• facebook
  • whatsapp
  • telegram

మసిబారుతున్న ప్రజారోగ్యం



దేశంలో విద్యుత్‌ డిమాండు అంతకంతకు పెరుగుతోంది. దానికోసం బొగ్గును మండించి ఉత్పత్తి చేసే థర్మల్‌ విద్యుత్తే దిక్కవుతోంది. బొగ్గును మండించడం వల్ల తీవ్రస్థాయిలో కలుషిత వాయువులు వెలువడుతున్నాయి. ఇవి ప్రజల ఆరోగ్యంతో పాటు పర్యావరణానికీ సవాలు విసురుతున్నాయి. సౌర విద్యుదుత్పత్తి ద్వారా ఈ కాలుష్యాన్ని గణనీయంగా కట్టడిచేసే అవకాశముంది.


గత రెండు దశాబ్దాల కాలంలో పలు దేశాల్లో థర్మల్‌ విద్యుత్కేంద్రాల నిర్మాణం బాగా తగ్గించి సౌర, పవన, జలవిద్యుత్‌ వంటి సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి వైపు మొగ్గుచూపుతున్నారు. మనదేశం కూడా ఇంతకాలం ఇదే దృక్ఫథంతో ఉన్నా మళ్ళీ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల దిశగా అడుగులు వేస్తోంది. గత కొన్నేళ్లలో అదనంగా పెద్దయెత్తున థర్మల్‌ విద్యుత్‌ అందుబాటులోకి వచ్చింది. ఇది దేశంలో కాలుష్య భూతం తీవ్రస్థాయిలో వాతావరణాన్ని కబళించేందుకు దారితీస్తుంది.


వాతావరణానికి హాని

ఇప్పటికే కాలుష్యం తదితర కారణాలతో వాతావరణ మార్పుల ఫలితంగా వరదలు, కరవులు, వడగండ్లు వంటి విపత్తులు సంభవించి దేశం ఏటా భారీగా నష్టపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నిర్మాణానికి పెట్టుబడులు పెట్టాలని కేంద్ర విద్యుత్‌శాఖ ఇటీవల ప్రైవేటు పారిశ్రామిక వర్గాలను కోరింది. కొత్త ఆర్థిక సంవత్సరం (2024-25)లో దేశంలోని అన్ని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు 87.40 కోట్ల టన్నుల బొగ్గు అవసరమని కేంద్ర బొగ్గుశాఖ ఇటీవల ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో 4.30 లక్షల మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యమున్న అన్ని రకాల విద్యుత్‌ కేంద్రాలు ఉన్నాయి. రోజువారీ గరిష్ఠ జాతీయ విద్యుత్‌ డిమాండు 2.43 లక్షల మెగావాట్ల మేర ఉంది. 2030 నాటికి రోజువారీ డిమాండు 3.66 లక్షల మెగావాట్లకు చేరుతుందని, దాన్ని అందుకోవాలంటే స్థాపిత ఉత్పత్తి సామర్థ్యాన్ని తొమ్మిది లక్షల మెగావాట్లకు చేర్చాలని కేంద్ర విద్యుత్‌ శాఖ ‘సమీక్ష, ప్రణాళిక, పర్యవేక్షణ కమిటీ’ తాజాగా నిర్ణయించింది. ఇందులో అయిదు లక్షల మెగావాట్లు సౌర, పవన, జలవిద్యుత్‌ కేంద్రాలే ఉండాలనేది లక్ష్యం.


దేశంలో పెద్దయెత్తున చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులు, ఆర్థికాభివృద్ధి కారణంగా రోజువారీ విద్యుత్‌ డిమాండు అనూహ్యంగా పెరుగుతోంది. దీన్ని తీర్చాలంటే విద్యుత్‌ కేంద్రాల నిర్మాణం శరవేగంగా జరగాలి. ఇందుకోసం రూ.10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు కావాలి. ప్రభుత్వ రంగం నుంచి భారీగా నిధులు వెచ్చించే పరిస్థితులు లేనందువల్ల ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తున్నారు. గత పదేళ్ల(2014-24)లో దేశంలో రోజువారీ విద్యుత్‌ డిమాండు భారీగా పెరిగినా, ఇప్పటికీ దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు సగటున గంటన్నర సేపు కరెంటు కోతలు ఉంటున్నాయని కేంద్ర విద్యుత్‌శాఖ తాజా నివేదికలో వెల్లడించింది. పదేళ్ల క్రితం కొన్ని ప్రాంతాల్లో రోజుకు అయిదు నుంచి 10 గంటలు కరెంటు కోతలు ఉండేవి. అన్ని గ్రామాలకు విద్యుదీకరణ పూర్తవడం, పరిశ్రమల ఏర్పాటు, ఇతర రంగాల్లో వృద్ధి కారణంగా విద్యుత్‌ వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. దీనికి అనుగుణంగా అదనంగా ఉత్పత్తి పెంచకపోతే మళ్ళీ కరెంటు కోతలు పెరగడం తథ్యం.


సౌర విద్యుత్‌ మేలు

ప్రజలకు కరెంటు సరఫరా వేళలు, ఛార్జీల నిర్ణయాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్‌ చట్టానికి వ్యతిరేకంగా ఏకపక్షంగా తీసుకుంటున్నందువల్ల కరెంటు సంస్థలు అప్పుల్లో కూరుకుపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్దగా సొంత విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు లేనందువల్ల ప్రైవేటు నుంచి లేదా కేంద్ర సంస్థల నుంచి కరెంటు కొని ప్రజలకు సరఫరా చేయాలి. అయినా సగటు సరఫరా వ్యయాన్ని వసూలు చేయడానికి కరెంటు ఛార్జీలను పెంచనీయకుండా, ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్‌ పంపిణీ సంస్థలను అడ్డుకుంటున్నందువల్ల నష్టాల్లో కూరుకుపోతున్నాయి. థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు విషయంలో ఒక్కో మెగావాట్‌కు సగటున రూ.12కోట్ల దాకా వ్యయమవుతుందని తాజా అంచనా. ఈ ఖర్చు పెరిగితే సామాన్య ప్రజలపై ఆర్థికభారం అధికంగా పడుతుంది. ఈ వ్యయాన్ని తగ్గించేలా ప్రభుత్వాల ప్రణాళికలుండాలి. సౌర, పవన విద్యుత్‌ ఉత్పత్తి పెంచితేనే దేశానికి కాలుష్యం, ఆర్థికభారం తప్పుతాయి. కొత్తగా నిర్మించే ప్రతి ఇల్లు, ఇతర భవనాలపై తప్పనిసరిగా సౌరవిద్యుత్‌ ఉత్పత్తి సౌకర్యం ఏర్పాటుచేసేలా నిబంధనలు రూపొందించాలి. కాలుష్యం లేకుండా ఉచిత వనరులతో ఉత్పత్తయ్యే సౌర విద్యుత్తును ఉపయోగించుకోవాలి. అదనంగా థర్మల్‌ విద్యుదుత్పత్తిని చేపడితే- మరింతగా కాలుష్యం కోరల్లో చిక్కుకున్నట్లే! 


- మంగమూరి శ్రీనివాస్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ డ్రాగన్‌ దూకుడుకు ముకుతాడు

‣ మహాలయం ముప్పున హిమాలయం

‣ సంరక్షణ కొరవడి సంక్షోభం

‣ స్వావలంబనలో కీలక మైలురాయి

‣ మద్దతుకు భరోసా.. రైతుకు దిలాసా!

Posted Date: 27-03-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం