• facebook
  • whatsapp
  • telegram

భూతాపంతో అకాల వర్షాలు

నానాటికీ తీవ్రమవుతున్న వాతావరణ మార్పుల వల్ల ప్రకృతి విపత్తులు విరుచుకుపడుతున్నాయి. ముఖ్యంగా అకాల వర్షాలు రైతులను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ప్రకృతి మార్పుల వల్ల ఆహార భద్రతకూ ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పుడమి పరిరక్షణకు ప్రపంచదేశాలు కలిసికట్టుగా ముందుకు సాగాలి.

మండుటెండలు కాయాల్సిన సమయంలో ఉరుములు, మెరుపులు, పిడుగుపాటుతో కూడిన భారీ వర్షాలు కురవడం నేడు చూస్తున్నాం. కొన్నేళ్లుగా అకాల వర్షాలు సర్వ సాధారణం అయ్యాయి. పగలు భగభగ మండే ఎండలు... అంతలోనే వర్షం... ఇవన్నీ నానాటికీ పెరుగుతున్న భూతాపం తాలూకు విపత్కర పరిణామాలే. ప్రపంచ దేశాలన్నీ ఒకే వేదికపైకి వచ్చి వాతావరణ మార్పులపై ఇప్పటి దాకా 27 సదస్సులు నిర్వహించాయి. అయినా, నేటికీ భూతాపాన్ని కట్టడి చేయడంలో సరైన క్రియాశీల పరిణామాలేవీ చోటుచేసుకోలేదు. భయంకరమైన విషజ్వరాలు, అంటువ్యాధులు ప్రబలడం, అతివృష్టి, అనావృష్టి, అకాల వర్షాలు... భూతాపం ప్రతిఫలాలే. మంచుకొండలు వేగంగా కరిగిపోవడం, సముద్రమట్టాలు గణనీయంగా పెరిగి తీరప్రాంత నగరాలు, పట్టణాలు నీట మునగడం తదితరాలన్నీ పర్యావరణ మార్పుల వల్ల తలెత్తుతున్న వైపరీత్యాలే. ప్రస్తుతం భూతాపం కారణంగా అకాల వర్షాలు, మండుతున్న ఎండలను మనం చవిచూడాల్సి వస్తోంది.

నానాటికీ అధికమవుతున్న భూతాపాన్ని కట్టడి చేయకుంటే రాబోయే రోజుల్లో మరిన్ని విపత్కర పరిణామాలను మానవాళి ఎదుర్కోవాల్సి వస్తుంది. దానివల్ల మానవ జాతి మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. దానికి సంకేతాలే ఈ ప్రకృతి వైపరీత్యాలు. వాతావరణ మార్పుల ఫలితంగా సంభవిస్తున్న ఆస్తి, ప్రాణ నష్టాలు మానవాళిని ఆర్థికంగా, నైతికంగా దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా రబీ సీజన్‌ పంట చేతికందే సమయంలో కురుస్తున్న అకాల వర్షాలు రైతాంగానికి కడగండ్లనే మిగులుస్తున్నాయి. ఇటీవల కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న అకాల వర్షాల ధాటికి అపార పంట నష్టం వాటిల్లింది. చాలాచోట్ల కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, మొక్కజొన్న, మిర్చి తడిసి ముద్దయ్యాయి. అధికారిక అంచనాల మేరకు ఒక్క తెలంగాణలోనే 10 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నాయి.

వాతావరణ మార్పుల ప్రభావం అత్యధికంగా భూమి, నీరు, ఇతర సహజ వనరులపై ఉండటంతో వ్యవసాయం ప్రధానంగా దెబ్బతింటోంది. పంటలతో పాటు వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పాడి-పశుసంపద, నీటి వనరులు, గ్రామీణ సమాజం, వ్యవసాయ కార్మికులపై వాతావరణ మార్పుల ప్రభావం గణనీయంగా ఉంటోంది. వరిని పెద్దమొత్తంలో సాగు చేయడం వల్లా మీథేన్‌ వాయువు అధికంగా వాతావరణంలోకి విడుదల అవుతోంది. ఈ క్రమంలో తక్కువ నీటితో వరిని పండించేలా కొత్త వంగడాలపై విస్తృతంగా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది. పెద్దగా నీటి అవసరం లేని చిరుధాన్యాల సాగు విస్తృతం అయ్యేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. పర్యావరణ మార్పుల ప్రభావం పంటల ఉత్పాదకతపైనా పడుతోంది. అధిక ఉష్ణతాపం కారణంగా నిరుడు పంజాబ్‌, హరియాణా వంటి చోట్ల గోధుమ దిగుబడులు గణనీయంగా తగ్గాయి. ఐరోపాలోనూ పంటలు దెబ్బతిని ఆహార సరఫరాలు అస్తవ్యస్తమయ్యాయి.వాతావరణ మార్పులను తట్టుకొని అధిక దిగుబడులను ఇచ్చే వంగడాలపైనా పరిశోధనలు కొనసాగాలి.

భారత వాతావరణ శాఖ ముందస్తుగానే వర్షాలపై హెచ్చరికలు జారీ చేస్తోంది. వాటిని క్షేత్రస్థాయిలో రైతులకు చేరవేసి వారు సరైన జాగ్రత్తలు తీసుకునేలా చేయడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కల్లాల్లో ఆరబోసుకున్న ధాన్యాన్ని కాపాడుకొనేలా రైతులకు టార్పాలిన్లను అందించడం తప్పనిసరి. అకాల వర్షాలకు పంటలు దెబ్బతినకుండా అవసరం మేరకు అన్నిచోట్లా గోదాములను నిర్మించాల్సిన అవసరం ఉంది. ఒకవైపు వర్షాకాలంలో కురిసే వానలు పంటలను ముంచెత్తుతున్నాయి. వాటికి తోడు ఎండాకాలంలోనూ అకాల వర్షాలు రబీ పంటలను దెబ్బతీస్తుండటంతో దేశీయంగా వ్యవసాయ రంగం కుదేలవుతోంది. ఈ క్రమంలో పర్యావరణ పరిరక్షణపై పాలకులు సమధికంగా దృష్టి సారించాలి. భూతాపం పెరుగుదలను నిలువరించేందుకు ప్రపంచ దేశాలు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలి. మరోవైపు ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు సన్నద్ధంగా ఉండాలి. సరైన నష్టపరిహారం అందించి పంటలు దెబ్బతిన్న రైతులకు అండగా నిలవడమూ తప్పనిసరి.

 

- డాక్టర్‌ జీవీఎల్‌ విజయ్‌కుమార్

(భూ విజ్ఞానశాస్త్ర నిపుణులు)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సాగర వ్యూహం.. సరికొత్త బంధం!

‣ భావ ప్రకటన స్వేచ్ఛకు భరోసా

‣ సౌరశక్తితో ఇంధన భద్రత

‣ శ్రామిక నైపుణ్యం.. దేశానికి వరం!

‣ అంగట్లో వ్యక్తిగత సమాచారం!

Posted Date: 12-05-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం