• facebook
  • whatsapp
  • telegram

ప్రజాస్వామ్యంపై దాడిఆంధ్రప్రదేశ్‌లో నిన్న జరిగిన ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు పేట్రేగిపోయారు. ప్రతిపక్షానికి చెందిన కార్యకర్తలు, ఏజెంట్లపై హేయ దాడులకు ఒడిగట్టారు. పల్నాడు జిల్లాలో ఈవీఎంలను ధ్వంసం చేశారు. పోలింగ్‌ సిబ్బందిపైనా జులుం ప్రదర్శించారు. పలుచోట్ల రిగ్గింగుకు పాల్పడినట్లు కథనాలు వెలువడ్డాయి. ఇండియాలో ఎన్నికలు ఇలా హింసాయుతంగా మారుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.


భారత రాజకీయాల్లో నేరచరితుల ప్రాబల్యం పెరిగిపోవడంతో స్వేచ్ఛగా, న్యాయంగా ఎన్నికలు జరిపించడం పెద్ద సవాలుగా మారింది. ఎన్నికల ఫలితాలు ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం విరాజిల్లుతుంది. పోలింగ్‌ కేంద్రాల కబ్జా, ఓటర్లను భయపెట్టడం లాంటి దురాగతాలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. వీటిని అరికట్టడానికి వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చినా, అవి అమలుకు నోచుకోవడం లేదు. తాజా సార్వత్రిక ఎన్నికల్లో మణిపుర్‌లో పోలింగ్‌ కేంద్రాల ఆక్రమణ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విరివిగా ప్రచారమయ్యాయి. ఇలాంటి అక్రమాలు జరిగిన నియోజకవర్గాల్లో ఎన్నికను రద్దు చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. ఏపీలోనూ నిన్నటి పోలింగ్‌ సందర్భంగా అధికార పక్షం దౌర్జన్యాలు అందరినీ దిగ్భ్రాంతపరచాయి. ఈ అకృత్యాలు యావత్‌ ఎన్నికల ప్రక్రియను ప్రశ్నార్థకం చేసి ప్రజాస్వామ్య పునాదులను బలహీనపరుస్తున్నాయి.


కీలక తీర్పులు

ఏప్రిల్‌ 19 (2024) నుంచి ప్రారంభమైన లోక్‌సభ ఎన్నికల మొదటి దశలోనే కొన్నిచోట్ల పోలింగ్‌ కేంద్రాల ఆక్రమణ, ఎలెక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎంల) ధ్వంసం జరిగినట్లు వార్తలు వచ్చాయి. భారత్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు 1951నాటి ప్రజాప్రాతినిధ్య చట్టానికి(ఆర్‌పీఏకి) అనుగుణంగా జరుగుతున్నాయి. ఎన్నికల అక్రమాలను ఈ చట్టంలోని 123వ సెక్షన్‌ స్పష్టంగా నిర్వచిస్తోంది. 135ఏ సెక్షన్‌ పోలింగ్‌ కేంద్రాల ఆక్రమణను నేరంగా ప్రకటిస్తోంది. ఈ నేరానికి పాల్పడినవారికి జరిమానాతో పాటు ఏడాది నుంచి మూడు సంవత్సరాల వరకు జైలుశిక్ష విధించవచ్చు. పోలింగ్‌ కేంద్రాల ఆక్రమణకు పాల్పడినట్లు రుజువైన వ్యక్తి లోక్‌సభ, శాసనసభ, శాసనమండలి సభ్యత్వానికి అనర్హుడవుతాడు. ఏదైనా పోలింగ్‌ కేంద్రం ఆక్రమణ, లేదా ఓట్ల లెక్కింపు కేంద్రం కబ్జా జరిగి ఫలితం తారుమారవుతుందని రిటర్నింగ్‌ అధికారి భావిస్తే ఆ విషయాన్ని ఎన్నికల సంఘానికి తెలియజేయాలి. ఇలాంటి అక్రమం జరిగినట్లు హైకోర్టు నిర్ధారిస్తే, అక్కడ గెలుపొందిన అభ్యర్థి ఎన్నికను రద్దు చేయవచ్చని ఆర్‌పీఏ నిర్దేశిస్తోంది. ఈవీఎంలకు ముందు బ్యాలట్‌ పేపర్ల పద్ధతి కొనసాగిన రోజుల్లో పోలింగ్‌ కేంద్రాల ఆక్రమణలు ఎక్కువగా జరిగేవి. 1992లో బసనగౌడ వెర్సస్‌ డాక్టర్‌ అమర్‌ఖేడ్‌ తదితరుల కేసులో పోలింగ్‌ కేంద్రాల కబ్జా ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేస్తుంది కాబట్టి విజేతను అనర్హుడిగా ప్రకటించవచ్చని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. రాజకీయపరమైన తగాదా వల్ల ఇద్దరు కుర్రాళ్ల హత్యకు సంబంధించిన రూలీ రామ్‌, ఏఎన్‌ఆర్‌ వెర్సస్‌ స్టేట్‌ ఆఫ్‌ హరియాణా కేసులో సుప్రీంకోర్టు- మృతదేహాలను తొక్కుకొంటూ పోయేది ప్రజాస్వామ్యం కాదని వ్యాఖ్యానించింది. అనాగరిక, హింసాయుత పద్ధతుల్లో అధికారాన్ని కైవసం చేసుకోవడం ప్రజాస్వామ్య పద్ధతి కాదని స్పష్టీకరించింది. హింసా దౌర్జన్యాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీం తీర్మానించింది. రిగ్గింగ్‌, పోలింగ్‌ కేంద్రాల ఆక్రమణ, ఓటర్ల బెదిరింపు ఘటనలను అరికట్టడానికి సీసీటీవీలను అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాటు చేయాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని జనక్‌ సింగ్‌ వెర్సస్‌ రామ్‌దాస్‌రాయ్‌ తదితరుల కేసులో ఓ కక్షిదారు సుప్రీంకోర్టును కోరారు. దానితో సర్వోన్నత న్యాయస్థానం ఏకీభవించి పోలింగ్‌ కేంద్రాల్లోనే సీసీటీవీ కెమెరాలను నెలకొల్పాలని సూచించింది. ఓటర్ల జాబితాలను కాజేసి బోగస్‌ ఓటింగుకు పాల్పడిన కేసు 2021లో జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎంఆర్‌ షాల సుప్రీం ధర్మాసనం ముందుకు వచ్చింది. దాన్ని లక్ష్మణ్‌ సింగ్‌ వెర్సస్‌ స్టేట్‌ ఆఫ్‌ బిహార్‌ కేసుగా పరిగణిస్తున్నారు. ఈ కేసులో పోలింగ్‌ కేంద్రాల ఆక్రమణకు కొందరు వ్యక్తులు అక్రమంగా ముఠా కట్టారు. ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలపై దాడికి దిగారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ హింసాదౌర్జన్యాలు జరుగుతున్నందువల్ల వాటిపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. మణిపుర్‌లో పోలింగ్‌ కేంద్రాల ఆక్రమణ జరిగిన చోట్ల ఎన్నికను రద్దు చేయాలనే డిమాండ్‌ వినిపిస్తోంది.


రాజకీయ పార్టీల బాధ్యత

పోలింగ్‌ కేంద్రాల ఆక్రమణ ప్రజాస్వామ్య పక్రియను బలహీనపరుస్తుందని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించింది. ఈ పెడధోరణిని అరికట్టడం కేవలం చట్టాలు, కోర్టుల వల్లనే సాధ్యం కాదు. రాజకీయ పార్టీలు సైతం ప్రజాస్వామ్య పరిరక్షణకు పునరంకితం కావాలి. నేరచరితులకు, అవినీతిపరులకు టికెట్లు ఇవ్వడం మానేయాలి. రాజకీయాల్లో నైతిక ప్రమాణాలను కాపాడటానికి పార్టీలు, వాటి నాయకులు నిబద్ధత కనబరచాలి. ఎన్నికల సంస్కరణలకు అధికారంలో ఉన్న పార్టీతో పాటు ప్రతిపక్షాలూ కంకణబద్ధం కావాలి. ప్రజాభీష్టానికి అనుకూలంగా ఎన్నికలు జరిగినప్పుడే ప్రజాస్వామ్యం మనగలుగుతుంది.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఎగవేతలు అరికడితే.. మరింత రాబడి!

‣ కార్చిచ్చులతో పచ్చదనం బుగ్గిపాలు

‣ పౌరస్వేచ్ఛకు సంకెళ్లు

‣ దేశ ఆర్థికానికి వెన్నుదన్ను

‣ మన ఎన్నికలపై డ్రాగన్‌ కుతంత్రాలు

‣ ఆయువు తోడేస్తున్న వాయువు

‣ బంగ్లాలో ప్రబలుతున్న భారత్‌ వ్యతిరేకత

Posted Date: 18-05-2024గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం