• facebook
  • whatsapp
  • telegram

ఎగవేతలు అరికడితే.. మరింత రాబడి!పరోక్ష పన్నుల్లో కేంద్రం తీసుకొచ్చిన సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయి. 2017లో ప్రవేశపెట్టిన వస్తుసేవల పన్ను (జీఎస్టీ) విధానంలో వసూళ్లు పెరుగుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లలో 11.7శాతం వృద్ధి నమోదైంది. రూ.20.18లక్షల కోట్ల రాబడి ప్రభుత్వ ఖజానాకు చేరింది. దాన్ని మరింతగా పెంచుకోవడానికి అనేక అవకాశాలున్నాయి.


వస్తుసేవల పన్ను(జీఎస్టీ) రాబడి అంతకంతకు పెరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.20.18 లక్షల కోట్ల మేర జీఎస్టీ ఆదాయం సమకూరింది. అందులో రాష్ట్రాల్లో జరిగే లావాదేవీలపై విధించే కేంద్ర జీఎస్టీ వాటా రూ.3.76 లక్షల కోట్లు, రాష్ట్ర జీఎస్టీ వాటా రూ.4.71 లక్షల కోట్లు. అంతర్రాష్ట్ర లావాదేవీలపై విధించే ‘ఇంటెగ్రేటెడ్‌ జీఎస్టీ’ వాటా రూ.10.27 లక్షల కోట్లుగా తేలింది. జీఎస్టీ పరిహార సెస్‌ ద్వారా మరో రూ.1.45లక్షల కోట్లు సమకూరాయి. స్థూల ఆదాయం నుంచి పన్ను చెల్లింపుదారులకు రూ.2.71 లక్షల కోట్లు తిరిగి వెనక్కి చెల్లించారు. ఇది పోను నికర ఆదాయం సుమారు రూ.18 లక్షల కోట్లుగా తేలింది. వసూలైన ‘ఇంటెగ్రేటెడ్‌ జీఎస్టీ’లో సగం కేంద్రానికి పోతుంది. మిగతా సగాన్ని రాష్ట్రాలకు వస్తుసేవల వినియోగం ప్రాతిపదికన నెలనెలా సర్దుబాటు చేస్తారు. అలా సర్దుబాటు చేయగా మొత్తం జీఎస్టీలో రాష్ట్రాలకు వచ్చిన వాటా రూ.8.74 లక్షల కోట్లు (రాష్ట్ర జీఎస్టీ + సర్దుబాటుచేసిన ఇంటెగ్రేటెడ్‌ జీఎస్టీ). ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల వాటాలు వరసగా రూ.40,650 కోట్లు, రూ.31,606 కోట్లు. ఇదే దూకుడు కొనసాగడంతో గత ఒక్క నెలలోనే రూ.2.10 లక్షల కోట్ల మేర ఆదాయం వచ్చింది. 2023 ఏప్రిల్‌తో పోలిస్తే ఇది 12.4శాతం అధికం. జీఎస్టీ రాబడి ఇంతగా వృద్ధి చెందడానికి అనేక అంశాలు దోహదపడ్డాయి.


పెరుగుదల ఎలాగంటే...

జీఎస్టీ నిర్మాణంలోనే దాని విజయ రహస్యం దాగి ఉంది. వస్తుసేవల పన్నును తీసుకురావడానికి ముందు కేంద్రం, రాష్ట్రాలు ఎక్సైజ్‌ సుంకం, సేవా పన్ను, విలువ ఆధారిత పన్ను, ప్రవేశ పన్ను, వినోద పన్ను వంటివి విధించేవి. వాటి స్థానంలో ఏకైక పరోక్ష పన్నుగా జీఎస్టీని తీసుకురావడం పన్ను చెల్లింపులను సులభతరం చేసింది. పన్ను నిర్మాణంలో పటిష్ఠత జీఎస్టీ వసూళ్లు పెరగడానికి మొదటి కారణం. దేశార్థికం, ప్రజల కొనుగోలు శక్తి అంతకంతకు పెరుగుతుండటమూ అందుకు దోహదపడుతోంది. జీఎస్టీ అమలులోకి వచ్చిన 2017 నుంచి కొవిడ్‌ ప్రబలిన రెండేళ్ల కాలాన్ని మినహాయిస్తే- దేశ జీడీపీ ఏటా ఆరు నుంచి ఎనిమిది శాతం వరకు వృద్ధి సాధించింది. దేశంలో తలసరి ఆదాయం 2014-15లో సుమారు రూ.87,000. 2022-23 నాటికి అది రూ.1,72,000కు ఎగబాకింది. ప్రజల కొనుగోలుశక్తి పెరుగుతున్న క్రమంలో వస్తుసేవల వినియోగం, పన్ను వసూళ్లు అధికమవుతున్నాయి. వీటికి తోడు ఆర్థిక వ్యవస్థలో సహజంగానే 4-5శాతం మేర ద్రవ్యోల్బణం ఉంటుంది. దాంతో వస్తుసేవల ధరలతో పాటే జీఎస్టీ వసూళ్లు కూడా పెరుగుతాయి.


మరోవైపు, పన్ను ఎగవేతలను అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర అధికారులు కఠిన చర్యలు తీసుకోవడం సత్ఫలితాలను ఇస్తోంది. కేంద్ర జీఎస్టీ నిఘా విభాగం నిరుడు 6,323 మంది మొత్తం రూ.1,98,324 కోట్ల మేర జీఎస్టీని ఎగవేసినట్లు గుర్తించారు. తరవాత వారిలో కొంతమంది స్వచ్ఛందంగా పన్ను చెల్లించారు. ఎగవేతలకు సూత్రధారులైన 140 మందిని అధికారులు అరెస్ట్‌ చేశారు. గత మే తరవాత దేశవ్యాప్తంగా చేపట్టిన డ్రైవ్‌లో 31,512 నకిలీ రిజిస్ట్రేషన్లు వెలుగుచూశాయి. వాటి ద్వారా రూ.49,623 కోట్ల మేర పన్ను ఎగవేసినట్లు తేలింది. 2020 నుంచి ఇప్పటివరకు బూటకపు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ ద్వారా రూ.1,14,755 కోట్ల పన్ను ఎగవేత జరిగినట్లు కేంద్ర జీఎస్టీ విభాగం గుర్తించింది.  ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎగవేతలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడటంలేదు. పన్ను చెల్లింపుదారులు 1.4 కోట్లకు పైగా ఉన్నారు. ప్రతినెలా కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించి వారు సమర్పించే రిటర్నులను, రోజూ లక్షల సంఖ్యలో వచ్చే బిల్లులను, ఇ-వే బిల్లులను పరిశీలించి ఎక్కడెక్కడ పన్ను ఎగవేత జరుగుతోందన్నది కనిపెట్టడం చాలా కష్టం. అందుకనే బిగ్‌ డేటా, కృత్రిమ మేధ వంటి సాంకేతికతలను ఉపయోగించి పన్ను ఎగవేతలను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.


ఆదాయ పెంపునకు అవకాశాలు..

జీఎస్టీ అమలులో సాంకేతికతదే కీలక పాత్ర. జీఎస్టీ మోసాలపై నిఘా కార్యకలాపాలను రాష్ట్రాల్లోని ప్రధాన కార్యాలయాల నుంచే చేపడుతున్నారు. క్షేత్రస్థాయిలో జరిగే మోసాలపై స్థానిక అధికారులకు అవగాహన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నిఘా వ్యవహారాలను వికేంద్రీకరించడం మేలు. ఇది అధికారుల్లో చొరవను, జవాబుదారీతనాన్ని పెంచుతుంది. తద్వారా పన్ను వసూళ్లు కూడా పెరుగుతాయి. జీఎస్టీలో పన్ను శాతాల హేతుబద్ధీకరణ ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉంది. ఇప్పుడున్న నాలుగు రకాల పన్ను (5, 12, 18, 28)శాతాలను రెండు లేదా ఒకటికి కుదించడానికి జీఎస్టీ మండలి రెండుసార్లు కమిటీలు వేసింది. కానీ, ఇంతవరకు నివేదికలు రాలేదు. ఈ సంస్కరణను త్వరగా చేపడితే, తాము ఎంత పన్ను కట్టాలనేది చెల్లింపుదారులకు స్పష్టంగా తెలుస్తుంది. దాంతో జీఎస్టీ వ్యాజ్యాలు తగ్గుముఖం పట్టి రాబడి పెరుగుతుంది. జీఎస్టీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యంత ముఖ్యమైన ఆదాయ వనరు. పన్ను ఎగవేతలను నిరోధించడం, పన్ను చెల్లింపు విధానాలను మరింత సులభతరం చేయడం, పన్ను నిర్మాణంలో సంస్కరణలు తీసుకురావడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలున్నాయి. ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు జీఎస్టీ మండలి కృషి చేయాలి.


సత్వర నిర్ణయాలతో మున్ముందుకు..

జీఎస్టీ మండలి క్షేత్రస్థాయిలో పన్ను అమలు తీరును నిశితంగా గమనిస్తోంది. పన్ను ఎగవేతలను నిరోధించడం, పన్ను చెల్లింపులను సులభతరం చేయడంపై సత్వర నిర్ణయాలు తీసుకుంటోంది. దాంతో ఈ విధానం ఒడుదొడుకులు లేకుండా సాఫీగా సాగిపోతోంది. ఇప్పటివరకు జీఎస్టీ మండలి 52సార్లు సమావేశమైంది. వీటిలో కేంద్ర, రాష్ట్ర ప్రతినిధుల ఏకాభిప్రాయంతోనే నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య ఇటువంటి సహకారం నెలకొనడం జీఎస్టీ విజయవంతంగా అమలు కావడానికి దోహదపడుతోంది. గత అక్టోబరులో జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఎక్స్‌ట్రా న్యూట్రల్‌ ఆల్కహాల్‌ (ఈఎన్‌ఏ)పై రాష్ట్రాలే పన్ను విధించుకొనేలా చూడటం, గేమింగ్‌ ఇండస్ట్రీపై 28శాతం పన్ను విధింపు, జీఎస్టీ ట్రైబ్యునళ్లు ఆచరణలోకి వచ్చేలా నిబంధనల రూపకల్పన వంటి కీలక నిర్ణయాలున్నాయి.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కార్చిచ్చులతో పచ్చదనం బుగ్గిపాలు

‣ పౌరస్వేచ్ఛకు సంకెళ్లు

‣ దేశ ఆర్థికానికి వెన్నుదన్ను

‣ మన ఎన్నికలపై డ్రాగన్‌ కుతంత్రాలు

‣ ఆయువు తోడేస్తున్న వాయువు

‣ బంగ్లాలో ప్రబలుతున్న భారత్‌ వ్యతిరేకత

Posted Date: 18-05-2024గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం