మానవ హక్కుల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా యునెస్కో నేడు ‘ప్రపంచ పత్రికాస్వేచ్ఛ దినోత్సవం’ నిర్వహిస్తోంది. పత్రికాస్వేచ్ఛే చోదకశక్తిగా భావితరాల హక్కులను పరిరక్షించేందుకు ఆ సంస్థ నడుం బిగించింది. ఇందుకు అవసరమైన ముసాయిదా విధానాన్ని రూపొందించేందుకు పలు దేశాలకు చెందిన సుప్రసిద్ధ విద్యావేత్తలు, పాత్రికేయులు, సామాజికవేత్తలు నేడు న్యూయార్క్‌లో సమాలోచనలు జరుపుతారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో చైనా, రష్యాల బలాలు సమానమవుతున్నాయి. అమెరికా, ఐరోపా దేశాలు భారత్‌కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇండియా ప్రపంచస్థాయి పాత్ర పోషించవలసి వస్తున్న ఈ తరుణంలో- న్యూయార్క్ టైమ్స్ సంపాదకవర్గం అమెరికా, ఐరోపా దేశాలకు రెండు అంశాలను గుర్తుచేసింది. పటిష్ఠమైన ప్రజాస్వామ్యం, స్వేచ్ఛాయుత పత్రికా రంగం భారత్‌లో తప్పనిసరిగా ఉండాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో పేర్కొంది. జనాకర్షణ కలిగిన నాయకత్వం భారత్‌ను 1975-77 మధ్య ఆత్యయిక స్థితిలోకి తీసుకువెళ్ళి, ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టిందని గుర్తుచేసింది. పలువురు నేతలు నిర్బంధం అనుభవించిన విషయాన్ని ప్రస్తావించింది. ‘రిపోర్టర్స్ వితవుట్ బోర్డర్స్’ సంస్థ ఏటా ప్రకటించే పత్రికాస్వేచ్ఛ ర్యాంకింగ్‌లో భారత్‌ది 150వ స్థానం! అలాగని అమెరికా మొదటిస్థానంలో ఏమీ లేదు. ఆ దేశం 42 స్థానంలో నిలవగా... పత్రికలకు తొలిసారి జన్మనిచ్చిన బ్రిటన్ 24వ స్థానానికి పరిమితమైంది. ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుతున్న రష్యా, చైనాలు వరసగా 155, 175 స్థానాల్లో మనకంటే వెనకే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక సవాళ్లు ఎదుర్కొంటున్న పత్రికాస్వేచ్ఛను పరిరక్షించేందుకు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని యునిసెఫ్, యునెస్కో వంటి సంస్థలు కృషి చేస్తున్నాయి.
సమాచార ప్రవాహం..
డిజిటల్ సాంకేతికతలు, సామాజిక, ప్రసార మాధ్యమాలు ఇబ్బడిముబ్బడిగా అందుబాటులోకి రావడంతో సమాచార ప్రవాహం ఊపందుకొంది. తద్వారా పత్రికాస్వేచ్ఛ తీవ్రంగా ప్రభావితమవుతోంది. అంతర్జాతీయ సమాజంలో నేడు అసమానతలు, సంఘర్షణలు, హింస పెచ్చుమీరుతున్నాయి. పర్యావరణ సంక్షోభం, ప్రజారోగ్యం వంటి ఎన్నో సవాళ్లు ముసురుకున్నాయి. ఇవన్నీ మానవ హక్కులపై ఆధారపడిన సంస్థలను ప్రభావితం చేస్తున్నాయి. రాజకీయ, సామాజిక పరిస్థితుల కారణంగా అంతర్జాల సేవలను నిలిపివేయడం, వాస్తవ విశ్లేషణలను అడ్డుకోవడం, ప్రసార మాధ్యమాల అణచివేతకు దిగడం వంటి పరిణామాలు ఎక్కువయ్యాయి. బెదిరింపు ధోరణులు ప్రబలడంతో ప్రపంచ వ్యాప్తంగా భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, మానవ హక్కులు ప్రమాదంలో పడ్డాయి. భావవ్యక్తీకరణ స్వేచ్ఛ నిజంగా దఖలుపడినప్పుడే- ప్రజానిధుల దుర్వినియోగం, మనుషుల అక్రమ రవాణా, దుర్విచక్షణ, అసమానతలు వెలుగులోకి వస్తాయి. ఈ ఏడాది ప్రపంచ పత్రికాస్వేచ్ఛ దినోత్సవం- భావప్రకటనా స్వేచ్ఛ, ఇతర హక్కులను ఎలుగెత్తి చాటాలన్నది యునిసెఫ్ ధ్యేయం. పత్రికాస్వేచ్ఛ ద్వారా మహిళలూ బాలల హక్కులు, డిజిటల్ హక్కులు, పర్యావరణ పరిరక్షణ, అవినీతికి వ్యతిరేకంగా పోరాడే హక్కుల విషయంలో అడ్డంకులను అధిగమించేందుకు మార్గదర్శనం అవసరమని ఆ సంస్థ ఆకాంక్షిస్తోంది.
కొవిడ్ విజృంభించినప్పుడు ప్రసార మాధ్యమాలు బాధ్యతాయుతమైన పాత్రను పోషించాయి. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ కరోనా మహమ్మారి కోరల నుంచి క్షేమంగా బయటపడేందుకు దోహదపడ్డాయి. యుద్ధాలు, ఎన్నికలు వంటి ముఖ్య అంశాలకు సంబంధించి ప్రజలకు సమాచారం చేరవేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రసార మాధ్యమాల నోళ్లు మూయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్ని సవాళ్లు ఎదురైనా ప్రసార మాధ్యమాలు మాత్రం 2030 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు తోడుగా నిలుస్తున్నాయి. పేదరిక నిర్మూలన, అందరికీ ఆహార కల్పనను సుసాధ్యంచేసే దిశగా వ్యవస్థలను పురిగొల్పుతున్నాయి. ఉగ్రవాదం, సమాచార హక్కు, సుపరిపాలన, ఘర్షణల పరిష్కారం వంటి అంశాల్లో పత్రికలు చేసిన కృషి ఐక్యరాజ్య సమితి మన్ననలు పొందింది. ముఖ్యంగా న్యూజిలాండ్, నమీబియా, ఫిలిప్పీన్స్, సెర్బియా, సెనెగల్, ఖతర్, లాత్వియా, ఇండొనేసియా వంటి దేశాల్లో ఐరాస కార్యక్రమాలకు మీడియా సంస్థలు ఎంతగానో దోహదపడ్డాయి. పత్రికాస్వేచ్ఛ ద్వారానే ఇది సాధ్యపడిందనడం నిస్సందేహం.
మరింత బలోపేతం..
మానవ హక్కులకు పత్రికాస్వేచ్ఛే చోదకశక్తి అని, దాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని అంతర్జాతీయ సమాజం కాంక్షిస్తోంది. దీన్నొక శక్తిమంతమైన ఆయుధంగా తీర్చిదిద్దినప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. మాదకద్రవ్యాల ముఠా చేతిలో కొలంబియన్ సంపాదకుడు గుయెర్మో కానో మృతి చెందడాన్ని యునెస్కో తీవ్రంగా పరిగణించింది. ఆ తరవాతే పత్రికాస్వేచ్ఛకు పట్టం కట్టాలన్న స్ఫూర్తితో 1997 నుంచి ఏటా మే3న ప్రపంచ పత్రికాస్వేచ్ఛ అవార్డును ప్రదానం చేస్తోంది. ప్రాణాలను పణంగాపెట్టి నిజాలను చాటిచెప్పే పాత్రికేయులకు దీని ద్వారా 25వేల డాలర్లను (సుమారు రూ.20 లక్షలను) అందిస్తోంది. ఇది ఆర్థిక సాయం కాదు. పత్రికాస్వేచ్ఛకు దన్ను!
- డాక్టర్ జీకేడీ ప్రసాద్
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ శ్రామిక నైపుణ్యం.. దేశానికి వరం!