• facebook
  • whatsapp
  • telegram

జలచరాల నుంచి పెనుముప్పు

చేపల చెరువుల్లో కాలుష్య సమస్య

తీరప్రాంతాలు ఎక్కువగా ఉన్న దేశాల్లో జలచరాలను ఆహారంగా తీసుకునే అలవాటు ఉంటుంది. భారతావనిలో సువిశాల తీరప్రాంతానికి తోడు- చెరువులు, కాలువలు సైతం ఉండటంతో చేపలు, రొయ్యల పెంపకం ఇక్కడ పెద్దస్థాయిలో జరుగుతుంది. పలు రాష్ట్రాల్లో వీటిని పెంచడంతోపాటు వివిధ దేశాలకూ ఎగుమతి చేస్తారు. వీటివల్ల భారత్‌కు విదేశీ మారక ద్రవ్యమూ పెద్దమొత్తంలోనే లభిస్తుంది. వీటి నుంచి వచ్చే ఆదాయాన్ని చూసి మంచి పంటలు పండే భూములనూ రొయ్యల చెరువులుగా మార్చిన దాఖలాలు ఆంధ్రప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని బర్డ్‌ఫ్లూ భయం వణికిస్తున్న నేపథ్యంలో జలచరాలకు డిమాండు బాగా పెరిగింది. చేపలు, రొయ్యలకు గిరాకీ ఇనుమడించింది. ఇప్పుడు ఆ మత్స్య సంపద విషయంలోనూ సరికొత్త భయాలు మొదలవుతున్నాయి. దేశంలోని పది రాష్ట్రాల్లో ఉన్న 241 చేపల చెరువుల్లో పెద్ద మొత్తంలో సీసం, కాడ్మియం ఉన్నాయని తాజా పరిశోధనలలో తేలింది. ఇది కేవలం కొద్ది ప్రాంతాల్లో చేసిన పరీక్షల్లోనే తేలింది. ఈ పదార్థాలవల్ల ప్రజారోగ్యానికి ముప్పుతో పాటు పర్యావరణమూ దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చేపల చెరువుల నీటి నాణ్యత విషయంలో తమిళనాడు, బిహార్‌, ఒడిశా రాష్ట్రాల పరిస్థితి దారుణంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ్‌బంగ, పుదుచ్చేరిలలోనూ ఈ నాణ్యత తీసికట్టుగానే ఉందన్నది నిపుణుల మాట. ఈ రాష్ట్రాలలోని కొన్ని చెరువుల నీళ్లలో కాలుష్యం తీవ్రస్థాయిలో ఉండటం వల్ల వాటిలో పెరిగిన చేపలు, రొయ్యలు, ఇతర జలచరాలు తినడానికి పనికిరావని చెబుతున్నారు.

దీర్ఘకాలిక నష్టం

దేశంలోని పలు రాష్ట్రాల్లోగల చేపల చెరువుల్లో సీసం, కాడ్మియం కాలుష్యం తీవ్రస్థాయిలోనే ఉంది. ఇవి చాలా త్వరగా కణాల్లో చేరిపోయి, మానవ శరీరంలోకి ప్రవేశించి దీర్ఘకాలిక నష్టాన్ని కలగజేస్తాయి. పిల్లలు, గర్భిణులు, వృద్ధులు ఈ పదార్థాలున్న చేపలను తింటే వాళ్ల ఆరోగ్యంపై ప్రభావం చాలా తొందరగా కనిపిస్తుందని వైద్యనిపుణులు తెలియజేస్తున్నారు. గతంలో నార్వేలో పెంచిన సాల్మన్‌ చేపల విషయంలో ఒకసారి ఇలాంటి సమస్యే తలెత్తింది. దాంతో కొంతకాలం పాటు నార్వే నుంచి వచ్చే సాల్మన్‌ చేపలను రష్యా నిషేధించింది. అనంతరం తమ చేపల్లో సీసం, కాడ్మియం లోహాలు అనుమతించిన స్థాయిలోనే ఉన్నాయని నార్వే రుజువు చేసుకుని, అంతర్జాతీయంగా అన్ని దేశాలతోనూ సంప్రదింపులు జరిపి తమ ఎగుమతులు పునరుద్ధరించుకుంది. చెరువుల్లో నత్రజనిని పెద్దమొత్తంలో వాడటంవల్ల వాటిలో నాచు పెరుగుతోంది. వ్యర్థాల నిర్మూలనపై మాత్రం చేపలు, రొయ్యల పెంపకందారులు సరిగా దృష్టిపెట్టడం లేదు. చెరువుల ఉపరితలాల్లో నాచు లాంటి పదార్థాలు చేరడం వల్ల కింది ప్రాంతాలకు తగినంత ఆక్సిజన్‌ అందదు. దాంతో కిందిభాగంలో పెరిగే లక్షలాది చేపలు ఊపిరాడక విలవిల్లాడతాయి. దానికి తోడు చేపలు బాగా పెరగాలన్న ఉద్దేశంతో హార్మోన్లు సైతం జోడించడంవల్ల వాటిలో పోషకవిలువలు తగ్గిపోతాయని, ఇతర సమస్యలు ఎక్కువ అవుతాయన్నది నిపుణుల మాట.

ఇటీవల ఆక్వా చెరువులపై చేసిన సర్వేలో దాదాపు 40 శాతం చెరువుల్లో పెద్దమొత్తంలో యాంటీబయటిక్స్‌ ఉపయోగిస్తున్నట్లు తేలింది. ఇవి మనుషులకు మరో రకమైన ప్రమాదం తెచ్చిపెడుతున్నాయి. ‘యాంటీ మైక్రోబయల్‌ రెసిస్టెన్స్‌’ (ఏఎంఆర్‌) సమస్యకు ప్రధాన కారణం ఇదేనని వైద్యరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేపల చెరువుల్లో వాడుతున్న యాంటీబయటిక్స్‌ వల్ల మనుషుల్లో ఏఎంఆర్‌ వస్తుందని, అది ప్రజారోగ్యానికి పెను ముప్పు కలుగజేస్తుందని అంటున్నారు. ఉత్పత్తిని పెంచడానికి కొన్ని సందర్భాల్లో అనవసరంగా మందులు, రసాయనాలు వాడుతుంటారు.  గేదెల నుంచి పాలు తీయడానికి వాటికి ఇంజెక్షన్లు చేయడం ఇప్పటికీ పలు ప్రాంతాల్లో చూస్తుంటాం. 2020లో కేరళలో ఉత్పత్తి అయిన చేపల్లో ఫార్మాలిన్‌ చాలా పెద్దమొత్తంలో కనపడటంతో రెండు వేల కిలోల చేపలను పారేయాల్సి వచ్చింది. చేపలు ఎక్కువకాలం నిల్వ ఉండటానికి ఫార్మాలిన్‌ ఉపయోగిస్తారు. దిల్లీ లాంటి మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఇలాంటి సమస్యే తలెత్తింది.

వ్యర్థాలతో అనర్థం

చెరువుల్లో చేపలు విసర్జించే వ్యర్థాల వల్ల సైతం కాలుష్యం తీవ్రస్థాయిలోనే ఉంటోంది. వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసే వ్యవస్థ మన దేశంలో అంతగా లేదు. చేపలు, రొయ్యల వ్యర్థాలను కాలువలు, చెరువుల సమీపంలోనే పారేయడం వల్ల పర్యావరణానికి తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లుతోంది. ఈ వ్యర్థాల నిర్వహణ, జలచరాల పెంపకం విషయంలో నియంత్రణ లేకపోవడమే ఈ సమస్యలన్నింటికీ మూలకారణం అవుతోంది. నియంత్రణ లేని ఆక్వా సాగు వల్ల సమీప భవిష్యత్తులో పెను ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న బర్డ్‌ ఫ్లూ, గతంలో వచ్చిన స్వైన్‌ ఫ్లూ వంటి వ్యాధులకు ప్రధాన కారణం ఏంటో అందరికీ తెలుసు. అందుకే ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్లు తెరిచి ఆక్వా సాగుపై దృష్టి పెట్టాలి. చాలా పెద్దస్థాయిలో చేపలు, రొయ్యల సాగు మన దేశంలో జరుగుతుండటం, వాటి ఎగుమతుల మీద దేశ ప్రతిష్ఠ కూడా ఆధారపడటం వల్ల ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరవాలి. విచ్చలవిడిగా రసాయనాలు, యాంటీబయటిక్స్‌, ఇతర పదార్థాలు వాడకుండా నియంత్రించడంతో పాటు కాలుష్య నియంత్రణకూ చర్యలు చేపట్టాలి.

- రఘురామ కామేశ్వరరావు పువ్వాడ
 

Posted Date: 30-01-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం