• facebook
  • whatsapp
  • telegram

  ప్రకృతి విలాపమే విపత్తులు


    ర్యావరణాన్ని సంరక్షిస్తే, అది మానవాళి ప్రయోజనాలను కాపాడుతుంది. యథేచ్ఛగా విధ్వంసకర దుశ్చర్యలకు తెగబడితే, అనూహ్య స్థాయిలో విపత్కర పరిస్థితులే దాపురిస్తాయి. ఇది, కొన్నేళ్లుగా పదేపదే నిరూపితమవుతున్న సార్వత్రిక సత్యం. ప్రకృతి పట్ల మనిషిలో మేటవేసిన అలసత్వం నిర్లక్ష్యం, అడ్డూఆపూ లేని పారిశ్రామికీకరణల దారుణ పర్యవసానమే- విపత్తుల పరంపర. దేశీయంగా వాటి దుష్ప్రభావ తీవ్రతకు తాజా అధ్యయనమొకటి అద్దం పడుతోంది. భయానక ఉత్పాతాల కారణంగా నిలువనీడ కోల్పోయి వేరేచోటుకు తరలుతున్నవారిపై సీఎస్‌ఈ (వైజ్ఞానిక పర్యావరణ కేంద్రం) నివేదిక దిగ్భ్రాంతకర వాస్తవాలను గుదిగుచ్చింది. నిరుడు వరదలు, తుపానులు, కరవుకాటకాల మూలాన విశ్వవ్యాప్తంగా నమోదైన ప్రతి అయిదు నిర్వాసిత ఘటనల్లో ఒకటి భారత్‌లో చోటుచేసుకున్నదే. ఇండియాలోనే అటువంటి 50 లక్షల ఉదంతాలు వెలుగుచూశాయి. గత సంవత్సరం 19 ప్రకృతి విపత్తులు 1,357 నిండుప్రాణాల్ని కబళించాయి. మొన్నటి నిసర్గ తుపాను మహారాష్ట్ర, గుజరాత్‌లను అమితంగా భయపెట్టి కడకు పరిమిత నష్టంతో ఉపశమించినా- ఇటీవలి అంపన్‌ సైక్లోన్‌ పశ్చిమ్‌బంగ, ఒడిశాలలో లక్షలాది జీవితాలను కడగండ్లపాలు చేసింది. 1990-2016 సంవత్సరాలమధ్య 235 చదరపు కిలోమీటర్ల మేర తీరప్రాంతం కోతకు గురైన ఇండియాలో నేటికీ ప్రతి ఉత్పాతమూ తనదైన విషాదముద్ర వేస్తూనే ఉంది. పర్యావరణ విధ్వంసం, భూతాపాలే ఇందుకు మూలకారణాలంటున్న సీఎస్‌ఈ అధ్యయనం- దేశంలో అటవీ ఛాయ హరించుకుపోతుండటాన్నీ ప్రస్తావించింది. దేశవ్యాప్తంగా సుమారు 280 జిల్లాల్లో అడవుల విస్తీర్ణంలో క్షీణత, అయిదు నదీ పరీవాహక ప్రాంతాల్లో తీవ్ర నీటిఎద్దడి- ప్రకృతి సమతూకం ఛిద్రమవుతోందనడానికి ప్రబల దృష్టాంతాలు. అంతకుమించి, తక్షణ దిద్దుబాటు చర్యల ఆవశ్యకతను ఎలుగెత్తుతున్న ప్రమాద సంకేతాలు.
    ఇంకో ముప్ఫై సంవత్సరాల్లో (2050 నాటికి) సబ్‌- సహారన్‌ ఆఫ్రికా, దక్షిణాసియా, లాటిన్‌ అమెరికా దేశాల్లోనే 14 కోట్లకు పైగా పర్యావరణ వలసలు సంభవిస్తాయని ఆ మధ్య ప్రపంచబ్యాంకు అంచనా వేసింది. కర్బన ఉద్గారాల పరిమాణంతోపాటు ఉష్ణోగ్రతలూ పెరిగి జల కాలుష్యం, అంటురోగాలు, ఆహార సంక్షోభం, అనూహ్య విపత్తులు కమ్ముకుంటాయన్న హెచ్చరికలు అక్షరసత్యమని ఇప్పటికే రుజువవుతున్నాయి. దాదాపు 17కోట్ల మందికి ఆవాసమైన భారత తీర ప్రాంతంలో తుపానులు కోర సాచినప్పుడల్లా కొంపా గోడూ కోల్పోయి వేరేచోటుకు తరలిపోయే విషాదాలు పునరావృతమయ్యే ప్రమాదం- జాతి నెత్తిన కత్తిలా వేలాడుతోంది. ఇండియాలోని 35 రాష్ట్రాలూ కేంద్రపాలిత ప్రాంతాల్లో 27కు ప్రకృతి వైపరీత్యాల ముప్పు పొంచే ఉందని సర్కారీ అధ్యయనాలే స్పష్టీకరిస్తున్నాయి. ఉత్పాతాల కారణంగా నష్టాలను కనిష్ఠ స్థాయికి కట్టడి చేసేలా సకల విధ సన్నాహాలెంత కీలకమో, పర్యావరణాన్ని కాపాడుకునే కార్యాచరణా అంతే ముఖ్యం. దశాబ్దాల నిర్లక్ష్యం ఇకపైనా కొనసాగితే- వాతావరణ మార్పులు పోనుపోను మానవాళి మనుగడకే జీవన్మరణ సమస్యగా పరిణమించడం తథ్యం. మునుపటికన్నా ఎక్కువగా అరేబియా మహా సముద్రంలో తుపానుల కల్లోలం పెరగడం, వివిధ దేశాల్లో ఉష్ణ పవనాలు, అమెజాన్‌ వర్షారణ్యాలూ తగలబడటం, దేశాల ఎల్లలు దాటి మిడతల దండు పోటెత్తడం... ఇవన్నీ ప్రకృతి విలాపాలే. ఒక్క జీన్స్‌ తయారీకి 7,500 లీటర్ల నీరు వాడుతున్నారు. అది ఏడేళ్లపాటు ఓ వ్యక్తి దాహార్తిని తీర్చగల జలరాశికి సమానం. జలాలు, అడవులే కాదు- ప్రకృతి ప్రసాదించిన సహజ సంపద అంతా విచక్షణాయుతంగా మానవజాతికి గరిష్ఠంగా మేలు చేసేలా సద్వినియోగం కావాలి. అటువంటి పర్యావరణ స్పృహ ప్రభుత్వాలు, పాలక గణాల్లో కొరవడితే- రేపటితరాలు మనల్ని క్షమించవు!

 

Posted Date: 25-06-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం