• facebook
  • whatsapp
  • telegram

జీవజాతులకు పెను ముప్పు!

అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం

‘ప్రకృతి సమస్యల పరిష్కారంలో మేము భాగస్వాములం’ అనే ఇతివృత్తంతో ఐక్యరాజ్యసమితి మే 22న అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. అలాగే, ‘ప్రకృతితో సామరస్యంగా జీవించు’ అంటూ జీవవైవిధ్య పరిరక్షణకు దశాబ్ద ప్రణాళికను అమలు చేస్తోంది. అడవుల దహనం, జనాభా పెరుగుదల, భారీ ప్రాజెక్టుల నిర్మాణం, ఇష్టారాజ్యంగా పరిశ్రమల ఏర్పాటు, యథేచ్ఛగా గనుల తవ్వకాలు, నగరీకరణ, థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు, విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ వినియోగం, వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకం తదితరాలు జీవవైవిధ్యానికి చేటుచేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా రోజుకు సగటున 200 జీవులు అంతరిస్తున్నట్లు అంచనా! అతిపెద్ద సముద్ర జీవుల్లో ఒకటైన వేల్‌ షార్క్‌ (తిమింగలం) వంటివి ఎన్నో అంతరించిపోతున్న జీవుల జాబితాలోకి చేరుతున్నాయి. పెరుగుతున్న భూతాపాన్ని నియంత్రించి, సత్వరం జీవవైవిధ్యాన్ని కాపాడుకోకపోతే 2050 నాటికి ఊహకందని విపరీత పరిణామాలెన్నో చోటుచేసుకుంటాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

అమెరికా కలిసివచ్చేనా?

జీవుల మద్య భేదాన్నే జీవవైవిధ్యం అంటారు. ప్రకృతి ఈ సమతౌల్యాన్ని కోల్పోతే జంతువులు, పక్షుల నుంచి మనుషులకు సోకే రోగాలు పెచ్చుమీరుతాయి. మృత కళేబరాలను తినే రాబందు  జాతి దాదాపు అంతరించిపోయింది. దానితో చనిపోయిన జంతువుల శరీరాలు కుళ్లిపోయి సూక్ష్మజీవులు విస్తరించి రోగాలు ప్రజ్వరిల్లుతున్నాయి. లక్షల కొలదీ ఉన్న జీవరాశుల్లో ఏ ఒక్క జీవజాతి అంతరించినా దాని ప్రభావం మానవ మనుగడమీద పడుతుంది. ‘తేనెటీగల సంతతి అంతరించిపోతే నాలుగేళ్లకు మానవజాతి కనుమరుగవుతుంది’ అన్న ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌ వ్యాఖ్యలు ఇక్కడ ప్రస్తావనార్హం. అందుకే భవిష్యత్తు తరాలకు జీవవైవిధ్యమే వెలకట్టలేని ఆస్తి అని ఐక్యరాజ్యసమితి అభివర్ణించింది. 196 దేశాలు భాగస్వామ్య పక్షాలైన అంతర్జాతీయ జీవ వైవిధ్య ఒడంబడికకు (యూఎన్‌సీబీడీ) అనుగుణంగా జీవవైవిధ్య పరిరక్షణకు ఐరాస కృషిచేస్తోంది. ప్రతీ రెండేళ్లకోసారి కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌ (సీఓపీ) నిర్వహించే సదస్సులో సాధించిన ప్రగతిని చర్చించి భవిష్యత్తు ప్రణాళికలను రూపొందిస్తోంది. సీఓపీ-11 సదస్సుకు 2012లో హైదరాబాద్‌ ఆతిథ్యమిచ్చింది. సీఓపీˆ-15 వచ్చే అక్టోబరులో చైనాలోని కున్మింగ్‌ నగరంలో జరగాల్సి ఉంది. కరోనాతో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆ సదస్సు ఆన్‌లైన్‌ వేదికగా జరిగే అవకాశముంది. మరోవైపు, అనేక విషయాల్లో ప్రపంచ పెద్దన్నగా వ్యవహరించే అమెరికా అంతర్జాతీయ జీవ వైవిధ్య ఒడంబడికలో ఇప్పటికీ చేరకపోవడం గమనార్హం. మానవాళికి చేటుచేసే  ఆయుధాల వ్యాపారంలో ముందుండే అగ్రరాజ్యం యూఎన్‌సీబీడీని మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది. బైడెన్‌ అధ్యక్షులయ్యాక అమెరికా తీరు కాస్త మారినట్లు కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో యూఎన్‌సీబీడీలోనూ అమెరికా చేరి, జీవవైవిధ్య పరిరక్షణకు ఆర్థికంగా చేయూతనిస్తుందని ప్రపంచదేశాలు ఆశిస్తున్నాయి. మరోవైపు, భూగోళం మీద 33 శాతం అడవులు ఉండాలి. కానీ, ప్రస్తుతం 31 శాతమే ఉన్నాయి. ఏటా భూమ్మీద 2.4 కోట్ల ఎకరాల్లో అడవులు కనుమరుగతున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద అరణ్యాల్లో ఒకటైన అమెజాన్‌ అడవిలో ఇటీవల రేగిన మంటలతో భారీయెత్తున హరిత విధ్వంసం జరిగింది. ఇలాంటి వాటిని అరికడుతూ, ఏటా భూమ్మీద భారీయెత్తున పచ్చటి వనాలు సృష్టించగలిగితేనే ప్రకృతిని నిలబెట్టుకోగలుగుతాం.

ఆచరణ అంతంతమాత్రం

సహజసిద్ధ, సంప్రదాయ వనరులతో జీవవైవిధ్యంలో భారతదేశానికి ప్రత్యేకస్థానం ఉంది. అయితే, సంబంధిత చట్టాల అమలులో ప్రభుత్వాల ఉదాసీనత చేటుచేస్తోంది. అంతర్జాతీయ జీవవైవిధ్య ఒడంబడికలో సభ్యదేశమైన భారత్‌ 2002లో జాతీయ జీవవైవిధ్య మండలి ఏర్పాటు చేసి చట్టాన్ని రూపొందించింది. కానీ, దాని అమలులో అడుగడుగునా అలసత్వం కనిపిస్తోంది. గ్రామాల్లో జీవ వైవిధ్య కమిటీలు ఏర్పాటు చేసి పంచాయతీ పాలకవర్గం వర్గం ద్వారా ఆయా ఆవాసప్రాంతాల్లోని సంప్రదాయ, జీవవైవిధ్య వనరుల్ని సంరక్షించాల్సి ఉంది. ప్రజలందరికీ జీవవైవిధ్య అవగాహన కల్పించాలి. ఇదంతా ఏదో పేరుకే జరుగుతోంది. నిర్వహణలో చిత్తశుద్ధి కొరవడింది. జీవవైవిధ్య కమిటీల విషయంలో సుప్రీంకోర్టు కలగజేసుకుని ప్రభుత్వాలను హెచ్చరించిన సందర్భాలున్నాయి. 1986 పర్యావరణ పరిరక్షణ, 1980 అటవీ పరిరక్షణ, 1981 వాయు కాలుష్య నియంత్రణ, 1974 జలకాలుష్య నియంత్రణ, 1972 వన్యప్రాణుల సంరక్షణ చట్టాల్లాంటివి ఎన్ని ఉన్నా దేశంలో కాలుష్యం పెరిగిపోతూనే ఉంది. అడవులు, వన్యప్రాణులు తరిగిపోతూనే ఉన్నాయి. ప్రపంచ సగటు కన్నా తక్కువగా మన దేశంలో 21శాతం అడవులే ఉండటం కలవరపరుస్తోంది. తెలంగాణలో 26 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 29 శాతం మేర అరణ్యాలుండటం కాస్త ఉపశమనం కలిగించే విషయమే అయినా పచ్చదనం ఇంకా చాలా పెరగాల్సి ఉంది. అంతర్జాతీయ ఒడంబడికకు తగినట్టు జీవవైవిధ్య పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలకులు కృషిచేస్తేనే భావితరాలకు భద్రమైన భవిష్యత్తును అందించగలం! 

- చిలుకూరి శ్రీనివాసరావు 

(జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత)
 

Posted Date: 22-05-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం