంబంధాలను పునరుద్ధరించుకోవాలన్న ఇమ్రాన్‌ విన్నపం మీదా ఆయన కిమ్మనలేదు. పైగా 2022 అక్టోబరులో పాక్‌ను అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో ఒకటిగా బైడెన్‌ అభివర్ణించారు. దాని అణు భద్రతా విధానాలనూ ప్రశ్నించారు. అఫ్గానిస్థాన్‌ మళ్ళీ తాలిబన్ల వశమయ్యాక అమెరికా దృష్టిలో ఈ ప్రాంతంలో పాక్‌ తన వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని కోల్పోయింది. అయితే ఇక్కడ అమెరికా ద్వంద్వ వైఖరినీ ప్రస్తావించాలి. ఒకవైపు పాక్‌ నాయకత్వంతో బైడెన్‌ అంటీముట్టనట్లు వ్యవహరిస్తే, అమెరికా విదేశాంగ విభాగం మాత్రం భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పాక్‌తో సంప్రతింపులు కొనసాగిస్తూ వచ్చింది.


పాక్‌ నూతన ప్రధానిగా షెహబాజ్‌ షరీఫ్‌ బాధ్యతలు చేపట్టిన తరవాత ఇటీవల బైడెన్‌ ఆయనకు వ్యక్తిగతంగా లేఖ రాశారు. ఇందులో భద్రతకు సంబంధించిన అంశాలకు ఆయన మరోసారి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ప్రపంచంతో పాటు, స్థానిక ప్రజల భద్రత కోసం ఇరు దేశాల శాశ్వత భాగస్వామ్యం కీలకమని అందులో వ్యాఖ్యానించారు. ప్రాంతీయ, ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో పాక్‌కు అమెరికా తోడుగా నిలుస్తుందని లేఖలో పేర్కొన్నారు. ఆరోగ్య భద్రత, అందరికీ విద్య, పర్యావరణం తదితర అంశాలనూ ప్రస్తావించారు. ఇజ్రాయెల్‌-హమాస్‌ వివాదం, టెల్‌అవీవ్‌-టెహరాన్‌ ఉద్రిక్త పరిస్థితులు పశ్చిమాసియాను మరింత రావణకాష్ఠంలా మార్చేసే ప్రమాదం నెలకొన్న నేపథ్యలో బైడెన్‌ ఈ లేఖను రాయడాన్ని గమనించాలి. ఇటీవల ఇరాన్‌కు పాక్‌ చేరువవుతోంది. ప్రస్తుత భౌగోళిక, రాజకీయ పరిస్థితుల్లో పాక్‌ తనకు అక్కరకొస్తుందని అమెరికా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇజ్రాయెల్‌పై టెహరాన్‌ నేరుగా దాడి చేసిన తరవాత ఇరాన్‌ అధ్యక్షుడు పాక్‌ను సందర్శించారు. ఈ ఏడాది ఎన్నికల తరవాత ఒక దేశాధినేత పాక్‌లో పర్యటించడం అదే తొలిసారి. ఈ సందర్భంగా పాకిస్థాన్‌ ఇంధన అవసరాలను తీర్చే ఇరాన్‌-పాక్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌ను పూర్తిచేయడం గురించి ఇరు దేశాల నేతలు చర్చించారు. పశ్చిమాసియాలో తన ప్రయోజనాల పరిరక్షణ కోసం ఇరాన్‌ను ప్రభావితం చేసేందుకు పాకిస్థాన్‌ను వినియోగించుకోవాలని అమెరికా భావిస్తున్నట్లు అర్థమవుతోంది. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్‌లకు బద్ధశత్రువైన ఇరాన్‌కు పాక్‌ మరింత చేరువ కావడం అగ్రరాజ్యానికి ఇష్టం లేదు. ఇరాన్‌ అధ్యక్షుడి పర్యటన తరవాత అమెరికా విదేశాంగశాఖ సహాయ మంత్రి పాక్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా భద్రతతో పాటు ఇతర అంశాలూ చర్చకు వచ్చాయి. అమెరికాకు మళ్ళీ పాక్‌ చేరువవుతుండటం భారతదేశానికి ఆందోళనకరమా అంటే, లేదనే చెప్పాలి. అగ్రరాజ్యంతో ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్యం కొంతకాలంగా పటిష్ఠమైంది. ముఖ్యంగా అమెరికా-భారత్‌ సంబంధాలు చాలా విస్తృతమైనవి. అగ్రరాజ్యంతో పాక్‌ సయోధ్య వల్ల అవి దెబ్బతినే అవకాశం లేదు.  


- అచల్‌ మల్హోత్రా, మాజీ దౌత్యవేత్త
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ప్రజాస్వామ్యంపై దాడి

‣ ఎగవేతలు అరికడితే.. మరింత రాబడి!

‣ కార్చిచ్చులతో పచ్చదనం బుగ్గిపాలు

‣ పౌరస్వేచ్ఛకు సంకెళ్లు

Posted Date: 18-05-2024గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని