• facebook
  • whatsapp
  • telegram

సంపూర్ణ స్వచ్ఛతే పరమావధి

గ్రామీణ పారిశుద్ధ్యంపై కేంద్రం దృష్టి

స్వాతంత్య్రం కన్నా పారిశుద్ధ్యం ముఖ్యమైనది అన్నారు మహాత్మా గాంధీ. అందరికీ పారిశుద్ధ్య వసతి ఉండాలన్నది ఆయన కల. బాపూజీ ఆశయసాధనకు ప్రతిన బూనిన ప్రభుత్వం స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాన్ని 2014 అక్టోబర్‌ రెండో తేదీన గాంధీ జయంతి నాడు ప్రారంభించింది. 2019 అక్టోబరు రెండున బహిరంగ మలవిసర్జన రహిత గ్రామీణ భారతంగా ప్రకటించి- మహాత్ముడికి నివాళి అర్పించింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం... దేశవ్యాప్తంగా గ్రామాల్లో పది కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించారు. 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని రెండున్నర లక్షల పైచిలుకు గ్రామ పంచాయతీలు బహిరంగ మలవిసర్జన రహితం(ఓడిఎఫ్‌)గా ప్రకటించుకొన్నాయి.

పంచాయతీల పాత్ర కీలకం

దేశాన్ని పరిశుభ్ర, ఆరోగ్య, సుసంపన్న భారత్‌గా తీర్చిదిద్దే దిశగా స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం సత్ఫలితాలను సాధించింది. సంపూర్ణ గ్రామీణ స్వచ్ఛ భారతం సాధించడానికి కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖలోని తాగునీరు-పారిశుద్ధ్య విభాగం 2019 నుంచి 2029 వరకు గ్రామీణ పారిశుద్ధ్య ప్రణాళికను రచించి, చేపట్టాల్సిన కార్యక్రమాలను నిర్దేశించింది. పారిశుద్ధ్య అలవాట్లను జన జీవితంలో భాగంగా చేయడమే ఈ ప్రణాళిక ముఖ్యోద్దేశం. స్థానిక ప్రభుత్వాల నేతృత్వంలో అందరికీ మరుగుదొడ్ల వసతి అందించాలని సంకల్పించింది. ప్రభుత్వం, సంపూర్ణ పారిశుద్ధ్య భారతాన్ని నిర్మించే క్రతువులో బహిరంగ మలవిసర్జన రహిత ప్రవర్తనను సుస్థిరం చేయడంతో పాటు- అన్ని గ్రామాలను ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణతో స్వచ్ఛతను మెరుగుపరచి, ఓపెన్‌ డెఫికేషన్‌ ఫ్రీ(ఓడీఎఫ్‌) ప్లస్‌ని సాధించాలని స్వచ్ఛ భారత్‌ రెండో దశను ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని 2020-21 నుంచి 2024-25 వరకు రూ.1.40 లక్షల కోట్ల బడ్జెట్‌తో అమలు చేస్తున్నారు. స్వచ్ఛ భారత్‌ మిషన్‌(గ్రామీణ్‌)- రెండో దశలో మరుగుదొడ్డి వాడకంతోపాటు, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు, బయో-డిగ్రేడబుల్‌ ఘన వ్యర్థాలు, మురుగు నీటి నిర్వహణలపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. గ్రామీణ స్థానిక సంస్థలకు కేటాయించిన ఆర్థిక సంఘం నిధుల్లో సగం తాగునీరు, పారిశుద్ధ్య రంగాలకు ఖర్చు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా అనేక గ్రామపంచాయతీల్లో డంపింగ్‌ యార్డులు, చెత్తను వేరు చేసే షెడ్లను నిర్మించారు. 73వ రాజ్యాంగ సవరణ చట్టం-1992 ద్వారా పారిశుద్ధ్యాన్ని 11వ షెడ్యూల్‌లో చేర్చడంవల్ల గ్రామాల్లో పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించడం పంచాయతీ రాజ్‌ సంస్థల ప్రధాన విధిగా మారింది. ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు శిక్షణ ఇచ్చి, తగిన సౌకర్యాలు సమకూర్చి, బలోపేతం చేయాలి. ఓడీఎఫ్‌ ప్లస్‌ సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి. వ్యర్థాల సేకరణ, రవాణా, భూమిలో పూడ్చటం అనే మూడు అంశాలు ఘన వ్యర్థాల పరిష్కారానికి కీలకం. ప్రాణాంతకంగా మారుతున్న ప్లాస్టిక్‌ సక్రమ నిర్వహణకు గ్రామ పంచాయతీల సిబ్బందిని సుశిక్షితులను చేయాలి. ఘన వ్యర్థాల నిర్వహణలో సంఘటిత, అసంఘటిత వ్యవస్థల మధ్య సంబంధం గురించి ప్రణాళికా సంఘం నియమించిన జె.ఎస్‌.బజాజ్‌ కమిటీ-1995 చేసిన సూచనలు పరిగణించాలి. మార్కెట్‌ ప్రేరేపిత పునరుద్ధరణ (రీసైక్లింగ్‌) పరిశ్రమ, ప్రభుత్వ తోడ్పాటు లేకుండానే మనుగడ సాగిస్తోందని అడవులు, పర్యావరణంపై నియమించిన టీఎస్‌ఆర్‌ సుబ్రమణియన్‌ కమిటీ నివేదిక-2014 తెలిపింది. పై రెండు కమిటీల సూచనల మేరకు వ్యర్థాల నిర్వహణకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి.

జీవనశైలిలో మార్పుల కోసం...

ఓడీఎఫ్‌ ప్లస్‌ లక్ష్యాన్ని చేరుకోవడానికి గ్రామ స్థాయిలో అంగన్‌వాడీల ద్వారా సురక్షితమైన పారిశుద్ధ్య పద్ధతులను ప్రచారం చేయాలి. ఇందుకోసం మహిళా, శిశు అభివృద్ధి సంక్షేమ శాఖ, పాఠశాలలు, కళాశాలల్లో స్వచ్ఛతతోపాటు, ఓడీఎఫ్‌ ప్లస్‌ భావనలను పాఠ్యాంశాలుగా అందించాలి. ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపరచడానికి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కృషి చేయాలి. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకోసం గ్రామీణాభివృద్ధి శాఖ పాటుపడాలి. 15వ ఆర్థిక సంఘం నిధులను పారిశుద్ధ్యానికి వినియోగించడానికి పంచాయతీ రాజ్‌ శాఖ, ఇతర అవసరమైన శాఖల మధ్య సమన్వయం తప్పనిసరి. గ్రామ స్థాయి ఉద్యోగులందరూ సంయుక్తంగా, చిత్తశుద్ధితో కార్యసాధనకు పూనుకొంటేనే ఓడీఎఫ్‌ ప్లస్‌ సాధన సులువవుతుంది. నిరంతరం వ్యర్థాల నిర్వహణ చేపట్టడం ఒకింత వ్యయ, ప్రయాసలతో కూడుకొన్నది కాబట్టి- నూతన, సౌకర్యవంతమైన, పర్యావరణ హితకర పద్ధతులను అభివృద్ధి చేయాలి. ఓడీఎఫ్‌ కంటే ఓడీఎఫ్‌ ప్లస్‌ కార్యక్రమాలు నిత్యం వేలమంది భాగస్వామ్యంతో, ప్రతి ఇంటితోనూ ముడివడి ఉంటాయి. బహుముఖ ప్రోత్సాహక విధానాలను అవలంబించి గ్రామీణుల ప్రవర్తనా శైలిలో మార్పు తేవాలి. గ్రామ పంచాయతీలు, గ్రామస్థాయి ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, విద్యార్థులు, స్వచ్ఛద సంస్థలు, కార్పొరేట్‌ సంస్థలు సమష్టిగా కృషి చేస్తూ మరో ప్రజా ఉద్యమంగా రూపుదిద్దితేనే సంపూర్ణ గ్రామీణ స్వచ్ఛభారత్‌ సాకారమవుతుంది.

- ఎ.శ్యామ్‌కుమార్‌
 

Posted Date: 13-01-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం