• facebook
  • whatsapp
  • telegram

ప్రకృతిని రక్షిస్తేనే భద్రత!

వాతావరణం కుంగి... మహమ్మారుల దాడి
 

ప్రకృతి విపత్తులు, మహమ్మారులు... ఒకేసారి దాడి చేస్తూ మనిషి మనుగడనే ప్రశ్నిస్తున్నాయి. ఈ దాడిని ఎదిరించడం అటుంచితే, కనీసం తట్టుకునే సామర్థ్యం కూడా ప్రభుత్వాలకు లేకుండా పోతోంది. ఒకవైపు కరోనా మహమ్మారితో అల్లాడుతుంటే వరసపెట్టి వచ్చిన తుపానులు, భారీ వర్షాలు సమస్యను మరింత జటిలం చేశాయి. పెరిగిన చలి వాతావరణం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు కొవిడ్‌ రెండో అల తీవ్రతను పరిచయం చేసింది. ఐరోపాలో కరోనా అలజడి పెరిగింది. ఇప్పటికే ఒకసారి కరోనాబారిన పడిన బ్రిటిష్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ మళ్లీ స్వీయ నిర్బంధంలోకి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. మనదేశంలో పశ్చిమ్‌ బంగను ఇటీవల అతలాకుతలం చేసిన అంఫన్‌ తుపాను అక్కడి ప్రభుత్వ సామర్థ్యానికి పరీక్ష పెట్టింది. వాతావరణ మార్పుల వల్ల తలెత్తే ముప్పుతో పాటు, కొవిడ్‌ తీవ్రతను తట్టుకోవడం తృణమూల్‌ సర్కారుకు కత్తిమీద సామే అయ్యింది. వాతావరణ మార్పులు అన్ని రకాల ముప్పు తీవ్రతను పలురెట్లు పెంచుతున్నట్లు ఆఫ్రికన్‌ వాతావరణ నిపుణుల అంచనా. ఈ మార్పుల వల్ల సంభవించే తుపానులు, భారీ వర్షాల కారణంగా- ఆహారం, మంచినీరు, విద్యుత్‌ సరఫరా దెబ్బతిని ఆసుపత్రి సేవలకూ విఘాతం వాటిల్లుతోంది. ఇవన్నీ మహమ్మారుల ముప్పును మరింతగా పెంచుతున్నాయి. అసలు వాతావరణ మార్పుల వల్లే అనేక రకాల మహమ్మారులు తలెత్తుతున్నాయన్నది నిపుణుల మాట.
 

ఇటీవల తెలుగు రాష్ట్రాల్ని ముంచెత్తిన భారీ వర్షాలు మురుగునీటి పారుదల వ్యవస్థల డొల్లతనాన్ని బయటపెట్టాయి. నీటి ప్రవాహ మార్గాలకు అడ్డుపడుతూ నిర్మాణాలు చేపట్టడం ద్వారా ప్రకృతి మీద పైచేయి సాధించేందుకు మనిషి చేసిన ప్రయత్నం వికటించింది. తుపాను సమయంలో బాధితులందరికీ ఒకేచోట ఆశ్రయం కల్పించడంతో మళ్లీ మహమ్మారి ముప్పు అక్కడ కనిపించింది. దాంతోపాటు డయేరియా, కలరా లాంటి అంటువ్యాధులూ తలెత్తే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమైంది. తగిన నీటి సదుపాయం, పారిశుద్ధ్యం లేకపోవడంతో అంటువ్యాధులతో పాటు మహమ్మారులూ వ్యాపిస్తాయని ఆరోగ్యరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఒకే తరహా పరిష్కారాలు కూడా సాధ్యం కావు. తుపాను రక్షణ కేంద్రాల్లో ఉండే వారందరికీ మాస్కులు ఇవ్వడం, వారికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించడం, అత్యవసర ఔషధాలు ఇవ్వడం లాంటి చర్యలు చేపట్టడం అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం కొంతవరకే సాధ్యమవుతోంది. భారత్‌ వంటి దేశాల్లో వీటిని పాటించలేక పోయారన్నది నిష్ఠుర సత్యం. వాతావరణ మార్పుల కారణంగా సంభవించే ప్రకృతి విపత్తులు, ప్రజారోగ్య వ్యవస్థలపై వాటి ప్రభావం, వాటి కారణంగా విజృంభించే అంటువ్యాధులు, మహమ్మారుల తీవ్రతను తరతమ భేదాలతో ప్రపంచ దేశాలెన్నో చవిచూశాయి. దక్షిణాఫ్రికాలో వరదల సమయంలో భౌతిక దూరం పాటించడం అసాధ్యంగా మారింది.
 

అంపన్‌ తుపాను తరవాత పశ్చిమ్‌ బంగలో కొవిడ్‌ మరణాల రేటు జాతీయ సగటుకు రెట్టింపైంది. ఇది కేవలం రెండు పరిణామాలు ఒకేసారి సంభవించడం వల్లే కాదని, ఒకదాని ప్రభావం మరోదాన్ని మరింత తీవ్రతరం చేయడమేనన్నది నిపుణుల విశ్లేషణ. ఆస్ట్రేలియాలో దావానలాల వల్ల వాయుకాలుష్యం పెరగడంతోపాటు, అదే సమయంలో కొవిడ్‌ మహమ్మారి కూడా విజృంభించింది. దాంతో అప్పటికే వేడి సంబంధిత అనారోగ్యాలతో బాధపడుతున్న వృద్ధులు, పేదలు, వికలాంగులు, నిరాశ్రయులు మరిన్ని ఇబ్బందులకు గురయ్యారు. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. ఇది కూడా ప్రకృతి విషయంలో మనిషి ఇష్టారాజ్యంగా ప్రవర్తించిన ఫలితమేనని పర్యావరణవేత్తలు విశ్లేషిస్తున్నారు. మన దేశంలో వలసలకూ అకాల కరవు లేదా అసాధారణ వర్షపాతమే కారణం అవుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితుల వల్ల అక్కడి నుంచి భారీ సంఖ్యలో ప్రజలు ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తోంది. ఇలా వలస వెళ్లినవారు తాము నివసించే పరిస్థితుల కారణంగా అంటువ్యాధులకు గురవుతున్నారు. ఇరుకైన ప్రదేశాల్లో నివసించడం వల్ల కరోనా లాంటి మహమ్మారులు ఈ వర్గాల్లో ఎక్కువగా కనిపించాయి. వీరు వెళ్లిన ప్రాంతాలకూ అవి వ్యాపించాయి. మనిషి తన ధర్మాన్ని పాటిస్తూ ప్రకృతిని రక్షిస్తే, ఆ ప్రకృతే మనిషిని కాపాడుతుంది. కానీ తన స్వార్థ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ అడవులను ఇష్టారాజ్యంగా నరికేయడం, నదులూ కాలువల ప్రవాహాలను అడ్డుకోవడం, నాలాల ఆక్రమణలు, అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు, మడ అడవుల విధ్వంసం... ఇలాంటి చర్యల వల్ల ప్రకృతి విలయతాండవం చేస్తోంది. దీనివల్ల మహమ్మారుల విజృంభణ పెచ్చరిల్లుతోంది. ఈ యథార్థాన్ని గ్రహించి మసలుకుంటేనే మానవాళికి మనుగడ!
 

- రఘురామ్‌
 

Posted Date: 28-11-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం