• facebook
  • whatsapp
  • telegram

లవణీకరణతో ఆహార సంక్షోభం

అంతర్జాతీయ మృత్తికా దినోత్సవం

జీవజాలానికి ఆలవాలమైన ధరణిపై- మానవుల చర్యల వల్లే నేల మనుగడకు పెనుముప్పు ఏర్పడుతోంది. మన అస్తిత్వానికి మూలమైన నేలను కాపాడుకొనేందుకు, భవిష్యత్‌ లక్ష్యాలను నిర్దేశించుకొనేందుకు- ఏటా డిసెంబరు అయిదో తేదీన అంతర్జాతీయ మృత్తికా దినోత్సవం నిర్వహించుకోవడం ఆనవాయితీ. నేల సహజత్వాన్ని కాపాడటానికి, ప్రజలందరికీ ఆహారభద్రత కల్పించడానికి, పేదరిక నిర్మూలనకు ఒకప్పటి థాయ్‌లాండ్‌ రాజు భూమిబోల్‌ అదుల్యదేజ్‌ చేసిన కృషికి గుర్తింపుగా ఆయన జయంతి సందర్భంగా డిసెంబరు అయిదున ప్రపంచం మృత్తికా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. నేలలపై విశ్వవ్యాప్త అవగాహన పెంచే దిశగా ఆ రోజున కృషి చేయాలని ఐక్యరాజ్యసమితి పిలుపిచ్చింది. 2014లో అధికారికంగా ఈ దినోత్సవాన్ని జరిపారు. ఈ సంవత్సరం ‘నేల లవణీకరణను ఆపి ఉత్పాదకతను పెంచుదాం’ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

కారణాలెన్నో...

భవిష్యత్తులో ప్రపంచం ఎదుర్కోబోతున్న పెను సమస్యల్లో నేల లవణీకరణ ఒకటి. సాధారణంగా ప్రకృతి ఏర్పరచిన సహజమైన ఉప్పు నేలలు పర్యావరణ వైవిధ్యంలో భాగమే. కానీ, మానవ ప్రేరేపిత చర్యల వల్ల కానీ, ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ సారవంతమైన నేలలు లవణీకరణ చెందడం పర్యావరణ విధ్వంసానికి సూచిక. లవణీకరణ సారవంతమైన నేలలను బంజరుభూములుగా మారుస్తుంది. లవణీకరణ అంటే నేల ఉపరితలంపై, మట్టిలో ఉప్పు సాంద్రత పెరగడం. సముద్ర జలాలు సాగు భూములను, సాధారణ నేలలను ముంచెత్తడం, వరదలు, కాలుష్య కారకాలతో కూడిన వర్షాలు, భూగర్భ జలాల్లో పేరుకుపోతున్న వ్యర్థాలు, కరవు పరిస్థితులు, అడవులను ధ్వంసం చేసి వ్యవసాయ భూములుగా మార్చడంవంటివి నేల లవణీకరణకు ప్రధాన కారణాలు. పట్టణ ప్రాంతాల్లో లవణీకరణ మురుగునీటి పారుదల వల్ల ఎక్కువగా ఏర్పడుతుంది. సహజంగానే నేలలో, నీటిలో లవణాలుంటాయి. అవి అధికమైతే నేలల లవణీయతకు దారితీస్తుంది. లవణీకరణకు ప్రధాన కారణమైన అయాన్లు సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, సల్ఫేట్‌లు, క్లోరిన్‌లు. ప్రభావితమైన లవణాలను బట్టి భూములను సోడిక్‌-సెలైన్‌, సెలైన్‌-సోడిక్‌ నేలలుగా పిలుస్తారు. ప్రవహించే నీటిలో, భూమిపై చేరిన నీటిలో కరిగి ఉన్న లవణాలు నీరు ఆవిరి కావడంతో ఉపరితలంపై మిగిలిపోవడం, భూగర్భజలాల నుంచి లవణాలు ఉపరితలంపైకి కేశనాళిక చర్య ద్వారా చేరడం వల్ల కూడా లవణీయత ఏర్పడుతుంది. భారీ ఆనకట్టలతో నీటిని సముద్రాల్లో కలవనివ్వకుండా అడ్డుకోవడం వల్ల- నదీ ముఖద్వారాల్లోని, తీరప్రాంతాల్లోని నేలలు క్షారమయం అవుతున్నాయి. ఉదాహరణకు అఫ్గానిస్థాన్‌లోని ఆముదర్యా; కజ్‌కిస్థాన్‌, ఉజ్‌బెకిస్థాన్‌ల నుంచి ప్రవహించే సిర్‌దర్యా నదీ ప్రవాహాలను ఆయా దేశాలు మళ్లించడం... అతి పెద్ద సరస్సు అయిన ‘అరల్‌ సీ’ ఎండిపోవడానికి, ఆయా నదుల పరీవాహక ప్రాంతాల భూముల లవణీకరణకు కారణమైంది. భారత్‌లో కొన్ని నదులు సముద్రంలో కలిసే చోట భూములు చౌడు పట్టిపోవడం చూస్తూనే ఉన్నాం.

నేల లవణీకరణ వల్ల మొదట ప్రభావితమయ్యే రంగం- వ్యవసాయం. ముందే మేల్కొని తగిన చర్యలు తీసుకోకుంటే నేల లవణీకరణ వల్ల ఉత్పాదకత తగ్గి భవిష్యత్తులో ఆహార సంక్షోభం ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. పంటలు, మొక్కల పెరుగుదలపై లవణీకరణ పెను ప్రభావం చూపుతుంది. ‘ఇంటర్‌ గవర్నమెంటల్‌ సైన్స్‌ పాలసీ ప్లాట్‌ఫామ్‌’ నివేదిక ప్రకారం ఏటా 19 కోట్ల ఎకరాల నేల- లవణీకరణ వల్ల పనికిరాకుండా పోతోంది. ఈజిప్టులో ఇప్పటికే 35శాతం వ్యవసాయ భూమి లవణీకరణకు గురైంది. ఆస్ట్రేలియా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యా అదే. భారత్‌లో 67 లక్షల హెక్టార్ల భూమి లవణీకరణకు గురైందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. గుజరాత్‌లో అత్యధికంగా 22 లక్షల హెక్టార్లు, ఉత్తర్‌ ప్రదేశ్‌లో 13 లక్షలు, మహారాష్ట్రలో ఆరు లక్షలు, పశ్చిమ్‌ బెంగాల్‌లో నాలుగు లక్షల హెక్టార్ల చొప్పున భూమి లవణీకరణకు గురైంది. దక్షిణాదిలో తీరప్రాంతం ఉన్న రాష్ట్రాల్లో ఈ సమస్య ఎక్కువ. కర్ణాటకలో రెండు లక్షల హెక్టార్లు, ఆంధ్రప్రదేశ్‌లో 1.70లక్షల హెక్టార్ల చొప్పున నేలలు లవణీకరణ చెందాయి. తమిళనాడు, కేరళ తరువాతి స్థానాల్లో ఉన్నాయి.

మనుగడే సవాలు

సరైన ఉపశమన చర్యలు తీసుకోకుండా ఇప్పుడు అనుసరిస్తున్న నీటిపారుదల పద్ధతులనే కొనసాగిస్తే 2050 నాటికి ప్రపంచంలో 50శాతం సాగుభూములు లవణీకరణకు గురయ్యే అవకాశం ఉందని ప్రపంచబ్యాంకు హెచ్చరించింది. నేల సహజంగా ఉప్పుబారడాన్ని ప్రాథమిక లవణీకరణగా పేర్కొంటారు. ద్వితీయ లవణీకరణ అనేది మానవ కార్యకలాపాల వల్ల ఏర్పడుతున్న సమస్య. దీన్ని పూర్తిగా నివారించాల్సిన అవసరం ఉంది. లవణీకరణ చెందిన నేలలను పునరుద్ధరించడానికి పలు శాస్త్రీయ విధానాలు అందుబాటులో ఉన్నా- వేగంగా పెరుగుతున్న సమస్యను వాటిద్వారా ఎంతవరకు నియంత్రించవచ్చనేది ప్రశ్నార్థకం. వ్యవసాయ యోగ్యమైన భూమి చౌడు పట్టిపోవడమనేది నేడు కేవలం రైతులకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. భవిష్యత్తులో ఆహార సంక్షోభానికి, నిరుద్యోగ సమస్య తీవ్రతరం కావడానికి ఇది కారణమవుతుంది. జీవనానికి ఆధారమైన నేలను పర్యావరణ వ్యతిరేక చర్యలతో నాశనం చెయ్యడం మానవ మనుగడకే సవాలుగా మారనుంది. ప్రభుత్వాలు ఈ సమస్యను చిత్తశుద్ధితో పరిష్కరించాలి.

- గొడవర్తి శ్రీనివాసు
 

Posted Date: 04-12-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం